Fake medical bills
-
కుక్క కరిస్తే.. కేన్సర్ అంటూ బిల్లులు!
కుక్క కరిచినందుకు ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుని.. దానికి ఏకంగా కేన్సర్ చికిత్స పొందినట్లుగా బిల్లులు పెట్టారు. మంచి ఆరోగ్యంగా ఉన్నవాళ్లు కూడా గుండె ఆపరేషన్లు చేయించుకున్నట్లు చూపించారు. ఇలాంటి ఘనుల్లో నలుగురిని కర్ణాటక సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి డబ్బులు పొందేందుకు ఇలా నకిలీ బిల్లులు పెట్టిన స్కాంను వాళ్లు ఛేదించారు. దాదాపు వంద వరకు ఫోర్జరీ బిల్లులు పెట్టి.. ఏకంగా రూ. 3 కోట్ల మొత్తాన్ని నొక్కేసినట్లు పోలీసులు కనుగొన్నారు. బెంగళూరులోని 30 ప్రముఖ ఆస్పత్రులలో ఈ వ్యవహారం జరిగిందని, ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది, ఆస్పత్రుల పాత్ర కూడా ఉన్నట్లు తాము అనుమానిస్తున్నామని సీఐడీ అధికారి ఒకరు చెప్పారు. ప్రస్తుతానికి ఈ కుంభకోణం విలువ రూ. 3 కోట్లేనని అనుకుంటున్నా, ఇది మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఒకటి రెండు రోజుల్లో ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బందిని విచారిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి కొన్ని బిల్లుల్లో తేడాలు గమనించి.. దానిపై విధానసభ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ కేసును సీఐడీకి బదిలీ చేయగా మొత్తం డొంకంతా కదిలింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా దీనిపై 54 కేసులు నమోదయ్యాయి. అమొగప్ప తిప్పన్న మొరటగి, సిఎం నాగరాజ శెట్టి, ఎంకే కిరణ్ కరియప్ప, శంకర్ సిద్దశెట్టి అనే నలుగురిని ఇప్పటివరకు అరెస్టు చేశారు. వీరిలో లమొగప్ప అనే వ్యక్తి వేర్వేరు పేషెంట్ల పేరుతో ఏకంగా 75 బిల్లులు పెట్టాడని తేలింది. సాధారణంగా మంత్రి గానీ, ఎమ్మెల్యే గానీ రికమండ్ చేస్తేనే లబ్ధిదారులకు నిధులు విడుదల చేస్తారు. ఈ కేసుల్లో కాంగ్రెస్, బీజేపీ, జేడీ(ఎస్) ఎమ్మెల్యేలు సంతకాలు చేశారని, వాళ్లకు అసలు ఈ విషయం తెలుసో లేదో తమకు తెలియదని సీఐడీ వర్గాలు తెలిపాయి. -
సీఎంఆర్ఎఫ్ స్కాంపై దర్యాప్తు ముమ్మరం
123 మందిని నిందితులుగా గుర్తించిన సీఐడీ 10 మందిని అరెస్టు చేసిన అధికారులు 56 ఆసుపత్రుల్లో రూ. 75 లక్షలు స్వాహా చేసినట్లు నిర్ధారణ దర్యాప్తు నివేదిక సీఎం కేసీఆర్‌కు సమర్పణట హైదరాబాద్: ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి చెల్లింపుల్లో బయటపడిన నకిలీ వైద్య బిల్లుల కుంభకోణంపై నేర విచారణ విభాగం(సీఐడీ) వేగం పెంచింది. వైద్య చికిత్సలు చేసుకోకుండానే నకిలీ బిల్లులు సృష్టించి రూ.లక్షలు కొల్లగొట్టిన వారికి ఉచ్చు బిగిస్తోంది. తొలి విడత దర్యాప్తులో భాగంగా 56 ఆస్పత్రుల్లోని రికార్డులను పరిశీలించి లబ్ధిదారులను ప్రశ్నించిన సీఐడీ... రూ.75 లక్షలు పక్కదారి పట్టినట్లు గుర్తించింది. ఈ కుంభకోణంలో 123 మందిని నిందితులుగా గుర్తించి 10 మందిని అరెస్టు చేసింది. మరికొంత మందిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలతో గాలిస్తోంది. బ్రోకర్లు, ఆస్పత్రుల సిబ్బంది, ఆరోగ్య మిత్రుల కుమ్మక్కు...: గతేడాది జనవరిలో సీఎంఆర్ఎఫ్ చెల్లింపులు పక్కదారి పడుతున్నట్లు గుర్తించిన అధికారులు తొలుత అనుమానంతో 18 రోగుల ఫైళ్లపై శాఖాపరమైన విచారణ చేపట్టగా అందులో నాలుగు నకిలీ బిల్లులున్నట్లు బయటపడింది. ఈ ఉదంతంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి గతేడాది జనవరి 30న సీఐడీ విచారణకు ఆదేశించడంతో రంగంలోకి దిగిన అధికారులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి మంజూరు చేసిన బిల్లులన్నింటిపై విచారణ చేపట్టారు. దాదాపు 12 వేల దరఖాస్తుదారులు 600 ఆస్పత్రులకు చెల్లించిన చెక్కులు, రోగుల రికార్డులను పరిశీలించింది. సీఎంఆర్ఎఫ్ సొమ్ము కొల్లగొట్టేందుకు పక్కా ప్రణాళిక ప్రకారం కుట్ర జరిగినట్లు సీఐడీ నిర్ధారించింది. నకిలీ వైద్య బిల్లులు సృష్టించేందుకు బ్రోకర్లు, హాస్పిటల్ బిల్ డెస్క్ సిబ్బంది, ఆరోగ్య మిత్రలు కుమ్మక్కైనట్లు దర్యాప్తులో తేల్చింది. ఇందులో ఇద్దరు సీఎంఆర్ఎఫ్ ఉద్యోగుల ప్రమేయం సైతం ఉన్నట్లు సీఐడీ గుర్తించింది. ‘పని’ పూర్తయ్యాక అందరూ పక్కాగా వాటాలు పంచుకున్నారని...నిందితులు కొన్ని సందర్భాలలో నకిలీ బిల్లులతో ఆరోగ్యశ్రీ కింద రీయింబర్స్‌మెంట్‌కు, సీఎంఆర్ఎఫ్ కింద ఆర్థిక సాయానికి దరఖాస్తులు పెట్టి నిధులు కాజేశారని కనుగొంది. అలాగే చికిత్సలతో సంబంధం లేకుండా హాస్పిటల్ బిల్ డెస్క్ సిబ్బంది ప్రమేయంతో వ్యక్తుల పేర్ల మీద నకిలీ బిల్లులు సృష్టించి ఆరోగ్య మిత్రల సాయంతో బ్రోకర్లు దరఖాస్తు చేసుకొని సీఎంఆర్ఎఫ్ ఆర్థిక సాయాన్ని మెక్కేశారని... కొన్ని కేసుల్లో చికిత్స చేయించుకున్న రోగులకు రూ. వేలల్లో అయిన బిల్లులను రూ. లక్షల్లోకి మార్చి డబ్బులు నొక్కేసినట్లు సీఐడీ గుర్తించింది. ఈ కుంభకోణంపై ఇప్పటివరకు చేపట్టిన దర్యాప్తు వివరాల నివేదికను సీఐడీ సీఎం కేసీఆర్‌కు సమర్పించింది.