farmers passbooks
-
ఎదురుచూపులే..
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో ఖరీఫ్ సీజన్ పూర్తి కావచ్చింది. నవంబర్ నుంచి యాసంగి సాగు పనులు జోరందుకోనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రైతుబంధు పథకం కింద అందించే పెట్టుబడి సాయం కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం రెండవ విడత రైతుబంధు చెక్కుల పంపిణీని ఈ నెలలోనే చేపట్టాలని అంతా సిద్ధం చేసింది. అయితే ముందస్తు అసెంబ్లీఎన్నిల షెడ్యూల్ వెలువడడంతో కేంద్ర ఎన్నికల సంఘం రైతుబంధు చెక్కుల పంపిణీకి నిలిపివేసింది. ఈ పథకం కింద అర్హులైన రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయాలని ఆదేశించింది. దీంతో ఎకరాకు రూ.4వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు వ్యవసాయ అధికారులు బ్యాంకు ఖాతాలు, ఇతర వివరాలు సేకరిస్తున్నారు. రెండవ విడతలో మొత్తం అర్హులైన రైతులు 1,16,557 మందికి గాను రూ.166.80 కోట్లు వరకు అందాల్సి ఉంది. ఇప్పటివరకు 65,220 మంది ఖాతాల వివరాలు తీసుకోగా, ఇందులో 51,337 మంది రైతుల వివరాలు ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. ఇందులో 13,400 మంది రైతుల ఖాతాల్లో రూ.14 కోట్ల వరకు నగదు పడినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ నెలాఖరు వరకు ఖాతాల వివరాలు సేరించనున్నట్లు వ్యవసాయ అధికారులు తెలుపుతున్నారు. మొదట ఈనెల 25వ తేదీ వరకు గడువు విధించగా, గత పదిహేను రోజులుగా మండల వ్యవసాయ కార్యాలయ వద్ద రైతుల సందడి నెలకొంది. పూర్తి స్థాయిలో రైతులు ఖాతా వివరాలు అందజేయకపోవడంతో మరో వారం రోజులు గడువు పెంచారు. కోటపల్లి, తాండూర్, దండేపల్లి, జన్నారం మండలాల్లో 80 శాతం వివరాలు సేకరించారు. మిగతా మండలాల్లో 50 నుంచి 70 శాతం పూర్తయ్యింది. రైతుల ఇంటి వద్దకు వెళ్లి వివరాలు సేకరించాల్సి ఉండగా, వ్యవసాయ అధికారులు కార్యాలయాల్లో కూర్చొని పని కానిస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉండడంతో రైతులు సమయానికి కార్యాలయాలకు వచ్చి వివరాలు అందించలేకపోతున్నారు. దీనికి తోడు సేకరించిన రైతుల వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయడంతో కొంత వరకు సాంకేతిక సమస్యలు వస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. పెంచిన గడువులోగా అయినా పూర్తిస్థాయిలో రైతుల ఖాతాల వివరాలు తీసుకుంటే నగదు జమ అయ్యే అవకాశం ఉంటుంది. మొదటి విడత రైతులకే.. గత ఖరీఫ్‌లో రైతుబంధు చెక్కులు పొందిన రైతులకే రెండవ విడత యాసంగి పెట్టుబడి సాయం అందుతుంది. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో రెండవ విడత చెక్కులు పంపిణీ చేయకుండా మొదటి విడత చెక్కులు తీసుకున్న రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. వ్యవసాయ అధికారులు ఈ నెల 10వ తేదీ నుంచి రైతుల ఖాతాల వివరాలు సేకరణ పనిలో పడ్డారు. ఖాతాలో ఆప్‌లోడ్ అయిన కొద్ది రోజులకు రైతుల సెల్‌కు ఖాతాలో నగదు జమ అయినట్లు మెసేజ్ వస్తోంది. అయితే ఇప్పటివరకు సాయం పొందాల్సిన రైతులకు సంబంధించిన ఖాతాల దరఖాస్తులు 65 శాతం రాగా.. ఇందులో 52 శాతం ఆన్లైన్లో అప్లోడ్ అయినట్లు అధికారులు పేర్కొంటున్నారు. రైతులు సహకరిస్తే పెట్టుబడి సాయం పూర్తిస్థాయిలో అందేందుకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడే ఆస్కారం లేదని వ్యవసాయ అధికారులు అంటున్నారు. నెలాఖరు వరకు గడువు : వీరయ్య, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రైతుల వివరాల సేకణరకు తొలుత ఈ నెల 25వ తేదీ వరకు ప్రభుత్వం గడువు విధించింది. వివరాల సేకరణలో ఆలస్యం కావడంతో గడువును నెలాఖరు వరకు పెంచడం జరిగింది. రైతులు ఆలస్యం చేయకుండా ఖాతాల వివరాలు అందజేస్తే సత్వరమే ఆన్లైన్లో అప్లోడ్ చేస్తాం. ఇప్పటివరకు 80 వేల మంది రైతుల వరకు ఖాతాల వివరాలు సేకరించాం. ఇందులో 62వేల మంది రైతుల వివరాలను ఆన్లైన్లో ఆప్‌లోడ్ చేశాం. జిల్లాలో ఇప్పటివరకు రూ.14 కోట్ల వరకు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. -
రైతుపై వీఆర్వో దాడి
సాక్షి, తొర్రూరు(పాలకుర్తి): పాస్‌పుస్తకం కోసం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన ఓ రైతుపై వీఆర్వో దాడికి పాల్పడిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... మహబూ బాబాద్ జిల్లా తొర్రూరు మండలం పత్తేపురం గ్రామానికి చెందిన ఆర్టీసీ కండక్టర్, రైతు లక్ష్మారెడ్డి, అదే గ్రామానికి చెందిన అతడి మేనత్త తలాసాలి పుషమ్మ తమకు ఉన్న వ్యవసాయ భూమిని రికార్డుల్లో ఎక్కించి పాస్ పుస్తకాలు ఇవ్వాలని కోరుతూ నాలుగేళ్లుగా వీఆర్వో ఉప్పలయ్య చుట్టూ తిరుగుతున్నారు. ఇందుకు డబ్బులు ఇవ్వాలని చెప్పగా, వారు కొద్ది నెలల క్రితం రూ.10వేలు ఇచ్చారు. అయినా భూమిని రికార్డుల్లోకి ఎక్కించడంలేదు. పాస్‌పుస్తకం జారీ చేయ డం లేదు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం లక్ష్మారెడ్డి వీఆర్వోను తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్రశ్నించాడు. మరో రూ.10వేలు ఇస్తేనే పాస్‌పుస్తకాలు జారీ చేస్తానని నిర్లక్ష్యంగా చెప్పి వెళ్లిపోతున్నాడు. తాను అడుగుతుంటే సరైన సమాధానం చెప్పకుండా వెళ్తున్నావేమిటని వీఆర్వోను లక్ష్మారెడ్డి నిలదీశాడు. దీంతో ఆగ్రహించిన వీఆర్వో లక్ష్మారెడ్డితో వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య గొడవ పెరిగి వీఆర్వో ఉప్పలయ్య లక్ష్మారెడ్డిపై చేయి చేసుకున్నాడు. అక్కడే ఉన్న స్థానికులు, రెవెన్యూ సిబ్బంది అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీస్ సిబ్బంది చేరుకుని శాంతింపజేశారు. పురుగుల మందు డబ్బాతో రైతు నిరసన భూపాలపల్లి: వీఆర్వో తనకు అన్యాయం చేశాడని ఆరోపిస్తూ ఓ రైతు ఆర్డీఓ కార్యాలయం ఎదుట శుక్రవారం క్రిమిసంహారక మందు డబ్బాతో నిరసన వ్యక్తం చేశాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం శంకరంపల్లి గ్రామానికి చెందిన పోత శ్రావణ్‌కు ధన్వాడ శివారులోని సర్వే నంబర్ 236/ఏలో 18 గుంటలు, సర్వే నంబర్ 235లో 2.11 ఎకరాల భూమి, సర్వే నంబర్ 326లో 2.22 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిలో 60 ఏళ్లుగా తాత, తండ్రి, ప్రస్తుతం తాను వ్యవసాయం చేశామని తెలిపాడు. కాగా వీఆర్వో రాజయ్య తనకు తెలియకుండా ఆ భూమిని వేరే ముగ్గురి పేర పట్టా చేశాడని ఆరోపించాడు. ఈ విషయమై వీఆర్వోను అడగ్గా సమస్యను పరిష్కరించకపోగా, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ బెదిరింపులకు గురిచేస్తున్నాడని తెలిపాడు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి తన భూమిని తనపై పట్టా చేయాలని, లేని పక్షంలో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని పట్టుబట్టాడు. ఆర్డీఓ కార్యాలయంలోని సిబ్బంది వచ్చి ఆర్డీఓ వచ్చాక సమస్యను విన్నవించాలని చెప్పి, క్రిమిసంహార మందు డబ్బాను లాక్కున్నారు. -
అంతు లేని నిర్లక్ష్యం!
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : భూప్రక్షాళన ఫలితాలు పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం రైతుల పాలిట శాపంగా మారింది. చేసిన తప్పులు సరిదిద్దుకోలేని రెవెన్యూ ఉద్యోగులు.. మరో పక్క కాసుల కోసం రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఒంట్లో సత్తువ లేక, అయినవారు ఎవరూ తోడు లేని అభాగ్యులు, రెక్కాడితే డొక్కాడని నిరుపేదలను సైతం వదలకుండా డబ్బుల కోసం పీడిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు... అంతులేని పొరపాట్లు చేసి, పాస్‌పుస్తకంలో సవరణచేయాలన్నా.. పుస్తకం ఇవ్వాలన్నా చేయి తడపాల్సిందేనని డిమాండ్ చేస్తూ కర్షకుల కన్నీటికి కారణమవుతున్నారు. రైతుల అవసరాలను ఆసరా చేసుకుని అందినకాడికి దోచుకుంటున్నారనే విమర్శలున్నాయి. అవసరాలు తీరక... పెట్టుబడికి అవసరమైన అప్పు కోసమే.. లేక లేక అమ్ముకుని అవసరాలు తీర్చుకునేందుకు భూమే ఆధారంగా ఉన్న రైతులకు భూప్రక్షాళన ఇబ్బందులను తెచ్చిపెట్టింది. నిత్యం వందలాది మంది పాస్‌పుస్తకాల కోసం తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గత సంవత్సరం వరకు చేతులో పట్టాదారు పాసుపుస్తకాలున్న చాలా మంది రైతులకు ఇప్పుడు కొత్త పాస్‌పుస్తకాలు అందలేదు. దీంతోబ్యాంకు రుణాలు దేవుడెరుగు... ప్రైవేట్ అప్పులూ పుట్టడం లేదు. అంతంత మాత్రంగా ఉన్న పంటలను రక్షించుకోవడానికి చేతిలో చిల్లిగవ్వ లేని రైతులు రుణం కోసం బ్యాంకులకు వెళ్లగా బ్యాంకర్లు మొండిచేయి చూపుతున్నారు. శాపంగా భూప్రక్షాళన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూప్రక్షాళనలో చోటు చేసుకున్న తప్పులు రైతుల పాలిట శాపంగా పరిణమించాయి. తప్పొప్పుల సవరణకు ప్రభుత్వం గడువు ఇచ్చినా అధికారులు నిర్ణీత సమయంలోగా పూర్తి చేయకపోవడంతో పట్టాదారు పాస్‌పుస్తకాలు చేతికి రాకపోగా రైతుబంధు పథకానికీ దూరమవుతున్నారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన పట్టాదారు పాస్‌పుస్తకాల్లో తప్పులు దొర్లిన వారితో పాటు పార్ట్–బీ(వివాదాస్పదమైనవి)లో ఉన్న భూముల విషయం ఇంకా ఓ కొలిక్కిరాలేదు. భూరిజిస్ట్రేషన్లు, ముటేషన్ల సేవలను ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు ప్రభుత్వం భూప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టగా ఆశించిన ఫలితాలు రాలేదు. రికార్డుల ప్యూరిఫికేషన్ అనంతరం వివరాలను ఆన్లైన్లో నిక్షిప్తం చేశారు. ఈ సందర్బంగా చోటు చేసుకున్న తప్పులను సవరించే ప్రక్రియ నేటికీ పూర్తి కాకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఎన్నికల విధుల్లోకి ముందస్తు ఎన్నికల నేపథ్యంలో సాధారణ విధులకు దూరమైన అధికారుల తీరుతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూప్రక్షాళన కార్యక్రమాన్ని సగంలోనే వదిలి