
ఠాణే: అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కస్కర్ ప్రస్తుతం కుటుంబ కలహాలతో సతమతమవుతున్నట్లు మహారాష్ట్రలోని ఠాణేలో ఉన్న బలవంతపు వసూళ్ల నిరోధక విభాగం (ఏఈసీ) అధికారులు ఇటీవల వెల్లడించారు. దావూద్ మూడో సంతానం, ఏకైక కొడుకైన మొయిన్ నవాజ్ కస్కర్ తన తండ్రి అక్రమ వ్యాపారాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడట. ఆ వ్యాపారాలను చూసుకునేందుకు నవాజ్ నిరాకరిస్తుండటం దావూద్‌కు మింగుడుపడటం లేదట.
దావూద్ తమ్ముడు ఇబ్రహీంను ఏఈసీ అధికారులు గత సెప్టెంబరులో పట్టుకుని కస్టడీలో ఉంచి విచారిస్తున్నారు. దావూద్ కుటుంబ విషయాల గురించి విచారణలో ఇబ్రహీం పలు విషయాలు బయటపెట్టినట్లు అధికారులు వెల్లడించారు. మత ప్రబోధకుడిగా మారాలనుకుంటున్న నవాజ్... కుటుంబ సభ్యుల మాటలు అసలు వినడం లేదట. దీంతోపాటు దావూద్‌కు మరికొన్ని కుటుంబ సమస్యలు కూడా ఉన్నట్లు విచారణలో తెలిసిందని అధికారులు చెబుతున్నారు.