Endoscopy treatment
-
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
హైదరాబాద్, మే 14, 2024: యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఓ వృద్ధుడు సుమారు నెల రోజుల క్రితం ఓ పెళ్లిలో మటన్ తింటూ, పళ్లు లేకపోవడంతో పొరపాటున ఓ ఎముక మింగేశారు. ఆహారనాళంలో ఇరుక్కుపోయిన ఆ ఎముక.. లోపల రంధ్రం చేసి, తీవ్ర ఇన్ఫెక్షన్కు కారణమైంది. ఎదభాగం మధ్యలో తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న ఆ వృద్ధుడు.. ఎట్టకేలకు ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రికి వచ్చారు.తొలుత నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి వెళ్లగా అక్కడ ఎండోస్కొపీ చేసి ఎముక ఉందన్న విషయాన్ని గుర్తించి, ఎల్బీనగర్ ఆస్పత్రికి పంపారు. ఇక్కడ కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ రాధిక నిట్టల నేతృత్వంలోని వైద్యబృందం ఆయనను క్షుణ్నంగా పరిశీలించి, తగిన పరీక్షలు కూడా చేసి శస్త్రచికిత్స అవసరం లేకుండా ఎండోస్కొపిక్ ప్రొసీజర్తోనే ఎముకను అత్యంత జాగ్రత్తగా బయటకు తీశారు. ఇందుకు సంబంధించిన వివరాలను డాక్టర్ రాధిక తెలిపారు.యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కక్కిరేన్ గ్రామానికి చెందిన 66 ఏళ్ల శ్రీరాములుకు దవడ పళ్లు లేవు. దానివల్ల నమలలేరు. కానీ ఒక పెళ్లికి వెళ్లి, అక్కడ మటన్ ఉండటంతో తినాలనుకున్నారు. పళ్లు లేకపోవడం వల్ల నమలకుండా నేరుగా మింగేశారు. అలా మింగినప్పుడు దాదాపు 3.5 సెంటీమీటర్ల పొడవున్న ఒక ఎముక ముక్క కూడా లోపలకు వెళ్లిపోయింది. వెళ్లిన విషయం కూడా తొలుత ఆయనకు తెలియలేదు. రెండు మూడు రోజుల తర్వాత ఛాతీలో నొప్పి అనిపించింది. స్థానికంగా వైద్యులకు చూపిస్తే అల్ట్రాసౌండ్ స్కానింగ్ తీసి గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనుకుని మందులు ఇచ్చారు. కానీ నొప్పి మాత్రం తగ్గలేదు. దాంతో తర్వాత నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి వెళ్లగా అక్కడ ఎండోస్కొపీ చేసి చూసి, లోపల ఎముక ఇరుక్కుందన్న విషయం చెప్పారు. అక్కడినుంచి ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రికి పంపారు.సాధారణంగా ఇలా ఇరుక్కున్న ఎముకలను ఎవరైనా తీసేస్తారు. కానీ, నెల రోజులుగా అది ఇరుక్కుపోవడం వల్ల ఆహారనాళానికి రంధ్రం చేసిసింది. ఆ ప్రాంతంలో ఇన్ఫెక్షన్ ఏర్పడి, పుండ్లు కూడా పడ్డాయి. కొంత చీము చేరింది. దానికితోడు ఇదంతా గుండెకు బాగా దగ్గరగా ఉంది. అలాంటప్పుడు తీసే సమయంలో ఏమాత్రం కొంత అటూ ఇటూ అయినా ఆహారనాళానికి పూర్తిగా రంధ్రం పడిపోయి, అది గుండెకు కూడా ప్రమాదకరంగా మారుతుంది. దీన్ని అత్యంత జాగ్రత్తగా ఎండోస్కొపీ ప్రొసీజర్‌లోనే తొలగించాం. లేనిపక్షంలో అక్కడ పెర్ఫొరేషన్ లాంటి మరిన్ని సమస్యలు వచ్చేవి.ఈ ప్రక్రియ చేసిన తర్వాత కూడా ఆయనకు చాలా జాగ్రత్తలు చెప్పాం. ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో అన్నం తింటే ఆ మెతుకులు మళ్లీ ఇన్ఫెక్షన్ అయిన పుండ్ల వద్దకు చేరి, అక్కడ ఆగిపోయి మళ్లీ ఇన్ఫెక్షన్ పెరిగిపోతుంది. అందుకే ఆయనకు కొంతకాలం పూర్తిగా ద్రవపదార్థాలు మాత్రమే తీసుకోవాలని చెప్పాం. కొబ్బరినీళ్లు, మంచినీళ్ల లాంటివి తీసుకోవాలన్నాం. ఇప్పుడు ఎముక వల్ల వచ్చిన నొప్పి ఆయనకు పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడే కొద్దిగా జొన్న అన్నం, పెరుగు అన్నం తినగలుగుతున్నారు.ఏ వయసువారైనా తినేటప్పుడు బాగా నమిలి తినాలి. ఇక కాస్త పెద్దవయసు వచ్చి, పళ్లు ఊడిపోయిన తర్వాత అయితే ఏదైనా బాగా ఉడకబెట్టుకుని, మెత్తగా అయిన తర్వాత మాత్రమే తీసుకోవాలి. ఎముకలను ఎవరైనా యథాతథంగా తినకూడదు. కానీ ఈ కేసులో ఆయనకు పళ్లు లేకపోవడంతో తెలియక, పొరపాటున మింగేశారు. అది సమయానికి తియ్యకపోతే ఇన్ఫెక్షన్ పెరిగిపోతుంది. ఆహారనాళానికి రంధ్రం కూడా పెద్దది అయిపోతుంది. అప్పుడు తప్పనిసరిగా మేజర్ సర్జరీ చేయాలి. చీము పడుతుంది. ఇలా ఒక నెల రోజుల పాటు ఎముక లోపల ఉండిపోవడం ఎప్పుడూ చూడలేదు” అని డాక్టర్ రాధిక నిట్టల వివరించారు. -
సొరంగ బాధితుల ఫొటోలను ఎండోస్కోపిక్ కెమెరా ఎలా తీసింది?
ఉత్తరకాశీలోని సిల్క్యారా టన్నెల్లో గత 9 రోజులుగా 41 మంది కూలీలు చిక్కుకుపోయారు. వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన కసరత్తు చేస్తోంది. ఈ నేపధ్యంలో వారికి పైపు ద్వారా ఘన ఆహారాన్ని అందించడంలో ప్రభుత్వం విజయం సాధించింది. దీనితోపాటు ఎండోస్కోపిక్ కెమెరా ద్వారా కార్మికుల పరిస్థితిని అధికారులు గమనించారు. రెస్క్యూ బృందం ఈరోజు (మంగళవారం) తెల్లవారుజామున వారి దగ్గరకు ఎండోస్కోపిక్ ఫ్లెక్సీ కెమెరా పంపారు. వారి క్షేమ సమాచారం గురించి ఆరా తీశారు. దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు. అందుకే ఎండోస్కోపిక్ కెమెరా అంటే ఏమిటో.. అది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎండోస్కోపిక్ కెమెరాలను మానవ శరీరంలోని అంతర్గత అవయవాలను పరిశీలించడానికి ఉపయోగిస్తారు. ఎండోస్కోపిక్ కెమెరాలు అత్యంత సాంకేతికంగా పనిచేస్తాయి. సరైన రోగనిర్ధారణ, వ్యాధులకు తగిన చికిత్స అందించేందుకు ఎండోస్కోపిక్ కెమెరాను వైద్యులు వినియోగిస్తారు. ఆధునిక ఎండోస్కోపిక్ కెమెరాలు ‘చిప్-ఆన్-టిప్’ సాంకేతికతతో పనిచేస్తాయి. కెమెరా చివరిలో ఉన్న సాఫ్ట్ ప్యాకేజీ ద్వారా ఫొటోలు తీయడం జరుగుతుంది. ఈ కెమెరా పైన ఎల్ఈడీ లైట్ ఉంటుంది. ఫలితంగా ఈ కెమెరా చీకటిగా ఉన్న ప్రదేశాలలో కూడా చిత్రాలను క్లిక్ చేయగలుగుతుంది. ఉత్తరాఖండ్‌లోని సొరంగంలో చిక్కుకున్న కార్మికుల ఆచూకీ కోసం అధికారులు ఫ్లెక్సీ కెమెరాను ఉపయోగించారు. పైప్‌లైన్‌లోని చిన్న రంధ్రం ద్వారా కెమెరాను సొరంగం లోనికి పంపించి బాధితుల గురించి తెలుసుకున్నారు. ఇది కూడా చదవండి: యాంటీమాటర్ అంటే ఏమిటి? ఎందుకు అత్యంత శక్తివంతం? -
మూడ్ పాడైతే బ్లేడ్, నెయిల్ కట్టర్, తాళం... ఎనీథింగ్ హాంఫట్!
గాంధీ ఆస్పత్రి: అతడి పేరు గోవర్ధన కార్తీక్... డ్రగ్స్ విక్రయిస్తూ పోలీసులకు చిక్కి జైలుకు చేరాడు... ఏమాత్రం మూడ్ బాగోలేకపోయినా చేతికి అందిన దాన్ని గుటుక్కుమనిపిస్తాడు. ఇలా పక్షం రోజుల్లో బ్లేడ్, నెయిల్ కట్టర్, తాళం చెవితో పాటు, ఇనుప రేకు ముక్కల్నీ మింగేశాడు. ఇతగాడి వ్యవహారశైలితో అటు జైలు అధికారులు, ఇటు గాంధీ ఆస్పత్రి వైద్యులు తలలు పట్టుకుంటున్నారు. చేతికి దొరికింది నోట్లో వేసుకుని... విజయవాడకు చెందిన కార్తీక్ (22) మత్తు పదార్థాలకు బానిసయ్యాడు. వాటిని ఖరీదు చేయడానికి అవసరమైన డబ్బు కోసం విక్రతగా మారా డు. కొన్నాళ్ల క్రితం పోలీసులకు చిక్కిన ఈ పెడ్లర్ ప్రస్తుతం చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. మత్తు మందులు దొరక్కో, జైల్లో పెట్టారనే అసహనమో తెలియదు కానీ ఇతగాడికి తరు మూడ్ పాడవుతూ ఉంటుంది. ఆ సమయంలో జైలులో తన చుట్టూ అందుబాటులో ఉన్న చిన్న, చిన్న ఇనుప వస్తువులను అమాంతం మింగేస్తుంటాడు. పక్షం రోజులుగా ఈ వ్యవహారశైలితో జైలు అధికారులకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాడు. అయితే ఎనిమా లేదంటే ఎండోస్కోపీ... గతంలో జైల్లో ఉండగానే తీవ్రమైన కడుపునొప్పి రావడంతో జైలు డాక్టర్లు పరీక్షించారు. ఈ నేపథ్యంలోనే అతడు ఇనుప వస్తువులు మింగిన విషయం బయటపడింది. కొన్నిసార్లు ఎనిమా ద్వారా బయటకు వచ్చేలా చేస్తుండగా... మరికొన్ని సార్లు మాత్రం ఆస్పత్రికి తీసుకురావాల్సి వచ్చింది. జైలు అధికారుల సూచన మేరకు గత నెల 28న మొదటిసారిగా గాంధీ ఆస్పత్రి ప్రిజనర్స్ వార్డులో అడ్మిట్ అయ్యాడు. వైద్య పరీక్షల్లో కార్తీక్ కడుపులో ఇనుప వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. ఎండోస్కోపీ ద్వారా పెద్ద పేగుల మధ్య ఇరుకున్న చేతి బేడీలకు వేసే తాళం చెవిని బయటకు తీశారు. ప్రిజనర్స్ వార్డు నుంచి డిశ్చార్జీ చేసి జైలుకు తరలించగా నెయి ల్కట్టర్, బ్లేడ్లు మింగాడు. కొన్ని ఎనిమా ద్వారా బయటకు రాగా, మరికొన్ని ఎండోస్కోపీ ద్వారా బయటకు తీశారు. తాజాగా సోమవారం మరోసారి... కార్తీక్ ఈసారి ఇనుప రేకు ముక్కను మింగేశాడు. తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్న అతడిని జైలు అధికారులు ఈ నెల 7న మరోసారి గాంధీ ఆస్పత్రిలోని ప్రిజనర్స్ వార్డులో చేర్చారు. గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగ వైద్యులు సోమవారం తీవ్రంగా శ్రమించి ఎండోస్కోపీ విధానంలో అతడి పేగుల మధ్య ఇరుక్కున్న రేకు ముక్కను బయటకు తీశారు. ఆయా వస్తువులు పేగుల్లో ఇరుక్కోవడంతో తీవ్రమైన నొప్పితో బాధపడటమే కాకుండా ప్రాణా పాయం ఏర్పడే ప్రమాదం ఉందని వైద్యలు చెప్తున్నారు. గాంధీ వైద్యులు పక్షం రోజుల్లో కార్తీక్‌కు మూడుసార్లు ఎండోస్కోపీ చేసి కడుపులో చిక్కుకున్న ఆయా వస్తువులను బయటకు తీశారు. రిమాండ్ ఖైదీ చేతికి ఎలా... చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న కార్తీక్‌కు ప్రమాదకరమైన ఇనుప వస్తువులు ఎలా అందుబాటులోకి