అనంత త్యాగాల ‘సీమ’పై శీతకన్ను
అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ ప్రాంతాలకు అందుబాటులో ఉండేలా... అదే సమయంలో కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు నొచ్చుకోని రీతిలో ఆ జిల్లాలకు సమీపంలోనే ఉన్న మార్కాపురం, వినుకొండ ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటుచేస్తే బాగుంటుంది.
రాజధాని నగరాన్ని కృష్ణా-గుంటూరు జిల్లాల మధ్య ఏర్పాటు చేయబోతున్నట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సహచరులు సూచి స్తున్న తీరును గమనిస్తే వారెవరూ గతం నుంచి గుణపాఠాలు నేర్చుకోలేదనిపి స్తోంది. రాజధాని ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణ కమిటీ తన నివేదికను సమర్పించాల్సి ఉండగా ఈలోగానే లేనిపోని ఊహాగానాలకు తావివ్వడం లోని సహేతుకత ఏమిటో అర్థంకావడంలేదు.
1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు, కృష్ణా, గుం టూరు జిల్లాల ప్రాబల్యాన్ని అంగీకరించబోమని రాయల సీమ ప్రజలు నాడు వ్యక్తంచేసిన అభిప్రాయాలు నేటికీ కొనసాగుతున్నాయి. కనుక, అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ ప్రాంతాలకు అందుబాటులో ఉండేలా... అదే సమయంలో కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు నొచ్చుకోని రీతిలో ఆ జిల్లాలకు సమీపంలోనే ఉన్న మార్కాపురం, వినుకొండ ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటుచేస్తే బాగుంటుంది.
రాజధాని పేరిట అభివృద్ధినంతటినీ ఒకేచోట కేంద్రీక రించాలనుకోవడమే పొరపాటు. దీనివల్లనే... తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అంత వ్యతిరేకత వచ్చింది. కనుక మార్కాపురం, వినుకొండ ప్రాంతాల్లో రాజధాని నిర్మాణా నికి పూనుకున్నా అక్కడ అసెంబ్లీ, సచివాలయం, మంత్రుల క్వార్టర్స్, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు వంటివి మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోవాలి. అన్ని ప్రాంతాల్లో ఉన్నత విద్యా సంస్థలను నెలకొల్పి, కోస్తా ప్రాంతాల్లోని ఇతర జిల్లాల్లో, రాయలసీమలో పరిశ్రమలను నిర్మించాలి.
ఇప్పటికీ వెనుకబడిన ప్రాంతమే
శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రకారం చూస్తే ఈనాటికీ విశాలాం ధ్రలో అత్యంత వెనుకబడిన ప్రాంతం రాయలసీమ. 1956 తర్వాత ఇది మరింతగా వెనుకబడింది. విశాలాంధ్ర కోసం కర్నూలు వాసులు రాజధానిని త్యాగం చేశారు. ఆ తర్వాత సాగిన అభివృద్ధిలో సైతం అన్నివిధాలా నష్టపోయారు. ప్రజాభిప్రాయాన్ని విస్మరించి, వారి మనోభావాలను గాయ పరిచి యూపీఏ ప్రభుత్వం ఏకపక్షంగా రాష్ట్రాన్ని చీల్చిన తర్వాతనైనా మన నాయకులకు జ్ఞానోదయమైనట్టు లేదు.
నీటి పంపకంలో సీమకు అన్యాయం
సాగునీటి విషయంలో సీమకు తీవ్ర అన్యాయం జరిగింది. ఇక్కడ వర్షపాతం చాలా తక్కువ. భూగర్భ జలాలూ తక్కు వ. ఉన్న చెరువులన్నీ నాశనం అయ్యాయి. కృష్ణా, పెన్నా నదులపై ఆశలు పెట్టుకున్నా, అవి రెండూ వారికి దక్కలేదు. పెన్నా నదిపై సోమశిల ప్రాజెక్టు కట్టి నెల్లూరు జిల్లా అవసరాలకు పెద్ద పీట వేయడంవల్ల ఆ నది కూడా సీమకు దక్కకుండాపోయింది. సీమ పేరుమీద కట్టిన తెలుగు గంగ ప్రాజెక్టు నీళ్లు సీమకంటే నెల్లూరు జిల్లాకే ఎక్కువ పోతాయి.
సీమలో మొత్తం సాగు భూమి విస్తీర్ణంలో నీటి పారు దల లభించేది అనంతపురంలో 12.5 శాతం, కర్నూలులో 21.5 శాతం మాత్రమే. జిల్లాలవారీగా చూస్తే వైఎ స్సార్ జిల్లాలో 32.9 శాతం, చిత్తూరు జిల్లాలో 37 శాతం, కోస్తాలో దాదాపు 70 శాతం భూములకు నీటిపారు దల ఉంది. 1960ల నాటికి సీమలో 50 శాతం సాగు చెరువుల కింద ఉంది. అది నేటికి 8 శాతం కూడా లేదు. 2008లో కోస్తాలో కాలువల కింద సాగు 78 శాతం ఉండగా రాయలసీ మలో 8 శాతం మాత్రమే ఉంది.
మానవ వనరుల్లోనూ అట్టడుగునే
ఏపీ అభివృద్ధి నివేదిక ప్రకారం కడప, కర్నూలు, అనంత పురం జిల్లాలు మానవ వనరుల అభివృద్ధిలో బాగా వెనకబ డ్డాయి. ఇక్కడ ఆదాయం తక్కువ. జీవనం సాగించడమే కష్టం. చదువు శాతం తక్కువ. రాగిముద్ద, వంకాయపచ్చడి, సాదా బట్టలు... ఇవే ఇక్కడి జీవన సంస్కృతి. వీటిని పట్టిం చుకోకుండా మళ్లీ కోస్తా ప్రాంతంవైపే అభివృద్ధిని కేంద్రీ కరిస్తే రాయలసీమ ప్రజల్లో అసంతృప్తి వెల్లువెత్తుతుంది.
సామాజిక ఆధిపత్య పోరు
నూతన రాజధాని నిర్మాణంలో సామాజిక ఆధిపత్య పోరు ప్రాబల్యమే కనిపిస్తున్నది. చరిత్రను పరిశీలించి, ప్రాంతాల అమరికను గమనించి, ఏ ప్రాంతాలకు ఏవిధంగా అన్యా యం జరిగిందో అధ్యయనం చేసి రాజధాని నిర్మాణానికి పూనుకోవాలి తప్ప స్వప్రయోజనాలే ప్రాతిపదికగా వ్యవహ రించకూడదు. అలా చేయడంవల్ల తమకు మరోసారి అన్యా యం జరిగిందన్న భావన రాయలసీమవాసుల్లో బలపడు తుంది. కనుక అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా, సాధ్యాసాధ్యాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలి.
(వ్యాసకర్త విశ్రాంత ప్రధానాచార్యులు, తిరుపతి) ఎనుగొండ నాగరాజు నాయుడు