తరలింపులో.. స్థానికతే అసలు సమస్య
హైదరాబాద్ నుంచి కొత్త రాజధానికి తరలింపుపై ఉద్యోగుల డిమాండ్లు
సాక్షి, హైదరాబాద్: కొత్త రాజధానికి తరలివెళ్లే ఉద్యోగుల పిల్లలకు స్థానికతపై రాష్ట్రప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. తరలింపులో ఇదే పెద్ద సమస్యగా పేర్కొన్నాయి. రాజ్యాంగ ప్రక్రియకు ఎక్కువ సమయం పట్టే పరిస్థితి ఉంటే.. కేంద్రప్రభుత్వం నుంచి వచ్చే విద్యా సంవత్సరానికి వర్తించేలా తాత్కాలిక ఉత్తర్వులైనా ఇప్పించాలని కోరాయి. హైదరాబాద్ నుంచి కొత్త రాజధానికి ఉద్యోగుల తరలింపుపై చర్చించడానికి ఉద్యోగసంఘాల ప్రతినిధులతో పురపాలకశాఖ మంత్రి నారాయణ గురువారమిక్కడ సచివాలయంలో సమావేశమయ్యారు. భేటీ ముగిశాక మంత్రి నారాయణ, ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ, ఏపీఎన్జీవో ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, రెవెన్యూసంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు విలేకరులతో మాట్లాడారు.
వివరాలు సేకరించాలని నిర్ణయం
యూనిఫాం సర్వీసు సిబ్బందితో కలపి 14,800 మంది హైదరాబాద్ నుంచి కొత్త రాజధానికి తరలివెళ్లాల్సి ఉంటుందని ప్రభుత్వం లెక్కలు తేల్చింది. పిల్లల చదువులు, దంపతుల్లో ఒకరి ఉద్యోగం తెలంగాణలో ఉండటం, ఆరోగ్య సమస్యలు.. తదితర కారణాలతో తప్పనిసరిగా హైదరాబాద్‌లోనే నివాసం ఉండాల్సిన ఉద్యోగులు ఎంతమంది ఉంటారో తేల్చాలని సమావేశంలో నిర్ణయించారు. ఉద్యోగుల వివరాలు సేకరించాలని, వాటి ఆధారంగా విశ్లేషించి.. కొంతమందిని హైదరాబాద్‌లో ఉంచే అవకాశమిచ్చే అంశాన్ని పరిశీలించాలని నిర్ణయిం చారు.
తరలింపు తథ్యం: మంత్రి నారాయణ
కొత్త రాజధానిలో తాత్కాలిక సచివాలయ భవన నిర్మాణం జూన్ 15కు పూర్తవుతుందని, ఉద్యోగుల తరలింపు తథ్యమని మంత్రి నారాయణ తెలిపారు. సచివాలయం, అసెంబ్లీలను ఒకేదశలో తరలిస్తామని చెప్పారు. శాఖాధిపతుల కార్యాలయాల్ని అవసరాల్నిబట్టి దశలవారీగా తరలిస్తామన్నారు. స్థానికత అంశాన్ని పరిష్కరించడానికి జీఏడీ అధికారుల బృందాన్ని ఢిల్లీకి పంపించాలని నిర్ణయించామని చెప్పారు. ఉద్యోగులు ప్రస్తావించిన డిమాండ్లపై సానుకూలంగా ఉన్నామని, సీఎంతో మాట్లాడాక వచ్చేనెల 9, 10 తేదీల్లో మరోసారి ఉద్యోగసంఘాలతో భేటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
రాజధానిలో పదివేల ఇళ్లు: అశోక్‌బాబు
రాజధానిలో ఉద్యోగుల వసతికోసం పదివేల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమైందని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు వెల్లడించారు. ఇవన్నీ ప్రభుత్వ క్వార్టర్లుగా ఉంటాయన్నారు. రెండోదశలో ‘రెంట్ టు ఓన్’ పథకాన్ని ప్రవేశపెట్టాలనే తమ డిమాండ్‌కు ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు.