expats villages
-
కన్నీరు తుడవంగ.. సొంతింట్లోకి సగర్వంగా
సాక్షి, గజ్వేల్: కన్నతల్లిలాంటి ఊరు.. అక్కడి మట్టితో బంధాన్ని తెంచుకుని.. కన్నీళ్లను దిగమింగుకుని మల్లన్నసాగర్ నిర్వాసితులు కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. పాత జ్ఞాపకాల స్థానే కొత్త ఆశలు.. ఆకాంక్షలతో సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముట్రాజ్‌పల్లి ఆర్అండ్ఆర్ (రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్) కాలనీలోకి చేరుకుంటున్నారు. ఇప్పటికే 2000కుపైగా కుటుంబాలు ఇక్కడికి వచ్చాయి. నిన్నమొన్నటి వరకు పచ్చని పంట పొలాలు, ప్రాణాధారంలాంటి చెరువులు, కుంటలు, పాడిపశువుల మధ్య స్వేచ్ఛగా గడిపిన వీళ్లంతా కాంక్రీటు వనంలో కొత్త అనుభవాలను ఎదుర్కోబోతున్నారు. నిర్వాసితుల ఉద్విగ్న పరిస్థితులపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్.. ఉపాధిపై ఆందోళన మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల కోసం గజ్వేల్ మున్సిపాలిటీలోకి వచ్చే ముట్రాజ్‌పల్లి, సంగాపూర్ గ్రామాల పరిధిలో రూపుదిద్దుకున్న ఆర్అండ్ఆర్ కాలనీలో ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నాయి. మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణంతో తొగుట మండలం పల్లెపహాడ్, వేములఘాట్, ఏటిగడ్డ కిష్టాపూర్, లక్ష్మాపూర్, రాంపూర్, బ్రాహ్మణ బంజేరుపల్లి, కొండపాక మండలం సింగారం, ఎర్రవల్లి గ్రామాలు పూర్తిగా ముంపునకు గురవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నిర్వాసితులంతా ఆర్అండ్ఆర్ కాలనీకి తరలివస్తున్నారు. ముంపు గ్రామాల ప్రజలు ఇప్పుడు కొత్త బతుకును వెతుక్కుంటున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయ పునరావాసం పక్కనపెడితే... ఇకపై తమ ఉపాధి పరిస్థితి ఏమిటనే అంశంపై అనేకమంది ఆందోళన చెందుతున్నారు. ఇదే ఆవేదనతో చాలామంది కన్నీరు పెట్టుకుంటున్నారు. గేటెడ్ కమ్యూనిటీ తరహాలో.. ముంపు గ్రామాల ప్రజలకు 650 ఎకరాల్లో 6 వేల మందికి ఇళ్లు ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం ముట్రాజ్‌పల్లి, సంగాపూర్‌లో గతంలో 300 ఎకరాలు సేకరించగా.. ఇటీవల మరో 350 ఎకరాలను సేకరించారు. నిర్వాసితులు కోరిన ప్రకారం ఇళ్లను ఎంత మందికి అవసరమైతే అంత మందికి నిర్మించి ఇవ్వడానికి గేటెడ్ కమ్యూనిటీ తరహాలో ముందే నిర్మాణ పనులను చేపట్టారు. ప్రభుత్వం కట్టే ఇళ్లు వద్దనుకునేవారికి ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే రూ.5.04 లక్షలను అందిస్తున్నారు. ఇప్పటికే 2,400 ఇళ్ల నిర్మాణం పూర్తికాగా 2 వేలకుపైగా పంపిణీ చేశారు. మరో 3,400 మందికి ఓపెన్ ప్లాట్లు పంపిణీ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా ఒక్కో ఇంటిని 250 గజాల్లో సుమారు 563 ఎస్ఎఫ్టీ వైశాల్యంతో నిర్మించారు. ఇంటి నిర్మాణానికి పోగా మిగిలిన భూమిలో రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, రెండు ఫంక్షన్ హాళ్లు, ఒక మార్కెట్, 8 అంగన్ వాడీ కేంద్రాలు, 3 ప్రాథమికోన్నత పాఠశాలలు, 2 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు నిర్మిస్తున్నారు. ఇళ్ల నిర్మాణాల కోసం రూ. 250 కోట్లు, ఇతర వసతుల కల్పన కోసం మరో రూ. 200 కోట్లకుపైగా ప్రభుత్వం వెచ్చిస్తోంది. కొన్ని నెలలుగా నివాసం ఆర్అండ్ఆర్ కాలనీని సకల సౌకర్యాలతో రూపొందిస్తున్నారు. ఇప్పటికే రాంపూర్, లక్ష్మాపూర్, ఎర్రవల్లి, సింగారం గ్రామస్తులు ఆర్అండ్ఆర్ కాలనీ పక్కనే ఉన్న డబుల్ బెడ్రూమ్ మోడల్ కాలనీలో కొన్ని నెలలుగా నివాసముంటున్నారు. ఆర్అండ్ఆర్ కాలనీ పనులు తుది దశకు చేరుకోవడంతో త్వరలోనే లక్ష్మాపూర్‌కు చెందిన 175 ఇళ్లు, ఎర్రవల్లికి చెందిన 553, సింగారానికి చెందిన 181 ఇళ్లలో కొత్తగా గృహ ప్రవేశాలు జరుగనున్నాయి. కొన్ని రోజులుగా వేములఘాట్, పల్లెపహాడ్, ఏటిగడ్డ కిష్టాపూర్, బ్రాహ్మణ బంజేరుపల్లికి చెందిన నిర్వాసితులు ఇక్కడికి చేరుకుంటున్నారు. శుక్రవారం నాటికి దాదాపు 986 కుటుంబాలు కొత్త ఇళ్లలో గృహ ప్రవేశాలు చేశాయి. ఇదిలా ఉండగా ఆర్అండ్ఆర్ కాలనీ పనులను జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కాలనీలో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడానికి ప్రత్యేక బృందాలు కృషి చేస్తున్నాయి. చదవండి: వైద్య సిబ్బందిని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు -
పోలీస్ పహారాలో వంశధార నిర్వాసితులు
శ్రీకాకుళం: వంశధార ప్రాజెక్టు నిర్వాసిత గ్రామల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిర్వాసిత గ్రామాలను ఖాళీచేయించే ప్రయత్నంలో పోలీస్ పహార ఏర్పాటు చేశారు. పోలీసులను నిర్వాసితులు తీవ్రంగా అడ్డుకున్నారు. ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించేంత వరకూ ఖాళీ చేయబోమని తేల్చి చెప్పారు. అంత వరకు ప్రాజెక్టు పనులను జరగనివ్వబోమని హెచ్చరించారు. దీంతో నిర్వాసిత గ్రామాల్లో సెక్షన్ 144, 30 విధించారు. గ్రామాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను విశాఖ డీఐజీ సీఎచ్ శ్రీకాంత్ పర్యవేక్షించారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో చర్చలు నిర్వహించుకోవాలని సూచించారు. సమస్య పరిష్కారానికి సామరస్యంగా కృషిచేయాలన్నారు. గతంలో జరిగిన విద్వంసం నేపథ్యంలోనే గ్రామాల్లో పోలీస్ బలగాలను పిలిపించినట్లు డీఐజీ తెలిపారు. ఇది వరకు పలుమార్లు జరిపిన చర్చలు విఫలం కావడంతో నిర్వాసిత గ్రామాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. -
ముంచుకొస్తున్న ముప్పు
గోదావరిలో పెరుగుతున్న నీటి మట్టం కోటిలింగాలలో తీరం ఆనుకుని ప్రవహిస్తున్న గోదావరి తరలివెళ్లాలంటున్న అధికారులు ఆందోళనలో నిర్వాసితులు వెల్గటూరు : గోదావరిలో నీటిమట్టం అంతకంతకు పెరుగుతోంది. ముంపు గ్రామాల్లోకి ఏ క్షణాన్నైన వరద రావొచ్చు. ఇప్పటికే కోటిలింగాలను నలువైపులా నుంచి వరద నీరు చుట్టుముడుతోంది. ముక్కట్రావుపేట, చెగ్యాం, ఉండెడ గ్రామాల్లో ఎస్సీకాలనీల్లోకి వరదనీరు చేరుకుంటోంది. నిర్వాసితులను తరలించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మరో వైపు పునరావాసకాలనీల్లో ఇంకా ఏర్పాట్లు చేస్తూనే ఉన్నారు. దీంతో నిర్వాసితుల్లో ఆందోళన మెుదలైంది. మండలంలోని కోటిలింగాలలో పుష్కరఘాట్లు దాదాపుగా గోదావరి వరదలో మునిగిపోతుండగా, పెద్దవాగు నది సంగమ ప్రదేశంలో నుంచి గట్టెక్కింది. వరదనీరు ఆలయ సమీపంలోకి చేరుకుంటుంది. గోదావరిలో వరద ఉధృతి పెరుగుతున్న కొద్దీ గ్రామానికి ఉత్తర దిశలో ఉన్న పెద్దవాగులో నీటి మట్టం పెరిగి దక్షిణం వైపు నుంచి గ్రామాన్ని చుట్టుముడుతోంది. ఇదతతా చూస్తూ గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ఊరు నుంచి ఎటు పర్లాంగు దూరం వెళ్లేందుకు అవకాశం లేదని ఆందోళన చెందుతున్నారు. అధికారులు కేవలం ఐదు ఇళ్ల కోసమే పునరావాసకాలనీలో ఏర్పాట్లు చేయటం గమనార్హం. మిగతా వారు మా సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. నిలిచిపోనున్న రాకపోకలు Ðð ల్గటూరుతో కోటిలింగాలను కలిపేందుకు గతంలో నిర్మించిన లోలెవల్ వంతెనకు వరద నీరు తాకుతోంది. నదిలో నీటి మట్టం ఇలాగే పెరిగితే ఈ రాత్రికే ఈ వంతెను మునిగిపోనుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి మట్టం సుమారు 145 ఎఫ్ఆర్ఎల్ ఉండగా గోదావరికి ఇరువైపులా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ నుంచి వరద వస్తుంది . ఇంకా నీటి మట్టం పెరిగితే వంతెన మునిగిపోతుంది. కోటిలింగాలకు బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. 1995లో వరదలు 1995లో గోదావరికి వరదలు వచ్చినప్పుడు గ్రామం వెనక నుంచి నది గట్టు తెగి ఊరిని వరదనీరు చుట్టుముట్టింది. అధికారులు అప్రమత్తమవడంతో సమీపంలోని పాషిగాంకు తరలించారు. అప్పడే పెద్దవాగు పొంగి ముక్కట్రావుపేట వరద ముంపునకు గురైంది. ఇప్పుడు అలాంటి పరస్థితులు ఏర్పడక ముందే ముంపు గ్రామాలను తరలించేందుకు రెవెన్యూ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తాత్కాలిక ఏర్పాట్లు ముంపు గ్రామాల్లో తహసీల్దార్ కృష్ణవేణి బుధవారం పరిశీలించారు. ఇప్పటికే గుర్తించిన చెగ్యాంలోని 185 కుటుంబాలను అదే గ్రామంలోని జెడ్పీ హైస్కూల్, ఉండెడలో 15 కుటుంబాలకు అదే గ్రామంలో ఎగువన ఉన్న ఇళ్లు, ముక్కట్రావుపేటలో 9 కుటుంబాలకు అదే గ్రామంలో గదులు అద్దెకు తీసుకున్నారు. కోటిలింగాలలో 5 కుటుంబాలను వెల్గటూరు పునరావాసకాలనీకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముంపు గ్రామాలకు మొత్తంగా పరిహారం అందించి పూర్తిస్థాయిలో పునరావాసకాలనీలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. పరిహారం పూర్తిగా ఇవ్వకుండా ఎలా తరలిస్తారని నిర్వాసితులు మొండికేస్తున్నారు. ప్రమాదపుటంచున ఉన్న కుటుంబాలను బలవంతంగానైనా తరలిస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. భయమేత్తంది వారం రోజుల కిందట గోదావరి గట్టు కింద ఎక్కడో ఉంది. ఇప్పడు గట్టెక్కి ఆలయం వైపునకు వస్తుంటే భయమేత్తాంది. రాత్రి మరింత పెరిగితే గ్రామంలోకి నీళ్లు వత్తాయి. భయంగా ఉంటోంది. – పోలు శంకర్, కోటిలింగాల పశువుల మేతకు కట్టమైతాంది ఊరు చుట్టూ గోదావరి నీరు చుట్టుముడుతాంది. పశువులు మేత మేసే స్థలం మొత్తంగా ముంపునకు గురైంది. పశువుల మేతకు కష్టంగా ఉంది. వాటిని నిలిపేందుకు కూడా స్థలం లేదు. – ఇటవేణి ఓదెలు, కోటిలింగాల తాత్కాలిక ఏర్పాట్లు సరిగ్గా లేవు – గంధం రవి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఉండెడ ఉండెడలో ప్రస్తుతం 15 కుటుంబాల ఇళ్లు ముంపునకు గురవుతున్నాయి. వీరి కోసం పునరావాసకాలనీలో సరైన ఏర్పాట్లు చేయలేదు. అసౌకర్యాలలో ఉండడం కట్టమే. తరలించేందుకు సిద్ధంగా ఉన్నాం గోదావరిలో వరద మరింత పెరిగితే ముప్పు పొంచిఉన్న కుటంబాలను తరలించేందుకు సిద్ధంగా ఉన్నాం. వీరి కోసం ఆయా గ్రామాల్లో తాత్కాలిక వసతులు ఏర్పాటు చేశాము. – కృష్ణవేణి, తహసీల్దార్