గంజాయి కూడా మెదడుకు మంచిదేనా!
బెర్లిన్: గంజాయి దమ్ము బిగించి కొడితే... ఆనందం సంగతి ఏమోగానీ ఆరోగ్యం పాడవుతుందని, త్వరగా చావుకు దగ్గరవుతామని చెప్పేవారు ఎందరో ఉంటారు. కానీ చిన్న మోతాదులో, క్రమం తప్పకుండా గంజాయిని తీసుకుంటే మెదడు చురుగ్గా పనిచేస్తుందని, ఫలితంగా పదేళ్లు ఎక్కువకాలం బతికే అవకాశం ఉందని బాన్ యూనివర్శిటీ, హెబ్రూ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో తేలింది.
వీరు మొదట ఎలుకలపై జరిపిన పరిశోధనలు విజయవంతం కావడంతో ఆ తర్వాత మనుషులపై పరిశోధనలు జరిపారు. అయితే చిన్న పిల్లలకంటే పెద్ద వాళ్లలోనే ఈ గంజాయి ప్రభావం బాగా కనిపిస్తోందని పరిశోధకులు తెలిపారు. చిన్న పిల్లలు గందరగోళానికి గురైతే పెద్ద వాళ్ల మెదడు చురుగ్గా పనిచేస్తున్నట్లు తేలిందని వారు చెప్పారు. ముందుగా తాము ఏడాది లోపు, ఏడాదిన్నర ఎలుకలపై ప్రయోగించి చూశామని, ఆ తర్వాత పిల్లలపై, పెద్దలపై ప్రయోగించి చూశామని చెప్పారు. గంజాయిలో ఉండే ‘కన్నాబినాయిడ్స్’ కారణంగా పెద్దవాళ్లలో మెదడు చురుగ్గా పనిచేయడం మొదలు పెట్టిందని వారు తెలిపారు.
మెదడు సామర్థ్యం తగ్గిపోతున్న సమయంలో మెదడును ఈ గంజాయి ప్రభావితం చేస్తున్నట్లు తేలిందని వెల్లడించారు. ఈ ప్రయోగం సందర్భంగా మానవుల ఇతర అవయవాలపై కూడా ఎలాంటి ప్రతికూల ప్రభావం కనిపించలేదని పరిశోధకులు చెప్పారు. అయితే మానవులపై ఇంకా పూర్తిస్థాయి క్లినికల్ అధ్యయనాలు జరపాల్సి ఉందని వివరించారు.