Extreme tragedy
-
రెప్పపాటులో ఘోరం
సాక్షి, సుల్తానాబాద్/మంథని : రెప్పపాటులో ఘోరం జరిగింది. అతివేగం, నిర్లక్ష్యం నలుగురిని బలిగొంది. రామగుండం– హైదరాబాద్ రాజీవ్ రహదారి మరోసారి రక్తమోడింది. కాసింత ఏమరపాటు కుటుంబాన్ని బలితీసుకుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్ద గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత రోడ్డు పక్కన ఆగిఉన్న లారీని కారు వెనకనుంచి ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు. దీంతో మంథని, సుల్తానాబాద్‌లో తీవ్ర విషాదం అలుముకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. సుల్తానాబాద్ మండల కేంద్రానికి చెందిన చదువాల అరుణ్‌కుమార్(37) మంథని పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఆరేళ్లుగా ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నాడు.భార్య సౌమ్య(30), కొడుకు అఖిలేశ్(9), కూతురు శాన్వి(5)తో కలిసి మంథనిలోనే నివాసం ఉంటున్నాడు. తన సోదరుడు సాయికుమార్, బావమరిది ఓం ప్రకాశ్‌ను హైదరాబాద్‌లోని ఇబ్రహీంపట్నంలో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలతో చేర్పించేందుకు కారులో భార్య, పిల్లలతో కలిసి గురువారం వెళ్లారు. వారిని అక్కడ దింపేసి, ఓ శుభకార్యానికి హాజరయ్యారు. రాత్రి 9గంటలకు మంథనికి బయల్దేరారు. గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత వీరు ప్రయాణిస్తున్న కారు సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్ద ఆగిఉన్న లారీని వెనకనుంచి ఢీకొట్టింది. ఘటనలో అరుణ్, సౌమ్య, శాన్వీ అక్కడికక్కడే మృతిచెందారు. అఖిలేష్ కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. నాలుగు గంటల శ్రమ.. రోడ్డుపై భారీ శబ్ధం వినిపించడంతో చుట్టుపక్కల వారు తరలివచ్చారు. ప్రమాదాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు.పెద్దపల్లి డీసీపీ తాళ్లపల్లి సుదర్శన్‌గౌడ్, ఏసీపీలు హబీబ్‌ఖాన్, వెంకటరమణ, సీఐ రాములు, ఎస్ఐ రాజేశ్ అక్కడికి చేరుకున్నారు. లారీని కారు వేగంగా ఢీకొట్టడంతో నుజ్జునుజ్జు కావడంతో మృతదేహాలన్నీ ఇరుక్కుపోయాయి. వాటిని తీసేందుకు పోలీసులు, స్థానికులు సుమారు నాలుగు గంటలు శ్రమించారు. గ్యాస్‌కట్టర్ తెప్పించి, కారు భాగాలు విడదీసి బయటకు తీశారు. లారీ డ్రైవర్ నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్‌ను వద్దని.. కారులో ప్రయాణం చేసిన ప్రతి సమయంలో అరుణ్‌కుమార్ డ్రైవర్‌ను వెంట తీసుకెళ్లేవాడని కుటుంబ సభ్యులు, స్నేహితులు తెలిపారు. గురువారం హైదరాబాద్‌కు వెళ్లిన సమయంలోనూ డ్రైవర్ అందుబాటులో ఉన్నప్పటికి కారులో ఎక్కు వ మంది వెళ్తున్నామని, డ్రైవర్ అవసరం లేదని తానే స్వయంగా కారు నడిపినట్లు తెలిపారు. డ్రైవర్ ఉంటే ప్రాణాలు దక్కేవని రోదించారు. మళ్లొస్తానని.. హైదరాబాద్‌కు వెళ్లే ముందు అరుణ్‌కుమార్ రామగుండంలో నివాసముంటున్న తల్లిదండ్రులు లక్ష్మినారాయణ, రాజేశ్వరీ వద్దకు వెళ్లాడు. నాన్న ఆరోగ్యం బాగా లేక పోవడంతో రూ. 20వేలు, బియ్యం అప్పజెప్పాడు. హైదరాబాద్ వెళ్లి మళ్లొస్తానని చెప్పిన కొడుకు తెల్లవారేసరికి అనంతాలకు వెళ్లాడని తల్లి రోదిస్తూ తెలిపింది. పలువురి పరామర్శ.. మంథని ఎమ్మెల్యే పుట్ట మధు, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బిరుదు రాజమల్లు, చింతకుంట విజయరమణారావు, కాంగ్రెస్ నాయకులు గొట్టిముక్కుల సురేశ్‌రెడ్డి, మున్నూరు కాపు సంఘం నాయకులు రౌతు కనకయ్య, ఆకుల నర్సయ్య, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు అన్నయ్యగౌడ్, ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కేశవరెడ్డి, కార్యదర్శి బుచ్చిరెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీనివాస్, రమణారావు, ప్రసాద్ సుల్తానాబాద్ ప్రభుత్వాస్పత్రి వద్ద మృతదేహాలను పరిశీలించారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. అతివేగమే కారణమా..? ప్రమాదానికి అతివేగమే ప్రధాన కారణంగా పోలీసులు భావిస్తున్నారు. కారు ప్రమాద సమయంలో 130 స్పీడ్‌తో వెళ్లడంతోపాటు అలసటతో నిద్రమత్తు ఉండడం కూడా మరో కారణమవుతుందని ట్రాఫిక్ ఏసీపీ వెంకటరమణ సంఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం పేర్కొన్నారు. ఘటనపై పరిశీలన చేసేందుకు రోడ్లు భవనాల శాఖ అధికారి, తహసీల్దార్, ఎస్ఐ, గ్రామసర్పంచ్లతో ప్రత్యేక టీమ్ ఏర్పాటుచేశామని డీసీపీ తాళ్లపల్లి సుదర్శన్‌గౌడ్ తెలిపారు. పెను విషాదం అరుణ్‌కుమార్ కుటుంబం రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడడంతో సుల్తానాబాద్, మంథనిలో పెను విషాదం అలుముకుంది. సుల్తానాబాద్ ట్యాంకువీధికి చెందిన అరుణ్‌కుమార్ మొదట గోదావరిఖని 8వకాలనీలో కష్ణవేణి హైస్కూల్లో పనిచేశారు. తరువాత ప్రిన్సిపల్ హోదాలో అదే పాఠశాల మంథనిశాఖకు వచ్చారు. అప్పటి నుంచి పాఠశాలను ఎంతో అభివృద్ధి చేశారు. ఎవరైనా ఆపదలో ఉంటే ఆపన్నఅస్తం అందించేవారు. అరుణ్ భార్య సౌమ్య బోధనారంగంలో స్థిరపడాలని బీఈడీ రెండో సంవత్సరం చదువుతోంది. కొడుకు నాలుగు, కూతురు యూకేజీ చదువుతున్నారు. వీరి మరణవార్త తెలుసుకున్న మంథని, సుల్తానాబాద్‌లోని స్నేహితులు, బంధువులు సుల్తానాబాద్‌లో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన అంతిమయాత్రలో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. -
సంద్రమంత విషాదం
సాక్షి, పరవాడ : ఆ సంబరం చూసి చూసి సముద్రుడికి ఈర్శ్య కలిగిందేమో వారిని తనలో కలిపేసుకున్నాడు.. వారి వినోదంతో విధికి కన్నుకుట్టిందేమో కన్నెర్ర జేసింది. ఆ కుటుంబాలకు ఆధారం వద్దనుకున్నాడేమో తన దగ్గరికి తీసుకుపోయాడు. కన్నీటికే కన్నీరు వచ్చే విషాదం.. పగవాడికి కూడా రాకూడని కష్టం.. ఆ తల్లిదండ్రులకు గర్భశోకం.. ఆ గ్రామానికి పెను విషాదం. పరవాడ మండలం ముత్యలమ్మపాలెం శివారు తిక్కవానిపాలెం తీరంలో రాకాసి అలలకు ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. మరో యువకుడు గల్లంతయ్యాడు. ఇంటికి చేదోడుగా ఉంటాడని ఆశ పడిన ఆ కుటుంబాలకు తీవ్ర దుఃఖాన్ని మిగిల్చారు. వెన్నెలపాలెంలో నాలుగు నిరుపేద కుటుంబాలు పెట్టుకున్న ఆశలు ఆరిపోయాయి. పరవాడ పోలీసుల కథనం మేరకు.. వెన్నెలపాలేనికి చెందిన ముగ్గురు యువకులు సముద్ర అలలకు బలికావడం.. మరొకరు గల్లంతు అవ్వడంతో జిల్లాలో తీవ్ర విషాదం అలముకుంది. గ్రామానికి చెందిన పైలా మహేష్(28), మాసవరపు నరేష్(27), సిరపరపు రామకృష్ణ(28) సముద్రంలో మునిగి మృత్యు ఒడికి చేరుకోగా.. లాలం నరసింగరావు(27) గల్లంతయ్యాడు. పరవాడలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2008లో పదో తరగతి చదువుకున్న విద్యార్థులు ‘పూర్వ విద్యార్థుల సమ్మేళనం’పేరిట ఆదివారం ముత్యాలమ్మపాలెం శివారు తిక్కవానిపాలెం తీరంలో కలుసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆడిపాడి, పాత జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. ఈ క్రమంలో వెన్నెలపాలేనికి చెందిన మహేష్, నరేష్, రామకృష్ణ, నరసింగరావు సముద్ర స్నానానికి దిగతా.. ఓ రాకాసి అల వీరిని సముద్రంలోకి లాగేసింది. దీంతో మహేష్, నరేష్, రామకృష్ణలు తీవ్ర అస్వస్తతకు గురై మరణించగా నరసింగరావు సముద్రంలోకి కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. సౌత్ ఏసీపీ జె.రామ్మోహన్రావు అనకాపల్లిలోని మార్చురీకి వెళ్లి మృతదేహాలను పరిశీలించారు. అనంతరం సంఘటన స్థలానికి వెళ్లి ప్రమాదానికి గల కారణాలను సీఐ స్వామినాయుడు, ఎస్ఐ వెంకటరావును అడిగి తెలుసుకున్నారు. దేవుడా మేం ఏ పాపం చేశాం... సముద్రంలో మునిగి మృతి చెందిన మహేష్, నరేష్, రామకృష్ణతో పాటు గల్లంతైన నరసింగరావులు ఆయా కుటుంబాల్లో ఒక్కరే మగ సంతానం. మహేష్‌కు మూడేళ్ల కిందట వివాహం జరగ్గా భార్య గౌతమి, రెండేళ్ల పాప రిషిత ఉన్నారు. తండ్రి కలాసీగా పనిచేస్తున్నా మహేష్ సంపాదనే ఆధారం. నరేష్ అవివాహితుడు కాగా తండ్రి రాజు డ్రైవర్‌గా పనిచేస్తూ ప్రమాదానికి గురవడంతో కాలు విరిగిపోయి ఇంటి వద్ద ఉండే పరిస్థితి. కుటుంబ భారం మీద పడడంతో హిందుజా కంపెనీలో పనికి కుదిరిన నరేష్ కుటుంబానికి పెద్దదిక్కుగా మారాడు. ఇక రామకృష్ణ కుటుంబానిది పూర్తిగా వ్యవసాయ కుటుంబం. తండ్రి ఉన్న ఎకరంలో సేద్యం చేస్తుండగా.. తల్లి వ్యవసాయ కూలీ. ఇద్దరు ఆడపిల్లల తరువాత రామకృష్ణ జన్మించాడు. గల్లంతైన నరసింగరావు ఏకైక సంతానం. చిన్ననాటి స్నేహితులైన నలుగురిలో ముగ్గురు ఒకే ప్రమాదంలో మరణించడం.. ఒకరు గల్లంతవ్వడంతో ఆయా కుటుంబాలల్లో తీరని విషాదం నెలకొంది. తల్లిదండ్రులతో పాటు బంధవులు, గ్రామస్తులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. -
దిక్కుతోచని స్థితిలో వెంకటాపురం
కుక్కునూరు : అగ్ని ప్రమాదం పేదల బతుకులను బుగ్గిపాలు చేసింది. సర్వస్వం అగ్ని కీలలకు ఆహుతైపోగా కట్టుబట్టలతో బాధితులు రోడ్డునపడ్డారు. తగలబడుతున్న ఇళ్ల నుంచి ప్రాణాలతో బయటపడ్డారు తప్ప ఒక్క పూచీక పుల్లను కూడా ఇంటిలో నుంచి బయటకు తెచ్చుకోలేకపోయారు. మండలంలోని వెంకటాపురం గ్రామం ఎస్సీ కాలనీలో శుక్రవారం మధ్యాహ్నం సంభవించిన అగ్ని ప్రమాదం ఇలా పేదల బతుకుల్లో నిప్పులు పోసింది. ఈ ప్రమాదంలో గుమ్మడి యాకూబ్ అనే వ్యక్తి కుమార్తె పెళ్లి కోసమని దాచుకున్న రూ.3 లక్షలు అగ్నికి ఆహుతైపోయాయి. అలాగే అతడికి చెందిన సుమారు 14 క్వింటాళ్ల ఎండుమిర్చి తగలబడిపోయింది. తాటిచెట్టుకు అంటుకున్న నిప్పు కాలనీపై పడి చూస్తుండగానే సుమారు 60 ఇళ్లను పూర్తిగా, 30 ఇళ్లను పాక్షికంగా తగలబెట్టేసింది. బాధితులను సబ్ కలెక్టర్ షాన్మోహన్, జంగారెడ్డిగూడెం డీఎస్పీ వెంకట్రావు, తహసీల్దార్ నాగరాజ్ నాయక్ పరామర్శించి అదుకుంటామని హామీ ఇచ్చారు. పక్కా ఇళ్లు నిర్మించి తగిన నష్ట పరిహారం అందించాలని బాధితులు సబ్ కలెక్టర్‌ను ఘెరావ్ చేశారు. రెవెన్యూ అధికారులు నష్టాన్ని అంచనా వేస్తున్నారు. పక్కా ఇళ్లు నిర్మించాలి : బాలరాజు బాధితులకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వడంతో పాటు అన్ని రకాలుగా ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ రాష్ర్ట ఎస్టీ సెల్ అధ్యక్షుడు తెల్లం బాలరాజు ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. త్వరలో బాధితులను పరామర్శిస్తాన్నారు. బాధితులను పరామర్శించకుండా వెళ్లిపోయిన మంత్రి సుజాత ఇది ఇలా ఉండగా శుక్రవారం ప్రమాదం జరిగిన సమయంలోనే కుక్కునూరు రాష్ర్టమంత్రి పీతల సుజాత వచ్చారు. 13న కుక్కునూరులో సీఎం చంద్రబాబు నాయుడు మీటింగ్ ఉన్న దృష్ట్యా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఆమె విచ్చేశారు. అయితే అగ్నిప్రమాద బాధితులను పరామర్శించకుండానే సీఎం మనువడు పుట్టినరోజు ఉందంటూ ఆమె హడావుడిగా వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది.