ఎరక్కపోయి ఇరుక్కుపోయి | Doctors remove mutton bone stuck in esophagus endoscopy procedure | Sakshi
Sakshi News home page

ఎరక్కపోయి ఇరుక్కుపోయి

Published Tue, May 14 2024 8:56 PM | Last Updated on Tue, May 14 2024 8:58 PM

Doctors remove mutton bone stuck in esophagus endoscopy procedure

ఆహార‌నాళంలో ఇరుక్కుపోయిన మ‌ట‌న్ ఎముక‌

వృద్ధుడికి నెల రోజులుగా తీవ్ర స‌మ‌స్య‌

గుండెకు స‌మీపంలో ఆహార‌నాళానికి రంధ్రం

ఎండోస్కొపీ ప్రొసీజ‌ర్‌తో తీసేసిన కామినేని వైద్యులు

హైద‌రాబాద్, మే 14, 2024:  యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాకు చెందిన ఓ వృద్ధుడు సుమారు నెల రోజుల క్రితం ఓ పెళ్లిలో మ‌ట‌న్ తింటూ, ప‌ళ్లు లేక‌పోవ‌డంతో పొర‌పాటున ఓ ఎముక మింగేశారు. ఆహార‌నాళంలో ఇరుక్కుపోయిన ఆ ఎముక‌.. లోప‌ల రంధ్రం చేసి, తీవ్ర ఇన్ఫెక్ష‌న్‌కు కార‌ణ‌మైంది. ఎద‌భాగం మ‌ధ్య‌లో తీవ్ర‌మైన నొప్పితో బాధ‌ప‌డుతున్న ఆ వృద్ధుడు.. ఎట్ట‌కేల‌కు ఎల్బీన‌గ‌ర్‌ కామినేని ఆస్ప‌త్రికి వ‌చ్చారు.

తొలుత నార్క‌ట్‌ప‌ల్లిలోని కామినేని ఆస్పత్రికి వెళ్ల‌గా అక్క‌డ ఎండోస్కొపీ చేసి ఎముక ఉంద‌న్న విష‌యాన్ని గుర్తించి, ఎల్బీన‌గ‌ర్ ఆస్ప‌త్రికి పంపారు. ఇక్క‌డ క‌న్స‌ల్టెంట్ మెడిక‌ల్ గ్యాస్ట్రో ఎంట‌రాల‌జిస్ట్ డాక్ట‌ర్ రాధిక నిట్ట‌ల నేతృత్వంలోని వైద్య‌బృందం ఆయ‌న‌ను క్షుణ్నంగా ప‌రిశీలించి, త‌గిన ప‌రీక్ష‌లు కూడా చేసి శ‌స్త్రచికిత్స అవ‌స‌రం లేకుండా ఎండోస్కొపిక్ ప్రొసీజ‌ర్‌తోనే ఎముక‌ను అత్యంత జాగ్ర‌త్త‌గా బ‌య‌ట‌కు తీశారు. ఇందుకు సంబంధించిన వివరాల‌ను డాక్ట‌ర్ రాధిక తెలిపారు.

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా రామ‌న్న‌పేట మండ‌లం క‌క్కిరేన్ గ్రామానికి చెందిన 66 ఏళ్ల శ్రీ‌రాములుకు ద‌వ‌డ ప‌ళ్లు లేవు. దానివ‌ల్ల న‌మ‌ల‌లేరు. కానీ ఒక పెళ్లికి వెళ్లి, అక్క‌డ మ‌ట‌న్ ఉండ‌టంతో తినాల‌నుకున్నారు. ప‌ళ్లు లేక‌పోవ‌డం వ‌ల్ల న‌మ‌ల‌కుండా నేరుగా మింగేశారు. అలా మింగిన‌ప్పుడు దాదాపు 3.5 సెంటీమీట‌ర్ల పొడ‌వున్న ఒక ఎముక ముక్క కూడా లోప‌ల‌కు వెళ్లిపోయింది. వెళ్లిన విష‌యం కూడా తొలుత ఆయ‌న‌కు తెలియ‌లేదు. రెండు మూడు రోజుల త‌ర్వాత ఛాతీలో నొప్పి అనిపించింది. స్థానికంగా వైద్యుల‌కు చూపిస్తే అల్ట్రాసౌండ్ స్కానింగ్ తీసి గ్యాస్ట్రిక్ ట్ర‌బుల్ అనుకుని మందులు ఇచ్చారు. కానీ నొప్పి మాత్రం త‌గ్గ‌లేదు. దాంతో త‌ర్వాత నార్క‌ట్‌ప‌ల్లిలోని కామినేని ఆస్ప‌త్రికి వెళ్ల‌గా అక్క‌డ ఎండోస్కొపీ చేసి చూసి, లోప‌ల ఎముక ఇరుక్కుంద‌న్న విష‌యం చెప్పారు. అక్క‌డినుంచి ఎల్బీన‌గ‌ర్ కామినేని ఆస్ప‌త్రికి పంపారు.

