exercise office
-
ఎక్సైజ్ కార్యాలయంలోనే మద్యం సరఫరా
కర్నూలు : ఎక్సైజ్ కార్యాలయంలోనే లెసైన్స్‌దారులకు మద్యాన్ని అధికారులు సరఫరా చేశారు. సుందరయ్య సర్కిల్ సమీపంలోని ఎఫ్‌సీఐ గోడౌన్లో ప్రభుత్వ మద్యం గోడౌన్‌ను ప్రారంభించినప్పటికీ అక్కడ సరైన సౌకర్యం లేకపోవడంతో శుక్రవారం రాత్రి ఎక్సైజ్ కార్యాలయ ఆవరణంలోనే లారీలను నిలిపి లెసైన్స్‌దారులకు అవసరమైన మద్యాన్ని సరఫరా చేశారు. కార్పొరేట్ పన్ను చెల్లించనందుకు ఆదాయపు పన్ను శాఖ అధికారులు కల్లూరు శివారులోని హంద్రీ నది ఒడ్డున ఉన్న మద్యం డిపోను కూడా ఐటీ అధికారులు సీజ్ చేశారు. ఫలితంగా ఈనెల 5వ తేదీ నుంచి మద్యం దుకాణాలను సరఫరా నిలిచిపోయింది. కమిషనర్ ఆదేశాల మేరకు తాత్కాలికంగా హోల్‌సేల్ ఐఎంఎల్ డిపో ప్రారంభించినప్పటికీ హమాలీల మధ్య పోటీ నెలకొనడంతో రెండు రోజులుగా సరఫరా నిలిచిపోయింది. హమాలీల మధ్య వివాదం 17 ట్రక్కుల మద్యం గోడౌన్‌కు వచ్చినప్పటికీ వాటిని దించే విషయంలో హమాలీల మధ్య వివాదం తలెత్తి పగలంతా సరఫరా ఆగిపోయింది. జిల్లా నలుమూలల నుంచి వ్యాపారులు ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకున్నప్పటికీ హమాలీలు అడ్డుకోవడంతో సమస్య జటిలమైంది. పాత ఐఎంఎల్ డిపో దగ్గర పనిచేసిన హమాలీలు ఎక్సైజ్ కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఎక్సైజ్ కార్యాలయం తమ ప్రాంతంలో ఉన్నందున తామే పనిచేస్తామంటూ పాతబస్టాండ్ ప్రాంత హమాలీలు అక్కడికి చేరుకున్నారు . దీంతో ఇరువర్గాల మధ్య సమస్య జఠిలం కావడంతో డీఎస్పీ రమణమూర్తి, సీఐ ములకన్న, ఎక్సైజ్ అధికారులు హమాలీలతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. ఒకవైపు ఐఎన్టీయూసీ నాయకులు రమణ, మరోవైపు సీఐటీయూ నాయకులు రాజగోపాల్ హమాలీల తరపున అధికారులతో చర్చలు జరిపినప్పటికీ ఫలించలేదు. ఇన్చార్జి డిప్యుటీ కమిషనర్ హేమంత్ నాగరాజు, సూపరింటెండెంట్ సూర్జిత్ సింగ్ తదితరులు కూడా చర్చలు జరిపారు. అయినప్పటికీ హమాలీల మధ్య అవగాహన కుదరకపోవడంతో సాయంత్రం ఇరువర్గాలను జాయింట్ కలెక్టర్ వద్ద హాజరుపరిచారు. ప్రస్తుతం 17 ట్రక్కులకు సంబంధించిన మద్యాన్ని రెండు గ్రూపులకు సంబంధించిన హమాలీలు అన్లోడ్ చేయాలని, ఆ తర్వాత ఎఫ్‌సీఐ గోదాము దగ్గర జరిగే లావాదేవీలు అక్కడ ఉన్న హమాలీలు పనిచేసే విధంగా ఒప్పందం కుదిరించడంతో రాత్రి 9 గంటల సమయంలో దుకాణాైలకు మద్యాన్ని సరఫరా చేశారు. -
వరంగల్ టు నాంపల్లి
వేములవాడ అర్బన్ :వరంగల్ జిల్లా నుంచి వేములవాడ ప్రాంతానికి గంజాయి సరఫరా అవుతున్నట్లు తమ విచారణలో తేలిందని ఎక్సై జ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ విజయ్ తెలి పారు. స్థానిక ఎక్సైజ్ కార్యాలయంలో బుధవా రం ఆయన విలేకరులతో మాట్లాడారు. జాతర సందర్భంగా ఎక్సైజ్‌శాఖ పక్షం రోజుల ముందునుంచే దాడులు నిర్వహించిందని, 50 వేల లీట ర్ల బెల్లం పానకం, పదివేల లీటర్ల గుడుంబా ధ్వంసం చేశామని పేర్కొన్నారు. 20 వాహనాలు సీజ్ చేశామని చెప్పారు. బుధవారం నిర్వహించిన దాడుల్లో రూ.10 వేల విలువైన మద్యం బాటిళ్లు పట్టుకున్నట్లు స్పష్టం చేశారు. గుడుంబా తయారు చేస్తున్న గ్రామాలను గుర్తించామని, దీన్ని అరికట్టేందుకు అవగాహన సదస్సులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. మంగళవారం రాత్రి నాంపల్లిలో జరిపిన దాడుల్లో పదిన్నర కిలోల గంజాయి పట్టుకున్నామని, విచారణలో వరంగల్ జిల్లా భూపాలపల్లి మండలం ద్వారకారావుపేట నుంచి బస్సులో వేములవాడకు తరలించినట్లు తేలిందని స్పష్టం చేశారు. నాంపల్లిలోని ఓ ఇంట్లో సంప్‌లో గంజాయి దాచిపెట్టారని తమ దాడుల్లో బయటపడిందని వెల్లడించారు. గుడుంబా, గంజాయి విక్రయించేవారి సమాచారం తమకు 9440902702 నంబర్లో సమాచారం అందించాలని కోరారు. సమావేశంలో టాస్క్‌ఫోర్స్ సీఐ చంద్రశేఖర్, వేములవాడ ఎస్‌హెచ్‌వో లక్ష్మణ్, ఎస్సైలు కిషన్, అశోక్, సమ్మయ్య, నరేశ్, రవీందర్‌రెడ్డి, రాములు, రాజన్న, సత్యనారాయణలు పాల్గొన్నారు. -
ఆగని అక్రమ వసూళ్లు
బీవీపాళెం(తడ): ఎలుక తోకను పట్టి ఏడాదంతా ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదు సామెతలా తయారైంది రాష్ట్ర సరిహద్దులోని ఉమ్మడి తనిఖీ కేంద్రం పనితీరు. అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ పలువురు ఉద్యోగులు చేయి చాపడాన్ని మానలేకున్నారు. పదేపదే అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) దాడులు చేస్తున్నా వారిలో మార్పు కరువైంది. ప్రైవేటు వ్యక్తుల సాయంతో దందా కొనసాగిస్తున్నారు. తాజాగా శనివారం అర్ధరాత్రి నిర్వహించిన దాడుల్లో వివిధ శాఖల కార్యాలయాల వద్ద రూ.51,288 స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ కేఎస్ నంజుండప్ప కథనం మేరకు..