వాట్సప్ నిషేధానికి సుప్రీంకోర్టు నో
వాట్సప్ సహా అలాంటి మరో 20 యాప్లను నిషేధించాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. అవసరమైతే వాటిద్వారా పంపే సందేశాలను ప్రభుత్వ వర్గాలు సేకరించేలా ఉండాలని, లేని పక్షంలో ఆ యాప్లను నిషేధించాలంటూ హర్యానాకు చెందిన ఆర్టీఐ కార్యకర్త సుధీర్ యాదవ్ సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్లతో కూడిన ధర్మాసనం... ఈ విషయంలో సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచిస్తూ పిల్ను కొట్టేసింది.
వాట్సప్ సహా 20 యాప్లు ఎన్క్రిప్షన్ను అమలుచేస్తున్నాయని, దీనివల్ల సందేశం పంపేవారు, దాన్ని రిసీవ్ చేసుకున్నవారు తప్ప మధ్యలో ఎవరూ వాటిని చదవలేరని సుధీర్ యాదవ్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఇది దేశభద్రతకు ముప్పు కలిగిస‍్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. బ్లాక్ బెర్రీ ఇంతకుముందు ఇలాగే ఎన్క్రిప్షన్ అమలుచేయగా, ప్రభుత్వం వద్దని తెలిపిందని యాదవ్ అన్నారు. ఎన్క్రిప్షన్ ఉంటే ఒక్కో సందేశాన్ని మధ్యలో చదవడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుందని తన పిటిషన్లో పేర్కొన్నారు.