అధికార యంత్రాంగం ఎన్నికల విధుల్లో నిమగ్నమైంది. పట్టాదారు పాస్‌పుస్తకాల కోసం తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్తున్న రైతులకు ‘ఎన్నికల ఏర్పాట్లలో ఉన్నాం.. ఆగాల్సిందే’ అన్న సమాదానం వస్తుండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం కలెక్టర్ కార్యాలయానికి పట్టాదారు పాస్పుస్తకాలిప్పించాలని కోరుతున్నారు. ఇదే క్రమంలో సోమవారం దేవరకద్ర, అడ్డాకులల్లో ఆందోళన చేసిన రైతులు మంగళవారం హన్వాడ, మద్దూరులో నిరసన తెలిపారు. జేబు నింపితేనే.... వీఆర్వో లేరు, తహసీల్దార్ సమావేశంలో ఉన్నారు... మ ళ్లీ రండనే సమాధానాలతో పాస్‌పుస్తకాలకోసం వెళ్లిన రై తులు నిత్యం ఎదుర్కొంటున్నారు. అయితే, అక్కడ అడిగినంత ముట్టజెప్పితే మాత్రం పాస్‌పుస్తకం వెంటనే చే తికి వస్తోందని పలువురు పేర్కొంటుండడం గమనార్హం. ముడుపు ముట్టజెప్పుకోకపోతే పాస్‌పుస్తకం ఊసెత్తడం లేదని రైతులు బహిరంగంగా పేర్కొంటున్నారు. జిల్లాలో 35,885 సవరణలు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూప్రక్షాళన కార్యక్రమంలో రికార్డుల ప్యూరిఫికేషన్ నిర్వహించిన అనంతరం కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సమయంలో పాస్‌పుస్తకాల్లో విపరీతంగా తప్పులు దొర్లడంతో సరిచేసి ఇస్తామని రైతుల నుండి పాస్‌బుక్‌లు, చెక్కులు తిరిగి తీసుకున్నారు. ఇలా జిల్లాలో 35,885 తప్పులను గుర్తించారు. అనంతరం పాస్‌పుస్తకాల్లో దొర్లిన తప్పులు సరిచేయక, చెక్కులు, పాస్‌బుక్కులు అందజేయకపోవడంతో రైతులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టు తిరుగుతున్నారు. -
పాసుబుక్కు అడిగితే కొట్టాడు..
పెబ్బేరు: పట్టాదారు పాసుబుక్కు అడిగిన పాపానికి రైతుపై వీఆర్వో దాడి చేసిన ఘటన ఇది. వనపర్తి జిల్లా పెబ్బేరు మండల పరిధిలో జనుంపల్లి గ్రామానికి చెందిన రైతు మన్నెపురెడ్డికి అదే గ్రామ శివార్లలో 4.34 ఎకరాల భూమి ఉంది. దీనికి సంబంధించి పట్టాదార్ పాస్బుక్కు ఇచ్చేందుకు వీఆర్వో ఎం.కృష్ణయ్య కొన్నిరోజులుగా సతాయిస్తున్నాడని రైతు ఆరోపణ. గురువారం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన మున్నెపురెడ్డి ఉప తహసీల్దార్ ఎదుట వీఆర్వోను పాసుబుక్కు ఇవ్వాలని కోరగా.. ‘మాకేం పనిలేదా? ఎపుడూ మీ పనేనా?’అని గదమాయిస్తూ రైతు భుజంపై గట్టిగా కొట్టాడు. ఉప తహసీల్దార్ ఆశోక్‌కుమార్ జోక్యం చేసుకుని మన్నెపురెడ్డిని కాపాడారు. అనంతరం ఈ ఘటనపై మున్నెపురెడ్డి తహసీల్దార్ శ్రీనివాసులుకు ఫిర్యాదు చేయగా విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. వీఆర్వో డబ్బులకోసం డిమాండ్ చేయగా తాను నిరాకరించానని మున్నెపురెడ్డి ఆరోపించారు. అందుకే పాస్‌బుక్ ఇవ్వడంలో జాప్యం చేయడమే కాకుండా దాడి చేశారని అన్నారు. -
కాసులిస్తే రైట్.. లేదంటే రిజెక్ట్!
