ధర్మాసుపత్రిలో పందికొక్కులు కరిచేశాయ్
♦ మహిళ కాలికి గాయం
♦ అనంతపురం జిల్లా గుంతకల్లులో ఘటన
గుంతకల్లు: గుంటూరు ఆసుపత్రిలో ఇటీవలే మూషికాల దాడిలో ఓ పసిగుడ్డు బలైంది. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరినీ కదిలించింది. పాలకుల్లో ఇసుమంతైనా చలనం రాలేదు. ప్రభుత్వ ఆసుపత్రులు శునకాలు, పందికొక్కులు, ఎలుకలు, పాములకు నిలయంగా మారుతున్నా, రోగులపై దాడులు చేస్తున్నా వారికి చీమకుట్టినట్లయినా లేదు. గుంటూరు ఘటనను మరిచిపోకముందే అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ మహిళను పందికొక్కు కరిచి, గాయపర్చింది. వజ్రకరూరు మండలం పందికుంట గ్రామానికి చెందిన లక్ష్మీ రెండు రోజుల క్రితం కాన్పు కోసం గుంతకల్లు ప్రభుత్వాస్పత్రిలో చేరింది.
శనివారం ఉదయం ఆడ శిశువుకు జన్మనిచ్చింది. లక్ష్మీకి సహాయకురాలుగా ఆమె తల్లి ఎర్రమ్మ (55) వచ్చింది. ఆసుపత్రిలోని కాన్పుల వార్డులో లక్ష్మీ పక్కనే నిద్రించింది. తెల్లవారుజామున 1-2 గంటల మధ్య పాప ఏడ్చింది. దీంతో ఎర్రమ్మ లేచి పాపను ఊయలలో వేసి నిద్రపుచ్చింది. తనూ నిద్రపోయింది. కొద్దిసేపటికి పందికొక్కులు కాన్పుల వార్డులోకి ప్రవేశించాయి. ఎర్రమ్మ కాలును ఓ పందికొక్కు కరిచింది. ఉలిక్కిపడి లేచిన ఆమె బిగ్గరగా కేకలు పెట్టింది. కాలిపై పందికొక్కు పంటిగాట్లు కన్పించాయి. తీవ్ర రక్తస్రావమైంది. వార్డులోని వారంతా నిద్ర లేచారు. పందికొక్కులను తరిమారు. అవి మరుగుదొడ్లలోని బొరియల్లోకి వెళ్లిపోయాయి. గాయపడిన ఎర్రమ్మకు ఆస్పత్రిలోని నర్సులు వైద్యం చేసి కాలుకు కట్టుకట్టారు.