
పోలీసుల అదుపులో నిందితులు
సాక్షి, చెన్నైః అడ్డదారుల్లో అధిక ధనం సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.. ఇందుకోసం ఆయన ఏకంగా విలేకరి, పోలీస్ సబ్‌ఇన్‌స్పెక్టర్ అవతారాలు ఎత్తాడు. పేరొందిన బంగారు నగల దుకాణ యజమాని నుంచి కోటిరూపాయలు కాజేసే ప్రయత్నంలో తొమ్మిదిమంది ముఠా సభ్యలతో కలిసి కటకటాల పాలయ్యాడు. క్రైం సినిమాను తలపించేలా సాగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నై తిరువేర్కాడు, సుందరచోళపురం ఏళుమలైనగర్‌కు చెందిన ధనశేఖర్ (27). ఈయన ఈనెల 3వ తేదీన చెన్నై ఉస్మాన్‌రోడ్డులోని శరవణ గోల్డ్ షాప్ అనే బంగారునగల షోరూంలో పాత బంగారునాణాన్ని ఇచ్చి మూడు సవర్ల బంగారు గొలుసును తీసుకున్నాడు. తన వెంటనే ఒకరకం పౌడర్‌ను బంగారుగొలుసుకు పూసి ఇది నకిలీ బంగారంలా ఉందని సిబ్బందితో గొడవపెట్టుకున్నాడు. దీంతో షోరూంలో గందరగోళ పరిస్థితులు నెలకొనగా యజమాని శివ అరుల్‌దురై వచ్చి ధనశేఖర్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. తాను యూనివర్సల్ ప్రెస్ మీడియా వైస్ ప్రెసిడెంట్‌ను, మీ షోరూంలో నకిలీ నగలు అమ్ముతున్నారని మీడియాలో ప్రచారం చేసి పరువుతీస్తాను. దీంతో ఇక మీ దుకాణంలో ఎవ్వరూ నగలు కొనరని బెదిరించాడు.
స్వాధీనం చేసుకున్న మారణాయుధాలు, నగదు
వినియోగదారుల ముందు పరువుపోతుందని భయపడిన యజమాని ధనశేఖర్ డిమాండ్ మేరకు రూ.15 లక్షలు ఇచ్చి పంపివేశాడు. ఇదే అదనుగా షోరూం యజమాని నుంచి మరింత సొమ్ము గుంజాలని ఆశించిన ధనశేఖర్ రెండు కార్లలో 16 మంది స్నేహితులతో కలిసి బుధవారం సాయంత్రం మరలా అదే షోరూంకు చేరుకున్నాడు. శివ అరుళ్‌దురై చాంబర్‌కు వెళ్లి రూ.కోటి డిమాండ్ చేశాడు. మంచి బంగారు నగను నకిలీ అని ఆరోజు వినియోగదారుల ముందు గొడవ పెట్టుకోవడంతో రూ.15 లక్షలు ఇచ్చాను. మరలా ఒక్కపైసా కూడా ఇవ్వడం కుదరదని దుకాణ యజమాని తేల్చి చెప్పారు. ఈ సమాధానంతో ముఠా సభ్యులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. వీరిలో జీవా అనే వ్యక్తి ఏకంగా దుకాణ యజమానికి తుపాకీ గురిపెట్టి గొడవకు దిగాడు. యజమాని శివ అరుళ్‌దురై తెలివిగా తన సిబ్బందికి కనుసైగ చేసి పోలీసులకు సమాచారం ఇప్పించాడు. పోలీసులు బిలబిలమంటూ షోరూంలోకి ప్రవేశించగా వారంతా తప్పించుకునే ప్రయత్నం చేయడంతో సిబ్బంది చుట్టుముట్టారు. ఈక్రమంలో ఆరుగురు పారిపోగా పదిమంది పట్టుబడ్డారు. ధనశేఖర్ నుంచి అనేక మీడియా సంస్థలకు చెందిన నకిలీ గుర్తింపుకార్డులు, నకిలీ ఎస్‌ఐ గుర్తింపుకార్డును, అతని స్నేహితుల నుంచి మారణాయుధాలు, రూ. లక్ష నగదు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు.