fake journalist
-
స్పాలో అక్రమాలంటూ.. ఓనర్‌ను బెదిరించి, ఆపై
బెంగళూరు: తమ చేతిలో ఉన్న పనితో సమాజానికి మంచి చేయాల్సింది పోయి వక్రమార్గం పట్టారు ప్రబుద్ధులు. నగరంలోని రామ్మూర్తి నగర పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక స్పా యజమానిని బెదిరించి రూ.1.60 లక్షలు వసూలు చేశారు. ఈ కేసులో ఆర్టీ నగర కావల్ బైరసంద్ర విలేకరి సయ్యద్ ఖలీం (28), పోలీస్ హోంగార్డులు అసిఫ్ (27), డి.జే.హళ్ళి సంపంగిరాం (31), ఆనంద్‌రాజ్ (30), బెన్సన్ లింగరాజపురం వినాయక్ (28) అనే నిందితులు పోలీసులు పట్టుకున్నారు. ఏదో విధంగా డబ్బు సంపాదించాలని విలేకరితో కలిసి హోంగార్డులు ఒక స్పాకు వెళ్లారు. మీ స్పాలో అక్రమాలు జరుగుతున్నాయని, తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, అడిగినంత డబ్బు ఇవ్వకపోతే కేసు పెడతామని బెదిరించారు. ఫిబ్రవరి 26న రూ.60 వేల నగదు, రూ. లక్షను గూగుల్ పే ద్వారా తీసుకున్నారు. తరువాత స్పా యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి ఐదుగురినీ అరెస్టు చేశారు. కేసు విచారణలో ఉంది. -
ప్రముఖ న్యూస్ చానల్ విలేకరినంటూ..
ఓడీ చెరువు(అనంతపురం జిల్లా): టీవీ రిపోర్టర్‌గా చెప్పుకుని బ్లాక్మెయిల్ చేస్తున్న యువకుడిపై ఓడీ చెరువు పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ఎస్ఐ గోపి తెలిపిన మేరకు.. గత నెల 24న మహేంద్రనాయక్ అనే యువకుడు తాను ఓ ప్రముఖ న్యూస్ చానల్ విలేకరినంటూ ఓడీ చెరువు మండలం కొండకమర్ల ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడు టీ భాస్కర్‌ను కలిసి పరిచయం చేసుకున్నాడు. ఆ పాఠశాలలో పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్న జయలక్ష్మికి సంబంధించిన అనుమతుల పత్రాల నకళ్లు కావాలని అడిగాడు. తప్పుడు విధానంలో ఆమెను ఎంపిక చేశారని, తనకు డబ్బు ఇస్తే ఈ విషయం వెలుగు చూడకుండా ఉంటుందని, లేకపోతే తమ న్యూస్ చానల్లో ప్రసారం చేస్తానంటూ బెదిరించాడు. ఈ విషయంగా ఆ న్యూస్ చానల్ ప్రతినిధులతో భాస్కర్ నేరుగా మాట్లాడి, అతను నకిలీ అని ధ్రువీకరించుకుని, పుట్టపర్తి డివిజన్ న్యూస్ చానల్ ప్రతినిధి కేశవతో కలిసి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఇవీ చదవండి: ఎచ్చెర్ల టీడీపీ ‘కళా’విహీనం..! ప్రియుడితో సహజీవనం.. చివరికి ఏం జరిగిందంటే? -
ఫేక్ జర్నలిస్ట్ అరెస్ట్
తిరుమల: ప్రముఖ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్లో జర్నలిస్ట్‌నంటూ, గతకొంత కాలంగా తిరుమలలో అక్రమాలకు పాల్పడుతున్న వెంకటరమణరావు అనే వ్యక్తిని టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతను నకిలీ గుర్తింపు కార్డుతో శ్రీవారి వీవీఐపీ దర్శన టోకన్లను సంపాదించి వ్యాపారవనరుగా మార్చుకున్నాడు. గత నెల తనే స్వయంగా వీవీఐపీ టోకన్లతో శ్రీవారిని దర్శించుకున్న సమయంలో ఆలయ అధికారులకు అనమానం రావటంతో, సదరు వ్యక్తిపై ఆరా తీయగా మొత్తం బండారం బయట పడింది. ఈ విషయంపై టీవీ యాజమాన్యానికి ఫిర్యాదు చేయగా.. తమ ఛానల్‌కు ఆ వ్యక్తితో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. దీంతో రంగంలోకి దిగిన టీటీడీ విజిలెన్స్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. కాగా, ఈ వ్యక్తి గతంలో కూడా నకిలీ గుర్తింపు కార్డు చూపించి అనేక అక్రమాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. -
కోటిస్తావా..? చస్తావా..?
సాక్షి, చెన్నైః అడ్డదారుల్లో అధిక ధనం సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.. ఇందుకోసం ఆయన ఏకంగా విలేకరి, పోలీస్ సబ్ఇన్స్పెక్టర్ అవతారాలు ఎత్తాడు. పేరొందిన బంగారు నగల దుకాణ యజమాని నుంచి కోటిరూపాయలు కాజేసే ప్రయత్నంలో తొమ్మిదిమంది ముఠా సభ్యలతో కలిసి కటకటాల పాలయ్యాడు. క్రైం సినిమాను తలపించేలా సాగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నై తిరువేర్కాడు, సుందరచోళపురం ఏళుమలైనగర్‌కు చెందిన ధనశేఖర్ (27). ఈయన ఈనెల 3వ తేదీన చెన్నై ఉస్మాన్‌రోడ్డులోని శరవణ గోల్డ్ షాప్ అనే బంగారునగల షోరూంలో పాత బంగారునాణాన్ని ఇచ్చి మూడు సవర్ల బంగారు గొలుసును తీసుకున్నాడు. తన వెంటనే ఒకరకం పౌడర్‌ను బంగారుగొలుసుకు పూసి ఇది నకిలీ బంగారంలా ఉందని సిబ్బందితో గొడవపెట్టుకున్నాడు. దీంతో షోరూంలో గందరగోళ పరిస్థితులు నెలకొనగా యజమాని శివ అరుల్‌దురై వచ్చి ధనశేఖర్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. తాను యూనివర్సల్ ప్రెస్ మీడియా వైస్ ప్రెసిడెంట్‌ను, మీ షోరూంలో నకిలీ నగలు అమ్ముతున్నారని మీడియాలో ప్రచారం చేసి పరువుతీస్తాను. దీంతో ఇక మీ దుకాణంలో ఎవ్వరూ నగలు కొనరని బెదిరించాడు. స్వాధీనం చేసుకున్న మారణాయుధాలు, నగదు వినియోగదారుల ముందు పరువుపోతుందని భయపడిన యజమాని ధనశేఖర్ డిమాండ్ మేరకు రూ.15 లక్షలు ఇచ్చి పంపివేశాడు. ఇదే అదనుగా షోరూం యజమాని నుంచి మరింత సొమ్ము గుంజాలని ఆశించిన ధనశేఖర్ రెండు కార్లలో 16 మంది స్నేహితులతో కలిసి బుధవారం సాయంత్రం మరలా అదే షోరూంకు చేరుకున్నాడు. శివ అరుళ్‌దురై చాంబర్‌కు వెళ్లి రూ.కోటి డిమాండ్ చేశాడు. మంచి బంగారు నగను నకిలీ అని ఆరోజు వినియోగదారుల ముందు గొడవ పెట్టుకోవడంతో రూ.15 లక్షలు ఇచ్చాను. మరలా ఒక్కపైసా కూడా ఇవ్వడం కుదరదని దుకాణ యజమాని తేల్చి చెప్పారు. ఈ సమాధానంతో ముఠా సభ్యులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. వీరిలో జీవా అనే వ్యక్తి ఏకంగా దుకాణ యజమానికి తుపాకీ గురిపెట్టి గొడవకు దిగాడు. యజమాని శివ అరుళ్‌దురై తెలివిగా తన సిబ్బందికి కనుసైగ చేసి పోలీసులకు సమాచారం ఇప్పించాడు. పోలీసులు బిలబిలమంటూ షోరూంలోకి ప్రవేశించగా వారంతా తప్పించుకునే ప్రయత్నం చేయడంతో సిబ్బంది చుట్టుముట్టారు. ఈక్రమంలో ఆరుగురు పారిపోగా పదిమంది పట్టుబడ్డారు. ధనశేఖర్ నుంచి అనేక మీడియా సంస్థలకు చెందిన నకిలీ గుర్తింపుకార్డులు, నకిలీ ఎస్ఐ గుర్తింపుకార్డును, అతని స్నేహితుల నుంచి మారణాయుధాలు, రూ. లక్ష నగదు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. -
నకిలీ విలేకరి అరెస్ట్
రాప్తాడు : ప్రముఖ దినపత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో విలేకరిగా పని చేస్తున్నానంటూ ఆర్ఎంపీ డాక్టర్లు, ప్రభుత్వ చౌకధాన్యపు డిపో డీలర్లు, మెడికల్ షాపులు, ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ విలేకరి దాలు సుబ్బరాయుడు అనే వ్యక్తిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు రాప్తాడు ఎస్ఐ ధరణిబాబు విలేకరులకు గురువారం తెలిపారు. కర్నూలులోని కొండారెడ్డి బురుజు ప్రాంతానికి చెందిన దాలు సుబ్బరాయుడు అలియాస్ ప్రవీణ్, రఫీ అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని మతాంతర వివాహం చేసుకుని ఐదేళ్ల కిందట అనంతపురానికి మకాం మార్చాడు. రాప్తాడు మండలం చిన్మయానగర్‌లోని అద్దె ఇంటిలో కాపురముంటూ నంబర్ వన్, టీవీ 5 చానళ్లలో కొంత కాలం పని చేశాడు. సుబ్బరాయుడు ప్రవర్తన సరిగా లేకపోవడంతో రెండు చానళ్ల వారు తొలగించారు. అప్పటి నుంచి మన తెలుగు చానల్, టీవీ 9 విలేకరి నంటూ ఆర్ఎంపీ, మెడికల్ షాపుల నిర్వాహకులను బెదిరించి, డబ్బులు వసూలు చేయడం ప్రారంభించాడు. మహిళ ఆర్ఎంపీ డాక్టర్‌ను బెదిరించి రూ.7 వేలు వసూలు చేశాడు. అనంతపురం గుల్జార్‌పేటలోని ఓ సెల్ దుకాణంలో సెల్ కొని డబ్బులు మళ్లీ ఇస్తానని ఊడాయించాడు. ఈ మధ్యనే చిన్మయానగర్‌లోని మెడికల్ షాపు నిర్వహిస్తున్న రఫీ దగ్గరకు వెళ్లి అనుమతులపై ఆరా తీసి బెదిరించాడు. తనకు రూ.25 వేలు ఇవ్వాలని, లేకుంటే డీఎంహెచ్ఓతో చెప్పి షాపు ఎత్తివేయిస్తానంటూ బెదిరించాడు. తన వద్ద అన్ని సర్టిఫికెట్లు ఉన్నాయంటూ రూ.4,700 ఇచ్చాడు. అనంతరం ఇదే విషయంపై ఎస్ఐ ధరణిబాబుకు ఆయన ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు కచ్చితమైన ఆధారాలతో నిందితుడు సుబ్బరాయుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
డబ్బు ఇవ్వకపోతే అంతు చూస్తా...
- నిమ్స్ వైద్యుడికి నకిలీ విలేకరి బెదిరింపులు - నిందితుడి అరెస్టు పంజగుట్ట : ‘నేను విలేకరిని, నాకు డబ్బు ఇవ్వకపోతే .. మా పత్రికలో నీకు వ్యతిరేకంగా వార్త రాసి నీ అంతు చూస్తా’ అంటూ బెదిరించి అడ్డంగా దొరికిపోయాడో నకిలీ విలేకరి. పంజగుట్ట పోలీసుల కథనం ప్రకారం ... దోమలగూడకు చెందిన మనోహర్ (40) రిపోర్టర్నని చెప్పుకుంటూ తిరుగుతుంటాడు. ఇతను శనివారం నిమ్స్ ఆసుపత్రి బ్లడ్‌బ్యాంక్ విభాగాధిపతి పాండురంగారావు వద్దకు వెళ్లి ‘నేరు యాంటీ కరప్షన్ పత్రిక విలేకరిని, నాకు వెయ్యి రూపాయలు కావాలి.. డబ్బు ఇవ్వకపోతే, నీకు వ్యతిరేకంగా మా పత్రికలో వార్త రాస్తానని బెదిరించాడు. తాను ఏ తప్పు చేయకపోయినా తను బెదిరిస్తుండటంతో సదరు డాక్టర్ అవాక్కయ్యాడు. వెంటనే పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు మనోహర్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను నకిలీ విలేకరని తేలింది. అతడి వద్ద విజ్ఞాన్, నందు టైమ్స్, జననేత, వాయిస్ ఆఫ్ తెలంగాణ, ఎవరెస్ట్ న్యూస్ అనే పేర్లతో ఉన్న ఏడు గుర్తింపు కార్డులు దొరికాయి. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు మనోహర్‌ను రిమాండ్‌కు తరలించారు.