Family strifes
-
కుటుంబ కలహాలతో దావూద్ సతమతం!
ఠాణే: అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కస్కర్ ప్రస్తుతం కుటుంబ కలహాలతో సతమతమవుతున్నట్లు మహారాష్ట్రలోని ఠాణేలో ఉన్న బలవంతపు వసూళ్ల నిరోధక విభాగం (ఏఈసీ) అధికారులు ఇటీవల వెల్లడించారు. దావూద్ మూడో సంతానం, ఏకైక కొడుకైన మొయిన్ నవాజ్ కస్కర్ తన తండ్రి అక్రమ వ్యాపారాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడట. ఆ వ్యాపారాలను చూసుకునేందుకు నవాజ్ నిరాకరిస్తుండటం దావూద్‌కు మింగుడుపడటం లేదట. దావూద్ తమ్ముడు ఇబ్రహీంను ఏఈసీ అధికారులు గత సెప్టెంబరులో పట్టుకుని కస్టడీలో ఉంచి విచారిస్తున్నారు. దావూద్ కుటుంబ విషయాల గురించి విచారణలో ఇబ్రహీం పలు విషయాలు బయటపెట్టినట్లు అధికారులు వెల్లడించారు. మత ప్రబోధకుడిగా మారాలనుకుంటున్న నవాజ్... కుటుంబ సభ్యుల మాటలు అసలు వినడం లేదట. దీంతోపాటు దావూద్‌కు మరికొన్ని కుటుంబ సమస్యలు కూడా ఉన్నట్లు విచారణలో తెలిసిందని అధికారులు చెబుతున్నారు. -
రైలు కింద పడి ఏఎస్సై ఆత్మహత్య
కడప : వైఎస్సార్ జిల్లాలో ఓ ఏఎస్సై ఆత్మహత్యకు పాల్పడ్డారు. కడప నగరం 11వ బెటాలియన్‌లో ఏఎస్సైగా పనిచేస్తున్న గురునాథ్(54) ఆదివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు నగరంలో ఆరా తీసినా ఫలితం లేకుండా పోయింది. సోమవారం మధ్యాహ్నం ఎర్రముక్కలపల్లె రైల్వే స్టేషన్ వద్ద పట్టాలపై గుర్తు తెలియని మృతదేహం పడి ఉండగా స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైల్వే పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి ఆధారాల సాయంతో గురునాథ్‌గా గుర్తించారు. ఈ మేరకు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. భార్య, పిల్లలు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని గుర్తించారు. ఆయన మృతికి కారణాలు తెలియదని కుటుంబసభ్యులు తెలిపారు. గురునాథ్‌కు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నిజామాబాద్‌లో దంపతుల దారుణ హత్య
-
నిజామాబాద్‌లో దంపతుల దారుణ హత్య
నిజామాబాద్ : నిజామాబాద్ పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. స్థానిక హైమద్‌పూర కాలనీలో నిర్మాణంలో ఉన్న భవనం వద్ద వాచ్‌మెన్‌గా పని చేస్తున్న దంపతులను గుర్తుతెలియని దుండగులు కిరాతకంగా హతమర్చారు. గత కొంతకాలంగా వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న మైసయ్య(57), లక్ష్మీ(48)లను గుర్తుతెలియని దుండుగులు శనివారం రాత్రి హత్యచేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. మైసయ్య భార్య చెన్నమ్మ చాలా ఏళ్ల క్రితం మృతిచెందడంతో.. భార్య చెల్లెలైన పాపమ్మను వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. గత కొంత కాలంగా పాపమ్మను వదిలేసి లక్ష్మీతో కలిసి ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో కుటుంబసభ్యుల మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. తాజాగా శనివారం రాత్రి కూడా మైసయ్య కొడుకు, కూతురు హైమద్‌పూరకు వచ్చి అతనితో వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలోనే దంపతుల హత్య జరిగిందనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. -
'కుటుంబ కలహాలతోనే రైతుల ఆత్మహత్యలు'
తూర్పుగోదావరి(మలికిపురం): తమ ప్రభుత్వం వచ్చాక రాష్ర్టంలో అప్పులు, పంట నష్టాల వల్ల ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఆయన మాట్లాడుతూ...కొందరు రైతులు కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్యలకు పాల్పడితే, వారు సాగు అప్పుల కారణంగా చనిపోయినట్టు చిత్రిస్తున్నారని ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా మలికిపురంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్నరైతు భరోసా యాత్రవల్ల రైతులకు ఒరిగేదేమీ ఉండదన్నారు. విభజన చట్టంలో హామీ ఇచ్చినట్టుగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందిగా కేంద్రంతో పోరాడుతామని రాజప్ప అన్నారు. ప్రత్యేక హోదా కోసం అసెంబ్లీలో అన్ని పార్టీలూ తీర్మానం చేయాల్సి ఉందని, అలాగే ఇతర రాష్ట్రాల మద్దతు కూడా అవసరమని చెప్పారు. ప్రత్యేక హోదా ఇవ్వకున్నా, కేంద్రం ఎక్కువ నిధులు ఇస్తే అభివృద్ధి సాధ్యపడుతుందని చినరాజప్ప చెప్పారు.