♦ అవినీతిని తగ్గిస్తామని తిరుపతి సదస్సులో సీఎం ప్రకటన
♦ రాజకీయ జోక్యంపై స్పష్టత ఇవ్వకపోవడంపై నిరాశ
♦ సీఎం వైఖరిపై తీవ్ర చర్చనీయాంశం
సాక్షి, తిరుపతి : సమస్యల సుడిగుండంలో నలుగుతున్న తమను ప్రభుత్వాధినేత గట్టెక్కించేలా భరోసా ఇస్తారని గంపెడాశలతో తిరుపతికి వచ్చిన ఉద్యోగుల్లో సీఎం తీరుపట్ల మిశ్రమ స్పందన వచ్చింది. రాష్ట్రంలోని 4.5లక్షల ఉద్యోగులు, 2.5 లక్షల మంది పెన్షనర్ల తరపున భవిష్యత్ కార్యాచరణపై సోమవారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించారు. దీనికి రాష్ర్టం నలుమూలల నుంచి 105 ఉద్యోగ సంఘాలకు చెందిన సుమారు వెయ్యి మందికి పైగా హాజరయ్యారు.
ప్రకటించిన 43శాతం ఫిట్‌మెంట్ అమలులో మరింత స్పష్టత, ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ, బదిలీల విషయంలో రాజకీయ జోక్యం, దీర్ఘకాలికంగా ఉన్న పదోన్నతి సమస్యలు, అవినీతి, సంస్కరణలు, పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా పెరగాల్సిన వసతి సౌకర్యాలు, నూతన రాజధాని నిర్మాణంలో ఉద్యోగుల పాత్ర, అక్కడ కల్పించాల్సిన వసతి సౌకర్యాలైపై స్పష్టత వస్తుందని అందరూ ఆశించారు.
అయితే, ఇందుకు భిన్నంగా సీఎం చంద్రబాబు స్పందన చూసి ఉద్యోగులు నివ్వెరపోయారు. ‘‘ఫిట్‌మెంట్ పెంచాం.. అవినీతిని తగ్గిస్తాం’’ అన్న ధోరణిలో మాత్రమే చంద్రబాబు ప్రసంగం సాగింది. అదే స్థాయిలో అందరికీ ట్యాబ్‌లు, ఐప్యాడ్‌లు అందిస్తాం.. అందుకు అనుగుణంగా ప్రభుత్వ సేవలు పెంచండి అన్న సందేశాలు మాత్రమే సీఎం ప్రసంగంలో చోటు చేసుకున్నాయి. ఇదిలా ఉంటే, ఉద్యోగులపై రాజకీయ వేధింపులు, అవినీతిలో వారి పాత్ర విషయంలో సీఎం ఏమాత్రం స్పష్టత ఇవ్వకపోవడంపై కూడా వారికి తీవ్ర నిరాశ కలిగించిందని చెప్పక తప్పదు. విధి నిర్వహణలో తాము అవినీతికి పాల్పడబోమంటూ ఉద్యోగ సంఘం నేతలు రూ.100 బాండు పత్రాల్లో రాసిస్తామని. అదే స్థాయిలో తమపై రాజకీయ జోక్యం ఉండదని సీఎం హామీ ఇవ్వగలరా? అని ప్రశ్నిస్తే .. అందుకు సీఎం సమాధానం నవ్వుతో సరిపెట్టి సమాధానాన్ని దాటవేసే ధోరణి కనబడింది. చంద్రబాబు ప్రసంగంలో పదేపదే ‘‘నన్ను నమ్మండి.. మీకు మేలు చేస్తాను’’ అని చెప్పినా ఉద్యోగుల్లో స్పందన మాత్రం అందుకు భిన్నంగా ఉండడం గమనార్హం.
ఇదేనా కార్యాచరణ?
Published Tue, Apr 7 2015 4:53 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM
Advertisement