► చెత్తబుట్టపాలవుతున్న మ్యుటేషన్ అర్జీలు ► పాసు పుస్తకాల వినతులదీ అదే దుస్థితి ► 35 శాతం దరఖాస్తుల తిరస్కరణ ► రూ.పది వేలిస్తేనే పాసు పుస్తకం జారీ ► రెవెన్యూలో కొనసాగుతున్న అవినీతిపర్వం.. ► పట్టించుకోని ప్రభుత్వం.. ► రైతులకు తీవ్ర ఇబ్బందులు హైదరాబాద్: చిత్తూరు జిల్లా బి.కొత్తకోటకు చెందిన ఓ రైతు తన పట్టాదారు పాసు పుస్తకంలో ఉన్నభూమిని వెబ్‌ల్యాండ్‌లో ఎక్కించాలంటూ (మ్యుటేషన్ కోసం) ‘మీసేవ’ కేంద్రంలో రూ.285 రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకున్నాడు. భూమి విస్తీర్ణంలో తేడా ఉందంటూ రెవెన్యూ అధికారులు దాన్ని తిరస్కరించి చెత్తబుట్టలో పడేశారు. విజయనగరం జిల్లా ఎస్.కోటకు చెందిన ఒకరు 2001లో ఐదెకరాల భూమిని కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ప్రవాస భారతీయుడైన ఆయన భూరికార్డుల్లో తన పేరు మార్చాలంటూ 2014లో చేసుకున్న అర్జీని అధికారులు తిరస్కరించారు. కారణమడిగితే.. అది ప్రభుత్వ భూమన్నారు. దళారీద్వారా రూ.లక్ష సమర్పించడంతో తక్షణమే ఆయన పేరిట రికార్డుల్లో అప్డేట్(మ్యుటేషన్) చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓమహిళ తండ్రినుంచి వారసత్వంగా సంక్రమించిన భూమిని తనపేరిట వెబ్‌ల్యాండ్‌లో అప్డేట్ చేయాలని పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరించారు. వేరేవారు కూడా ఆ ఆస్తికి వారసత్వ హక్కుందని చెబుతున్నట్టు వీఆర్వోనే కొర్రీ వేయించారు. ఉన్నతాధికారిద్వారా చెప్పించినా.. డబ్బుముట్టజెప్పందే ఆమె పని జరగలేదు. కర్నూలుజిల్లా ఎమ్మిగనూరు రైతు ఒకరు ఈ-పట్టాదారు పాసుపుస్తకానికి దరఖాస్తు చేసుకున్నాడు. ఆయన చిరునామాకెళ్లాల్సిన పాసు పుస్తకం మండల రెవెన్యూ కార్యాలయానికి చేరింది. వీఆర్వోను సంప్రదించగా చెన్నైనుంచి పుస్తకం తెప్పించాలంటూ.. రూ.పదివేలు ఖర్చవుతుందన్నారు. సొమ్మివ్వడంతో వీఆర్వో తన వద్దనున్న పుస్తకాన్ని వారమయ్యాక రైతుకిచ్చారు. ..ఇది ఈ నలుగురి సమస్య మాత్రమే కాదు. పట్టాదారు పాసు పుస్తకాలు, భూరికార్డుల్లో మార్పుచేర్పుల(మ్యుటేషన్)కోసం దరఖాస్తు చేసుకున్న, చేసుకుంటున్న లక్షలాదిమంది నిత్యం ఎదుర్కొంటున్న సమస్య. కాసులివ్వకపోతే ఏదో సాకు చూపి రెవెన్యూ అధికారులు ఈ అర్జీల్ని తిరస్కరిస్తున్నారు. ఇలా వచ్చిన దరఖాస్తుల్లో 35 శాతాన్ని అధికారులు తిరస్కరించినట్లు అధికారిక గణాంకాలే తేటతెల్లం చేస్తున్నాయి. అయినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. దీంతో