చెక్పోస్టులపై రాష్ట్ర వ్యాప్తంగా జరిపిన దాడుల్లో భాగంగా శనివారం అర్ధరాత్రి 12 గంటలకు భీమునివారిపాళెం ఉమ్మడి తనిఖీ కేంద్రం వద్దకు ఏసీబీ అధికారులు వచ్చారు. పరిసరాల్లో మకాం వేసిన అధికారులు అరగంట పాటు అన్ని శాఖల విభాగాల పనితీరును పరిశీలించారు. అనంతరం 12.30 గంటలకు బృందాలుగా విడిపోయి ఒక్కసారిగా అన్ని శాఖల కార్యాలయాల్లోకి ప్రవేశించారు. రవాణా శాఖ కార్యాలయం వద్ద ఉన్న ఓ ప్రైవేటు వ్యక్తి ఏసీబీ అధికారులను గమనించి తన చేతిలోని రూ.5,858ను పరిసరాల్లో పడేసి ఉడాయించాడు. ఆ శాఖ కార్యాలయం సమీపంలోని ఓ ప్రైవేటు గదిలో లభించిన బ్రీఫ్‌కేసులో రూ.6,700 లభించింది. అయితే విధులు ముగించుకున్న తర్వాత ఊరికెళ్లేందుకు బ్రీఫ్‌కేసుతో పాటు నగదు తెచ్చుకున్నానని, అందుకు నిదర్శనంగా ట్రైన్ టికెట్ ఉన్నట్లు రవాణాశాఖలోని ఓ ఉద్యోగి చెప్పాడు. ఆ పక్కనే ఉన్న ఎక్సైజ్ కార్యాలయంలో రూ.250 మాత్రమే లభించడంతో పట్టించుకోలేదు. అయితే ఓ కానిస్టేబుల్ మద్యం సేవించి విధులు నిర్వర్తిస్తున్నట్లు గుర్తించి తడ పోలీసులకు అప్పగించారు. అతడికి వైద్యపరీక్షలు జరిపించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పరారైన వ్యక్తి వివరాలను కూడా సేకరించామని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని డీఎస్పీ నంజుండప్ప తెలిపారు. ఆదివారం సెలవు కావడంతో వాహనాల రద్దీ తక్కువగా ఉందని, అందువల్లే అక్రమ నగదు వసూళ్లు తక్కువగా ఉన్నాయని వెల్లడించారు. వాహనదారులు ఎక్కువ మంది సిబ్బంది అడగకపోయినా మామూళ్లు ఇచ్చివెళుతున్నారని, ఈ పద్ధతికి స్వస్తిచెప్పాలని హితవు పలికారు. సిబ్బంది పద్ధతి మార్చుకోకపోతే వరుస దాడులు తప్పవని హెచ్చరించారు. బెంచ్ కలెక్షన్ రూ.38,730 తనిఖీకి వచ్చిన ఏసీబీ అధికారులు సాధారణ సిబ్బందిలా వివిధ శాఖల విభాగాల్లో కూర్చున్నారు. ఈ సందర్భంగా లారీల సిబ్బంది భారీగా మామూళ్లు ముట్టజెప్పివెళ్లారు. ఇలా రాత్రి 12.30 నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు రూ.38,730 వసూలైంది. ఇందులో రవాణా శాఖ కార్యాలయం వద్ద రూ.22,300, వాణిజ్యపన్నుల శాఖ విభాగంలో రాష్ట్రంలోకి వాహనాలు ప్రవేశించే ఇన్కమింగ్ కార్యాలయం వద్ద రూ.10,140, చెన్నై వైపు వెళ్లే మార్గంలో వివిధ శాఖలకు సంబంధించిన కార్యాలయాలు ఉన్న అవుట్గోయింగ్ సెంటర్ వద్ద రూ.6,290 వసూలైనట్లు అధికారులు వెల్లడించారు. తనిఖీల్లో ఏసీబీ డీఎస్పీతో పాటు ఇన్స్పెక్టర్లు రవికుమార్(విజయవాడ), శ్రీనివాసులు(ఒంగోలు), నరసింహారెడ్డి(గుంటూరు), కె.వెంకటేశ్వర్లు, కృపానందం(నెల్లూరు), 15 మంది సిబ్బంది, 10 మంది వివిధ శాఖల ఉద్యోగులు, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు.