మళ్లీ రేగిన ఉన్మాదం
గుజరాత్‌లోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిమంది స్వస్థలాలకు తరలివెళ్తున్న దృశ్యాలు చానె ళ్లలో చూస్తున్నవారికి విస్మయం కలిగిస్తున్నాయి. కనీసం నిలబడటానికి కూడా చోటు లేనంతగా కిక్కిరిసి ఉన్న బస్సుల్లో చంటిపిల్లలతో, కొద్దిపాటి సామాన్లతో వారంతా తరలిపోతున్నారు. గుడి సెల్లో ఉన్నవారిని బయటకు లాగి నిప్పెట్టడం, ‘బయటి వ్యక్తుల’ని అనుమానం వచ్చినవారిని ఇష్టా నుసారం కొట్టడం... లాఠీలతో, ఇనుప రాడ్లతో, హాకీ స్టిక్‌లతో వెంటబడి తరమడం గత వారం రోజులుగా నిత్యకృత్యమైంది. ఆమధ్య దేశంలోని వేర్వేరుచోట్ల ఉన్మాద మూకలు చెలరేగి అమా యకుల్ని కొట్టి చంపిన ఉదంతాలు వరసబెట్టి కొనసాగాయి. అవి సద్దుమణిగాయని అందరూ అను కునేలోగానే తాజా ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గుజరాత్‌లోని సబర్కాంత జిల్లాలో 14 నెలల పసిపాపపై లైంగిక నేరానికి పాల్పడిన కేసులో బిహార్ నుంచి వలసవచ్చిన యువకుణ్ణి పోలీ సులు అరెస్టు చేశారు.
అది మొదలు బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్ల నుంచి వలసవచ్చిన వారిపై ఉత్తర గుజరాత్ ప్రాంతంలోని ఆరు జిల్లాల్లో దాడులు మొద లయ్యాయి. పర్యవసానంగా ఒక్క అహ్మదాబాద్ నుంచే 25,000మంది బిహార్, యూపీ ప్రజలు నిష్క్రమించారని మీడియా కథ నాలు చెబుతున్నాయి. రాజకీయ నాయకులంతా కారణం మీరంటే మీరని పరస్పర నిందారోపణ లతో బజారునపడ్డారు. అయిదు రాష్ట్రాల ఎన్నికలకూ నగారా మోగింది గనుక ఈ ఆరోపణలు మరింత పదునెక్కాయి. అందరికీ రక్షణ కల్పిస్తామని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఇస్తున్న హామీలు రాష్ట్రంనుంచి నిష్క్రమిస్తున్న జనాన్ని నమ్మించలేకపోతున్నాయి. ఒక్క అహ్మ దాబాద్ నగరంలోనే 2,500 మంది పోలీసుల్ని నియమించి అభయం ఇస్తున్నా భయకంపితులై ఉన్న వలస జనం విశ్వసించడం లేదు. ఈ దాడులకు సంబంధించి ఇంతవరకూ దాదాపు 70 కేసులు నమోదయ్యాయి. 450మంది వరకూ అరెస్టయ్యారు. వీరిలో చాలామంది స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. 40 గంటలపాటు 2,000 కిలోమీటర్లు ప్రయాణించి ప్రాణాలు అరచేత పెట్టుకుని బిహార్‌కు తిరిగొచ్చినవారు చెబుతున్న కథనాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి.
గుజరాత్ సంపన్నవంతమైన ప్రాంతం. పరిశ్రమలు దండిగా ఉన్న ప్రాంతం. వ్యవసాయ రంగం కూడా మెరుగ్గానే ఉంది. వృద్ధిరేటులో ఆ రాష్ట్రానిది దేశంలోనే మూడో స్థానం. దేశంలో ఇతర ప్రాంతాలకన్నా అక్కడ నిరుద్యోగిత తక్కువని గణాంకాలు చెబుతున్నాయి. గుజరాత్‌కి వలసపోతే ఏదో ఒక పని దొరుకుతుందని ఆశపడి వేరే రాష్ట్రాలవారు అక్కడికి దండు కడతారు. అయితే ఇలా పొట్టచేతబట్టుకుని వలసపోయేవారికి అక్కడ పనులు సిద్ధంగా ఉండవు. చిల్లర వ్యాపారాలు, బస్తాలు మోయడం, పెయింట్ వేయడం, పొలాల్లో కూలిపని వగైరాలతో వారు జీవనం సాగిస్తారు. కర్మాగారాల్లో కార్మికులుగా చేరేవారిలో అత్యధికులకు కార్మిక చట్టాలు వర్తించవు. వేతనాలు అంతంతమాత్రం. పూట గడవాలంటే రోజంతా కాయకష్టం చేయాల్సిందే. స్థానికులైతే నిబంధనలు మాట్లాడతారు గనుక చాలా కర్మాగారాలు వేరే రాష్ట్రాలవారికి ప్రాధా న్యతనిస్తాయి. ఫలితంగా బయటివారి వల్ల తమకు ఉపాధి కరువవుతున్నదని స్థానికులు భావిం చడానికి ఆస్కారం ఏర్పడింది. దీన్ని కుల సంఘాలు, రాజకీయ పార్టీలు తమకనుకూలంగా ఉపయోగించుకుంటున్నాయి.
వలసవచ్చినవారిపై స్థానికులను ఉసిగొల్పినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న గుజరాత్ క్షత్రియ ఠాకూర్ సేన అధ్యక్షుడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే అల్పేష్ ఠాకూర్ వాటిలో నిజం లేదని చెబుతూనే స్థానికులకు జరుగుతున్న అన్యాయం గురించి ఏకరువు పెట్టారు. ‘ఫ్యాక్టరీల్లో 80 శాతంమంది స్థానికులే ఉండాలన్న నిబంధనను ఎవరూ పాటించడంలేద’ని ఆయన ఆరోపణ. ఎక్కడో ఏదో చిచ్చు రేగే వరకూ, అల్లర్లు చోటుచేసుకునేవరకూ ప్రభుత్వాల్లో కదలిక లేకపోవడం వల్ల ఈ స్థితి ఏర్పడింది. ఫ్యాక్టరీల్లో, పంటపొలాల్లో, చిన్నా చితకా వ్యాపారాల్లో కుదురుకున్న స్థాని కేతరుల స్థితిగతులేమిటో, వారికీ, స్థానికులకూ మధ్య తలెత్తుతున్న వైరుధ్యాలు ఎటువంటివో, వాటికి కారణాలేమిటోసామాజిక శాస్త్రవేత్తలతో ఆరా తీయిస్తే దిద్దుబాటు చర్యలకు ఆస్కారం ఉంటుంది. సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. కానీ అలాంటి అంశాల్లో ప్రభుత్వాలు చొరవ చూపవు.
2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో దాదాపు 40 కోట్లమంది పౌరులు అంతర్గతంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలసపోతున్నారు. అంటే దేశ జనాభాలో మూడో వంతు మంది వలస జీవితాలే గడుపుతున్నారు. ఇలాంటివారంతా అయినవారికి చాలా దూరంగా బతు కులు వెళ్లదీస్తున్నారు. వీరు వెళ్లేది కొత్త ప్రాంతం గనుక, అక్కడ పరిచయస్తులు ఉండరు గనుక రేషన్ కార్డు సంపాదించాలన్నా కూడా కష్టం. ఓటు హక్కు ఉండదు గనుక ఏ రాజకీయ పార్టీకీ వీరిపై ధ్యాస ఉండదు. అంతగా చదువు లేనివారు గనుక తమకుండే హక్కులేమిటో, ఎవరిని ఆశ్ర యిస్తే బతుకులు మెరుగవుతాయో కూడా తెలియదు. స్థానికులకే ఓట్ల కాలంలో తప్ప దిక్కూ మొక్కూ లేని స్థితి ఉన్న ప్రస్తుత వాతావరణంలో ఏదో రాష్ట్రం నుంచి వలస వచ్చినవారిని పట్టిం చుకునేవారెవరు? కనీసం వారి స్వరాష్ట్రాల్లోని ప్రభుత్వాలకు కూడా వారెలా బతుకుతున్నారన్న స్పృహ ఉండదు. తమ కాయకష్టంతో ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా తోడ్పడుతున్నారు. స్థూల దేశీయోత్పత్తిలో వీరి వాటా పది శాతం ఉంటుందని అంచనా. ఇలాంటివారి స్థితిగతులను పట్టించుకుని వాటిని మెరుగుపరచాలని, పల్లెపట్టుల్లో ఉపాధి అవకాశాలు పెంచి వలసలను కనిష్ట స్థాయికి తీసుకురావాలని పాలకులు అనుకోవడం లేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు సమస్య ముంచుకొచ్చినప్పుడు తాత్కాలికంగా దాన్ని ఆర్పే ప్రయత్నం చేయడం తప్ప నిర్దిష్టమైన ప్రణాళికల రూపకల్పనకు సిద్ధపడటం లేదు. కనుకనే ఈ అమానవీయ ఉదంతాలు తరచు సాగు తూనే ఉన్నాయి. ఇది విచారకరం.