ERC charges
-
తెలంగాణ: విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదన తిరస్కరణ
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను ఈఆర్సీ తిరస్కరించింది. డిస్కమ్‌ల ప్రతిపాదనలను సోమవారం ఈఆర్సీ తిరస్కరించటంతో సామాన్య వినియోగదారులకు ఊరట లభించింది. 800 యూనిట్లు దాటితే ఫిక్స్డ్ ఛార్జీలు రూ. 10 నుంచి రూ. 50 పెంచాలనే డిస్కమ్‌ల ప్రతిపాదనలను కమిషన్ ఆమోదించలేదు. డిస్కమ్‌ల 8 పిటిషన్లపై కమిషన్ తన అభిప్రాయాలను వెల్లడించిందని ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు తెలిపారు. ‘‘అన్ని పిటిషన్లపై ఎలాంటి లాప్స్ లేకుండా వెల్లడించాలని నిర్ణయించింది. 40 రోజుల తక్కువ సమయంలో నిర్ణయం వెలువరిస్తున్నాం. విద్యుత్ సంస్థల ఆర్థిక స్థితిగతులు, వినియోగదారులు, ప్రభుత్వ సబ్సిడీ దృష్టిలో పెట్టుకొని కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది. ఎనర్జీ చార్జీలు ఏ కేటగిరిగిలో కూడా పెంచడం లేదు. స్థిర చార్జీలు రూ.10 యధాతధంగా ఉంటాయి. పౌల్ట్రీ ఫామ్, గోట్ ఫామ్‌లను కమిషన్ ఆమోదించలేదు. హెచ్‌టీ కేటగిరిలో ప్రతిపాదనలు రిజక్ట్ చేశాం.132కేవీఏ, 133కేవీఏ, 11కేవీలలో గతంలో మాదిరిగానే ఛార్జీలు ఉంటాయి. లిఫ్ట్ ఇరిగేషన్‌కు కమిషన్ ఆమోదించింది. టైమ్ ఆఫ్ డేలో పీక్ అవర్‌లో ఎలాంటి మార్పు లేదు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటలకు నాన్ పీక్ ఆవర్‌లో రూపాయి నుంచి రూపాయిన్నర రాయితీ పెంచాం. చేనేత కార్మికులకు హార్స్ పవర్‌ను పెంచాం. హెచ్‌పీ 10 నుంచి హెచ్‌పీ 25కి పెంచాం.గృహ వినియోగదారులకు మినిమమ్ చార్జీలు తొలగించాం. గ్రిడ్ సపోర్ట్ చార్జీలు కమిషన్ ఆమోదించింది. ఆర్ఎస్పీ ఇవి కేవలం ఐదు నెలల వరకే ఉంటాయి. రూ.11,499.52 కోట్లు ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చింది. రూ.1,800 కోట్లు ప్రపోజల్స్ ఇచ్చారు. డిస్కంలు రూ.57,728.90 పిటిషన్ వేస్తే.. ఈఆర్సీ రూ.54,183.28 కోట్లు ఆమోదించింది’ అని వివరాలు వెల్లడించారు.చదవండి: కాళేశ్వరం కమిషన్ విచారణలో కీలక ఆధారాలు -
Telangana: ఇక ప్రతి నెలా సర్దుబాదుడు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారుల నుంచి ప్రతి నెలా ఇంధన సర్దుబాటు చార్జీలు(ఎఫ్ఎస్ఏ) వసూలు చేసేందుకు లేదా వారికి తిరిగి చెల్లించేందుకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) అనుమతిచ్చింది. ఈ మేరకు తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ మూడో సవరణ నిబంధనలు–2023ను బుధవారం ప్రకటించింది. ఇంధన/ విద్యుత్ కొనుగోలు వ్యయం సర్దుబాటు చార్జీల భారాన్ని ఆటోమేటిక్‌గా విద్యుత్ బిల్లులకు బదిలీ చేసేందుకు ..కేంద్ర ప్రభుత్వం 2021 అక్టోబర్ 22న ఎలక్ట్రిసిటీ (టైమ్లీ రికవరీ ఆఫ్ కాస్ట్ డ్యూ టు చేంజ్ ఇన్లా) రూల్స్ 2021ను అమల్లోకి తెచ్చింది. బొగ్గు, ఇతర ఇంధనాల ధరల పెరుగుదలతో పెరిగిపోతున్న విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని ఎప్పటికప్పుడు వినియోగదారుల నుంచి ఇంధన సర్దుబాటు చార్జీల రూపంలో వసూలు చేసేందుకు కేంద్రం ఈ నిబంధనలను తీసుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్రంలో సైతం ఇంధన సర్దుబాటు చార్జీలు వసూలు చేసేందుకు తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు విజ్ఞప్తి చేయగా, తాజాగా ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంధన సర్దుబాటు చార్జీలను లెక్కించేందుకు ప్రత్యేక ఫార్ములాను సైతం ప్రకటించింది. 2023 ఏప్రిల్ 1 నుంచి ఇంధన సర్దుబాటు చార్జీల వసూళ్లు అమల్లోకి రానున్నాయి. రుణాత్మకంగా తేలితే రిఫండ్ ► తెలంగాణ ఈఆర్సీ నిబంధనల ప్రకారం.. ఎన్ (ఒక నెల) నెలకు సంబంధించిన ఇంధన సర్దుబాటు చార్జీలను ఎన్+2 (మూడవ నెల)కు సంబంధించిన బిల్లుతో కలిపి ఎన్+3 (4వ నెల) నెలలో డిస్కంలు జారీ చేస్తాయి. ఉదాహరణకు జనవరి నెల ఇంధన సర్దుబాటు చార్జీలను డిస్కంలు మార్చి నెల బిల్లుతో కలిపి ఏప్రిల్ నెలలో వినియోగదారులపై విధించాల్సి ఉంటుంది. ఒక వేళ ఎఫ్ఎస్ఏ చార్జీలను లెక్కించిన తర్వాత రుణాత్మకంగా తేలితే ఆ మేరకు వినియోగదారులకు రిఫండ్ (తిరిగి చెల్లించాలి) చేయాల్సి ఉంటుంది. 30 పైసలకు మించితే ముందస్తు అనుమతి తప్పనిసరి ► యూనిట్ విద్యుత్‌పై గరిష్టంగా 30 పైసల వరకు ఎఫ్ఎస్ఏ చార్జీలను ఈఆర్సీ ముందస్తు అనుమతి లేకుండా డిస్కంలు విధించవచ్చు. ఒక వేళ ఎఫ్ఎస్ఏ చార్జీలు యూనిట్‌కు 30 పైసలకు మించితే ఆపై ఉండే అదనపు మొత్తాన్ని ఈఆర్సీ ముందస్తు అనుమతి లేకుండా విధించడానికి వీలులేదు. వ్యవసాయం మినహా అందరిపై వడ్డన.. ► ఎల్టీ–5 కేటగిరీలోని వ్యవసాయ వినియోగదారులు మినహా అన్ని కేటగిరీల వినియోగదారులపై ఇంధన సర్దుబాటు చార్జీలు విధించడానికి ఈఆర్సీ అనుమతినిచ్చింది. వ్యవసాయ వినియోగదారుల ఇంధన సర్దుబాటు చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం నుంచి వసూలు చేయాలని కోరింది. ఒక వేళ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించని పక్షంలో ఆ మొత్తాలను తర్వాతి కాలంలో ఇతర వినియోగదారుల నుంచి ట్రూఅప్ చార్జీల రూపంలో వసూలు చేసేందుకు అనుమతించబోమని ఈఆర్సీ స్పష్టం చేసింది. ఎఫ్ఎస్ఏ చార్జీలను లెక్కించే సమయంలో ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ నష్టాలను సైతం పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. గడువులోగా వసూలు చేసుకోవాల్సిందే.. ► నిర్ణీత కాల వ్యవధిలోపు ఎఫ్ఎస్ఏ చార్జీలను విధించడంలో డిస్కంలు విఫలమైతే తర్వాత వసూలు చేసేందుకు అనుమతి ఉండదు. నెలవారీ ఇంధన సర్దుబాటు చార్జీలను నిబంధనల ప్రకారం డిస్కంలు లెక్కించి సంబంధిత నెల ముగిసిన 45 రోజుల్లోగా పత్రికల్లో ప్రచురించాల్సి ఉంటుంది. 45 రోజులు దాటితే ఆ నెలకు సంబంధించిన ఎఫ్ఎస్ఏ చార్జీలను అనుమతించరు. విద్యుత్ బిల్లుల్లో ఎఫ్ఎస్ఏ చార్జీలను ప్రత్యేకంగా చూపించడంతో పాటు వసూలైన ఎఫ్ఎస్ఏ చార్జీలను ప్రత్యేక ఖాతా కింద నమోదు చేయాలి. ప్రతి త్రైమాసికం ముగిసిన తర్వాత 60 రోజుల్లోగా ఆ త్రైమాసికంలోని నెలలకు సంబంధించిన ఎఫ్ఎస్ఏ చార్జీల వివరాలను ఈఆర్సీకి అందజేయాలి. డిస్కంలు విధించిన ఎఫ్ఎస్ఏ చార్జీలను ఈఆర్సీ క్షుణ్ణంగా పరిశీలించి ఆమోదించనుంది. ట్రూఅప్ ప్రతిపాదనలు కీలకం.. ► ప్రతి ఏటా నవంబర్ ముగిసేలోగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్)తో పాటు వినియోగదారుల నుంచి వసూలు చేసిన ఎఫ్ఎస్ఏ చార్జీల వివరాలు, ట్రూఅప్ చార్జీల ప్రతిపాదనలను ఈఆర్సీకి డిస్కంలు సమర్పించాల్సి ఉంటుంది. ముందే వసూలు చేసిన ఎఫ్ఎస్ఏ చార్జీలను పరిగణనలోకి తీసుకుని ట్రూఅప్ చార్జీల రూపంలో వినియోగదారులకు పంచాల్సిన లాభ, నష్టాలపై ఈఆర్సీ నిర్ణయం తీసుకుంటుంది. ట్రూఅప్ ప్రతిపాదనలు సమర్పించడంలో విఫలమైన పక్షంలో వీటిని సమర్పించే వరకు ఎఫ్ఎస్ఏ చార్జీల వసూళ్లకు ఈఆర్సీ అనుమతించదు. ఒక ఆర్థిక సంవత్సరంలో ఈఆర్సీ అనుమతించిన చార్జీలకు, విద్యుత్ సరఫరాకు జరిగిన వాస్తవ వ్యయానికి మధ్య ఉండే వ్యత్యాసాన్ని ట్రూఅప్ చార్జీల పేరిట వసూలు చేసుకునేందుకు ఈఆర్సీ అనుమతిస్తుంది. -
కరెంటు వాతకు సిద్ధం!
రూ. 1,089 కోట్ల వరకూ విద్యుత్ చార్జీల భారం పెంపు ప్రతిపాదనలను ఈఆర్సీకి అందించిన డిస్కంలు సగటున 5.75 శాతం చార్జీల పెంపు ఆంధ్రప్రదేశ్ కంటే స్వల్పంగా తక్కువ డిస్కంల మొత్తం ఖర్చు రూ. 26,700 కోట్లు ప్రస్తుత ఆదాయం రూ. 18,900 కోట్లు 2015-16 లోటు అంచనా రూ. 7,800 కోట్లు చార్జీల పెంపుతో వచ్చే అదనపు రాబడి రూ. 1,089 కోట్లు డిస్కంల నికర లోటు రూ. 6,721 కోట్లు అత్యంత గోప్యంగా ఏఆర్ఆర్ల సమర్పణ వివరాలు వెల్లడించని డిస్కం అధికారులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ చార్జీల వడ్డనకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. కొత్త రాష్ట్రం కావడంతో కొంత ఆచితూచి వ్యవహరించిన ప్రభుత్వం.. పొరుగు రాష్ట్రం ఏపీతో పోలిస్తే భారాన్ని కొంత మేరకు తగ్గించింది. ఈ మేరకు కొత్త చార్జీల ప్రతిపాదనలను డిస్కంలు అత్యంత నాటకీయంగా, గోప్యంగా శనివారం రాత్రి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి సమర్పించాయి. చార్జీల వివరాలతో పాటు 2015-16 ఆర్థిక సంవత్సరపు వార్షిక రాబడి, అవసరాల నివేదికలను (ఏఆర్‌ఆర్‌లు) అందజేశాయి. దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) ఫైనాన్స్ డెరైక్టర్ శ్రీనివాసరావు, ఉత్తర ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్) జనరల్ మేనేజర్ మధుసూదన్ శనివారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఈఆర్సీ కార్యదర్శి శ్రీనివాసరెడ్డికి ఈ నివేదికలు సమర్పించారు. అందులోని వివరాలను వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు. కానీ విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం విద్యుత్ పంపిణీ సంస్థలు తమ ఏఆర్‌ఆర్‌లలో రూ. 7,800 కోట్ల నష్టాల్లో ఉన్నట్లు చూపించాయి. అందులో రూ. 1,089 కోట్లను చార్జీల పెంపు ద్వారా భర్తీ చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఈఆర్సీని కోరాయి. అంటే సగటున 5.75 శాతం చార్జీల పెంపు ఉండే అవకాశముంది. కేటగిరీల వారీగా చార్జీల్లో కొంత హెచ్చు తగ్గులుండే అవకాశమున్నప్పటికీ... ఏపీతో పోలిస్తే 0.25 శాతం తక్కువగానే విద్యుత్ చార్జీల పెంపు ఉంటుందని డిస్కంల అధికారులు సూచనప్రాయంగా వెల్లడించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు తక్కువ విద్యుత్ వినియోగించే అల్పాదాయ వర్గాలపై భారం పడకుండా... సంపన్న వర్గాలు, పరిశ్రమలు, ఎక్కువ విద్యుత్ వాడే కేటగిరీలకు చార్జీలు పెరగనున్నాయి. పెంచినా నికరంగా లోటే... విద్యుత్ చార్జీలను పెంచినప్పటికీ డిస్కంలపై నికరంగా రూ. 6,721 కోట్ల లోటు ఉంటుంది. దానిని పూడ్చుకునేందుకు ప్రభుత్వమిచ్చే సబ్సిడీలపై ఆధారపడాల్సి ఉంటుందని డిస్కంలు ఏఆర్‌ఆర్‌లలో నివేదించాయి. రాష్ట్రంలో సరిపడేంత విద్యుత్ అందుబాటులో లేకపోవటంతో పాటు విద్యుత్ కొనుగోలు చేయాల్సి రావడంతో గతంతో పోలిస్తే ఖర్చులు పెరిగాయి. ప్రస్తుతమున్న చార్జీలు, నాన్ టారిఫ్, ఇతరత్రా ఆదాయాల ద్వారా మొత్తం రూ. 18,900 కోట్ల ఆదాయం వస్తుందని.. విద్యుత్ కొనుగోలు, సరఫరా, సంస్థల నిర్వహణకు అయ్యే ఖర్చు రూ. 26,700 కోట్లు ఉంటుందని డిస్కంలు తమ ఏఆర్‌ఆర్‌లలో పేర్కొన్నాయి. ఈఆర్సీ వద్ద హైడ్రామా.. గతంలోని ఆనవాయితీకి భిన్నంగా తెలంగాణ డిస్కంలు తమ తొలి ఏఆర్ఆర్లను సమర్పించాయి. సాధారణంగా ఏఆర్ఆర్లను సమర్పించిన వెంటనే అందులోని వివరాలను సంక్షిప్తంగా వెల్లడించేవారు. కానీ ఈ సారి డిస్కం అధికారులు ఏఆర్‌ఆర్‌లు సమర్పించే విషయాన్ని రహస్యంగా ఉంచారు. ఈఆర్సీకి ఇచ్చిన తర్వాత కూడా పెదవి విప్పకుండా మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. ఎట్టి పరిస్థితిలోనూ ఈ వివరాలను బయటకు రానీయోద్దని తమకు ప్రభుత్వం నుంచి కచ్చితమైన ఆదేశాలు ఉన్నాయంటూ తప్పుకొన్నారు. మరోవైపు ఏఆర్ఆర్లోని వివరాలను వెల్లడించే బాధ్యత తనది కాదని ఈఆర్సీ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. సాధారణంగా డిస్కంలు అందించిన ఏఆర్ఆర్లతో పాటు కొత్త రేట్ల టారిఫ్‌ను వెబ్సైట్లో ఈఆర్సీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కానీ డిస్కంలు తమకు సీడీ (సాఫ్ట్ కాపీ) రూపంలో నివేదికలు ఇవ్వలేదని... రాత్రిపూట కావటం, ఆదివారం సెలవుదినం కావడంతో మరో రెండు రోజుల వరకు వెబ్సైట్లో పెట్టడం వీలు కాదని శ్రీనివాసరెడ్డి చెప్పారు. అయితే పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచేవరకు మూడు నెలలుగా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వచ్చిన తెలంగాణ సర్కారు... ఎట్టకేలకు కొత్త చార్జీలను ఈఆర్సీకి సమర్పించినప్పటికీ గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తెరలేపింది. కానీ ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే చార్జీల పెంపు శాతం తక్కువగా ఉంటుందని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి ధ్రువీకరించారు. ఇప్పటికే మూడు నెలలు వాయిదా పడటం, ఈఆర్సీ ఇచ్చిన గడువు శనివారంతో ముగిసే నేపథ్యంలో డిస్కంలు ఆఖరి నిమిషంలో ఏఆర్‌ఆర్‌లు సమర్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీఎం ఢిల్లీ పర్యటనలో ఉండటంతో ఈ వివరాలను వెల్లడించకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం.