eruvaka pournami
-
Photo Feature: ఏరువాక సందడి.. మొబైల్ వ్యాక్సినేషన్
కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ ఉపసంహరించడంతో నగరాల్లో వాహనాల రద్దీ పెరిగి మళ్లీ కాలుష్యం ఎక్కువ అవుతోంది. ఏరువాక పున్నమి సందర్భంగా గురువారం అన్నదాతలు సంప్రదాయబద్దంగా పొలం పనులకు శ్రీకారం చుట్టారు. దేవస్నాన్ పూర్ణిమ పర్వదినం సందర్భంగా పూరీలోని జగన్నాథుని ఆలయంలో ఉత్సవమూర్తులకు జలాభిషేకం చేశారు. మరోవైపు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశవ్యాప్తంగా ముమ్మరంగా సాగుతోంది. హైదరాబాద్‌లో మొబైల్ వ్యాక్సినేషన్‌తో ఈ ప్రక్రియను వేగవంతం చేశారు. మరిన్ని ‘చిత్ర’ విశేషాలు ఇక్కడ చూడండి. -
Eruvaka Pournami: రైతన్నల వ్యవసాయ పండుగ
సాక్షి, విద్యానగర్(కరీంనగర్): తొలకరి పిలుపు రైతన్న మోములో చిరునవ్వు, పిల్ల కాలువల గెంతులాట, పుడమితల్లి పులకరింతకు సాక్ష్యమే ఏరువాక పౌర్ణమి. ఆధునికత ఎంత ముందుకు సాగినా నాగలి లేనిదే పని జరగదు. రైతు లేనిదే పూట గడవదు. అలాంటి వ్యవసాయానికి సంబంధించిన పండుగే ఏరువాక పౌర్ణమి. వైశాఖ మాసం ముగిసి జ్యేష్ఠ మాసం మొదలైన తర్వాత వర్షాలు కురవడం మొదలవుతాయి. జ్యేష్ఠ పౌర్ణమి నాటికి తొలకరి పడి భూమి మెత్తబడుతుంది. దుక్కి దున్నడం, వ్యవసాయ పనులను ప్రారంభించడం ఏరువాకతోనే ప్రారంభమవుతుంది. ఏరువాక అంటే.. అన్నదాతలు వైభవంగా జరుపుకునే పండుగ ఏరువాక పౌర్ణమి. ఏటా జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ నాడు జరుపుకునే వేడుక. ఏరు అంటే ఎద్దులను నాగలికి కట్టి దున్నడానికి సిద్ధం చేయడం అని అర్థం. ఈరోజు రైతులు కాడెద్దులను కడిగి వాటి కొమ్ములకు రంగులు పూసి, మెడలో గజ్జెలు, గంటలతో అలంకరిస్తారు. ఎడ్లకు కట్టేకాడిని దూపదీప నైవేద్యాలతో పూజించి, ఎద్దులకు భక్ష్యాలు తినిపిస్తారు. పొలాలకు వెళ్లి భూతల్లికి పూజలు నిర్వహిస్తారు. భూమిని దుక్కి దున్నడం ప్రారంభిస్తారు. దేశమంతటా.. ఏరువాకను జ్యోతిష, శాస్త్రవేత్తలు కృష్యారంభం, సస్యారంభం అని వ్యవహరిస్తారు. దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా జరుపుకుంటారు. జ్యేష్ఠమాసంలో మొదలయ్యే నైరుతి రుతుపవనాల ప్రభావం దేశమంతా ఒకేలా ఉంటుంది. దేశంలో దాదాపు 80 శాతం వర్షపాతం నైరుతి వల్లే కలుగుతుంది. పాడిపంటలకు, పొలం పనులకు ఆటంకాలు ఎదురుకావొద్దని కోరుకుంటూ ఏరువాకను మహా యజ్ఞంలా పరిగణించి ఆచరిస్తారు. నాగేటి సాళ్లల్లో సీత దొరికింది కాబట్టి సీతా యజ్ఞంగాను భావిస్తారు. మరో విశేషం ఏమిటంటే ఈ రోజే ఒడిశాలోని పూరీ జగన్నా«థునికి స్నానోత్సవం నిర్వహిస్తారు. అతి ప్రాచీనమైన పండుగ.. ఏరువాక అతి ప్రాచీనమైన పండుగ. ఈ రోజున శ్రీకృష్ణదేవరాయలు రైతుల కృషిని అభినందించి, తగిన రీతిలో వారిని ప్రోత్సహించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అలాగే శుద్ధోధన రాజు కపిలవస్తులో లాంఛనంగా ఏరువాకను ప్రారంభిస్తూ బంగారు నాగలిని రైతులకు అందించినట్లుగా కథలున్నాయి. ఏరువాకతో వ్యవసాయానికి సిద్ధమయ్యే రైతులకు ధాన్యపు సిరులు కురవాలని ఆశిద్దాం. రైతుకు అండగా ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. రైతులకు అండగా నిలిచి, అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. భూరికార్డుల ప్రక్షాళనతో అన్నదాతలకు కొత్త పాసుబుక్కులు ఇచ్చింది. రైతు రుణమాఫీ అమలు చేస్తూ పంట బీమా సౌకర్యం కల్పిస్తోంది. రైతుబంధు పథకంతో ఏటా ఏటా ఎకరానికి రూ.10 వేలు నేరుగా అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. రైతు బీమా పథకం ధ్వారా 18 నుంచి 59 ఏళ్లలోపు రైతు మరణిస్తే బాధిత కుటుంబానికి తక్షణం రూ.5 లక్షలు పరిహారంగా అందిస్తోంది. ప్రతీ గ్రామీణ నియోజకవర్గానికి 100 సంచార పశు వైద్యశాలను నిర్వహిస్తోంది. 24 గంటల కరెంటు, సకాలంలో ఎరువులు, విత్తనాలను అందుబాటులోకి తేవడమే కాకుండా బీడు భూములకు, ఎండిన చెరువులు, కుంటలకు కాళేశ్వరం జలాల ద్వారా సాగు నీరందిస్తోంది. లాక్డౌన్లో రైతులు ఆగం కావొద్దని పండించిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసి, బాసటగా నిలిచింది. దిగుబడి పెరిగితే సాగు లాభమే మాకు మానకొండూర్‌లో 20 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. సేంద్రీయ విధానంలో వరి సాగు చేస్తాం. ప్రత్యేక రాష్ట్రంలో రైతుల కష్టాలు మెల్లమెల్లగా తీరుతున్నాయి. వాతావరణం కూడా అనుకూలించి, దిగుబడి పెరిగితే వ్యవసాయం లాభమే. – బొప్పు శ్రీహరి, ఉత్తమ రైతు అవార్డు గ్రహీత, మానకొండూర్ విత్తనాలు ప్రభుత్వమే ఇవ్వాలి ఏటా నకిలీ, నాణ్యతలేని విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వమే సబ్సిడీతో నాణ్యమైన విత్తనాలు ఇవ్వాలి. అప్పుడే అన్నదాతలకు మేలు జరుగుతుంది. – నర్సయ్య, రైతు, తీగలగుట్టపల్లి, కరీంనగర్ నీటి ఎద్దడి లేదు ఏరువాక పౌర్ణమి రోజు రైతులందరం వ్యవసాయ పనిముట్లు, భూదేవికి, ఏడ్లకు పూజలు చేస్తాం. నాగలి కట్టి దుక్కులు దున్నడం ప్రారంభిస్తాం. వ్యవసాయానికి సాగునీటి ఎద్దడి లేకపోవడం సంతోషం. వర్షాలు అనుకున్నట్లు పడితే సాగుకు ఢోకా ఉండదు. – గంగాచారి, రైతు, చింతకుంట,కరీంనగర్ -
రైతులకు అండగా భరోసా కేంద్రాలు
సాక్షి, పశ్చిమగోదావరి: దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతు భరోసా కేంద్రాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి అన్నారు. శుక్రవారం దెందులూరు నియోజకవర్గం సత్యనారాయణపురంలో ఎరువాక పౌర్ణమి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రైతులతో కలిసి దుక్కి దున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వరుణ దేవుడు కరుణించడంతో వర్షాలు పుష్కలంగా కురిసి రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. (రాజధాని భూ కుంభకోణం.. సిట్ దూకుడు) పంట వేసే సమయంలో రైతుకు అండగా ఉండేందుకు రైతు భరోసా ద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆర్థిక సాయం అందించిందని పేర్కొన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో విత్తనాలు,ఎరువుల కోసం రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు,ఎరువులను నేరుగా రైతులకు అందిస్తున్నామన్నారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన పథకాలతో రైతులు ఆనందంగా ఉన్నారని ఆయన తెలిపారు. (తిరుమల శ్రీవారి ఆలయంలో ట్రయల్ రన్..) -
నేడు ఏరువాక పౌర్ణమి
సాక్షి, అమరావతి: ఏరువాక పౌర్ణమి వచ్చేసింది.. తొలకరి పలకరిస్తున్న వేళ.. నేల తల్లి పులకిస్తున్న వేళ.. రైతన్నలు కాడీమేడీ పట్టి.. కుడి, ఎడమల కోడె దూడలు కట్టి.. నాగలి పట్టి పొలాలు దున్నేందుకు సిద్ధమయ్యే రోజిది. వైశాఖ మాసం ముగిసి జ్యేష్ఠం మొదలైన తర్వాత వర్షాలు మొదలవుతాయి. రైతులు వ్యవసాయ పనిముట్లను శుభ్రం చేసి, పసుపు–కుంకుమతో పశువులను అలంకరించి పొలం పనులు ప్రారంభిస్తుంటారు. ప్రకృతి కూడా సహకరించడంతో అన్నదాతలు శుక్రవారం ఏరువాకకు సిద్ధమయ్యారు. (మరో ఐదు ‘శ్రీసిటీ’లు) ముందుచూపుతోనే ప్రభుత్వ ప్రోత్సాహం ► రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ ఆరంభానికి ముందే వైఎస్సార్ రైతు భరోసా కింద అన్నదాతలకు పెట్టుబడి సాయాన్ని అందించింది. ► వర్షాకాలానికి ముందే నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేసింది. ఎరువులు, పురుగు మందులను రైతు ముంగిట్లోకి తెచ్చేందుకు సంసిద్ధమై రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించింది. పంట రుణాలు మంజూరు చేయించింది. ► గతేడాది 36,15,526 హెక్టార్లలో పంటలు సాగు కాగా, ఈ సారి 39,58,906 హెక్టార్లలో సాగు చేయించాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ► తొలకరి పలకరింపుతో రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు. రాయలసీమ ప్రాంతంలో ఖరీఫ్ ప్రధాన పంటగా సాగు చేసే వేరుశనగను విత్తేందుకు దుక్కుల్ని సిద్ధం చేస్తున్నారు. ► ఈ నెల 10 నుంచి గోదావరి కాలువలకు నీరు విడుదల చేయనున్న నేపథ్యంలో గోదావరి డెల్టా ప్రాంతంలో వరి నార్లు పోసేందుకు రైతులు సన్నాహాలు ప్రారంభించారు. ► కృష్ణా డెల్టాలో చెరువులు, బావులు కింద నారుమళ్లకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్నీ మంచి శకునాలే 4 ఈ ఏడాది కూడా సకాలంలో వర్షాలు కురుస్తాయని రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి ఆకాంక్షించారు. 4 కృష్ణా బేసిన్ ఎగువ ప్రాంతంలో మంచి వర్షపాతం నమోదైందని.. మహాబలేశ్వర్‌లో గురువారం ఉదయానికి 212 మి.మీ వర్షం కురిసిందని, ఇది శుభారంభమని తెలిపారు. – అగ్రి మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి రైతులకు మంత్రి కన్నబాబు శుభాకాంక్షలు ఏరువాక పౌర్ణమి సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఆ శాఖ కమిషనర్ హెచ్. అరుణ్‌కుమార్ అన్నదాతలకు శుభాకాంక్షలు తెలిపారు. -
బసవన్న రాజసం..రైతన్న సంబరం
సాక్షి, కర్నూలు : ఏరువాక పౌర్ణమి.. వ్యవసాయ సీజన్ ప్రారంభానికి సూచికగా పల్లెల్లో రైతులు సంబరంగా నిర్వహించుకునే సంప్రదాయ పండుగ. ఇందులో భాగంగా జిల్లాలో ముఖ్యంగా ఆదోని డివిజన్ పరిధిలోని పల్లెల్లో సోమవారం రైతులు వ్యవసాయ పనుల్లో తమకు చేదోడువాదోడుగా ఉంటున్న ఎద్దులకు రంగులద్ది, అలంకరణలతో సింగారించి వాటికి పూజలు చేశారు. తొలకరి చినుకులతో మొదలయ్యే ఖరీఫ్ సాగు పనులు నిర్విఘ్నంగా సాగాలని కోరుతూ ఆలయాల్లో పూజలు చేశారు. దేవుళ్లకు నైవేద్యం సమర్పించారు. సాయంత్రం ఎద్దులతో పార్వేట ఉత్సవం నిర్వహించారు. గెలిచిన ఎద్దులను ఘనంగా ఊరేగించారు. వాటి యజమానులకు బహుమతులు అందించారు. మొత్తంగా ఏడాదికోసారి వచ్చే ఏరువాక పౌర్ణమి వేడుకలు పల్లెల్లో అంబరాన్నంటాయి. ఎమ్మిగనూరు మండలం గుడేకల్‌లో కాస్త వెరైటీగా పార్వేట సందర్భంగా యువకులు సినీ హీరోలు, రాజకీయ నాయకుల వేషధారణలో ఆకట్టుకున్నారు. -
మెగా చెక్‌తో సరిపెట్టేనా?
నేడు ‘ఏరువాక పౌర్ణమి’కి హాజరుకానున్న సీఎం చంద్రబాబు ఇన్పుట్, వాతావరణ, ఫసల్‌బీమా పరిహారం సొమ్ము పంపిణీపై స్తబ్ధత అనంతపురం అగ్రికల్చర్ : గత ఖరీఫ్‌లో దెబ్బతిన్న పంటలకు సంబంధించి నష్టపోయిన రైతులకు ఈ నెల 9వ తేదీ నుంచి పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ) పరిహారం పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర మంత్రులు, కలెక్టర్ ఇది వరకే ప్రకటించారు. ఆ సమయం రానే వచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం రాయదుర్గంలో జరిగే ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానుండడంతో, ఇప్పటికే చేతిలో చిల్లిగవ్వ లేక ఖరీఫ్ సేద్యానికి తటపటాయిస్తున్న ‘అనంత’ రైతన్నలు ఎన్నో ఆశలు పెంచుకున్నారు. అయితే ముందుగా ప్రకటించినట్లు రైతుల చేతికి ఇన్పుట్ సబ్సిడీ పరిహారం సొమ్ము అందజేస్తారా? లేదా రూ.1,032.69 కోట్ల ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి ‘మెగా చెక్’ అందజేసి వెళ్లిపోతారా? అనేది తెలుస్తుంది. మెగా చెక్ అందజేస్తే పరిహారం కోసం రైతులు మరికొన్ని నెలలు ఎదురుచూడక తప్పదు. గతేడాది వేరుశనగ, ఇతర పంటలకు వాతావరణ బీమా చేసుకున్న రైతులకు రూ.419 కోట్లు పరిహారం మంజూరు చేస్తున్నట్లు రెండు రోజుల కిందట బజాజ్ అలయెంజ్ కంపెనీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి మండలాల వారీగా ఎన్ని కోట్లు, ఎంత మంది రైతులు, ఎన్ని హెక్టార్లు, హెక్టారుకు ఎంత పరిహారం వర్తించిందనే వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. మరో పక్క ఒక్కో రైతుకు హెక్టారుకు రూ.15 వేల చొప్పున గరిష్టంగా రెండు హెక్టార్లకు రూ.30 వేలు పరిహారం ఇస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై ఇన్సూ రెన్స్‌కు ఇన్‌పుట్‌సబ్సిడీ ముడిపెట్టి జాబితాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మొదట ఇన్సూరెన్స్ ద్వారా వచ్చిన పరిహారం రైతుల ఖాతాల్లోకి జమ చేసిన తర్వాత రూ.30 వేల కన్నా తక్కువగా వచ్చిన రైతులకు ఇన్పుట్ పరిహారం ద్వారా సర్దుబాటు చేయనున్నారు. ఇన్సూరెన్స్ రూ.30 వేలు వచ్చిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ వర్తించదనే ప్రచారం కూడా జరుగుతోంది. మరోపక్క ప్రధానమంత్రి ఫసల్‌బీమా కింద దాదాపు రూ.150 కోట్ల వరకు పరిహారం ఉండవచ్చని చెబుతున్నా దీనిపై స్పష్టత లేదు. కేవలం 2016కు సంబంధించి జిల్లా రైతులకు ఎంతలేదన్నా రూ.1,600 కోట్లకు పైగా పరిహారం. రుణమాఫీ కింద మూడో విడతలో రూ.416 కోట్లు అందాల్సివుంది. వీటిన్నింటిపై శుక్రవారం ఏరువాక పౌర్ణమిలో సీఎం చంద్రబాబు ఏ మేరకు భరోసా కల్పిస్తారో వేచి చూడాలి. -
9న జిల్లావ్యాప్తంగా ఏరువాక పౌర్ణమి
అనంతపురం అర్బన్ : ‘ఖరీఫ్ పంటల సాగుని పురస్కరించుకుని ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ నెల 9న జిల్లా కేంద్రంతో పాటు అన్ని నియోజకవర్గాల్లో ఏరువాక పౌర్ణమి కార్యక్రమం జరుగుతుంది. వ్యవసాయ, దాని అనుబంధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జయప్రదం చేయాలి.’ అని జేసీ–2 సయ్యద్ ఖాజా మొహిద్దీన్ అధికారుకులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో వ్యవసాయ శాఖ జేడీ శ్రీరామ్మూర్తితో కలిసి వ్యవసాయ, దాని అనుబంధ శాఖల అధికారులతో ఏరువాక పౌర్ణమిపై ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ–2 మాట్లాడుతూ వివిధ శాఖల్లోని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రైతులకు చేరేలా స్టాల్స్‌ని ఏర్పాటు చేయాలన్నారు. రైతులకు అవసరమైన పరిజ్ఞానంతో పాటు వారికి ఉన్న పథకాలు, రాయితీలు అర్థమ్యేలా వివరించాలన్నారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ జేడీ జి.సన్యాసిరావు, పట్టుశాఖ జేడీ అరుణకుమారి, ఆత్మా పీడీ నాగన్న, ఏపీఎంఐపీ పీడీ వెంకటేశ్వర్లు, మత్స్యశాఖ డీడీ హీరానాయక్, తదితరులు పాల్గొన్నారు.