encrypted messages
-
ఉగ్ర ‘టూల్‌కిట్’లో సోషల్ మీడియా
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద సంస్థలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని యథేచ్ఛగా వాడుకుంటున్నాయని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికలు ఉగ్రవాదుల టూల్కిట్లో ముఖ్యమైన సాధనాలుగా మారిపోయాయని చెప్పారు. ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్, క్రిప్టో–కరెన్సీ వంటి నూతన సాంకేతికతలను ముష్కరులు దుర్వినియోగం చేయకుండా అంతర్జాతీయంగా కఠిన చ్యలు చేపట్టాలని, ఇందుకోసం ప్రపంచదేశాలు గట్టి ప్రయత్నాలు చేయాలని సూచించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్ఎస్సీ) ఆధ్వర్యంలో శనివారం ఢిల్లీలో జరిగిన కౌంటర్–టెర్రరిజం కమిటీ(సీటీసీ) ప్రత్యేక సమావేశంలో జైశంకర్ మాట్లాడారు. భద్రతా మండలిలోని 15 సభ్యదేశాల ప్రతినిధులు, పలువురు అంతర్జాతీయ నిపుణులు ఈ భేటీకి హాజరయ్యారు. ఉగ్రæ చర్యలపై యూఎన్ఎస్సీ భారత్‌లో సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి. ప్రపంచ మానవాళికి పెనుముప్పు ఉగ్రవాదాన్ని అణచివేయడానికి భారత్ అంకితభావంతో కృషి చేస్తోందని జైశంకర్ పునరుద్ఘాటించారు. ‘ఐక్యరాజ్యసమితి ఫండ్ ఫర్ కౌంటర్–టెర్రరిజం’కు ఈ ఏడాది భారత్ స్వచ్ఛందంగా 5 లక్షల డాలర్లు ఇవ్వబోతోందని ప్రకటించారు. గత రెండు దశాబ్దాలుగా సాంకేతికంగా ఎన్నో మార్పులు వచ్చాయని చెప్పారు. ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మాదక ద్రవ్యాలు చేరవేయడానికి, లక్ష్యాలపై దాడులు చేయడానికి ఉగ్రవాద సంస్థలు, వ్యవస్థీకృత నేరగాళ్ల ముఠాలు మానవ రహిత విమానాలు, డ్రోన్లు వాడుతుండడం ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలకు పెద్ద తలనొప్పిగా మారిందన్నారు. ఉగ్రవాదం ప్రపంచ మానవాళికి పెద్ద ముప్పుగా పరిణమించిందని చెప్పారు. గ్లోబల్ యాక్షన్ కావాలి: గుటేరస్ ఉగ్రవాద సంస్థలు ఆధునిక టెక్నాలజీని వాడుకోకుండా కట్టడి చేయాలని, ఇందుకోసం ప్రపంచ దేశాలన్నీ ఉమ్మడిగా కృషి (గ్లోబల్ యాక్షన్) చేయాలని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఒక సందేశాన్ని పంపారు. ఉగ్రవాద కార్యకలాపాల కోసం కొత్త టెక్నాలజీని వాడుకోవడం వేగంగా పెరుగుతోందని ఐక్యరాజ్యసమితిలో భారతదేశ ప్రతినిధి రుచిరా కాంబోజ్ చెప్పారు. ‘ఢిల్లీ డిక్లరేషన్’ను 15 సభ్యదేశాల ప్రతినిధులు ఆమోదించారు. ఉగ్ర సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రైవేట్ రంగం, పౌర సమాజంతో కలిసి పనిచేయాలని ప్రభుత్వాలకు కౌంటర్–టెర్రరిజం కమిటీ పిలుపునిచ్చింది. ఉగ్రవాదాన్ని ఉపేక్షించవద్దు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము భారత్ కొన్ని దశాబ్దాలుగా ఉగ్రవాద బాధిత దేశమేనని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. ఉగ్రవాద చర్యలను ఎంతమాత్రం ఉపేక్షించడానికి వీల్లేదని తేల్చిచెప్పారు. ఉగ్రవాదులకు ప్రేరణ ఏదైనప్పటికీ వారి కార్యకలాపాలను అరికట్టాల్సిందేనని స్పష్టం చేశారు. ముష్కర శక్తుల ఆట కట్టించే విషయంలో ప్రపంచ దేశాలకు భారత్ మార్గదర్శిగా కొనసాగాలని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆధ్వర్యంలో జరిగిన కౌంటర్–టెర్రరిజం కమిటీ(సీటీసీ) సమావేశాన్ని ఉద్దేశించిన ద్రౌపదీ ముర్ము ప్రసంగించారు. ఉగ్రవాదంపై భారత్ అలుపెరుగని పోరాటం సాగిస్తోందని ఉద్ఘాటించారు. భారత్ ఉగ్రవాదం బారినపడిందని పేర్కొన్నారు. -
వాట్సాప్‌లో సమాచారం భద్రం కాదా?
వాషింగ్టన్: మెసేజింగ్ యాప్ వాట్సాప్ మనం అనుకున్నంత భద్రమైనదేమీ కాదని నిపుణులు వ్యాఖ్యానించారు. వాట్సాప్ ద్వారా ఒక వ్యక్తి మరో వ్యక్తికి పంపే సందేశాలు ఎన్‌క్రిప్ట్ అయ్యి గోప్యంగా ఉండటం నిజమేకావచ్చని, అయితే వాట్సాప్ కాల్ డేటా సహా ఇతర సమాచారం దుర్వినియోగం అవుతుండొచ్చని అమెరికాకు చెందిన నిపుణుడు వివేక్ వాధ్వా అంటున్నారు. వాట్సాప్‌ను ఫేస్బుక్ 2014లో కొనేసింది. వినియోగదారులు వాడుతున్న ఫోన్ వివరాలు, గుర్తింపు తదితరాలను ఫేస్‌బుక్‌కు అందజేస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించిన విషయాన్ని వివేక్ గుర్తుచేస్తున్నారు. వాట్సాప్ గ్రూప్ చాట్లలో భద్రత లేదని, ఏదేనీ గ్రూప్‌లోని వ్యక్తికి ఆ గ్రూప్‌లో ఉన్న సభ్యులందరి ఫోన్ నంబర్లు తెలిసిపోతుండటంపై వివేక్ ఆందోళన వ్యక్తం చేశారు. ఫేస్బుక్ వినియోగదారుల సమాచారం దుర్వినియోగమవ్వడం, గూగుల్ వంటి సంస్థలు యూజర్ల సమాచారాన్ని సేకరించి, నిర్వహిస్తుండటం తదితరాల నేపథ్యంలో కొత్త నిబంధనలు రావాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. -
వాట్సప్ నిషేధానికి సుప్రీంకోర్టు నో
వాట్సప్ సహా అలాంటి మరో 20 యాప్‌లను నిషేధించాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. అవసరమైతే వాటిద్వారా పంపే సందేశాలను ప్రభుత్వ వర్గాలు సేకరించేలా ఉండాలని, లేని పక్షంలో ఆ యాప్‌లను నిషేధించాలంటూ హర్యానాకు చెందిన ఆర్టీఐ కార్యకర్త సుధీర్ యాదవ్ సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్లతో కూడిన ధర్మాసనం... ఈ విషయంలో సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచిస్తూ పిల్‌ను కొట్టేసింది. వాట్సప్ సహా 20 యాప్‌లు ఎన్క్రిప్షన్ను అమలుచేస్తున్నాయని, దీనివల్ల సందేశం పంపేవారు, దాన్ని రిసీవ్ చేసుకున్నవారు తప్ప మధ్యలో ఎవరూ వాటిని చదవలేరని సుధీర్ యాదవ్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఇది దేశభద్రతకు ముప్పు కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. బ్లాక్ బెర్రీ ఇంతకుముందు ఇలాగే ఎన్క్రిప్షన్ అమలుచేయగా, ప్రభుత్వం వద్దని తెలిపిందని యాదవ్ అన్నారు. ఎన్క్రిప్షన్ ఉంటే ఒక్కో సందేశాన్ని మధ్యలో చదవడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుందని తన పిటిషన్లో పేర్కొన్నారు. -
ఉగ్రవాదులకు వాట్సప్ సాయం?
వాట్సప్, వైబర్, హైక్, టెలిగ్రామ్ లాంటి మెసేజింగ్ యాప్‌లు ఉగ్రవాదులకు సాయం చేస్తున్నాయా? అందుకోసం వాటిని నిషేధించాలా? ప్రస్తుతం ఇలాంటి ప్రశ్నలు సుప్రీంకోర్టులో వినిపిస్తున్నాయి. హర్యానాకు చెందిన సుధీర్ యాదవ్ అనే ఈ మేరకు ఒక ప్రజాహిత వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టులో దాఖలుచేశారు. మెసేజీలను ఎన్‌క్రిప్ట్ చేయడం ద్వారా ఈ యాప్‌లు ఉగ్రవాదులకు, నేరగాళ్లకు సాయం చేస్తున్నాయని యాదవ్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఇలా ఎన్‌క్రిప్ట్ చేసిన మెసేజీలను ఇంటర్క్రిప్ట్ చేయడం.. అంటే వాటిని మధ్యలోనే చదవడం అసాధ్యం. ఉగ్రవాదులు ఒకరికి ఒకరు వాట్సప్, వైబర్ లాంటి యాప్‌ల ద్వారా సందేశాలు పంపుకొన్నప్పుడు వాటిని నిఘా సంస్థలు మధ్యలోనే పట్టేసినా.. అవి ఎన్‌క్రిప్ట్ అయి ఉంటాయి కాబట్టి అందులో ఏముందో తెలుసుకోలేరు. పంపిన వ్యక్తి, దాన్ని అందుకున్న వ్యక్తి మాత్రమే వాటిని చదవగలరు. సూపర్ కంప్యూటర్లు కూడా ఇలా ఎన్‌క్రిప్ట్ చేసిన సందేశాలను చదవలేవు. ఎన్‌క్రిప్ట్ చేసిన ఒక మెసేజిని డీక్రిప్ట్ చేయాలంటే కొన్ని వందల సంవత్సరాలు పడుతుందని యాదవ్ తెలిపారు. అందువల్ల వాట్సప్, వైబర్, టెలిగ్రామ్, హైక్, సిగ్నల్ లాంటి యాప్‌లు జాతీయ భద్రతకు ముప్పు అని, వాటిని నిషేధించాలని తన పిటిషన్ ద్వారా సుప్రీంకోర్టును కోరారు. ఈ కేసును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈనెల 29న విచారిస్తుంది.