Eureka
-
చాలామంది గెటౌట్ అన్నారు
‘‘కాలేజీ నేపథ్యంలో హ్యాపీడేస్ నుంచి ‘ప్రేమమ్’ వరకు చాలా సినిమాలొచ్చాయి. కాలేజ్‌లో జరిగే ఓ ఫెస్ట్ (ఫెస్టివల్) ఆధారంగా వస్తున్న సినిమా మా ‘యురేక’’ అన్నారు కార్తీక్ ఆనంద్. సయ్యద్ సోహైల్ రియాన్, కార్తీక్ ఆనంద్, డింపుల్ హయతి, షాలిని, సమీక్ష ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘యురేక’. కార్తీక్ ఆనంద్ దర్శకత్వంలో ప్రశాంత్ నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదలవుతోంది. లలిత కుమారి సహనిర్మాత. కార్తీక్ ఆనంద్ మాట్లాడుతూ – ‘‘నాకు చిన్నప్పటి నుంచే సినిమాలు, కథలు రాయడం ఆసక్తి. ‘యురేక’లో నటించి, దర్శకత్వం వహించాను. ఓ కాలేజ్ ఫెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే మర్డర్ మిస్టరీయే ఈ చిత్రం. సినిమాకు సెకండాఫ్ హార్ట్ లాంటింది. ఫస్టాఫ్ సరదాగా సాగుతుంది. సమకాలీన అంశాలకు సందేశాన్ని జోడించాం. సినిమా చాన్స్ కోసం స్క్రిప్ట్స్ పట్టుకుని చాలామంది ప్రొడ్యూసర్స్‌ని కలిశాను. నేనే యాక్ట్ చేసి, డైరెక్ట్ చేస్తానని చెప్పగానే చాలామంది గెటౌట్ అన్నారు. ప్రశాంత్‌గారు నన్ను నమ్మి ‘యురేక’కి అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా చేస్తూ సెలవుల్లో ‘యురేక’ సినిమా తీశాను. ఈ సినిమా ఫలితాన్ని బట్టి నా కెరీర్‌ను నిర్ణయించుకుంటాను’’ అన్నారు. -
కష్టాలు దాటుకుంటూ వచ్చాం
కార్తీక్ ఆనంద్, సయ్యద్ సోహైల్ రియాన్, డింపుల్ హయతి, షాలిని ప్రధాన తారాగణంగా తెరకెక్కిన చిత్రం ‘యురేక’. ప్రశాంత్ నిర్మించిన ఈ సినిమాకు లలిత కుమారి సహ–నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం ఈ నెల 13న విడుదల కానుంది. నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ– ‘‘చిన్న సినిమాలవారు కష్టాలు పడుతున్నారు. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చేవారు సినిమాల నిర్మాణం, విడుదల వంటి విషయాలపై అవగాహన పెంచుకోవాలి’’ అన్నారు. ‘‘ఓ కాలేజ్ ఫెస్ట్ నేపథ్యంలో సాగే మర్డర్ మిస్టరీ ఈ చిత్రం. ఈ సినిమాను డైరెక్ట్ చేస్తూ, ఓ లీడ్ రోల్ చేస్తానని కథ చెప్పినప్పుడు ఎక్కువమంది ఒప్పుకోలేదు. కానీ నిర్మాత ప్రశాంత్ నన్ను నమ్మి అవకాశం ఇచ్చారు’’అన్నారు కార్తీక్ ఆనంద్. ‘‘భవిష్యత్‌లో కార్తీక్ మంచి స్థాయిలోకి వెళతాడు’’ అన్నారు సయ్యద్. ‘‘యువత తలచుకుంటే ఏమైనా సాధించగలరు అన్నదే మా సినిమా’’ అన్నారు ప్రశాంత్. ‘‘కొత్తవారు తీసిన సినిమా అని కాకుండా తప్పక చూడండి’’ అన్నారు లలితకుమారి. నటుడు ఆర్కే, సంగీత దర్శకుడు నరేష్, ఎడిటర్ అనిల్ పాల్గొన్నారు. -
‘అందరికీ నచ్చే చిత్రం యురేక’
కార్తీక్ ఆనంద్, డింపుల్ హయతి, సయ్యద్ సోహైల్ రియాన్, షాలిని ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘యురేక’. ఇంజనీరింగ్ కాలేజ్ ఫెస్ట్ నేపథ్యంలో సాగే లవ్ అండ్ రొమాంటిక్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రానికి కార్తీక్ ఆనంద్ దర్శకత్వం వహించారు. లక్ష్మీ ప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రశాంత్ తాత ఈ సినిమా నిర్మించారు. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి నిర్మాత బెక్కెం వేణుగోపాల్ ముఖ్య అథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ.. ‘యువత అంతా కలసి అవగాహనతో తీసిన సినిమా యురేక. మార్చి 13న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో అందరూ బాగా నటించారు. డైరెక్టర్ కార్తీక్ వాళ్ళ పేరెంట్స్ తనకు బాగా సపోర్ట్ చెయ్యడం వల్లే బెస్ట్ ఔట్ పుట్ వచ్చింది. సినిమా అంతా బాగుంది. ప్రధానంగా సెకండ్ హాఫ్ అద్భుతంగా ఉంటుంది. ఆర్కే గారు ఈ సినిమాలో మంచి రోల్ చేశారు. చిత్ర యూనిట్‌కు బెస్ట్ విషెస్ తెలుపుతున్నా’అని అన్నారు. ‘కాలేజీలో జరిగే ఒక ఫంక్షన్ లో జరిగే సంఘటన ఆధారంగా ఈ సినిమా ఉండబోతొంది. ఇటీవల విడుదలైన మా సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. నైట్ ఎఫెక్ట్ లో వచ్చే ఎపిసోడ్స్ ను కెమెరామెన్ విశ్వ బాగా తీశాడు. మ్యూజిక్ డైరెక్టర్ నరేష్ మంచి సాంగ్స్ తో పాటు బెస్ట్ రీ రికార్డింగ్ ఇచ్చాడు. మా నిర్మాత ప్రశాంత్ తాత గారి సపోర్ట్ మరువలేనిది. నన్ను నమ్మి ఈ సినిమా చేశారు’అని దర్శకుడు కార్తీక్ ఆనంద్ పేర్కొన్నారు. హీరో సయ్యద్ సోహైల్ రియాన్ మాట్లాడుతూ.. ‘డైరెక్టర్ కార్తీక్ ఆనంద్ నాకు మంచి రోల్ ఇచ్చారు. మంచి సినిమాలో నటించానన్న ఆనందం ఉంది. చిన్న సినిమాలకు అందరి సపోర్ట్ కావాలి. ఎన్నో ఇబ్బందుల్లో కూడా డైరెక్టర్ కార్తీక్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. యురేక మీ అందరికి నచ్చే సినిమా అవుతుందని భావిస్తున్నా’అని అన్నాడు. బ్రహ్మాజీ, రఘుబాబు, శివన్నారాయణ, వాసు, అభయ్, రాకేట్ రాఘవ, మహేశ్ విట్టా తదితరులు నటించిన ఈ చిత్రానికి నరేష్ కుమారన్ సంగీతమందించాడు. -
యూత్‌కి థ్రిల్
కార్తీక్ ఆనంద్, షాలిని, మున్నా, డింపుల్ హయతి ప్రధాన పాత్రల్లో కార్తీక్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యురేక’. లక్ష్మీ ప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రశాంత్ తాత నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కార్తీక్ ఆనంద్ మాట్లాడుతూ– ‘‘యూత్‌ఫుల్ ఎంగేజింగ్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. ఇటీవల విడుదలైన మా సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్, టీజర్లకు మంచి స్పందన వచ్చింది. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. త్వరలోనే ఆడియో, సినిమా విడుదల తేదీలను ప్రకటిస్తాం’’ అన్నారు. బ్రహ్మాజీ, రఘుబాబు, శివన్నారాయణ, వాసు తదితరులు నటించిన ఈ సినిమాకి సహ నిర్మాత: లలితకుమారి బొడ్డుచర్ల, సంగీతం: నరేష్ కుమరన్, కెమెరా: ఎన్.బి. విశ్వకాంత్, లైన్ ప్రొడ్యూసర్: బి.ఆర్.ఎస్.టి.సాయి. -
ఇంజినీరింగ్ నేపథ్యంలో...
కార్తీక్ ఆనంద్, షాలినీ, మున్నా, డింపుల్ హయతి ప్రధాన పాత్రల్లో కార్తీక్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యురేక’. లక్ష్మి ప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రశాంత్ తాత నిర్మించిన ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా టీజర్‌ని విడుదల చేశారు. కార్తీక్ ఆనంద్ మాట్లాడుతూ– ‘‘ఇంజినీరింగ్ కాలేజ్ నేపథ్యంలో తెరకెక్కిన లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమా ఇది. ఔట్పుట్ చాలా బాగా వచ్చింది. టీజర్ విడుదలైన కొద్ది సేపటికే మంచి స్పందన వచ్చింది’’ అన్నారు. ‘‘త్వరలోనే మా చిత్రాన్ని ట్రైలర్‌ని రిలీజ్ చేసి, సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని ప్రశాంత్ తాత అన్నారు. అపూర్వ, బ్రహ్మాజీ, రఘుబాబు, శివన్నారాయణ తదితరులు నటించిన ఈ చిత్రానికి సహ నిర్మాత: లలిత కుమారి బొడ్డుచర్ల, సంగీతం: నరేష్ కుమరన్, కెమెరా: ఎన్.బి. విశ్వకాంత్, లైన్ ప్రొడ్యూసర్: బి.ఆర్.ఎస్.టి.సాయి. -
యురేకా - కాకీక...!
హ్యూమర్ నేను జుట్టుకు రంగేసుకుంటూ ఉండగా కొత్త ఐడియా చెబుతానంటూ ఠక్కున ఎంట్రీ ఇచ్చాడు మా రాంబాబుగాడు. ‘‘నువ్వన్నీ చాలా విచిత్రంగా మాట్లాడుతుంటావ్రా. ఒరేయ్... మొన్నట్లా మాట్లాడకు’’ అన్నాను కాస్త కోపంగా. ‘‘మొన్న అన్న మాటలు కూడా కరక్టే కదా’’ అన్నాడు వాడు. రాంబాబుగాడు ఆరోజు చెప్పినవి ఒకసారి తలచుకున్నా. ఇంతకూ వాడన్న మాట ఏమిటో చెబుతా వినండి. ‘ఆవు... పులి’ కథ తెలుసు కదా. అందులో పులికి తాను ఆహారంగా దొరికిపోయాక ఒకసారి తన బిడ్డను కలిసి వస్తానంటుంది కదా. చివరిసారిగా దూడకు పాలు పట్టించి బుద్ధులు చెబుతుంది కదా. అలా మాటమీద నిలబడ్డ కారణం వల్ల ఆవుకు ఆ ప్రఖ్యాతి రాలేదట. ఆవుకు ప్రశస్తి కలిగిన కారణం వేరట. ‘‘ఏంట్రా ఆ కారణం?’’ ఆసక్తిని చంపుకోలేక అడిగా. నిజానికి ఆ కథ రాసిన వ్యక్తి ఒక డాక్టర్ అట. అందునా క్యాన్సర్ స్పెషలిస్టు అట. బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో తెలియజేయడం కోసమే ఈ కథ రాశాట్ట. ఆవు వెళ్లి తన బిడ్డకు పాలు పట్టించి వచ్చింది. కాబట్టి పులి-గిలీ లాంటివి ఏమీ చేయలేకపోయాయని చెప్పాడు. నిజానికి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది పులి రూపంలో ప్రత్యక్షమైందని కూడా వాడు వాక్రుచ్చాడు. ఆవు కాస్తా బిడ్డకు రొమ్ముపాలు పట్టించడంతో క్యాన్సర్ అనే ఆ పులి కాస్తా పిల్లిగా మారిపోయిందనీ, అది కాలుగాలినట్టుగా ఆవుచుట్టూ కాసేపు పచార్లు చేయడం తప్ప మరేమీ చేయలేకపోయిందని వాడి రహస్య పరిశోధనల్లో తేలిందట. వాడి ఆ పరిశోధన గాథను నాకు పూసగుచ్చినట్టుగా చెప్పాడు. ఆ కథ రాసిన వాడు అలనాటి ఆంకాలజిస్టు అనే గుట్టు కూడా విప్పాడు. కాకపోతే పరిశోధన ఫలితంలా చెబితే అందరూ అంతగా పట్టించుకోరట. అందుకే ‘డావిన్సీ కోడ్’లా ఆ రహస్య సమాచారాన్నంతా బయటకు ఒక నీతి కథలా కనిపించేలా రాశాట్ట. అదీ వాడు చెప్పిన మాట. ‘‘మొన్నటి నా పరిశోధనల్లో కొత్త సంగతి మనం కనిపెట్టడం తప్ప మనకు డెరైక్టుగా ఉపయోగ పడేది ఏమీ లేదు. కాకపోతే ఈ దెబ్బతో మనం కోటీశ్వరులం అయిపోవచ్చు’’ అన్నాడు. కోటీశ్వరులం కావచ్చనే మాటతో నేను కాస్త టెంప్ట్ అయ్యాను. ‘‘ఏంట్రా?...’’ అడిగాను నేను రంగేసుకోవడం ఆపకుండానే. ‘‘ఇలా వారానికి ఒకసారి కష్టపడి రంగేసుకునే బదులు... కాకి ఈకలకు ఆ రంగు ఎలా వస్తుందో తెలుసుకొమ్మని మనం రహస్యంగా సైంటిస్టులకు చెప్పాల్రా. సేమ్ టు సేమ్ రంగు వెంట్రుకలకూ వచ్చేలా చూస్తే చాలు. ఇలా మాటిమాటికీ రంగేసుకోనక్కర్లేదు. ఒకసారి ఆ పదార్థం జుట్టులోకి వెళ్లేలా చేస్తే చాలు... కాకి రంగు ఎప్పటికీ మారనట్టే... జుట్టుకూ రంగు మారదు. మొన్న మన వేప చెట్టు మీద కాకి వాలగానే నా బుర్రలోకి ఈ ఐడియా వాలిందిరా. వెంటనే యురేకా-కాకీక అనుకున్నా’’ అన్నాడు వాడు. ‘‘పక్షి ఈకలు వేరు... మనుషుల జుట్టు వేరు’’ అన్నాను నేను. ‘‘ఏం కాదు... మనుషుల్లో జుట్టు, గోళ్లూ... పక్షుల్లో ఈకలూ ఒకే పదార్థంతో తయారవుతాయట. దాని పేరు కెరటిన్ అట’’ అన్నాడు వాడు. ‘‘అయితే...?’’ ‘‘ఏముందిరా... అన్నీ ఒకే రకం పదార్థంతో తయారవుతున్నప్పుడు కొంగకు మాత్రం తెల్లరంగు ఉండి కాకి ఈకల్లోకి ఆ నల్లరంగు ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. అదే రంగు నీ జుట్టుకూ వచ్చేలా చేసేయాలి. కాకి ఈక ఫార్ములా తెలుసుకొని ఆ పేటెంట్‌ను మన పేరు మీద రాయించుకుంటే చాలురా... ఇక మనకు డబ్బులే డబ్బులు’’ అన్నాడు వాడు. వాడిచ్చిన ఐడియాను కాస్త సీక్రెట్‌గా ఉంచాలనుకున్నాను. మనకు నమ్మకమైన సైంటిస్టుకు ఎవరికైనా చెప్పి కాస్త పరిశోధన చేయించాలనీ... సక్సెస్ అయ్యాక ఫార్ములా అమ్ముకుని ఆ సైంటిస్టూ, మేమిద్దరమూ వేణ్ణీళ్లకు చన్నీళ్లుగా కాస్త డబ్బు చేసుకుందామనుకున్నాం. భార్య దగ్గర రహస్యాలేవీ దాచకూడదన్న ప్రిన్సిపుల్ కొద్దీ నేను ఈ ఆలోచన చెప్పగానే సదరు ఐడియా మీద చన్నీళ్లు చల్లేసిందామె. ‘‘బట్టతలల వాళ్లెవ్వరూ మీ ఐడియాను కొనరు. కాకి మీద ఇంత పరిశోధన చేసే బదులు... రాబందు బట్టతల మీద జుట్టు మొలిచే మార్గం కనిపెడితే బెటరు కదా. దాంతో మరింత డబ్బే డబ్బు కదా’’ అంది మా ఆవిడ. - యాసీన్ -
కమర్షియల్ ఫార్ములాలో తొప్పి
పక్కా కమర్షియల్ ఫార్ములాలో జనరంజక అంశాలతో తెరకెక్కిస్తున్న చిత్రం తొప్పి అంటున్నారు చిత్ర దర్శకుడు యురేకా. ఇంతకుముందు మదురై సంభవం, త్వరలో తెరపైకి రానున్న సిగప్పు ఎనక్కు పిడిక్కుం చిత్రాలను తెరకెక్కించిన ఈయన మంచి సాహితీవేత్త కూడా కావడం విశేషం. అలాగే దుబాయ్, మలేషియా వంటి దేశాల్యల వ్యాపారవేత్తలుగా ఎదిగి చిత్ర నిర్మాణంలోకి రంగ ప్రవేశం చేస్తున్న వారి సంఖ్య అధికం అవుతోంది. ఈ చిత్ర నిర్మాత పరమరాజ్ 30 ఏళ్ల క్రితం న్యూజిలాండ్‌కెళ్లి హోటల్ అధినేతగా ఎదిగి తాజాగా చిత్ర రంగ ప్రవేశం చేసి రాయల్ స్క్రీన్స్ పతాకంపై తొప్పి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రం నిర్మించాలన్నది తన 30 ఏళ్ల కల అని అంటున్న ఈయన తన కల సాకారానికి తన భార్య సహకారం ఎంతో ఉందన్నారు. మురళిరాం, రక్షరాజ్లు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో జీఎం కుమార్, అరుళ్దాస్, తిలకర్, మునారు మణి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. నిర్మాత పరమ్‌రాజ్ ఒక కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్ర వివరాలను దర్శకుడు యురేకా మాట్లాడుతూ, తరతరాలుగా దొంగతనమే వృత్తిగా జీవిస్తున్న ఒక కుటుంబానికి చెందిన యువకుడు పోలీసు అధికారి కావాలని ఆశిస్తారని చెప్పారు. ఆ ఆశతో పోలీసు ఇన్ఫార్మర్గా కొంతకాలం పని చేస్తాడని చెప్పారు. అయితే పోలీసు అధికారి కావాలనే అతని కోరికకు కుటుంబ నేపథ్యం పెద్ద సమస్యగా మారుతుందన్నారు. ఆ యువకుడు చివరకు లక్ష్యం సాధించాడా? లేదా? అన్నదే కథ అని దర్శకుడు తెలిపారు. 47 రోజుల్లో చిత్ర షూటింగ్‌ను పూర్తి చేసినట్టు చెప్పారు. తొప్పి చిత్రానికి కథే హీరో అని కథనం చాలా కొత్తగా ఉంటుందని చెప్పారు. చిత్రాన్ని త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు. చిత్రానికి ఛాయాగ్రహణంను ఎం.సుకుమార్, సంగీతాన్ని రాంప్రసాద్ సుందర్ అందించారు.