బంద్ సంపూర్ణం | Bhadrachalam Division First Day Bandh Successful | Sakshi
Sakshi News home page

బంద్ సంపూర్ణం

Published Sat, Nov 16 2013 4:25 AM | Last Updated on Sat, Sep 2 2017 12:38 AM

Bhadrachalam Division First Day Bandh Successful

భద్రాచలం, న్యూస్‌లైన్: భద్రాచలాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే ఉంచాలని కోరుతూ  జర్నలిస్టు సంఘాల జేఏసీ శుక్రవారం  చేపట్టిన భద్రాచలం డివిజన్ బంద్ సంపూర్ణంగా జరిగింది. బంద్‌కు రాజకీయ పార్టీలు, వివిధ ఉద్యోగ, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించడంతో విజయవంతమై జనజీవనం స్తంభించింది.  భద్రాచలం పట్టణంలో బంద్ ప్రభావం స్పష్టంగా కనిపించింది.  భద్రాచలం చాంబర్‌ఆఫ్ కామర్స్ వారు కూడా బంద్‌లో పాల్గొనడటంతో దుకాణాలు పూర్తిగా మూతపడ్డాయి.  పట్టణంలోని వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. 72 గంటల  బంద్ విజయవంతానికి గాను గురువారం అర్ధరాత్రి నుంచే జర్నలిస్టులు బ్రిడ్జి సెంటర్లో బైఠాయించి వాహనాలను అడ్డుకున్నారు.
 
 భద్రాచలం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులను నిలిపివేయించారు. బస్టాండ్ ముందు రాస్తారోకో నిర్విహ ంచి టైర్లను తగులబెట్టి నిరసన తెలిపారు. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ముందురోజు డివిజన్‌లోని వివిధ ప్రాంతాలకు వెళ్లిన ఆర్టీసీ బస్సులను ఆయా మండలాల్లోనే ఆందోళన కారులు వాటిని నిలిపివేశారు. భద్రాచలంతో పాటు  వాజేడు, దుమ్ముగూడెం, కూనవరం, వీఆర్ పురం మండల కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించారు.  వెంకటాపురం మండల కేంద్రంలో రోడ్డుపైనే జర్నలిస్టులు, అఖిల పక్షం నాయకులు ఆటలు ఆడి నిరసన తెలపటంతో పాటు అక్కడనే వంటా-వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. చింతూరు మండలం చట్టి వద్ద తెలంగాణ వాదులు వాహనాలను అడ్డగించారు. బంద్‌తో పెట్రోల్ బంకులు, దుకాణాలు పూర్తిగా మూతపడ్డాయి. సినిమాహాళ్లు, హోటళ్లను కూడా మూసివేశారు.
 
 సారపాక వరకే ఆర్టీసీ బస్సులు : భద్రాచలం డివిజన్ బంద్‌తో గోదావరి అవతల ఉన్న సారపాక వరకే ఆర్టీసీ బస్సులు తిరిగాయి. రామాలయం దర్శనం కోసం వచ్చిన భక్తులకు సారపాక నుంచి మూడు కిలోమీటర్ల మేర కాలినడక తప్పలేదు. దీంతో వికలాంగులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భద్రాచలం డివిజన్‌లోని వివిధ మండలాల వారు కూడా ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు సారపాక వరకూ వెళ్లి ఆర్టీసీ బస్సులను ఆశ్రయించారు. కాగా దూరప్రాంత బస్సులను తిప్పేందుకు పోలీసుల ప్రయత్నించగా, టీజేఏసీ డివిజన్ అధ్యక్షులు చల్లగుళ్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అడ్డగించారు. దీనిపై పట్టణ ఎస్‌ఐ అబ్బయ్యతో వారు వాగ్వాదానికి దిగారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌లకు వారు భోజనాలను ఏర్పాటు చేశారు. కాగా ఇదే రీతిన శని,ఆదివారాల్లో కూడా బంద్ చేపట్టనున్నట్లు జర్నలిస్టు  సంఘాల వారు ప్రకటించారు. ఈ రెండు రోజుల పాటు బంద్‌కు సహకరించాలని జర్నలిస్టు సంఘాల జేఏసీ నాయకులు బీవీ రమణారెడ్డి కోరారు.
 
 తగ్గిన భక్తుల సంఖ్య
 బంద్‌తో భద్రాచలం రామాలయానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. రామాలయం సమీపంలో దుకాణాలను కూడా మూసి వేశారు. దీంతో దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు భద్రాచలంలో మంచినీరు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా మూడు రోజుల బంద్ నేపథ్యంలో పాపికొండల విహార యాత్రను నిలిపివేస్తున్నట్లుగా లాంచీ యజమానుల సంఘం నాయకులు ప్రకటించారు.
 
 ఆరోరోజుకు చేరిన దీక్షలు
 భద్రాచలాన్ని తెలంగాణలోనే ఉంచాలనే డిమాండ్‌తో టీజేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆరో రోజుకు చేరాయి.  స్థానిక ఎమ్మెల్యే కుంజా సత్యవతి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, టీజేఏసీ జిల్లా అధ్యక్షులు కూరపాటి రంగరాజు, పీఆర్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటపతిరాజు తదితరులు దీక్షాశిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా భద్రాచలం ఎమ్మెల్యే కుంజా సత్యవతి మాట్లాడుతూ భద్రాచలం ప్రాంతంలో ఉన్న  అపారమైన ఖనిజ సంపదను కొల్లగొట్టేందుకే కొంతమంది ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించటంతో పాటు ముంపు ప్రాంత  నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. భద్రాచలం అంశాన్ని రాష్ట్రపతి, జీవోఎంల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.
 
 భద్రాచలంను వదులుకునేది లేదు : టీజేఏసీ జిల్లా అధ్యక్షులు రంగరాజు
 తెలంగాణలో అంతర్భాగమైన భద్రాచలంను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులు కునేది లేదని టీజేఏసీ జిల్లా అధ్యక్షులు కూరపాటి రంగరాజు అన్నారు. భద్రాచలంలో చేపట్టిన టీజేఏసీ దీక్షలను ఆయన సందర్శించి మాట్లాడారు. భద్రాచలంను తెలంగాణ నుంచి వేరే ప్రయత్నాలను తిప్పి కొట్టేందుకు ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పోలవరం ప్రాజెక్టు కోసమే సీమాంధ్రులు ఈ ప్రాంతాన్ని ఆంధ్రలో కలుపుకునేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. భద్రాచలం కోసం టీజేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో పీఆర్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు వెంకటపతిరాజు టీజేఏసీ నాయకులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
 
 ర్యాలీలతో దద్దరిల్లిన భద్రాద్రి
 భద్రాచలాన్ని తెలంగాణలోనే ఉంచాలనే డిమాండ్ చేస్తూ వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల వారు పట్టణంలో ర్యాలీలు నిర్వహించారు. సీపీఐ, టీఆర్‌ఎస్, బీజేపీ అదే విధంగా వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో వేర్వేరుగా ర్యాలీలు చేశారు. భద్రాచలం డివిజన్ వైద్యుల జేఏసీ ఆధ్వర్యంలో    బస్టాండ్ నుంచి అంబేద్కర్ సెంటర్‌వరకూ ర్యాలీ నిర్వహించి టీజేఏసీ దీక్షలకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వైద్యులు నివాళులు అర్పించారు.
 
 దళిత సంఘాల అర్ధనగ్న ప్రదర్శన
 భద్రాచలంను తెలంగాణ రాష్ట్రంలోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ ద ళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్‌లో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement