బంద్ విజయవంతం
Published Fri, Feb 14 2014 2:49 AM | Last Updated on Sat, Sep 2 2017 3:40 AM
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : రాష్ర్ట విభజన బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ సమైక్యాంధ్రకు మద్దతుగా జిల్లాలో గురువారం నిర్వహించిన బంద్ విజయవంతమైంది. బంద్‌పై ముందే సమాచారం ఉండడంతో స్వచ్ఛందంగా వాణిజ్య సముదాయాలను మూసివేశారు. దీంతో జిల్లా కేంద్రం బోసి పోయింది. ప్రజ లు కూడా తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా సమైక్యవాదులు ఉదయానికే రోడ్లపైకి వచ్చి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. ప్రధానంగా విజయనగరం పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బస్సులు బయటకు వెళ్లకుండా నాయకులు అడ్డుకున్నారు.
దీంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సమైక్యరాష్ట్ర పరిరక్షణ సమితి, తెలుగుదేశం పార్టీల కార్యకర్తలు రోడ్ల పైకి వచ్చి నిరసన తెలిపారు. ప్రధాన కూడళ్లలో అక్కడక్కడ తెరిచి ఉన్న దుకాణాలను మూయించా రు. బ్యాంకులతో పాటు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలైన బీఎస్‌ఎన్‌ఎల్, పోస్టల్, ఎల్‌ఐసీ కార్యాలయాలను మూయించారు. దీంతో జిల్లావ్యాప్తంగా రూ.200 కోట్ల లావాదేవీలు నిలిచిపోయాయి. రవాణా వ్యవస్థ స్తంభించడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. వాణిజ్య సముదాయాలు బోసిపోయాయి. ప్రతి కూడలిలో రాస్తారోకోలు నిర్వహించి...కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. చీపురుపల్లి, ఎస్.కోట, నెల్లిమర్ల, గజపతినగరం, సాలూరు, పార్వతీపురం తదితర నియోజకవర్గాల్లో వివిధ పార్టీల కార్యకర్తలు, నేతలు, ఎన్జీవోలు, సమైక్యవాదులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహించారు
మూతపడిన ప్రభుత్వ కార్యాలయాలు.....
బంద్ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. ఖజానా, కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయాలలో ఉద్యోగులతో పాటూ వివిధ కార్యాలయాల నుంచి జిల్లా అధికారులను సైతం బయటకు పంపించి ఎన్జీఓలు నిరసన తెలిపారు. కలెక్టరేట్‌లోని పలు కార్యాలయాలకు వె ళ్లాల్సిన మార్గాలను మూయించారు. దీంతో కలెక్టరేట్ బోసిపోయింది. ఉదయం నుంచే బ్యాంకులు ,పోస్టల్ కార్యాలయాలను మూసి నిరసన తెలిపారు.
స్తంభించిన రవాణా వ్యవస్థ.....
బంద్ నేపథ్యంలో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సరుకుల రవాణా కూడా జరగలేదు. దీంతో ప్రజలు అవస్థలు పడ్డారు. ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో పదుల సంఖ్యలో బస్సులు నిలిచిపోయాయి.
మూతపడ్డ పెట్రోల్ బంకులు..
పట్టణంలోని పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. అయితే కొంత మంది యజమానులు మాత్రం ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకున్నారు. రంజినీ యాడ్ లేబ్స్ థియేటర్ సమీపంలో ఉన్న ఓ బంకుతో పాటూ పట్టణ శివారుల్లోని పలు బంకుల్లో బాటిళ్ల ద్వారా అధిక రేట్లకు పెట్రోల్‌ను విక్రయించారు. లీటరు పెట్రోలు రూ.100 నుంచి రూ. 140 వరకూ విక్రయించారు.
దాడులు అన్యాయం....
పార్లమెంట్‌లో సీమాంధ్ర ఎంపీలపై దాడి చేయడాన్ని సమైక్యవాదులు ఖండించారు. అడ్డగోలుగా విభజన చేయాలన్న ఆలోచన విరమించుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ప్రధానంగా కేంద్ర మంత్రులు స్పందించి విభజన బిల్లును అడ్డుకోవాలన్నారు. ఎటువంటి చర్చ జరగకుండా బిల్లు ప్రవేశపెట్టినట్లు ప్రకటించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. అంతేకాకుండా సమైక్య వాణి వినిపించినందుకు 18 మంది ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని ఖండించారు. మిగిలిన పక్షాలపై నేతలు ఒత్తిడి తెచ్చి బిల్లును ఓడించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సమైక్యరాష్ట్ర పరిరక్షణ సమితి నాయకులు గంటా వెంకటరావు, ఆర్‌ఎస్ జాన్, పెద్దింటి అప్పారావు, కె.శ్రీనివాసరావు, పి.పద్మనాభం, ఏపీ నాన్ టీచింగ్ సంఘ సెక్రటరీ పిడిపర్తి సాంబశివశాస్త్రి తదితరులు పాల్గొన్నారు. వీరి ఆందోళనలకు పలు పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు.
Advertisement
Advertisement