Bandh Successful
-
బంద్ సక్సెస్
కామారెడ్డి క్రైం: కామారెడ్డి పట్టణ బంద్ విజయవంతమైంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానాన్ని కొందరు అక్రమంగా దున్నడాన్ని వ్యతిరేకిస్తూ జేఏసీ, అఖిలపక్ష, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శనివారం కామారెడ్డి బంద్ జరిగింది. వ్యాపార సముదాయాలు, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. అఖిలపక్షం ఆధ్వర్యంలో రాజకీయ పార్టీ లు, విద్యార్థి సంఘాలు, వామపక్షాలు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించాయి. తప్పుడు పత్రాలను సృష్టించి కళాశాల మైదానాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న వారికి తగిన గుణపాఠం చెబుతామని అఖిలపక్ష నేతలు పేర్కొన్నారు. కళాశాల ఆస్తులను కాపాడుకోవడం కోసం ఎంతటి ఉద్యమాలకైనా సిద్ధమని స్పష్టం చేశారు. ఆక్రమిస్తే సహించబోం: విప్ గోవర్ధన్ కళాశాల ఆస్తులను ఆక్రమిస్తే సహించబోమని ప్రభుత్వవిప్ గంప గోవర్ధన్ హెచ్చరించారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ప్రైవేట్ వ్యక్తులు దున్నిన కళాశాల మైదానాన్ని పరిశీలించారు. మైదానంలో వాలీబాల్ ఆడిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి కళాశాల ఆస్తులు వెళ్లకుండా చూసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఎవరు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ప్రజా కోర్టు నుంచి మాత్రం తప్పించుకోలేరన్నారు. కళాశాల భూములను కాపాడుకునేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. జేఏసీ చైర్మన్ జగన్నాథం, మున్సిపల్ చైర్పర్సన్ పిప్పిరిసుష్మ, ఎంపీపీ మంగమ్మ, బహుజన ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు క్యాతం సిద్దిరాములు, టీఆర్ఎస్ నేత నిట్టువేణుగోపాల్‌రావు, పార్టీ మండల అధ్యక్షుడు పిప్పిరి ఆంజనేయులు, కాంగ్రెస్ నేతలు నల్లవెల్లి అశోక్, నిమ్మ మోహన్‌రెడ్డి, మామిండ్ల అంజయ్య, బీజేపీ నాయకులు వి.మురళీధర్‌గౌడ్, చిన్నరాజులు, ప్రభాకర్‌యాదవ్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి సిద్దిరాములు, సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి కట్ల భూమన్న, ఎంసీపీఐ జిల్లా కార్యదర్శి రాజలింగం, విద్యార్థి సంఘాల నాయకులు ఆజాద్, అగ్గి రవీందర్, అరుణ్‌కుమార్, భానుప్రసాద్, సురేశ్ పాల్గొన్నారు. -
ఆమనగల్లు బంద్ విజయవంతం
ఆమనగల్లు: ఆర్డీఓ కార్యాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వర్తక, వ్యాపార, వృత్తిదారుల సంఘాల జేఏసీ ఆధ్యర్యంలో సోమవారం చేపట్టిన ఆమనగల్లు పట్టణ బంద్ విజయవంతమైంది. పట్టణంలోని వర్తక, వాణిజ్య సంస్థలు, హోటళ్లు, పెట్రోలు బంక్‌లు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, సినిమా హాళ్లు మూతపడ్డాయి. జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు బైక్ ర్యాలీ నిర్వహించారు. జాతీయ రహదారిపై ధర్నా చేశారు. తహసీల్దార్ అనితకు వినతిపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి, ఆమనగల్లు జెడ్పీటీసీ సభ్యులు కండె హరిప్రసాద్, ఎంపీటీసీ సభ్యులు పత్యానాయక్, సింగంపల్లి శ్రీను, వర్తక సంఘ అధ్యక్షుడు కండె పాండురంగయ్య, సభ్యులు కోట తిరుపతయ్య, వీరబొమ్మ రామ్మోహన్, రాజు, వస్త్ర వ్యాపారుల సంఘ సభ్యులు వెంకటేశ్, ఎల్వీఆర్ రాము, శివప్ప, జగదీశ్వర్, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
విభజన మంటలు
