డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ గడువు పెంపు
న్యూఢిల్లీ: పింఛన్‌దారులు లైఫ్ సర్టిఫికెట్‌ను డిజిటల్ రూపంలో సమర్పించేం దుకు ఈపీఎఫ్ఓ గడువును ఫిబ్రవరి 28 వరకు పొడిగించింది. పెద్దనోట్ల రద్దుతో బ్యాంకుల్లో ఏర్పడిన రద్దీ దృష్ట్యా ఈ గడువును గత నవంబర్‌లో జనవరి 15 వరకు పెంచిన సంగతి తెలిసిందే. డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ల సమర్పణకు ఆధార్‌ను తప్పనిసరి చేశామని, బ్యాంకుల ద్వారా వీటిని భౌతికంగా స్వీకరించే విధానాన్ని తొలగించినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
మొబైల్ ఫోన్లు లేదా ఉమ్మడి సేవా కేంద్రాలు (సీఎస్సీ) లేదా ప్రత్యేక బ్యాంకు శాఖల ద్వారా లైఫ్ సర్టిఫికెట్‌ను డిజిటల్ రూపంలో సమర్పించాలని సూచించారు. మొబైల్ఫోన్లలో జీవన్ ప్రమాణ్ యాప్ ద్వారా ఈపీఎఫ్ఓ ఈ సర్టిఫికెట్‌ను అంగీకరిస్తుంది. లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించని పింఛన్‌దారులకు పెన్షన్ ఆగిపోతుంది.