దిక్కుతోచని స్థితిలో వెంకటాపురం
కుక్కునూరు : అగ్ని ప్రమాదం పేదల బతుకులను బుగ్గిపాలు చేసింది. సర్వస్వం అగ్ని కీలలకు ఆహుతైపోగా కట్టుబట్టలతో బాధితులు రోడ్డునపడ్డారు. తగలబడుతున్న ఇళ్ల నుంచి ప్రాణాలతో బయటపడ్డారు తప్ప ఒక్క పూచీక పుల్లను కూడా ఇంటిలో నుంచి బయటకు తెచ్చుకోలేకపోయారు. మండలంలోని వెంకటాపురం గ్రామం ఎస్సీ కాలనీలో శుక్రవారం మధ్యాహ్నం సంభవించిన అగ్ని ప్రమాదం ఇలా పేదల బతుకుల్లో నిప్పులు పోసింది.
ఈ ప్రమాదంలో గుమ్మడి యాకూబ్ అనే వ్యక్తి కుమార్తె పెళ్లి కోసమని దాచుకున్న రూ.3 లక్షలు అగ్నికి ఆహుతైపోయాయి. అలాగే అతడికి చెందిన సుమారు 14 క్వింటాళ్ల ఎండుమిర్చి తగలబడిపోయింది. తాటిచెట్టుకు అంటుకున్న నిప్పు కాలనీపై పడి చూస్తుండగానే సుమారు 60 ఇళ్లను పూర్తిగా, 30 ఇళ్లను పాక్షికంగా తగలబెట్టేసింది. బాధితులను సబ్ కలెక్టర్ షాన్‌మోహన్, జంగారెడ్డిగూడెం డీఎస్పీ వెంకట్రావు, తహసీల్దార్ నాగరాజ్ నాయక్ పరామర్శించి అదుకుంటామని హామీ ఇచ్చారు. పక్కా ఇళ్లు నిర్మించి తగిన నష్ట పరిహారం అందించాలని బాధితులు సబ్ కలెక్టర్‌ను ఘెరావ్ చేశారు. రెవెన్యూ అధికారులు నష్టాన్ని అంచనా వేస్తున్నారు.
పక్కా ఇళ్లు నిర్మించాలి : బాలరాజు
బాధితులకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వడంతో పాటు అన్ని రకాలుగా ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ రాష్ర్ట ఎస్టీ సెల్ అధ్యక్షుడు తెల్లం బాలరాజు ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. త్వరలో బాధితులను పరామర్శిస్తాన్నారు.
బాధితులను పరామర్శించకుండా వెళ్లిపోయిన మంత్రి సుజాత
ఇది ఇలా ఉండగా శుక్రవారం ప్రమాదం జరిగిన సమయంలోనే కుక్కునూరు రాష్ర్టమంత్రి పీతల సుజాత వచ్చారు. 13న కుక్కునూరులో సీఎం చంద్రబాబు నాయుడు మీటింగ్ ఉన్న దృష్ట్యా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఆమె విచ్చేశారు. అయితే అగ్నిప్రమాద బాధితులను పరామర్శించకుండానే సీఎం మనువడు పుట్టినరోజు ఉందంటూ ఆమె హడావుడిగా వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది.