ఈఎస్‌ఐ
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని కార్మికులందరికీ ఈఎస్‌ఐ సదు పాయం కల్పించేందుకు విధానం రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. భవన నిర్మాణ కార్మికులకు బీమా అమలు చేయాలని అన్నారు. రాష్ట్రంలో కార్మికుల సంక్షేమంపై ముఖ్యమంత్రి శనివారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో సంఘటిత, అసంఘటిత కార్మికులు ఎంతమంది ఉన్నారు, ఏ రంగంలో ఎంతమంది ఉన్నారు, వారి ఆరోగ్యం, సంక్షేమం, బీమా విషయంలో ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలేమిటి అనే విషయంలో అధికారులు సమగ్ర నివేదిక రూపొందించాలని ఆదేశించారు.
ప్రస్తుతం కార్మికుల్లో ఎంతమంది ఈఎస్‌ఐ ప్రయోజనాలు పొందుతున్నారో తేల్చి, మిగతావారికి కూడా ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించేందుకు కార్యాచరణ రూపొందించాలని పేర్కొన్నారు. భవన నిర్మాణ కార్మికులకు కూడా ఈఎస్‌ఐ సదుపాయం కల్పించాలని చెప్పారు. కార్మికుల ఆధార్ కార్డులను అనుసంధానం చేయాలని, కార్మిక శాఖలో రిజిస్ట్రేషన్ చేయించాలని చెప్పారు. మే డే తర్వాత మరోసారి సమావేశమై కార్మికుల సంక్షేమానికి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, కార్యదర్శి నదీమ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment