రెప్పపాటులో ఘోరం | Road Accident In Sultanabad | Sakshi
Sakshi News home page

రెప్పపాటులో ఘోరం

Published Sat, Jun 23 2018 1:38 PM | Last Updated on Thu, Aug 30 2018 4:17 PM

Road Accident In Sultanabad - Sakshi

గ్యాస్‌కట్టర్‌తో కారు భాగాలు తొలగిస్తున్న స్థానికులు, పోలీసులు 

సాక్షి, సుల్తానాబాద్‌/మంథని : రెప్పపాటులో ఘోరం జరిగింది. అతివేగం, నిర్లక్ష్యం నలుగురిని బలిగొంది. రామగుండం– హైదరాబాద్‌ రాజీవ్‌ రహదారి మరోసారి రక్తమోడింది. కాసింత ఏమరపాటు కుటుంబాన్ని బలితీసుకుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం కాట్నపల్లి వద్ద గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత రోడ్డు పక్కన ఆగిఉన్న లారీని కారు వెనకనుంచి ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు. దీంతో మంథని, సుల్తానాబాద్‌లో తీవ్ర విషాదం అలుముకుంది.  


పోలీసుల వివరాల ప్రకారం.. 
సుల్తానాబాద్‌ మండల కేంద్రానికి చెందిన చదువాల అరుణ్‌కుమార్‌(37) మంథని పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌లో ఆరేళ్లుగా ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నాడు.భార్య సౌమ్య(30), కొడుకు అఖిలేశ్‌(9), కూతురు శాన్వి(5)తో కలిసి మంథనిలోనే నివాసం ఉంటున్నాడు. తన సోదరుడు సాయికుమార్, బావమరిది ఓం ప్రకాశ్‌ను హైదరాబాద్‌లోని ఇబ్రహీంపట్నంలో ఉన్న పాలిటెక్నిక్‌ కళాశాలతో చేర్పించేందుకు కారులో భార్య, పిల్లలతో కలిసి గురువారం వెళ్లారు. వారిని అక్కడ దింపేసి, ఓ శుభకార్యానికి హాజరయ్యారు. రాత్రి 9గంటలకు మంథనికి బయల్దేరారు. గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత వీరు ప్రయాణిస్తున్న కారు సుల్తానాబాద్‌ మండలం కాట్నపల్లి వద్ద ఆగిఉన్న లారీని వెనకనుంచి ఢీకొట్టింది. ఘటనలో అరుణ్, సౌమ్య, శాన్వీ అక్కడికక్కడే మృతిచెందారు. అఖిలేష్‌ కరీంనగర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. 


నాలుగు గంటల శ్రమ.. 
రోడ్డుపై భారీ శబ్ధం వినిపించడంతో చుట్టుపక్కల వారు తరలివచ్చారు. ప్రమాదాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు.పెద్దపల్లి డీసీపీ తాళ్లపల్లి సుదర్శన్‌గౌడ్, ఏసీపీలు హబీబ్‌ఖాన్, వెంకటరమణ, సీఐ రాములు, ఎస్‌ఐ రాజేశ్‌ అక్కడికి చేరుకున్నారు. లారీని కారు వేగంగా ఢీకొట్టడంతో నుజ్జునుజ్జు కావడంతో మృతదేహాలన్నీ ఇరుక్కుపోయాయి. వాటిని తీసేందుకు పోలీసులు, స్థానికులు సుమారు నాలుగు గంటలు శ్రమించారు. గ్యాస్‌కట్టర్‌ తెప్పించి, కారు భాగాలు విడదీసి బయటకు తీశారు. లారీ డ్రైవర్‌ నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 


డ్రైవర్‌ను వద్దని..  
కారులో ప్రయాణం చేసిన ప్రతి సమయంలో అరుణ్‌కుమార్‌ డ్రైవర్‌ను వెంట తీసుకెళ్లేవాడని కుటుంబ సభ్యులు, స్నేహితులు తెలిపారు. గురువారం హైదరాబాద్‌కు వెళ్లిన సమయంలోనూ డ్రైవర్‌ అందుబాటులో ఉన్నప్పటికి కారులో ఎక్కు వ మంది వెళ్తున్నామని, డ్రైవర్‌ అవసరం లేదని తానే స్వయంగా కారు నడిపినట్లు తెలిపారు. డ్రైవర్‌ ఉంటే ప్రాణాలు దక్కేవని రోదించారు. 


మళ్లొస్తానని.. 
హైదరాబాద్‌కు వెళ్లే ముందు అరుణ్‌కుమార్‌ రామగుండంలో నివాసముంటున్న తల్లిదండ్రులు లక్ష్మినారాయణ, రాజేశ్వరీ వద్దకు వెళ్లాడు. నాన్న ఆరోగ్యం బాగా లేక పోవడంతో రూ. 20వేలు, బియ్యం అప్పజెప్పాడు. హైదరాబాద్‌ వెళ్లి మళ్లొస్తానని చెప్పిన కొడుకు తెల్లవారేసరికి అనంతాలకు వెళ్లాడని తల్లి రోదిస్తూ తెలిపింది.  
పలువురి పరామర్శ.. 
మంథని ఎమ్మెల్యే పుట్ట మధు, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బిరుదు రాజమల్లు, చింతకుంట విజయరమణారావు, కాంగ్రెస్‌ నాయకులు గొట్టిముక్కుల సురేశ్‌రెడ్డి, మున్నూరు కాపు సంఘం నాయకులు రౌతు కనకయ్య, ఆకుల నర్సయ్య, సర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షుడు అన్నయ్యగౌడ్, ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు కేశవరెడ్డి, కార్యదర్శి బుచ్చిరెడ్డి, అసోసియేట్‌ అధ్యక్షుడు శ్రీనివాస్, రమణారావు, ప్రసాద్‌ సుల్తానాబాద్‌ ప్రభుత్వాస్పత్రి వద్ద మృతదేహాలను పరిశీలించారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. 


అతివేగమే కారణమా..? 
ప్రమాదానికి అతివేగమే ప్రధాన కారణంగా పోలీసులు భావిస్తున్నారు. కారు ప్రమాద సమయంలో 130 స్పీడ్‌తో వెళ్లడంతోపాటు అలసటతో నిద్రమత్తు ఉండడం కూడా మరో కారణమవుతుందని ట్రాఫిక్‌ ఏసీపీ వెంకటరమణ సంఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం పేర్కొన్నారు. ఘటనపై పరిశీలన చేసేందుకు రోడ్లు భవనాల శాఖ అధికారి, తహసీల్దార్, ఎస్‌ఐ, గ్రామసర్పంచ్‌లతో ప్రత్యేక టీమ్‌ ఏర్పాటుచేశామని డీసీపీ తాళ్లపల్లి సుదర్శన్‌గౌడ్‌ తెలిపారు. 


పెను విషాదం 
అరుణ్‌కుమార్‌ కుటుంబం రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడడంతో సుల్తానాబాద్, మంథనిలో పెను విషాదం అలుముకుంది. సుల్తానాబాద్‌ ట్యాంకువీధికి చెందిన అరుణ్‌కుమార్‌ మొదట గోదావరిఖని 8వకాలనీలో కష్ణవేణి హైస్కూల్‌లో పనిచేశారు. తరువాత ప్రిన్సిపల్‌ హోదాలో అదే పాఠశాల మంథనిశాఖకు వచ్చారు. అప్పటి నుంచి పాఠశాలను ఎంతో అభివృద్ధి చేశారు. ఎవరైనా ఆపదలో ఉంటే ఆపన్నఅస్తం అందించేవారు. అరుణ్‌ భార్య సౌమ్య బోధనారంగంలో స్థిరపడాలని బీఈడీ రెండో సంవత్సరం చదువుతోంది. కొడుకు నాలుగు, కూతురు యూకేజీ చదువుతున్నారు. వీరి మరణవార్త తెలుసుకున్న మంథని, సుల్తానాబాద్‌లోని స్నేహితులు, బంధువులు సుల్తానాబాద్‌లో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన అంతిమయాత్రలో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement