ఆ ఉగ్రదాడిపై మాట్లాడను: పాక్ ప్రధాని
న్యూయార్క్: పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ యురి ఉగ్రదాడి ఘటనపై మాట్లాడేందుకు నిరాకరించారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో షరీఫ్.. యురిదాడి గురించి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం దాటవేశారు. ఈ దుశ్చర్యపై ఆయన ఎలాంటి వ్యాఖ్యా చేయలేదు. ఈ విషయంపై మాట్లాడేందుకు తాను సిద్ధంగా లేనని చెప్పారు.
సోమవారం మీడియా సమావేశంలో భారత్కు చెందిన ఓ జాతీయ టీవీ ఛానెల్ ప్రతినిధి యురిదాడి గురించి ప్రశ్నించగా, పాక్ ప్రధాని అసహనం వ్యక్తం చేశారు. మీడియా ప్రతినిధిని సమావేశం నుంచి బయటకు పంపాల్సిందిగా తన సిబ్బందిని ఆదేశించారు. దీంతో ఆయన్ను సమావేశం నుంచి బయటకు పంపారు. ఇక షరీఫ్ విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ కూడా యురి ఘటనపై మాట్లాడేందుకు నిరాకరించారు.
ద్వైపాక్షిక చర్చల కోసం పాక్ ప్రధాని అమెరికా వెళ్లారు. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి జాన్ కెర్రీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో షరీఫ్ కశ్మీర్ అంశాన్ని చర్చించారు. కశ్మీర్ సమస్య పరిష్కారంలో అమెరికా జోక్యం చేసుకోవాలని షరీఫ్ కోరినట్టు ఐక్యరాజ్య సమితిలో పాక్ దూత మలీహా లోధి చెప్పారు. అమెరికా పర్యటనలో షరీఫ్ న్యూజిలాండ్ ప్రధానితో కూడా భేటీ అయ్యారు.
జమ్ము కశ్మీర్లో యూరి సైనిక స్థావరంపై ఉగ్రవాదులు చేసిన దాడిలో 20 మంది జవాన్లు వీరమరణం పొందగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. భద్రత దళాలు నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. యురిదాడిని ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండించాయి.