గాంధీ ఆస్పత్రి: అతడి పేరు గోవర్ధన కార్తీక్... డ్రగ్స్ విక్రయిస్తూ పోలీసులకు చిక్కి జైలుకు చేరాడు... ఏమాత్రం మూడ్ బాగోలేకపోయినా చేతికి అందిన దాన్ని గుటుక్కుమనిపిస్తాడు. ఇలా పక్షం రోజుల్లో బ్లేడ్, నెయిల్ కట్టర్, తాళం చెవితో పాటు, ఇనుప రేకు ముక్కల్నీ మింగేశాడు. ఇతగాడి వ్యవహారశైలితో అటు జైలు అధికారులు, ఇటు గాంధీ ఆస్పత్రి వైద్యులు తలలు పట్టుకుంటున్నారు.
చేతికి దొరికింది నోట్లో వేసుకుని...
విజయవాడకు చెందిన కార్తీక్ (22) మత్తు పదార్థాలకు బానిసయ్యాడు. వాటిని ఖరీదు చేయడానికి అవసరమైన డబ్బు కోసం విక్రతగా మారా డు. కొన్నాళ్ల క్రితం పోలీసులకు చిక్కిన ఈ పెడ్లర్ ప్రస్తుతం చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. మత్తు మందులు దొరక్కో, జైల్లో పెట్టారనే అసహనమో తెలియదు కానీ ఇతగాడికి తరు మూడ్ పాడవుతూ ఉంటుంది. ఆ సమయంలో జైలులో తన చుట్టూ అందుబాటులో ఉన్న చిన్న, చిన్న ఇనుప వస్తువులను అమాంతం మింగేస్తుంటాడు. పక్షం రోజులుగా ఈ వ్యవహారశైలితో జైలు అధికారులకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాడు.
అయితే ఎనిమా లేదంటే ఎండోస్కోపీ...
గతంలో జైల్లో ఉండగానే తీవ్రమైన కడుపునొప్పి రావడంతో జైలు డాక్టర్లు పరీక్షించారు. ఈ నేపథ్యంలోనే అతడు ఇనుప వస్తువులు మింగిన విషయం బయటపడింది. కొన్నిసార్లు ఎనిమా ద్వారా బయటకు వచ్చేలా చేస్తుండగా... మరికొన్ని సార్లు మాత్రం ఆస్పత్రికి తీసుకురావాల్సి వచ్చింది. జైలు అధికారుల సూచన మేరకు గత నెల 28న మొదటిసారిగా గాంధీ ఆస్పత్రి ప్రిజనర్స్ వార్డులో అడ్మిట్ అయ్యాడు. వైద్య పరీక్షల్లో కార్తీక్ కడుపులో ఇనుప వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. ఎండోస్కోపీ ద్వారా పెద్ద పేగుల మధ్య ఇరుకున్న చేతి బేడీలకు వేసే తాళం చెవిని బయటకు తీశారు. ప్రిజనర్స్ వార్డు నుంచి డిశ్చార్జీ చేసి జైలుకు తరలించగా నెయి ల్‌కట్టర్, బ్లేడ్‌లు మింగాడు. కొన్ని ఎనిమా ద్వారా బయటకు రాగా, మరికొన్ని ఎండోస్కోపీ ద్వారా బయటకు తీశారు.
తాజాగా సోమవారం మరోసారి...
కార్తీక్ ఈసారి ఇనుప రేకు ముక్కను మింగేశాడు. తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్న అతడిని జైలు అధికారులు ఈ నెల 7న మరోసారి గాంధీ ఆస్పత్రిలోని ప్రిజనర్స్ వార్డులో చేర్చారు. గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగ వైద్యులు సోమవారం తీవ్రంగా శ్రమించి ఎండోస్కోపీ విధానంలో అతడి పేగుల మధ్య ఇరుక్కున్న రేకు ముక్కను బయటకు తీశారు. ఆయా వస్తువులు పేగుల్లో ఇరుక్కోవడంతో తీవ్రమైన నొప్పితో బాధపడటమే కాకుండా ప్రాణా పాయం ఏర్పడే ప్రమాదం ఉందని వైద్యలు చెప్తున్నారు. గాంధీ వైద్యులు పక్షం రోజుల్లో కార్తీక్‌కు మూడుసార్లు ఎండోస్కోపీ చేసి కడుపులో చిక్కుకున్న ఆయా వస్తువులను బయటకు తీశారు.
రిమాండ్ ఖైదీ చేతికి ఎలా...
చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న కార్తీక్‌కు ప్రమాదకరమైన ఇనుప వస్తువులు ఎలా అందుబాటులోకి వస్తున్నాయన్నది కీలకంగా మారింది. ఈ విషయంపై అతడేమీ చెప్పట్లేదని, తమకూ అర్థం కావడం లేదని ఎండోస్కోపీ నిర్వహించిన గాంధీ ఆస్పత్రి వైద్యులు అంటున్నారు. కార్తీక్ కడుపులో నుంచి మూడుసార్లు తీసిన వస్తువులు ప్రమాదకరమైనవే అని గాంధీ ఆస్పత్రి గ్యాస్ట్రో ఎంట్రాలజీ హెచ్‌ఓడీ శ్రవణ్‌కుమార్ స్పష్టం చేశారు. రిమాండ్ ఖైదీగా ఉన్న కార్తీక్ మానసిక రుగ్మతలతో బాధపడుతున్నాడని, తక్షణమే మానసిక వైద్యులకు చూపించాలని సూచించానని ఆయన వివరించారు.
(చదవండి: ఇంటర్ ఛేంజర్లతో ఇక్కట్లు!)
Comments
Please login to add a commentAdd a comment