England Lawn Tennis Club
-
వింబుల్డన్ టోర్నమెంట్ రద్దు
లండన్: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అసాధారణ పరిస్థితులదృష్ట్యా... ఈ ఏడాది ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌ను రద్దు చేస్తున్నట్లు ఆల్ ఇంగ్లండ్ లాన్‌టెన్నిస్ క్లబ్ (ఏఈఎల్టీసీ) బుధవారం అధికారికంగా ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది వింబుల్డన్ టోర్నీ జూన్ 29 నుంచి జూలై 12 వరకు జరగాల్సింది. వచ్చే ఏడాది వింబుల్డన్ టోర్నీ జూన్ 28 నుంచి జూలై 11 వరకు జరుగుతుందని ఏఈఎల్టీసీ తెలిపింది. రెండో ప్రపంచ యుద్ధం కారణంగా వింబుల్డన్ టోర్నీని 1940 నుంచి 1945 వరకు నిర్వహించలేదు. ఆ తర్వాత 1946 నుంచి ప్రతి యేటా వింబుల్డన్ నిరాటంకంగా కొనసాగింది. అయితే కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తుండటంతో అందరి ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి వింబుల్డన్‌ను రద్దు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వింబుల్డన్ టోర్నీ రద్దు కావడంతో జూలై 13 వరకు ఎలాంటి టెన్నిస్ టోర్నీలు లేవని అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ), మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) తెలిపాయి. -
సెల్ఫీ స్టిక్స్‌పై నిషేధం
లండన్: ఏ క్రీడా ఈవెంట్స్‌లోనైనా ప్రేక్షకుల నుంచి ఆటగాళ్ల వరకు సెల్ఫీలు తీసుకోవడం పరిపాటి. కానీ వింబుల్డన్‌లో ఇలాంటి చేష్టలు ఇక కుదరవు. సెల్ఫీ స్టిక్స్‌ను అనుమతించకూడదని ఆల్ ఇంగ్లండ్ లాన్ టెన్నిస్ క్లబ్ నిర్ణయించుకుంది. మ్యాచ్‌ల సందర్భంగా నిషేధిత వస్తువుల జాబితాలో ఈ సెల్ఫీ స్టిక్స్‌ను కూడా చేర్చారు. కొంచెం ఎత్తు నుంచి సెల్ఫీలను తీసుకునేందుకు మెటల్ రాడ్స్‌తో కూడిన ఈ స్టిక్స్‌కు మొబైల్, కాంపాక్ట్ కెమెరాలను అమర్చుకుంటారు. ఇదంతా ప్రశాంత వాతావరణాన్ని ఇబ్బంది కలిగించేదిగా ఉందని, భద్రతాపరంగా కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని నిర్వాహకులు చెబుతున్నారు.