క్షేత్రస్థాయి అధికారులు భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. పట్టాదారు పాసుపుస్తకాలకు తహసీల్దార్లు రూ.10 వేలు వసూలు చేస్తున్నారు. కొందరైతే మ్యుటేషన్లు, పాసు పుస్తకాలకు రూ.20నుంచి రూ.30వేలదాకా దండుకుంటున్నారు. డబ్బులివ్వకపోతే రెవెన్యూ ఉద్యోగులే కొర్రీలేయించి లిటిగేషన్లు సృష్టిస్తున్నారు. రెవెన్యూలో అవినీతిని అంగీకరించిన ఉప ముఖ్యమంత్రి... ‘రెవెన్యూ’లో నెలకొన్న అవినీతికి సాక్షాత్తూ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. ఏప్రిల్ 26న జరిగిన జాయింట్ కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ ‘‘కోర్టుకెళ్లి ఉత్తర్వులు తెచ్చుకోండంటూ రెవెన్యూ అధికారులే కొందరికి సూచిస్తూ లిటిగేషన్లు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. నిరభ్యంతర పత్రాలివ్వకుండా దళారుల్ని ఏర్పాటు చేసుకుని డబ్బు తీసుకున్నాకే ఇస్తున్నారు. అర్జీలు ఏళ్లయినా పరిష్కారమవట్లేదు. దీన్నిబట్టి జాయింట్కలెక్టర్ల పర్యవేక్షణ లోపించినట్లు స్పష్టమవుతోంది’ అని అన్నారు. తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాల్లో విచ్చలవిడి అవినీతికి పాల్పడుతున్నారని ఉన్నతస్థాయి రెవెన్యూ అధికారులే అంగీకరిస్తున్నారు. క్షేత్రస్థాయి అధికారులవద్ద ఈ మాటల్ని ప్రస్తావిస్తే.. బదిలీలకు ప్రజాప్రతినిధులు లక్షల్లో తీసుకుం టున్నారని, ప్రొటోకాల్ ఖర్చులు నెలనెలా వేలల్లో ఉంటున్నాయని, ఇవన్నీ ఎక్కడినుంచి తేవాలని ప్రశ్నిస్తున్నారు. తిరస్కరణలో సీఎం జిల్లా టాప్ మ్యుటేషన్లు, పాసుపుస్తకాల అర్జీల తిరస్కరణలో సీఎం చంద్రబాబు సొంతజిల్లా చిత్తూరు మొదటిస్థానంలో ఉంది. జిల్లాలో 3,06,641 దరఖాస్తులు రాగా 84,417 అర్జీల్ని తిరస్కరించారు. 1,30,125 అర్జీల్లో 69,188 వినతుల తిరస్కరణతో కృష్ణాజిల్లా రెండోస్థానంలో ఉంది. రాష్ట్రంలో మ్యుటేషన్లు, పాసు పుస్తకాలకోసం మొత్తం 13.62 లక్షల అర్జీలు రాగా 8.13 లక్షల్నే(59.72 శాతం) ఆమోదించారు. 4.77 లక్షల(వచ్చిన వాటిలో 35 శాతం) వినతుల్ని తిరస్కరించారు. ఆమోదించిన అర్జీల్లోనూ రైతులు కోరిన పని జరిగినవి 45 శాతమే. ఇక ఈ-పట్టాదారు పాసు పుస్తకాలకోసం అర్జీల్ని ఆమోదించినా చెన్నైకు పంపించి తెప్పించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. మ్యుటేషన్లకు సంబంధించి ఆమోదించిన అర్జీల్లోనూ సబ్‌డివిజన్ జరిపాకే అప్డేట్ చేస్తామంటూ పెండింగ్‌లో పెట్టినవి పెద్దసంఖ్యలో ఉన్నాయి.