ఏలూరు, న్యూస్‌లైన్:రాష్ట్ర విభజనకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ గురువారం జిల్లాలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపును అందుకుని పార్టీ నాయకులు, శ్రేణులు ఆందోళన కార్యక్రమాలను వేడెక్కించారు. విభజన నిర్ణయూన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలంటూ కదం తొక్కారు. మరోవైపు పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టిందన్న విష యం తెలిసి అన్నివర్గాల ప్రజలు ఆగ్రహంతో రగిలిపోయూరు. రోడ్లపైకి వచ్చి సోనియూగాంధీ, మన్మోహన్సింగ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. పార్లమెం టులో తెలంగాణ బిల్లు ప్రవేశ పెడుతు న్న సమయంలో.. రాష్ట్రం విడిపోతుం దన్న మనస్తాపంతో ఏలూరులో కేఏహెచ్ఎల్ డిగ్రీ కళాశాల డిగ్రీ విద్యార్థి మహ్మద్ ముజాహిద్దీన్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. తోటి విద్యార్థులు, పోలీసులు అతడిని అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. సకలం బంద్ రాష్ట్ర విభజన నిర్ణయూన్ని వ్యతిరేకిస్తూ జిల్లా వ్యాప్తంగా చేపట్టిన సమైక్య బంద్ సంపూర్ణైమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గురువారం వేకువజాము నే ఆర్టీసీ డిపోలకు చేరుకుని బస్సులను బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు. అనంతరం ప్రభుత్వ కార్యాలయాలను, బ్యాంకులను మూయించేశారు. ఎన్జీవోలు, టీ డీపీ నాయకులు సమైక్య బంద్‌లో పాల్గొని వివిధ రూపాల్లో కార్యక్రమాలు నిర్వహించారు. ఏలూరు నగరంలో చైతన్య కళాశాలను మూయిస్తున్న సమయంలో ఎన్జీవో నాయకులు, విద్యాసంస్థ యూజమాన్యం మధ్య వాగ్వివా దం చోటు చేసుకుంది. వైఎస్సార్ సీపీ ఏలూరు నగర శాఖ కన్వీనర్ గుడిదేశి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఫైర్‌స్టేషన్ సెంటర్లో ధ ర్నా చేశారు. టీడీపీ నాయకులు మోటార్ సైకిళ్లపై తిరుగుతూ దుకాణాలను మూయించివేశారు. అనంతరం ఫైర్‌స్టేషన్ సెంటర్లో ధర్నా చేశా రు. రైతాంగ సమాఖ్య ఆధ్వర్యంలో రైతు లు ప్రదర్శన నిర్వహించారు. సీఆర్ రెడ్డి అటానమస్ కళాశాల విద్యార్థులు మానవహారం ఏర్పాటు చేశారు. అనంతరం రోడ్డుపై పడుకుని సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. ఎన్జీవోల ఆధ్వర్యంలో సోనియాగాంధీ, మన్మోహన్సింగ్ దిష్టిబొమ్మలతో నగరంలో శవయూత్ర నిర్వహించి ఫైర్‌స్టేషన్ సెంటర్లో అంత్యక్రియలు నిర్వహించారు. విశాలాంధ్ర మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు నల్లమోతు చక్రవర్తి ఢిల్లీ యూత్రకు వెళుతూ ఏలూరులో ఆగారు. నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జేఏసీ నాయకులు డాక్టర్ ఏవీఆర్ మోహన్, న్యాయవాది కానాల రామకృష్ణ, ఎన్జీవోల తరఫున టి.యోగానందం, ఆర్ఎస్ హరనాధ్ కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఊరూవాడా ఆందోళనలు భీమవరం పట్టణంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపోకు వెళ్లిన కార్యకర్తలు బస్సులను బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు. మునిసిపల్ మాజీ చైర్మన్ గ్రంధి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రకాశం చౌక్‌లో రాస్తారోకో చేశారు. ఇక్కడే ఎన్జీవోలు, టీడీపీ నాయకులు రాస్తారోకో చేశారు. అనంతరం బీజేపీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తెలంగాణ బిల్లుకు మద్దతిస్తే కాంగ్రెస్‌తోపాటు బీజేపీకి నూకలు చెల్లుతాయని హెచ్చరిం చారు. వీరవాసరంలో బంద్ విజయవంతమైంది. ఉండిలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ విజయవంతమైంది. ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ఆధ్వర్యంలో నరసాపురంలో బంద్ చేపట్టారు. ప్రభుత్వ కార్యాలయూలను ఎన్జీవోలు మూయించివేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిం చారు. వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్లో రాస్తారోకో చేశారు. కొవ్వూరులో పార్టీ సమన్వయకర్త తానే టి వనిత ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించి దుకాణాలను మూయించేశారు. మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ పాల్గొన్నారు. ఎన్జీవోలు, టీడీపీ నాయకుల ఆధ్వర్యంలోనూ నిరసన కార్యక్రమాలు జరిగాయి. నిడదవోలులో ఎన్జీవోలు ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాం కులను మూయించేశారు. మోటార్ సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. కొయ్యల గూడెంలో బంద్ విజయవంతమైంది. భీమడోలులో జాతీయ రహదారిపై వైసీపీ నాయకులు, రాష్ట్ర రహదారిపై టీడీపీ నాయకులు రాస్తారోకో చేశారు. చింతలపూడిలో ఎన్జీవో అసోసియేషన్ ఆధ్వర్యంలో మానవహారం చేశారు. తాడేపల్లిగూడెంలో వైఎస్సార్ సీపీ సమన్వయకర్త తోట గోపీ నాయకత్వంలో బంద్ చేపట్టారు. ఎన్జీవో అసోసియేషన్ పిలుపుమేరకు ఉద్యోగులు, నాన్‌పొలిటికల్ జేఏసీ నాయకులు బంద్‌లో పాల్గొన్నారు. తణుకులో వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త చీర్ల రాధయ్య ఆధ్వర్యంలో బంద్, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. తేతలి వై జంక్షన్ వద్ద రాస్తారోకో చేయటంతో రెండు గంట లపాటు ట్రాఫిక్ స్తంభించింది. ఎన్జీవో అసోసియేషన్ నాయకులు పీవీ రమణ, వైవీ సత్యనారాయణమూర్తి, ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. పాలకొల్లులో ఎన్జీవో అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి. -
మా శ్వాస.. ఆశ సమైక్యమే
తెలుగుతల్లిపై వేలాడుతున్న విభజన గొడ్డలికి ఎదురెళతామంటూ నాయకులు, ఉద్యోగులు సమర శంఖం పూరించారు. తెలుగు నేలను చీల్చే కుట్రలను అడ్డుకునేందుకు ఎంతటి పోరాటమైనా చేస్తామని స్పష్టం చేశారు. సమైక్యాంధ్రే శ్వాసగా, ఆశగా ముందుకు వెళతామని అన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా గురువారం పలు పార్టీలు, ఉద్యోగ సంఘాలు నిర్వహించిన బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ నాయకులు ప్రజల భాగస్వామ్యంతో పలు చోట్ల ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. విజయనగరం టౌన్, న్యూస్‌లైన్:పార్లమెంట్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా గురువారం ఆందోళనలు జరిగాయి. ఈ సందర్భంగా పెట్రోల్ బంక్‌లు, సినిమా హాళ్లు, వ్యాపార వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మూసివేసి బంద్‌కు సహకరించారు. వైఎస్ఆర్ సీపీ అధిష్టానం పిలుపు మేరకు శుక్రవారం రహదారులు దిగ్బంధం చేస్తామని ఆ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు అవనాపు విజయ్ తెలిపారు. నిరసన కార్యక్రమాల్లో భాగంగా పూసపాటిరేగలో వైఎస్ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు సమక్షంలో సుమారు 200 బైక్‌లతో ర్యాలీ జరిగింది. విజయనగరంలో అవనాపు విజయ్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో పలు చోట్ల నిరసన కార్యక్రమాలు చేపట్టారు. భోగాపురంలో వైఎస్ఆర్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు ఇమ్మిడిశెట్టి రమేష్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎస్.కోటలో నియోజకవర్గ సమన్వయకర్తలు డాక్టర్ గేదెల తిరుపతి, వేచలపు చినరామునాయుడు, వల్లూరి జయప్రకాశ్‌బాబు, రాష్ట్ర మహిళా కమిటీ సభ్యులు కోళ్ల గంగాభవాని, యల్లపు దమయంతిదేవి, జిల్లా మైనార్టీసెల్ కన్వీనర్ షేక్ రహ్మాన్, ఎస్సీ సెల్ కన్వీనర్ కె.పాల్‌కుమార్, మండల కన్వీనర్ ఎస్.సత్యంల నేతృత్వంలో చేపట్టిన సమైక్యాంధ్ర బంద్ విజయవంతమైంది. వీరికి మైనార్టీ సెల్ కన్వీనర్ షేక్ దర్గామదీనా తదితరులు సంఘీభావం తెలిపారు. గజపతినగరం నియోజకవర్గ సమన్వయకర్త కడుబండి శ్రీనివాసరావు స్వగృహం నుంచి వందలాది మంది నాయకులు, కార్యకర్తలతో ర్యాలీగా వచ్చి జాతీయ రహదారిపై ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. గంట్యాడ, బోనంగి, పెదమజ్జిపాలెం, బుడతనాపల్లి గ్రామాల్లోనూ వైఎస్ఆర్ సీపీ ఆందోళనలు కొనసాగాయి. అలాగే పార్వతీపురంలో వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన సమైక్యాంధ్ర బంద్ విజయవంతమైంది. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త జమ్మాన ప్రసన్నకుమార్ నేతృత్వంలో నిర్వహించిన ఈ బంద్‌లో భాగంగా స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలిలో రాస్తారోకో జరిగింది. ఈ బంద్‌కు ఏపీఎన్జీఓల సంఘం సంఘీబావం తెలిపింది. అనంతరం సుమారు 50 మోటారు సైకిళ్లతో వైఎస్ఆర్ సీపీ నాయకులు ర్యాలీ చేశారు. కురుపాం నియోజక వర్గంలోని గరుగుబిల్లి మండలం ఖడ్గవలస జంక్షన్ వద్ద వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. అలాగే సాలూరులో వైఎస్ఆర్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, జిల్లా ఎస్టీ సెల్ కన్వీనర్ గరుడపల్లి ప్రశాంత్ కుమార్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, వైఎస్సార్ సీపీ నాయకులు గొర్లె మధు, మాజీ మున్సిపల్ చైర్మన్ జర్జాపు ఈశ్వరరావులు సమైక్యాంధ్రకు మద్ధతుగా బుధవారం అర్ధరాత్రి సాలూరు ఆర్టీసీ డీపో వద్ద ధర్నా నిర్వహించారు. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. చీపురుపల్లిలోనూ ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మీసాల వరహాల నాయకుడు ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి. -
బంద్ విజయవంతం
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : రాష్ర్ట విభజన బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ సమైక్యాంధ్రకు మద్దతుగా జిల్లాలో గురువారం నిర్వహించిన బంద్ విజయవంతమైంది. బంద్‌పై ముందే సమాచారం ఉండడంతో స్వచ్ఛందంగా వాణిజ్య సముదాయాలను మూసివేశారు. దీంతో జిల్లా కేంద్రం బోసి పోయింది. ప్రజ లు కూడా తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా సమైక్యవాదులు ఉదయానికే రోడ్లపైకి వచ్చి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. ప్రధానంగా విజయనగరం పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బస్సులు బయటకు వెళ్లకుండా నాయకులు అడ్డుకున్నారు. దీంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సమైక్యరాష్ట్ర పరిరక్షణ సమితి, తెలుగుదేశం పార్టీల కార్యకర్తలు రోడ్ల పైకి వచ్చి నిరసన తెలిపారు. ప్రధాన కూడళ్లలో అక్కడక్కడ తెరిచి ఉన్న దుకాణాలను మూయించా రు. బ్యాంకులతో పాటు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలైన బీఎస్ఎన్ఎల్, పోస్టల్, ఎల్ఐసీ కార్యాలయాలను మూయించారు. దీంతో జిల్లావ్యాప్తంగా రూ.200 కోట్ల లావాదేవీలు నిలిచిపోయాయి. రవాణా వ్యవస్థ స్తంభించడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. వాణిజ్య సముదాయాలు బోసిపోయాయి. ప్రతి కూడలిలో రాస్తారోకోలు నిర్వహించి...కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. చీపురుపల్లి, ఎస్.కోట, నెల్లిమర్ల, గజపతినగరం, సాలూరు, పార్వతీపురం తదితర నియోజకవర్గాల్లో వివిధ పార్టీల కార్యకర్తలు, నేతలు, ఎన్జీవోలు, సమైక్యవాదులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహించారు మూతపడిన ప్రభుత్వ కార్యాలయాలు..... బంద్ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. ఖజానా, కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయాలలో ఉద్యోగులతో పాటూ వివిధ కార్యాలయాల నుంచి జిల్లా అధికారులను సైతం బయటకు పంపించి ఎన్జీఓలు నిరసన తెలిపారు. కలెక్టరేట్లోని పలు కార్యాలయాలకు వె ళ్లాల్సిన మార్గాలను మూయించారు. దీంతో కలెక్టరేట్ బోసిపోయింది. ఉదయం నుంచే బ్యాంకులు ,పోస్టల్ కార్యాలయాలను మూసి నిరసన తెలిపారు. స్తంభించిన రవాణా వ్యవస్థ..... బంద్ నేపథ్యంలో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సరుకుల రవాణా కూడా జరగలేదు. దీంతో ప్రజలు అవస్థలు పడ్డారు. ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో పదుల సంఖ్యలో బస్సులు నిలిచిపోయాయి. మూతపడ్డ పెట్రోల్ బంకులు.. పట్టణంలోని పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. అయితే కొంత మంది యజమానులు మాత్రం ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకున్నారు. రంజినీ యాడ్ లేబ్స్ థియేటర్ సమీపంలో ఉన్న ఓ బంకుతో పాటూ పట్టణ శివారుల్లోని పలు బంకుల్లో బాటిళ్ల ద్వారా అధిక రేట్లకు పెట్రోల్‌ను విక్రయించారు. లీటరు పెట్రోలు రూ.100 నుంచి రూ. 140 వరకూ విక్రయించారు. దాడులు అన్యాయం.... పార్లమెంట్లో సీమాంధ్ర ఎంపీలపై దాడి చేయడాన్ని సమైక్యవాదులు ఖండించారు. అడ్డగోలుగా విభజన చేయాలన్న ఆలోచన విరమించుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ప్రధానంగా కేంద్ర మంత్రులు స్పందించి విభజన బిల్లును అడ్డుకోవాలన్నారు. ఎటువంటి చర్చ జరగకుండా బిల్లు ప్రవేశపెట్టినట్లు ప్రకటించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. అంతేకాకుండా సమైక్య వాణి వినిపించినందుకు 18 మంది ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని ఖండించారు. మిగిలిన పక్షాలపై నేతలు ఒత్తిడి తెచ్చి బిల్లును ఓడించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సమైక్యరాష్ట్ర పరిరక్షణ సమితి నాయకులు గంటా వెంకటరావు, ఆర్ఎస్ జాన్, పెద్దింటి అప్పారావు, కె.శ్రీనివాసరావు, పి.పద్మనాభం, ఏపీ నాన్ టీచింగ్ సంఘ సెక్రటరీ పిడిపర్తి సాంబశివశాస్త్రి తదితరులు పాల్గొన్నారు. వీరి ఆందోళనలకు పలు పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. -
బంద్ విజయవంతం
శ్రీకాకుళం కలెక్టరేట్/శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: పార్లమెంట్లో రాష్ర్ట పునర్విభజన బిల్లును ప్రవేశపెడుతున్నందుకు నిరసనగా వైఎస్సార్సీపీ, ఉద్యోగ, విద్యార్థి సంఘాలు ఇచ్చిన జిల్లా బంద్ పిలుపు విజయవంతమైంది. గురువారం జిల్లాలో చేపట్టిన బంద్‌ను వైఎస్సార్సీపీ శ్రేణులు, సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక జయప్రదం చేశాయి. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో... వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహనరెడ్డి పిలుపు మేరకు శ్రీకాకుళంలో పార్టీ నాయకులు వరుదు కళ్యాణి, వైవీ సూర్యనారాయణ, దు ప్పల రవీంద్ర, హనుమంతు కిరణ్, ఎం.వి.పద్మావతి, మామిడి శ్రీకాంత్ తదితరులు వేకువజామునే ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దకు చేరుకుని ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. డే అండ్ నైట్ కూడలి వద్దకు చేరుకుని మానవహారం నిర్వహించారు. వివిధ ప్రభుత్వ కార్యాలయాల వద్దకు చేరుకుని సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యోగులు విధులు బహిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. పాలకొండలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త విశ్వసరాయి కళావతి, పార్టీ లీగల్‌సెల్ కన్వీనర్ చందక జగదీష్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. పలాస నియోజకవర్గ సమన్వయకర్త వజ్జ బాబూరావు, నాయకులు డి.భవానీశంకర్, చంద్రమౌళి, నర్తు చంద్రమౌళి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. కాశీబుగ్గలోని మూడు రోడ్ల కూడలి వద్ద సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు కాశీబుగ్గ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. నరసన్నపేటలో వైఎస్సార్ కూడలి వద్ద నిర్వహించిన ధర్నాలో పార్టీ నాయకులు ధర్మాన రామలింగంనాయుడు, ఏఎంసీ చైర్మన్ చీపురు కృష్ణమూర్తి, సురంగి నర్సింగరావు, ఎ.మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. రాజాం నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త కంబాల జోగులు, కేంద్ర కార్యనిర్వాహకమండలి సభ్యుడు పీఎంజె బాబు, ట్రేడ్ యూనియన్ జిల్లా కన్వీనర్ జి.టి.నాయుడు పాల్గొన్నారు. విద్యాసంస్థల మూసివేత జిల్లాలో పలు విద్యాసంస్థలు ముందుగానే సెలవును ప్రకటించాయి. తెరిచి ఉన్న విద్యాసంస్థలను మూసివేయాలని రాజకీయ పార్టీల నాయకులు, ఎన్జీవో సంఘాల ప్రతినిధులు కోరడంతో మూసివేశారు. జిల్లా కేంద్రంలో సినిమా హాళ్ళు, పెట్రోలు బంక్‌లు మూతపడ్డాయి. తెరిచిన పెట్రోలు బంక్‌లను కూడా సమైక్యవాదులుమూసివేయించారు.చిత్ర ప్రదర్శన నిలిపివేస్తున్నట్లు సినిమా హాళ్ల వద్ద బోర్డులు ఏర్పాటు చేయడంతో ప్రేక్షకులు వెనుదిరిగారు. బంద్‌తో పట్టణంలోని రోడ్లన్నీ బోసిపోయాయి. ప్రధాన రోడ్లలో గల దుకాణాలు, షోరూంలు, హోటళ్ళు, వివిధ సంస్థలు మూతపడ్డాయి. శ్రీకాకుళంలోని రైతుబజారు, పొట్టిశ్రీరాములు మార్కెట్లో దుకాణాలను మూసివేశారు. అక్కడక్కడ తెరిచిన దుకాణాలను సమైక్యవాదులు మూసివేయించారు. బంద్ ప్రభావంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాల యాలు, ప్రభుత్వ, ప్రైవే టు కళాశాలలు మూతపడ్డాయి. జిల్లాపరిషత్, కలెక్టరే ట్, డీఆర్డీఏ కాంప్లెక్స్, పోస్టల్, బ్యాంకులు, బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ తదితర కార్యాల యాలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. డీఆర్డీఏ కాంప్లెక్స్, కలెక్టరేట్ కార్యాల యా న్ని, రెవిన్యూ సర్వీసుల సంఘ సిబ్బంది వెళ్ళి వాటిని మూసివేయించారు. కళాశాలల కు సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ప్రతినిధులు వెళ్ళి మూసివేయించారు. కార్యక్రమంలో జి.పురుషొత్తం, జె.ఎం.శ్రీనివాస్, టి.కామేశ్వరి, అబ్దుల్ రెహమాన్, చల్లా అలి వేలు మంగ, మామిడి శ్రీకాంత్, సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ప్రతినిధులు చౌదరి పురుషోత్తమనాయుడు, హనుమంతు సాయిరాం, జామి భీమశంకర్, డి.వెంకట్రావు, పి.జయరాం, పి.జానకిరాం, ఎల్.జగన్మోహనరావు, కొం క్యాణ వేణుగోపాల్, ఆర్.వేణుగోపాల్, శిష్టు రమేష్ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ నేతలు... సమైక్యాంధ్ర ఉద్యమంలో టీడీపీ నేతలు మొక్కుబడిగా పాల్గొన్నారు. కాంప్లెక్స్ వద్ద ధర్నా చేస్తున్న సమైక్యవాదులు, వైఎస్సార్సీపీ నాయకుల వద్దకు టీడీపీ నాయకులు చౌదరి నారాయణమూర్తి, తదితరులు వచ్చి కూర్చుని వెళ్లిపోయారు. తర్వాత వారి జాడ కనిపించలేదు. ప్రయాణికుల ఇక్కట్లు బంద్ సందర్భంగా బస్సులన్నీ నిలిచిపోవడం తో శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ఖాళీగా ఉంది. ఆర్టీసీ కార్మికులు వచ్చినా బస్సులు కదలకపోవడంతో అందులోనే వారు సేదతీరారు. బస్సు లు తిరగకపోవడంతో ప్రయాణికులు ఇబ్బం దులు పడ్డారు. ప్రైవేట్ వాహనాల యజమానులు అధిక మొత్తంలో వసూలు చేశారు. -
కేంద్రంపై కన్నెర్ర
ఏలూరు, న్యూస్‌లైన్ : తెలంగాణ బిల్లును పార్లమెంట్లో తిరస్కరించాల్సిందేనని ఎన్జీవోలు డిమాండ్ చేశారు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై కళ్లెర్రజేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ ఉద్యమంలో భాగంగా ఎన్జీవోలు సోమవారం చేపట్టిన కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల బంద్ విజయవంతమైంది. ఏలూరు, భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు, చింతలపూడిలోని కేంద్ర కార్యాలయాలను ఎన్జీవోలు మూయించారు. ఏలూరు నగరంలో సెంట్రల్ ఎక్సైజ్, జూట్ మిల్లు వద్ద బీఎస్ఎన్ఎల్, వేంగి భవనం, ప్రధాన తపాలా కార్యాలయం, ఎల్ఐసీ, ఆర్‌ఆర్‌పేటలోని ఆదాయపుపన్ను శాఖ ఆఫీస్, యునైైటె డ్ ఇన్య్సూరెన్స్ తదితర కార్యాలయాలను ఎన్జీవో నేతలు ఆర్ఎస్ హ రనాథ్, ఎస్.