ఆగని అక్రమ వసూళ్లు | Stop illegal collections | Sakshi
Sakshi News home page

ఆగని అక్రమ వసూళ్లు

Published Mon, Jul 28 2014 2:44 AM | Last Updated on Sat, Sep 2 2017 10:58 AM

ఆగని అక్రమ వసూళ్లు

ఆగని అక్రమ వసూళ్లు

బీవీపాళెం(తడ):  ఎలుక తోకను పట్టి ఏడాదంతా ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదు సామెతలా తయారైంది రాష్ట్ర సరిహద్దులోని ఉమ్మడి తనిఖీ కేంద్రం పనితీరు. అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ పలువురు ఉద్యోగులు చేయి చాపడాన్ని మానలేకున్నారు. పదేపదే అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) దాడులు చేస్తున్నా వారిలో మార్పు కరువైంది. ప్రైవేటు వ్యక్తుల సాయంతో దందా కొనసాగిస్తున్నారు. తాజాగా శనివారం అర్ధరాత్రి నిర్వహించిన దాడుల్లో వివిధ శాఖల కార్యాలయాల వద్ద రూ.51,288 స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ కేఎస్ నంజుండప్ప కథనం మేరకు..చెక్‌పోస్టులపై రాష్ట్ర వ్యాప్తంగా జరిపిన దాడుల్లో భాగంగా శనివారం అర్ధరాత్రి 12 గంటలకు భీమునివారిపాళెం ఉమ్మడి తనిఖీ కేంద్రం వద్దకు ఏసీబీ అధికారులు వచ్చారు.
 
 పరిసరాల్లో మకాం వేసిన అధికారులు అరగంట పాటు అన్ని శాఖల విభాగాల పనితీరును పరిశీలించారు. అనంతరం 12.30 గంటలకు బృందాలుగా విడిపోయి ఒక్కసారిగా అన్ని శాఖల కార్యాలయాల్లోకి ప్రవేశించారు. రవాణా శాఖ కార్యాలయం వద్ద ఉన్న ఓ ప్రైవేటు వ్యక్తి ఏసీబీ అధికారులను గమనించి తన చేతిలోని రూ.5,858ను పరిసరాల్లో పడేసి ఉడాయించాడు. ఆ శాఖ కార్యాలయం సమీపంలోని ఓ ప్రైవేటు గదిలో లభించిన బ్రీఫ్‌కేసులో రూ.6,700 లభించింది. అయితే విధులు ముగించుకున్న తర్వాత ఊరికెళ్లేందుకు బ్రీఫ్‌కేసుతో పాటు నగదు తెచ్చుకున్నానని, అందుకు నిదర్శనంగా ట్రైన్ టికెట్ ఉన్నట్లు రవాణాశాఖలోని ఓ ఉద్యోగి చెప్పాడు. ఆ పక్కనే ఉన్న ఎక్సైజ్ కార్యాలయంలో రూ.250 మాత్రమే లభించడంతో పట్టించుకోలేదు. అయితే ఓ కానిస్టేబుల్ మద్యం సేవించి విధులు నిర్వర్తిస్తున్నట్లు గుర్తించి తడ పోలీసులకు అప్పగించారు.
 
 అతడికి వైద్యపరీక్షలు జరిపించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పరారైన వ్యక్తి వివరాలను కూడా సేకరించామని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని డీఎస్పీ నంజుండప్ప తెలిపారు. ఆదివారం సెలవు కావడంతో వాహనాల రద్దీ తక్కువగా ఉందని, అందువల్లే అక్రమ నగదు వసూళ్లు తక్కువగా ఉన్నాయని వెల్లడించారు. వాహనదారులు ఎక్కువ మంది సిబ్బంది అడగకపోయినా మామూళ్లు ఇచ్చివెళుతున్నారని, ఈ పద్ధతికి స్వస్తిచెప్పాలని హితవు పలికారు. సిబ్బంది పద్ధతి మార్చుకోకపోతే వరుస దాడులు తప్పవని హెచ్చరించారు.
 
 బెంచ్ కలెక్షన్ రూ.38,730
 తనిఖీకి వచ్చిన ఏసీబీ అధికారులు సాధారణ సిబ్బందిలా వివిధ శాఖల విభాగాల్లో కూర్చున్నారు. ఈ సందర్భంగా లారీల సిబ్బంది భారీగా మామూళ్లు ముట్టజెప్పివెళ్లారు. ఇలా రాత్రి 12.30 నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు రూ.38,730 వసూలైంది.
 
 ఇందులో రవాణా శాఖ కార్యాలయం వద్ద రూ.22,300, వాణిజ్యపన్నుల శాఖ విభాగంలో రాష్ట్రంలోకి వాహనాలు ప్రవేశించే ఇన్‌కమింగ్ కార్యాలయం వద్ద రూ.10,140, చెన్నై వైపు వెళ్లే మార్గంలో వివిధ శాఖలకు సంబంధించిన కార్యాలయాలు ఉన్న అవుట్‌గోయింగ్ సెంటర్ వద్ద రూ.6,290 వసూలైనట్లు అధికారులు వెల్లడించారు. తనిఖీల్లో ఏసీబీ డీఎస్పీతో పాటు ఇన్‌స్పెక్టర్లు రవికుమార్(విజయవాడ), శ్రీనివాసులు(ఒంగోలు), నరసింహారెడ్డి(గుంటూరు), కె.వెంకటేశ్వర్లు, కృపానందం(నెల్లూరు), 15 మంది సిబ్బంది, 10 మంది వివిధ శాఖల ఉద్యోగులు, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement