పార్లమెంటులో ‘యూపీఎస్సీ’ రగడ
తక్షణమే చర్చ చేపట్టాలన్న విపక్షం
కొనసాగుతున్న సివిల్స్ అభ్యర్థుల నిరసన
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షపై వివాదం మరింత తీవ్రమైంది. సీశాట్ 2 పేపర్లోని ఇంగ్లిష్ విభాగం మార్కులను మెరిట్ నిర్ధారణలో పరిగణనలోకి తీసుకోబోమన్న ప్రభుత్వ ప్రకటనకు సంతృప్తి చెందని అభ్యర్థులు జంతర్‌మంతర్ వద్ద తమ నిరసనను కొనసాగించారు. సీశాట్ పేపర్ 2ను పూర్తిగా తొలగించాలని, ఆగస్టు 24న నిర్వహించ తలపెట్టిన ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు నిరసన దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు. వారికి మద్ధతుగా.. సీశాట్ అంశంపై తక్షణమే చర్చించాలంటూ పార్లమెంటు ఉభయసభల్లోని ప్రతిపక్ష సభ్యులు పలుమార్లు సభాకార్యక్రమాలకు అంతరాయం కలిగించారు. లక్షలాది విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపే ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటన చేయాలని, సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పరిష్కారం లభించేంతవరకు ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేయాలని కోరారు.
లోక్‌సభలో జీరో అవర్ సందర్భంగా ఈ అంశాన్ని లేవనెత్తిన ఎస్పీ, ఆర్జేడీ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి గందరగోళం సృష్టించడంతో సభ పావుగంట పాటు వాయిదా పడింది. సభ తిరిగి సమావేశమైన అనంతరం చర్చ కోరుతూ నోటీస్ ఇవ్వాలని స్పీకర్ సుమిత్ర మహాజన్ వారికి సూచించారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్ష సభ్యులు ఈ అంశాన్ని లేవనెత్తారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి తక్షణమే దీనిపై చర్చ చేపట్టాలని కోరుతూ కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీ, జేడీయూ, అన్నాడీఎంకే సహా 9 ప్రతిపక్ష పార్టీలు చైర్మన్‌కు నోటీస్ ఇచ్చాయి. సంబంధంలేని అంశాలను ప్రశ్నోత్తరాల సమయంలో లేవనెత్తవద్దని, నిబంధనల ప్రకారం నోటీసులు ఇవ్వాలని చైర్మన్ వారికి సూచించినప్పటికీ శాంతించని సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేయడంతో సభను అరగంటపాటు వాయిదా వేశారు.
కాగా, సీశాట్ వివాదానికి ప్రభుత్వం చూపిన పరిష్కారం ‘సత్వరమే తీసుకున్న సరైన నిర్ణయం’ అని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు పార్టీ ఎంపీలతో వ్యాఖ్యానించారు. ప్రిలిమినరీ పరీక్ష మెరిట్ నిర్ధారణలో ఇంగ్లీష్ భాషకు సంబంధించిన మార్కులను పరిగణనలోకి తీసుకోబోమని ప్రభుత్వం సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే.