'ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రోడ్ నెట్ వర్క్'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంలో భాగంగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రోడ్ నెట్ వర్క్ ను రూపొందిస్తున్నట్లు మంత్రి నారాయణ స్పష్టం చేశారు. సీఆర్డీఏ కార్యాలయంలో ప్రొఫెసర్లతో ఆదివారం సమావేశమైన మంత్రి నారాయణ అమరావతి లోగో, రూపకల్పనపై ప్రధానంగా చర్చించారు. ఈ భేటీకి నాలుగు వర్సిటీలకు చెందిన 30 మంది ప్రొఫెసర్లు హజరయ్యారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ.. అమరావతి లోగో రూపకల్పనకు 28 మందితో కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఏపీ రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ బృందం బృహత్తర ప్రణాళిక ఇచ్చిందన్నారు. శంకుస్థాపనకు అద్భుతమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఏపీ శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హజరు కానున్నట్లు తెలిపారు. రాజధాని శంకుస్థాపనతో ఏపీ రూపురేఖలు మారిపోతాయని.. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రోడ్ నెట్ వర్క్ రూపొందిస్తున్నట్లు నారాయణ తెలిపారు. శంకుస్థాపన ఏర్పాట్లపై వేర్వేరు కమిటీ వేశామన్నారు.శంకుస్థాపన ప్రాంతంలో ఎనిమిది హెలిప్యాడ్ లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.