సతీష్, నెరుసు రామారావు, కె.రమేష్‌కుమార్ మూయించేశారు. ఏలూరు కలెక్టరేట్ వద్ద ఎన్జీవో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్వీ సాగర్, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పి.సోమశేఖర్, నగర అధ్యక్షుడు శ్రీనివాస్ కొద్దిసేపు ఆందోళన చేశారు. భీమవరంలో బీఎస్ఎన్ఎల్, పోస్టల్, రిజిస్ట్రేషన్, తహసిల్దార్, మునిసిపల్ కార్యాలయాలను ఎన్జీవో నేతలు మూయించారు. అనంతరం తాలూకాఆఫీస్ నుంచి ప్రకాశం చౌక్ వరకు ఎన్జీవోలు ర్యాలీ చేశారు. తహసిల్దార్ కార్యాలయం వద్ద సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. పాలకొల్లులో ఏరియా ప్రభుత్వాసుపత్రిని ఎన్జీవోలు ముట్టడించి వైద్యాధికారులను అడ్డుకున్నారు. దీంతో అరగంటసేపు వైద్యసేవలు స్తంభించాయి. అనంతరం ఎన్జీవో నాయకులు గుడాల హరిబాబు, గారపాటి గోపాల్‌రావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కొవ్వూరులో పలు కేంద్ర కార్యాలయాలను ఎన్జీవోలు మాయించారు. చింతలపూడిలో పోస్టాఫీస్, బీఎస్ఎన్ఎల్ కార్యాలయాలు మూయించి స్థానిక ఫైర్‌స్టేషన్ సెంటర్ నుంచి డిగ్రీ కళాశాల వరకు ఎన్జీవోలు 3కే రన్ నిర్వహించారు. తాడేపల్లిగూడెంలో ఎల్ఐసీ, ఎఫ్‌సీఐ, హెడ్ పోస్టాఫీస్, బీఎస్ఎన్ఎల్ కార్యాలయాలను మూయించి నిరసన తెలిపారు. తణుకులో బీఎస్ఎన్ఎల్ కార్యాలయాన్ని మూసివేయించి పట్టణంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. -
బంద్ సంపూర్ణం
భద్రాచలం, న్యూస్‌లైన్: భద్రాచలాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే ఉంచాలని కోరుతూ జర్నలిస్టు సంఘాల జేఏసీ శుక్రవారం చేపట్టిన భద్రాచలం డివిజన్ బంద్ సంపూర్ణంగా జరిగింది. బంద్‌కు రాజకీయ పార్టీలు, వివిధ ఉద్యోగ, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించడంతో విజయవంతమై జనజీవనం స్తంభించింది. భద్రాచలం పట్టణంలో బంద్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. భద్రాచలం చాంబర్‌ఆఫ్ కామర్స్ వారు కూడా బంద్‌లో పాల్గొనడటంతో దుకాణాలు పూర్తిగా మూతపడ్డాయి. పట్టణంలోని వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. 72 గంటల బంద్ విజయవంతానికి గాను గురువారం అర్ధరాత్రి నుంచే జర్నలిస్టులు బ్రిడ్జి సెంటర్లో బైఠాయించి వాహనాలను అడ్డుకున్నారు. భద్రాచలం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులను నిలిపివేయించారు. బస్టాండ్ ముందు రాస్తారోకో నిర్విహ ంచి టైర్లను తగులబెట్టి నిరసన తెలిపారు. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ముందురోజు డివిజన్లోని వివిధ ప్రాంతాలకు వెళ్లిన ఆర్టీసీ బస్సులను ఆయా మండలాల్లోనే ఆందోళన కారులు వాటిని నిలిపివేశారు. భద్రాచలంతో పాటు వాజేడు, దుమ్ముగూడెం, కూనవరం, వీఆర్ పురం మండల కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించారు. వెంకటాపురం మండల కేంద్రంలో రోడ్డుపైనే జర్నలిస్టులు, అఖిల పక్షం నాయకులు ఆటలు ఆడి నిరసన తెలపటంతో పాటు అక్కడనే వంటా-వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. చింతూరు మండలం చట్టి వద్ద తెలంగాణ వాదులు వాహనాలను అడ్డగించారు. బంద్‌తో పెట్రోల్ బంకులు, దుకాణాలు పూర్తిగా మూతపడ్డాయి. సినిమాహాళ్లు, హోటళ్లను కూడా మూసివేశారు. సారపాక వరకే ఆర్టీసీ బస్సులు : భద్రాచలం డివిజన్ బంద్‌తో గోదావరి అవతల ఉన్న సారపాక వరకే ఆర్టీసీ బస్సులు తిరిగాయి. రామాలయం దర్శనం కోసం వచ్చిన భక్తులకు సారపాక నుంచి మూడు కిలోమీటర్ల మేర కాలినడక తప్పలేదు. దీంతో వికలాంగులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భద్రాచలం డివిజన్లోని వివిధ మండలాల వారు కూడా ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు సారపాక వరకూ వెళ్లి ఆర్టీసీ బస్సులను ఆశ్రయించారు. కాగా దూరప్రాంత బస్సులను తిప్పేందుకు పోలీసుల ప్రయత్నించగా, టీజేఏసీ డివిజన్ అధ్యక్షులు చల్లగుళ్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అడ్డగించారు. దీనిపై పట్టణ ఎస్ఐ అబ్బయ్యతో వారు వాగ్వాదానికి దిగారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లకు వారు భోజనాలను ఏర్పాటు చేశారు. కాగా ఇదే రీతిన శని,ఆదివారాల్లో కూడా బంద్ చేపట్టనున్నట్లు జర్నలిస్టు సంఘాల వారు ప్రకటించారు. ఈ రెండు రోజుల పాటు బంద్‌కు సహకరించాలని జర్నలిస్టు సంఘాల జేఏసీ నాయకులు బీవీ రమణారెడ్డి కోరారు. తగ్గిన భక్తుల సంఖ్య బంద్‌తో భద్రాచలం రామాలయానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. రామాలయం సమీపంలో దుకాణాలను కూడా మూసి వేశారు. దీంతో దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు భద్రాచలంలో మంచినీరు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా మూడు రోజుల బంద్ నేపథ్యంలో పాపికొండల విహార యాత్రను నిలిపివేస్తున్నట్లుగా లాంచీ యజమానుల సంఘం నాయకులు ప్రకటించారు. ఆరోరోజుకు చేరిన దీక్షలు భద్రాచలాన్ని తెలంగాణలోనే ఉంచాలనే డిమాండ్‌తో టీజేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆరో రోజుకు చేరాయి. స్థానిక ఎమ్మెల్యే కుంజా సత్యవతి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, టీజేఏసీ జిల్లా అధ్యక్షులు కూరపాటి రంగరాజు, పీఆర్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటపతిరాజు తదితరులు దీక్షాశిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా భద్రాచలం ఎమ్మెల్యే కుంజా సత్యవతి మాట్లాడుతూ భద్రాచలం ప్రాంతంలో ఉన్న అపారమైన ఖనిజ సంపదను కొల్లగొట్టేందుకే కొంతమంది ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించటంతో పాటు ముంపు ప్రాంత నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. భద్రాచలం అంశాన్ని రాష్ట్రపతి, జీవోఎంల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. భద్రాచలంను వదులుకునేది లేదు : టీజేఏసీ జిల్లా అధ్యక్షులు రంగరాజు తెలంగాణలో అంతర్భాగమైన భద్రాచలంను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులు కునేది లేదని టీజేఏసీ జిల్లా అధ్యక్షులు కూరపాటి రంగరాజు అన్నారు. భద్రాచలంలో చేపట్టిన టీజేఏసీ దీక్షలను ఆయన సందర్శించి మాట్లాడారు. భద్రాచలంను తెలంగాణ నుంచి వేరే ప్రయత్నాలను తిప్పి కొట్టేందుకు ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పోలవరం ప్రాజెక్టు కోసమే సీమాంధ్రులు ఈ ప్రాంతాన్ని ఆంధ్రలో కలుపుకునేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. భద్రాచలం కోసం టీజేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో పీఆర్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు వెంకటపతిరాజు టీజేఏసీ నాయకులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ర్యాలీలతో దద్దరిల్లిన భద్రాద్రి భద్రాచలాన్ని తెలంగాణలోనే ఉంచాలనే డిమాండ్ చేస్తూ వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల వారు పట్టణంలో ర్యాలీలు నిర్వహించారు. సీపీఐ, టీఆర్ఎస్, బీజేపీ అదే విధంగా వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో వేర్వేరుగా ర్యాలీలు చేశారు. భద్రాచలం డివిజన్ వైద్యుల జేఏసీ ఆధ్వర్యంలో బస్టాండ్ నుంచి అంబేద్కర్ సెంటర్‌వరకూ ర్యాలీ నిర్వహించి టీజేఏసీ దీక్షలకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వైద్యులు నివాళులు అర్పించారు. దళిత సంఘాల అర్ధనగ్న ప్రదర్శన భద్రాచలంను తెలంగాణ రాష్ట్రంలోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ ద ళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.