ఇంగ్లండ్ రాణికీ ఆర్థిక కష్టాలు..!
లండన్: ఇంగ్లండ్.. ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన దేశం. గత వైభవానికి గౌరవ చిహ్నంగా నేటికీ అక్కడ రాచరిక వారసులు కొనసాగుతున్నారు. అయితే ఇంగ్లండ్ రాణి ఎలిజబెత్ 2 ప్యాలెస్ నిర్వహణ కోసం కేటాయించిన నిధులు గతంలో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయికి పడిపోయాయి. కేవలం పది కోట్ల రూపాయిల నిధులు మాత్రమే నిల్వ ఉన్నాయి. ఇంగ్లండ్ కామన్స్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ నివేదిక ఈ విషయాల్ని వెల్లడించింది.
నిధుల్ని సద్వినియోగంగా వాడుకోవడం, తగినంత నిల్వ ఉంచడంలో రాణి సలహాదారులు విఫలమయ్యారని అకౌంట్స్ కమిటీ దుయ్యబట్టింది. 2001లో రాణి ప్యాలెస్ నిధులు 350 కోట్ల రూపాయిలు ఉండగా నేడు పది కోట్ల రూపాయిలకు దిగజారినట్టు పేర్కొంది. ట్రెజరీ వెంటనే గాడిన పెట్టాల్సిన అవసరముందని కమిటీలో ఉన్న ఓ ఎంపీ చెప్పారు. ప్యాలెస్ ఆర్థిక ప్రణాళిక, పర్యవేక్షణ వ్యవహారాలను పునఃసమీక్షించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.