అత్తమ్మకు చెబుతా..
సాక్షి, హైదరాబాద్ : క్వీన్ ఎలిజబెత్–2 చిన్న కోడలు, రాయల్ హైనెస్ కౌంటీస్ ఆఫ్ వెసెక్స్, డైమండ్ జూబ్లీ ట్రస్ట్ వైస్ ప్యాట్రన్ సోఫీ హెలెన్ రిస్ జోన్స్ రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం నగరానికి వచ్చారు. తొలిరోజు సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి, ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థను సందర్శించారు. ఉదయం గాంధీ ఆస్పత్రికి వచ్చిన ఆమె... అత్త క్వీన్ ఎలిజబెత్–2 నాటిన మొక్కను చూడాలని ఆసక్తి చూపినప్పటికీ ప్రొటోకాల్ అడ్డంకిగా మారడం, సెక్యూరిటీ ఇబ్బందులు తలెత్తుతాయని భావించి విరమించుకున్నారు. అయితే మొక్క చిగురించిన విషయం అత్తమ్మకు చెబుతానంటూ హర్షం వ్యక్తం చేశారు.
1983లో ఎలిజబెత్–2 పాత గాంధీ ఆస్పత్రిలో మొక్కను నాటడం, తర్వాత అది మోడుబారిపోవడం, సోఫీ హెలెన్ ఆస్పత్రిని సందర్శించనున్న తరుణంలో మరోసారి చిగురించడంపై ‘అత్త.. కోడలు.. ఓ మొక్క’ శీర్షికతో ‘సాక్షి’ ఆదివారం కథనం ప్రచురించిన విషయం విదితమే. ఈ క్లిప్పింగ్‌ను ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్ సోఫీ హెలెన్‌కు చూపించి వివరించారు. తెలుగు అర్థం కాకపోయినప్పటికీ ఫొటోలను ఆమె ఆసక్తిగా తిలకించారు. ‘ఓహ్... ఐ విల్ టెల్ టు మై ఆంటీ’ అంటూ హర్షం వ్యక్తం చేశారు. గాంధీ ఆస్పత్రిలో పిల్లలతో పాటు మొక్కలనూ అపురూపంగా చూసుకుంటున్నారని కితాబు ఇచ్చారు. అత్తమ్మ నాటిన మొక్కను చూడాలని ఉన్నప్పటికీ ప్రొటోకాల్ సమస్యతో చూడలేకపోతున్నానని సోఫీ హెలెన్ ఆవేదన వ్యక్తం చేశారని ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్ తెలిపారు. ‘సాక్షి’ పేపర్ క్లిప్పింగ్‌ను బ్రిటీష్ అధికారులతో పాటు పోలీసులు ఆసక్తిగా చూశారు.
సాక్షి’ క్లిప్పింగ్‌ను చూస్తున్న అధికారులు
సేవలు భేష్
రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం నగరానికి వచ్చిన సోఫీ హెలెన్ గాంధీ ఆస్పత్రి, ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థను సందర్శించారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘గాంధీ’లో చిన్నారుల విభాగంలో అందిస్తున్న రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ సేవలను పరిశీలించారు. ఉదయం 10:45 గంటలకు ఆస్పత్రికి వచ్చిన ఆమెకు సూపరింటెండెంట్ పి.శ్రవణ్‌కుమార్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఒ.శ్రవణ్‌కుమార్ స్వాగతం పలికారు. ఆమెను నేరుగా చిన్నారుల విభాగంలోని ఎన్ఐసీయూ, పీఐసీయూ వార్డులకు తీసుకెళ్లి అక్కడ అందిస్తున్న సేవలను వివరించారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్య సేవలు పొందుతున్న శిశువుల బుగ్గలను ఆప్యాయంగా నిమిరిన సోఫీ ఆనందపారవశ్యానికి లోనయ్యారు. అనంతరం చిన్నారుల తల్లులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు.
సోఫీ హెలెన్‌కు స్వాగతం పలుకుతున్న ‘గాంధీ’ అధికారులు
దాదాపు గంటసేపు ఆయా వార్డులను పరిశీలించిన ఆమె వైద్య సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్ మాట్లాడుతూ... క్వీన్ ఎలిజబెత్ డైమండ్ జూబ్లీ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత నాలుగేళ్లలో ఆస్పత్రిలో దాదాపు 4,500 మందికి రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ (ఆర్ఓపీ) సేవలు అందించామన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 350 మందికి ఈ సేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు. కోట్లాది రూపాయల విలువైన 20 సీప్యాప్ వెంటిలేటర్లు, రెండు లేజర్ మెషిన్లను ట్రస్ట్ ద్వారా అందించారని, ఆర్ఓపీ వైద్యసేవలు, లేజర్ శస్త్ర చికిత్సలపై లండన్ వైద్యులు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారని, ఈ శిక్షణ ఎంతో ఉపయుక్తమైనదని పేర్కొన్నారు. ఆస్పత్రిలో అందిస్తున్న సేవలపై ట్రస్ట్ వైస్ ప్యాట్రన్ సోఫీ హెలెన్ సంతృప్తి వ్యక్తం చేశారని, పాలనా యంత్రాంగం, వైద్యులు, సిబ్బందిని అభినందించారని తెలిపారు. ఎన్ఐసీయూ ఇన్చార్జి ప్రొఫెసర్ జార్జ్, డిప్యూటీ సూపరింటెండెంట్ నర్సింహా రావు, బ్రిటీష్ హైకమిషనరేట్ అధికారులు పాల్గొన్నారు. అయితే సోఫీ సందర్శనకు సంబంధించి మీడియాకు ఆంక్షలు విధించారు. సోఫీ మంగళవారం నిలోఫర్ ఆస్పత్రిని సందర్శించే అవకాశం ఉంది.
ఎల్వీ ప్రసాద్లో...
బంజారాహిల్స్: ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి రెటినోపతి ఆఫ్ ప్రీ మెచ్యూరిటీ కార్యక్రమాలకు డైమండ్ జూబ్లీ ట్రస్ట్ మద్దతిస్తోంది. ఈ నేపథ్యంలో సోఫీ సోమవారం ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిని సందర్శించారు. 1998లో కళ్లం అంజిరెడ్డి ప్రాంగణంలో ఆధునిక ఆర్ఓపీ సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో డాక్టర్ సుభద్ర జలాలి ముఖ్య భూమిక పోషించారు. గత 20 ఏళ్లుగా ఆస్పత్రి బృందం 20వేల పైచిలుకు శిశువులకు పరీక్ష చేసింది. ఐదేళ్లుగా డైమండ్ జూబ్లీ ట్రస్ట్ ఇక్కడి ఆర్ఓపీ కార్యక్రమాలకు మద్దతు ఇస్తోంది. ఈ సందర్భంగా సోఫీ ఆస్పత్రి పీడీయాట్రిక్ ఆర్ఓపీ బృందాలతో చర్చించింది. కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ సీనియర్ ప్రతినిధులు పాల్గొన్నారు.