వస్తున్నాయన్నది కీలకంగా మారింది. ఈ విషయంపై అతడేమీ చెప్పట్లేదని, తమకూ అర్థం కావడం లేదని ఎండోస్కోపీ నిర్వహించిన గాంధీ ఆస్పత్రి వైద్యులు అంటున్నారు. కార్తీక్ కడుపులో నుంచి మూడుసార్లు తీసిన వస్తువులు ప్రమాదకరమైనవే అని గాంధీ ఆస్పత్రి గ్యాస్ట్రో ఎంట్రాలజీ హెచ్ఓడీ శ్రవణ్‌కుమార్ స్పష్టం చేశారు. రిమాండ్ ఖైదీగా ఉన్న కార్తీక్ మానసిక రుగ్మతలతో బాధపడుతున్నాడని, తక్షణమే మానసిక వైద్యులకు చూపించాలని సూచించానని ఆయన వివరించారు. (చదవండి: ఇంటర్ ఛేంజర్లతో ఇక్కట్లు!) -
ఎండోస్కోపీ చికిత్సతో ఎసిడిటీకి చెక్
* దేశంలోనే తొలిసారిగా ఏషియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీలో చికిత్స * ఔట్ పేషెంట్‌గా వచ్చి అరగంటలో చికిత్స చేయించుకుని వెళ్లొచ్చు * దీంతో శాశ్వతంగా ఎసిడిటీకి చెక్ పెట్టవచ్చన్న చైర్మన్ నాగేశ్వర్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: ఎండోస్కోపీ చికిత్సతో ఎసిడిటీకి పూర్తిస్థాయిలో చెక్ పెట్టవచ్చని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం జపాన్‌లోనే ఈ చికిత్స జరుగుతోందని.. ఆ తర్వాత హైదరాబాద్‌లోని తమ ఆస్పత్రిలోనే ఈ పద్ధతిలో చికిత్స అందిస్తున్నామని చెప్పారు. బుధవారం ఆయన తాజ్ కృష్ణా హోటల్లో డైరెక్టర్ జీవీ రావుతో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎసిడిటీని నిర్లక్ష్యం చేస్తే అది చివరకు క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉందన్నారు. మందుల వాడకం వల్ల దుష్ఫలితాలు వస్తాయని, అందుకే ఈ చికిత్స సరైందని అన్నారు. జపాన్‌లో ఈ చికిత్సకు రూ. 5లక్షల వరకు ఖర్చవుతుండగా.. తాము రూ. 30 వేల నుంచి రూ. 40 వేలకే చేస్తున్నామన్నారు. తిరుపతికి చెందిన స్టాఫ్ నర్స్ అమ్ములు నాలుగేళ్లుగా ఎసిడిటీతో బాధపడుతుంటే ఆమెకు ఈ చికిత్స విజయవంతంగా చేశామన్నారు. ఎండోస్కోపీ విధానం అనేది శస్త్రచికిత్స కాదని.. కేవలం ఎండోస్కోపీ టెక్నిక్‌గా ఆయన అభివర్ణించారు. అన్నవాహికకు, జీర్ణాశయానికి మధ్యలో ఉండే కవాటాన్ని కొత్తగా కృత్రిమ పద్ధతుల్లో ప్రవేశపెట్టడమే ఈ వైద్య విధానమన్నారు. కణాలతో కవాటాన్ని సృష్టించి ఈ చికిత్స చేస్తామన్నారు. దీన్నే యాంటీ రిఫ్లక్స్ ముకోసాల్ రిఫ్లెక్షన్ (ఆర్మ్స్) అంటారని, దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవన్నారు. ఈ విధానంలో చికిత్స చేయించుకుంటే భవిష్యత్తులో ఎసిడిటీ సమస్య తలెత్తదన్నారు. 2 వేల ఏళ్లుగా మనుషులకు ఎసిడిటీ వస్తూనే ఉందని, దేశంలో రోజురోజుకూ ఎసిడిటీ సమస్య పెరిగిపోతోందన్నారు. జైపూర్‌లో 22 శాతం మందికి, ఢిల్లీలో 17 శాతం, చెన్నైలో 10 శాతం, హైదరాబాద్‌లో 25 శాతం, ఏపీలో 24 శాతం మంది ఎసిడిటీతో బాధపడుతున్నారని చెప్పారు. జీవన విధానం మారడం వల్లే ఎసిడిటీ, కడుపులో మంట వస్తుందన్నారు. దాంతోపాటు వ్యాయామం లేకపోవడం మరో ప్రధాన కారణమన్నారు. ఆర్మ్స్ వైద్య చికిత్స విధానాన్ని జపాన్‌కు చెందిన వైద్యుడు కనుగొన్నారని, ఇది వైద్య రంగంలో విప్లవమని పేర్కొన్నారు.