కరెంటు వాతకు సిద్ధం!
రూ. 1,089 కోట్ల వరకూ విద్యుత్ చార్జీల భారం
పెంపు ప్రతిపాదనలను ఈఆర్సీకి అందించిన డిస్కంలు
సగటున 5.75 శాతం చార్జీల పెంపు
ఆంధ్రప్రదేశ్ కంటే స్వల్పంగా తక్కువ
డిస్కంల మొత్తం ఖర్చు రూ. 26,700 కోట్లు
ప్రస్తుత ఆదాయం రూ. 18,900 కోట్లు
2015-16 లోటు అంచనా రూ. 7,800 కోట్లు
చార్జీల పెంపుతో వచ్చే అదనపు రాబడి రూ. 1,089 కోట్లు
డిస్కంల నికర లోటు రూ. 6,721 కోట్లు
అత్యంత గోప్యంగా ఏఆర్‌ఆర్‌ల సమర్పణ
వివరాలు వెల్లడించని డిస్కం అధికారులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ చార్జీల వడ్డనకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. కొత్త రాష్ట్రం కావడంతో కొంత ఆచితూచి వ్యవహరించిన ప్రభుత్వం.. పొరుగు రాష్ట్రం ఏపీతో పోలిస్తే భారాన్ని కొంత మేరకు తగ్గించింది. ఈ మేరకు కొత్త చార్జీల ప్రతిపాదనలను డిస్కంలు అత్యంత నాటకీయంగా, గోప్యంగా శనివారం రాత్రి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి సమర్పించాయి. చార్జీల వివరాలతో పాటు 2015-16 ఆర్థిక సంవత్సరపు వార్షిక రాబడి, అవసరాల నివేదికలను (ఏఆర్‌ఆర్‌లు) అందజేశాయి. దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్‌పీడీసీఎల్) ఫైనాన్స్ డెరైక్టర్ శ్రీనివాసరావు, ఉత్తర ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎన్‌పీడీసీఎల్) జనరల్ మేనేజర్ మధుసూదన్ శనివారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఈఆర్సీ కార్యదర్శి శ్రీనివాసరెడ్డికి ఈ నివేదికలు సమర్పించారు. అందులోని వివరాలను వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు. కానీ విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం విద్యుత్ పంపిణీ సంస్థలు తమ ఏఆర్‌ఆర్‌లలో రూ. 7,800 కోట్ల నష్టాల్లో ఉన్నట్లు చూపించాయి. అందులో రూ. 1,089 కోట్లను చార్జీల పెంపు ద్వారా భర్తీ చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఈఆర్సీని కోరాయి. అంటే సగటున 5.75 శాతం చార్జీల పెంపు ఉండే అవకాశముంది. కేటగిరీల వారీగా చార్జీల్లో కొంత హెచ్చు తగ్గులుండే అవకాశమున్నప్పటికీ... ఏపీతో పోలిస్తే 0.25 శాతం తక్కువగానే విద్యుత్ చార్జీల పెంపు ఉంటుందని డిస్కంల అధికారులు సూచనప్రాయంగా వెల్లడించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు తక్కువ విద్యుత్ వినియోగించే అల్పాదాయ వర్గాలపై భారం పడకుండా... సంపన్న వర్గాలు, పరిశ్రమలు, ఎక్కువ విద్యుత్ వాడే కేటగిరీలకు చార్జీలు పెరగనున్నాయి.
పెంచినా నికరంగా లోటే...
విద్యుత్ చార్జీలను పెంచినప్పటికీ డిస్కంలపై నికరంగా రూ. 6,721 కోట్ల లోటు ఉంటుంది. దానిని పూడ్చుకునేందుకు ప్రభుత్వమిచ్చే సబ్సిడీలపై ఆధారపడాల్సి ఉంటుందని డిస్కంలు ఏఆర్‌ఆర్‌లలో నివేదించాయి. రాష్ట్రంలో సరిపడేంత విద్యుత్ అందుబాటులో లేకపోవటంతో పాటు విద్యుత్ కొనుగోలు చేయాల్సి రావడంతో గతంతో పోలిస్తే ఖర్చులు పెరిగాయి. ప్రస్తుతమున్న చార్జీలు, నాన్ టారిఫ్, ఇతరత్రా ఆదాయాల ద్వారా మొత్తం రూ. 18,900 కోట్ల ఆదాయం వస్తుందని.. విద్యుత్ కొనుగోలు, సరఫరా, సంస్థల నిర్వహణకు అయ్యే ఖర్చు రూ. 26,700 కోట్లు ఉంటుందని డిస్కంలు తమ ఏఆర్‌ఆర్‌లలో పేర్కొన్నాయి.
ఈఆర్సీ వద్ద హైడ్రామా..
గతంలోని ఆనవాయితీకి భిన్నంగా తెలంగాణ డిస్కంలు తమ తొలి ఏఆర్‌ఆర్‌లను సమర్పించాయి. సాధారణంగా ఏఆర్‌ఆర్‌లను సమర్పించిన వెంటనే అందులోని వివరాలను సంక్షిప్తంగా వెల్లడించేవారు. కానీ ఈ సారి డిస్కం అధికారులు ఏఆర్‌ఆర్‌లు సమర్పించే విషయాన్ని రహస్యంగా ఉంచారు. ఈఆర్సీకి ఇచ్చిన తర్వాత కూడా పెదవి విప్పకుండా మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. ఎట్టి పరిస్థితిలోనూ ఈ వివరాలను బయటకు రానీయోద్దని తమకు ప్రభుత్వం నుంచి కచ్చితమైన ఆదేశాలు ఉన్నాయంటూ తప్పుకొన్నారు. మరోవైపు ఏఆర్‌ఆర్‌లోని వివరాలను వెల్లడించే బాధ్యత తనది కాదని ఈఆర్సీ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. సాధారణంగా డిస్కంలు అందించిన ఏఆర్‌ఆర్‌లతో పాటు కొత్త రేట్ల టారిఫ్‌ను వెబ్‌సైట్‌లో ఈఆర్సీ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. కానీ డిస్కంలు తమకు సీడీ (సాఫ్ట్ కాపీ) రూపంలో నివేదికలు ఇవ్వలేదని... రాత్రిపూట కావటం, ఆదివారం సెలవుదినం కావడంతో మరో రెండు రోజుల వరకు వెబ్‌సైట్లో పెట్టడం వీలు కాదని శ్రీనివాసరెడ్డి చెప్పారు. అయితే పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచేవరకు మూడు నెలలుగా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వచ్చిన తెలంగాణ సర్కారు... ఎట్టకేలకు కొత్త చార్జీలను ఈఆర్సీకి సమర్పించినప్పటికీ గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తెరలేపింది. కానీ ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే చార్జీల పెంపు శాతం తక్కువగా ఉంటుందని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి ధ్రువీకరించారు. ఇప్పటికే మూడు నెలలు వాయిదా పడటం, ఈఆర్సీ ఇచ్చిన గడువు శనివారంతో ముగిసే నేపథ్యంలో డిస్కంలు ఆఖరి నిమిషంలో ఏఆర్‌ఆర్‌లు సమర్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీఎం ఢిల్లీ పర్యటనలో ఉండటంతో ఈ వివరాలను వెల్లడించకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం.