అనుమానంతో ఆలిపై హత్యాయత్నం
=ఆపై పురుగుమందు తాగి భర్త ఆత్మహత్య
=మృత్యువుతో పోరాడుతున్న భార్య
=కాట్రేనిపాడు అటవీప్రాంతంలో దారుణం
నూజివీడు రూరల్/ముసునూరు, న్యూస్‌లైన్ : భార్యపై అనుమానం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ముందుగా భార్యను కత్తితో నరికి హత్య చేసేందుకు యత్నించాడు. ఆపై పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె మృత్యువుతో పోరాడుతోంది. నూజివీడు సీఐ సీెహ చ్వీ మురళీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తుక్కులూరు పాత హరిజనవాడకు చెందిన బొకినాల ఏసురత్నం(43)తో ఆగిరిపల్లి మండలం ఈదులగూడేనికి చెందిన ధనమ్మకు 23 ఏళ్ల క్రితం వివాహమైంది.
వీరికి జ్యోతి, సోని, కిరణ్, రవి సంతానం. వీరిలో జ్యోతికి వివాహం కాగా, సోని, కిరణ్ కూలీ పనులు చేస్తున్నారు. రవి చదువుకుంటున్నాడు. 1992లో మండలంలోని తుక్కులూరులో జరిగిన హత్యకేసు లో ఏసురత్నం ఆరేళ్లు జైలుశిక్ష అనుభవించాడు. జైలు నుంచి విడుదలయ్యాక కొంతకాలంగా భార్యను అనుమాని స్తూ రోజూ వేధిస్తున్నాడు. ఈ క్రమంలో కుటుంబ అవసరాల నిమిత్తం పుల్లలు తీసుకువద్దామని చెప్పి భార్య ధనమ్మ తో కలిసి బుధవారం ముసునూరు మండలం కాట్రేనిపాడు అటవీ ప్రాంతానికి వెళ్లాడు.
సాయంత్రం సమయంలో పుల్లలు నరికేందుకు తెచ్చిన కత్తితో భార్యను మూడుసార్లు నరికాడు. అనంతరం తనవెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు. ఈ ఘటనలో ధనమ్మకు తీవ్ర రక్తస్రావమై అడవిలోనే తెల్లవార్లూ మృత్యువుతో పోరాడుతూనే ఉంది. ఏసురత్నం మృతి చెందాడు. గురువారం ఉదయం సుమా రు 10 గంటల ప్రాంతంలో కొంతమంది గొర్రెల కాపరులు ఈ ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఏసురత్నం సైకిల్ కనిపించింది. అతడు కనిపించకపోవడంతో అనుమానం వచ్చి ఆ ప్రాంతంలో గాలించారు. తీవ్రంగా గాయపడిన ధనమ్మను, ఏసురత్నం మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు.
నూజివీడు రూరల్, ముసునూరు ఎస్సైలు బి.ఆదిప్రసాద్, వి.వెంకటేశ్వరరావు ఘటనాస్థలికి వచ్చారు. ధనమ్మను 108లో నూజివీడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆస్పత్రికి తరలించారు. ధనమ్మ నుంచి డీఎస్పీ ఆరుమళ్ల శంకర్‌రెడ్డి, సీఐ మురళీకృష్ణ వివరాలు సేకరించారు. ఈ ఘటనపై ముసునూరు ఎస్సై వెంకటేశ్వరరావు కేసు నమో దు చేయగా, సీఐ దర్యాప్తు నిర్వహిస్తున్నారు.