ఉగ్రవాదులకు వాట్సప్ సాయం?
వాట్సప్, వైబర్, హైక్, టెలిగ్రామ్ లాంటి మెసేజింగ్ యాప్లు ఉగ్రవాదులకు సాయం చేస్తున్నాయా? అందుకోసం వాటిని నిషేధించాలా? ప్రస్తుతం ఇలాంటి ప్రశ్నలు సుప్రీంకోర్టులో వినిపిస్తున్నాయి. హర్యానాకు చెందిన సుధీర్ యాదవ్ అనే ఈ మేరకు ఒక ప్రజాహిత వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టులో దాఖలుచేశారు. మెసేజీలను ఎన్క్రిప్ట్ చేయడం ద్వారా ఈ యాప్లు ఉగ్రవాదులకు, నేరగాళ్లకు సాయం చేస్తున్నాయని యాదవ్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఇలా ఎన్క్రిప్ట్ చేసిన మెసేజీలను ఇంటర్క్రిప్ట్ చేయడం.. అంటే వాటిని మధ్యలోనే చదవడం అసాధ్యం.
ఉగ్రవాదులు ఒకరికి ఒకరు వాట్సప్, వైబర్ లాంటి యాప్ల ద్వారా సందేశాలు పంపుకొన్నప్పుడు వాటిని నిఘా సంస్థలు మధ్యలోనే పట్టేసినా.. అవి ఎన్క్రిప్ట్ అయి ఉంటాయి కాబట్టి అందులో ఏముందో తెలుసుకోలేరు. పంపిన వ్యక్తి, దాన్ని అందుకున్న వ్యక్తి మాత్రమే వాటిని చదవగలరు. సూపర్ కంప్యూటర్లు కూడా ఇలా ఎన్క్రిప్ట్ చేసిన సందేశాలను చదవలేవు. ఎన్క్రిప్ట్ చేసిన ఒక మెసేజిని డీక్రిప్ట్ చేయాలంటే కొన్ని వందల సంవత్సరాలు పడుతుందని యాదవ్ తెలిపారు. అందువల్ల వాట్సప్, వైబర్, టెలిగ్రామ్, హైక్, సిగ్నల్ లాంటి యాప్లు జాతీయ భద్రతకు ముప్పు అని, వాటిని నిషేధించాలని తన పిటిషన్ ద్వారా సుప్రీంకోర్టును కోరారు. ఈ కేసును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈనెల 29న విచారిస్తుంది.