సాధార‌ణంగా ఇలా ఇరుక్కున్న ఎముక‌ల‌ను ఎవ‌రైనా తీసేస్తారు. కానీ, నెల రోజులుగా అది ఇరుక్కుపోవ‌డం వ‌ల్ల ఆహార‌నాళానికి రంధ్రం చేసిసింది. ఆ ప్రాంతంలో ఇన్ఫెక్ష‌న్ ఏర్ప‌డి, పుండ్లు కూడా ప‌డ్డాయి. కొంత చీము చేరింది. దానికితోడు ఇదంతా గుండెకు బాగా ద‌గ్గ‌ర‌గా ఉంది. అలాంట‌ప్పుడు తీసే స‌మ‌యంలో ఏమాత్రం కొంత అటూ ఇటూ అయినా ఆహార‌నాళానికి పూర్తిగా రంధ్రం ప‌డిపోయి, అది గుండెకు కూడా ప్రమాద‌క‌రంగా మారుతుంది. దీన్ని అత్యంత జాగ్ర‌త్త‌గా ఎండోస్కొపీ ప్రొసీజ‌ర్‌లోనే తొల‌గించాం. లేనిపక్షంలో అక్కడ పెర్ఫొరేషన్ లాంటి మరిన్ని సమస్యలు వచ్చేవి.

ఈ ప్ర‌క్రియ చేసిన త‌ర్వాత కూడా ఆయ‌న‌కు చాలా జాగ్ర‌త్త‌లు చెప్పాం. ఒక‌వేళ ఇలాంటి ప‌రిస్థితుల్లో అన్నం తింటే ఆ మెతుకులు మ‌ళ్లీ ఇన్ఫెక్ష‌న్ అయిన పుండ్ల వ‌ద్ద‌కు చేరి, అక్క‌డ ఆగిపోయి మ‌ళ్లీ ఇన్ఫెక్ష‌న్ పెరిగిపోతుంది. అందుకే ఆయ‌న‌కు కొంత‌కాలం పూర్తిగా ద్ర‌వ‌ప‌దార్థాలు మాత్ర‌మే తీసుకోవాల‌ని చెప్పాం. కొబ్బ‌రినీళ్లు, మంచినీళ్ల లాంటివి తీసుకోవాల‌న్నాం. ఇప్పుడు ఎముక వ‌ల్ల వ‌చ్చిన నొప్పి ఆయ‌న‌కు పూర్తిగా త‌గ్గిపోయింది. ఇప్పుడే కొద్దిగా జొన్న అన్నం, పెరుగు అన్నం తిన‌గ‌లుగుతున్నారు.

ఏ వ‌య‌సువారైనా తినేట‌ప్పుడు బాగా న‌మిలి తినాలి. ఇక కాస్త పెద్ద‌వ‌య‌సు వ‌చ్చి, ప‌ళ్లు ఊడిపోయిన త‌ర్వాత అయితే ఏదైనా బాగా ఉడ‌క‌బెట్టుకుని, మెత్త‌గా అయిన త‌ర్వాత మాత్ర‌మే తీసుకోవాలి. ఎముక‌ల‌ను ఎవ‌రైనా య‌థాత‌థంగా తిన‌కూడ‌దు. కానీ ఈ కేసులో ఆయ‌న‌కు ప‌ళ్లు లేక‌పోవ‌డంతో తెలియ‌క‌, పొర‌పాటున మింగేశారు. అది స‌మ‌యానికి తియ్య‌క‌పోతే ఇన్ఫెక్ష‌న్ పెరిగిపోతుంది. ఆహార‌నాళానికి రంధ్రం కూడా  పెద్ద‌ది అయిపోతుంది. అప్పుడు త‌ప్ప‌నిస‌రిగా మేజ‌ర్ స‌ర్జ‌రీ చేయాలి. చీము ప‌డుతుంది. ఇలా ఒక నెల రోజుల పాటు ఎముక లోప‌ల ఉండిపోవ‌డం ఎప్పుడూ చూడ‌లేదు” అని డాక్ట‌ర్ రాధిక నిట్ట‌ల వివ‌రించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement