ESI scheme
-
ఏపీ ఈఎస్ఐ స్కాం : లొంగిపోయిన ప్రమోద్‌రెడ్డి
సాక్షి, అమరావతి : ఈఎస్ఐ స్కాం నిందితుడు ప్రమోద్‌రెడ్డి గురువారం ఏసీబీ కోర్టులో లొంగిపోయారు. రూ.150 కోట్ల ఈఎస్ఐ స్కాంలో ఏ3 నిందితుడిగా ఉన్న ప్రమోద్‌రెడ్డి గత కొద్ది రోజులుగా ఏసీబీ అధికారులకు చిక్కకుండా తప్పించుకుతిరుగుతున్నారు. మాజీమంత్రి అచ్చెన్నాయుడు ఇచ్చిన సిఫారసు లేఖలతో అప్పటి డైరెక్టర్ రమేష్, ప్రదీప్‌రెడ్డితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈసీజీ, కాల్ సెంటర్ సర్వీసెస్ నడపకుండానే రూ.7.96 కోట్లు బిల్లు తీసుకున్నట్లు ఏసీబీ విచారణలో తేలింది. విచారణ నుంచి తప్పించుకునేందుకు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే ఏసీబీ అధికారులు గాలింపు ముమ్మరం చేయడంతో కోర్టులో లొంగిపోయారు. ప్రమోద్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఏసీబీ అధికారులు అతన్ని మచిలీపట్నం సబ్ జైలుకు తరలించారు. కాగా, మందుల కొనుగోలు గోల్‌మాల్‌లో ప్రమోద్‌రెడ్డి ప్రమేయం ఉన్నట్లు ఏసీబీ నిగ్గులేల్చిన విషయం తెలిసిందే. -
ఈఎస్ఐ స్కాం: నిందితులకు 14 రోజుల రిమాండ్
సాక్షి, హైదరాబాద్ : ఈఎస్ఐ కుంభకోణం కేసులో నిందితులకు ఏసీబీ కోర్టు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కేసు తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు దేవికారాణి సహా తొమ్మిది మంది నిందితులను చంచల్‌గూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే ఈకేసులో అరెస్ట్‌ను సవాలు చేస్తూ నిందితుల తరఫు న్యాయవాదులు ఏబీసీ కోర్టులో పిటిషనల్ దాఖలు చేశారు. ఉదేశ్య పూర్వకంగానే తమ క్లయింట్ లను ఇబ్బంది పెడుతున్నారంటూ వాదిస్తున్నారు. ఇదే తరహా కేసుల్లో గత సుప్రీం తీర్పులను కోర్టుకు దృష్టికి తీసుకువచ్చారు. పాత కేసుకు ప్రస్తుత కేసుకు నిందితుల పై ఒకే తరహా అభియోగాలు మోపారని నిందితుల తరుఫు న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. (ఈఎస్ఐ స్కాం: మరోసారి దేవికారాణి అరెస్ట్) కాగా శుక్రవారం దేవికారాణి, కంచర్ల శ్రీహరి బాబు అలియాస్ బాబ్జీ, కంచర్ల సుజాత, కుక్కల కృప సాగర్ రెడ్డి, బండి వెంకటేశ్వర్లు, చెరుకూరి నాగరాజు, తింకశల వెంకటేష్‌లతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఈ స్కామ్‌లో ఏసీబీ అధికారులు 6.5 కోట్ల రూపాయల అవినీతిని గుర్తించారు. దేవికారాణిని మొదటిసారి అరెస్ట్ చేసిన తర్వాత ఆమెకు సంబంధించిన 35 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించి ఏసీబీ సీజ్ చేసింది. -
‘కాల్ సెంటర్లో చూపించిన కాల్స్ అన్నీ నకిలీవే’
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన రూ.150 కోట్ల ఈఎస్ఐ స్కాంలో ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడుతో సహా 12మందిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 19 మందిపై కేసు నమోదు చేశారు. మిగిలిన వారి కోసం ఏపీ, తెలంగాణలో గాలిస్తున్నారు. కాల్ సెంటర్లో చూపించిన కాల్స్ అన్నీ నకిలీవేనని అధికారులు గుర్తించారు. తెలంగాణ కాల్స్‌ని లిస్ట్‌లో చూపించి బిల్లులు తీసుకున్నట్లు విచారణలో తేలిందని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసులో ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేశమన్నారు. మరో తొమ్మిది మందికి సంబంధించి ఈ కేసులో ఆధారాలు సేకరించామని ఆయన చెప్పారు. త్వరలోనే చార్జిషీట్ దాఖలు చేస్తామని , నిందితుల సంఖ్యకూడా ఇరవై ఐదుకు పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ‘టీడీపీ హయాంలో మందులు, సర్జికల్, ల్యాబ్, మెడికల్, ఫర్నిచర్ కొనుగోలులో అవినీతిపై రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశాం. మందులు కొనుగోలులో అప్పటి ప్రభుత్వ నిబంధనలను పాటించలేదు. నిర్ణీత ధర కంటే ఎక్కువ రేట్లకు మందులను కొన్నట్టు గుర్తించాం. రూ.106 కోట్లు విలువ చేసే మందులు నాన్ కాంట్రాక్టు లో కొన్నారు. లక్ష పైన కొనే వాటిని ఈ ప్రోక్యూర్ లో కొనాలి, అయితే డైరెక్టర్స్ అలా కాకుండా కొన్ని సంస్థలతో కుమ్మక్కై అవకతవకలకు పాల్పడ్డారు. ఈ టెండర్ల పక్కన పెట్టి రూ.400 కోట్లకు కొనుగోళ్లు జరిపారు. ధనలక్ష్మి అనే ఉద్యోగిని కుమారుడు అవకతవల కోసం అమరావతి మెడికల్స్, తిరుమల మెడికల్స్ ఏర్పాటు చేశారు. వాటిని 2019 తర్వాత మూసేశారని గుర్తించాం. కింద ఆసుపత్రి నుంచి స్టాక్ ఆడిగితేనే మందులు సరఫరా జరగాలి. డాక్టర్ జనార్దన్ రూ. 4 కోట్లు విలువైన మందులు అవసరం లేకుండా కొన్నారు. కొన్న మందులను ఏం చేశారో తెలీదు, స్టాక్ బోర్డు లెక్కలు సరిపోలేదు. ప్రమోద్ రెడ్డి, నీరజ్ రెడ్డికి మంత్రి అచ్చెన్నాయుడు టెలీ సర్వీసెస్ పేరుతో కాంట్రాక్టు ఇప్పించారు. టెలీ సర్వేసెస్లో సేవలు పొందిన పేషేంట్ నుంచి రూ. 1.20 పైసలు వసూలు చేయాలి.సర్వీసు వాడుకున్న వారి నుంచి కాకుండా బిల్ క్లెయిమ్ చేశారు.టెలీ సర్వీసెస్ కాల్స్ అన్నీ ఫెక్, అన్నీ తెలంగాణ ఫోన్స్ గా గుర్తించాం.రూ.480 రూపాయలు ఈసీజీకి వసూలు చేశారు. నిబంధనల ప్రకారం 200 మాత్రమే చేయాలి.టెలీ సర్వీస్‌లో రూ. 400 కోట్లు అక్రమాలు జరిగాయి. బడ్జెట్ కూడా పక్క దారి పట్టింది. రూ.132 కోట్లు బడ్జెట్ లేకపోయినా ఆర్డర్స్ చేశారు. ప్రభుత్వం 230 కోట్లు బడ్జెట్ కేటాయిస్తే.. 650 కోట్ల పర్చేజ్ ఆర్డర్ విడుదల చేశారు. కేసులో నిందితుల సంఖ్య మరికొంత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు రూ. 150 కోట్ల మేరకు అవినీతి జరిగినట్టు గుర్తించాం. అచ్చెన్నాయుడికి బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉంది’అని రవికూమార్ పేర్కొన్నారు. -
కార్మికులందరికీ ఈఎస్ఐ సదుపాయం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని కార్మికులందరికీ ఈఎస్ఐ సదు పాయం కల్పించేందుకు విధానం రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. భవన నిర్మాణ కార్మికులకు బీమా అమలు చేయాలని అన్నారు. రాష్ట్రంలో కార్మికుల సంక్షేమంపై ముఖ్యమంత్రి శనివారం ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో సంఘటిత, అసంఘటిత కార్మికులు ఎంతమంది ఉన్నారు, ఏ రంగంలో ఎంతమంది ఉన్నారు, వారి ఆరోగ్యం, సంక్షేమం, బీమా విషయంలో ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలేమిటి అనే విషయంలో అధికారులు సమగ్ర నివేదిక రూపొందించాలని ఆదేశించారు. ప్రస్తుతం కార్మికుల్లో ఎంతమంది ఈఎస్ఐ ప్రయోజనాలు పొందుతున్నారో తేల్చి, మిగతావారికి కూడా ఈఎస్ఐ సౌకర్యం కల్పించేందుకు కార్యాచరణ రూపొందించాలని పేర్కొన్నారు. భవన నిర్మాణ కార్మికులకు కూడా ఈఎస్ఐ సదుపాయం కల్పించాలని చెప్పారు. కార్మికుల ఆధార్ కార్డులను అనుసంధానం చేయాలని, కార్మిక శాఖలో రిజిస్ట్రేషన్ చేయించాలని చెప్పారు. మే డే తర్వాత మరోసారి సమావేశమై కార్మికుల సంక్షేమానికి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, కార్యదర్శి నదీమ్ తదితరులు పాల్గొన్నారు. -
ఈఎస్ఐసీ నుంచి కొత్త పథకం
హైదరాబాద్: బండారు దత్తాత్రేయ నేతృత్వంలోని కేంద్ర కార్మిక శాఖ తాజాగా ప్రతి కార్మికుడినీ ఈఎస్ఐ స్కీమ్ కవరేజీ పరిధిలోకి తెచ్చేందకు ఒక పథకాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా సంస్థలు/కంపెనీలు వారిఉద్యోగులను ఈఎస్ఐ స్కీమ్‌లో భాగస్వాములను చేయవచ్చని ఈఎస్ఐ కార్పొరేషన్ తెలిపింది. ఈ పథకం వచ్చే జనవరి 1 నుంచి మార్చి 31 వరకు అంటే మూడు నెలలపాటు అందుబాటులో ఉంటుంది. అలాగేఈఎస్ఐ కేంద్రాల్లోని వైద్య సదుపాయాల నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు ఈఎస్ఐ కార్పొరేషన్... రాష్ట్రాలతో కలిసి వెచ్చించే వ్యయ పరిమితిని రూ.2,150 నుంచి రూ.3,000 (ఇన్సూరెన్స్ కలిగిన వ్యక్తి చొప్పున)పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెంపు ప్రయోజనాలు 2020 వరకు అందుబాటులో ఉంటాయి. ఇటీవల జరిగిన ఈఎస్ఐ కార్పొరేషన్ 170వ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. -
ఈఎస్ఐకి 62 ఏళ్లు
న్యూఢిల్లీ: కార్మిక రాజ్య బీమా సంస్థ(ఈఎస్ఐసీ)కు సోమవారంతో 62 ఏళ్లు పూర్తయ్యాయి. వివిధ రంగాల్లోని ఉద్యోగులకు సామాజిక భద్రత చేకూర్చేందుకు ఈ సంస్థ నిర్వహిస్తున్న ఈఎస్ఐ పథకం కూడా 62 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1952 ఫిబ్రవరి 24న నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కాన్పూర్‌లో ఈ పథకాన్ని ప్రారంభించారు. దీంతో ఫిబ్రవరి 24ను ఈఎస్సీఐ దినోత్సవంగా పాటిస్తున్నారు. వైద్య సేవలతోపాటు, విధినిర్వహణలో గాయపడడం, నిరుద్యోగం, మరణం తదితర సందర్భాల్లో బాధితులకు, మృతుల కుటుంబాలకు నగదు ప్రయోజనాలు చేకూర్చడానికి ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ పథకాన్ని తీసుకొచ్చారు. ఈఎస్ఐసీ కాలానికి తగ్గట్టు దీని సేవలను విస్తరించింది.