మనోహార్
- నిమ్స్ వైద్యుడికి నకిలీ విలేకరి బెదిరింపులు
- నిందితుడి అరెస్టు
పంజగుట్ట : ‘నేను విలేకరిని, నాకు డబ్బు ఇవ్వకపోతే .. మా పత్రికలో నీకు వ్యతిరేకంగా వార్త రాసి నీ అంతు చూస్తా’ అంటూ బెదిరించి అడ్డంగా దొరికిపోయాడో నకిలీ విలేకరి. పంజగుట్ట పోలీసుల కథనం ప్రకారం ... దోమలగూడకు చెందిన మనోహర్ (40) రిపోర్టర్‌నని చెప్పుకుంటూ తిరుగుతుంటాడు. ఇతను శనివారం నిమ్స్ ఆసుపత్రి బ్లడ్‌బ్యాంక్ విభాగాధిపతి పాండురంగారావు వద్దకు వెళ్లి ‘నేరు యాంటీ కరప్షన్ పత్రిక విలేకరిని, నాకు వెయ్యి రూపాయలు కావాలి.. డబ్బు ఇవ్వకపోతే, నీకు వ్యతిరేకంగా మా పత్రికలో వార్త రాస్తానని బెదిరించాడు.
తాను ఏ తప్పు చేయకపోయినా తను బెదిరిస్తుండటంతో సదరు డాక్టర్ అవాక్కయ్యాడు. వెంటనే పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు మనోహర్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను నకిలీ విలేకరని తేలింది. అతడి వద్ద విజ్ఞాన్, నందు టైమ్స్, జననేత, వాయిస్ ఆఫ్ తెలంగాణ, ఎవరెస్ట్ న్యూస్ అనే పేర్లతో ఉన్న ఏడు గుర్తింపు కార్డులు దొరికాయి. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు మనోహర్‌ను రిమాండ్‌కు తరలించారు.