కాసులిస్తే రైట్.. లేదంటే రిజెక్ట్!
► చెత్తబుట్టపాలవుతున్న మ్యుటేషన్ అర్జీలు
► పాసు పుస్తకాల వినతులదీ అదే దుస్థితి
► 35 శాతం దరఖాస్తుల తిరస్కరణ
► రూ.పది వేలిస్తేనే పాసు పుస్తకం జారీ
► రెవెన్యూలో కొనసాగుతున్న అవినీతిపర్వం..
► పట్టించుకోని ప్రభుత్వం..
► రైతులకు తీవ్ర ఇబ్బందులు
హైదరాబాద్: చిత్తూరు జిల్లా బి.కొత్తకోటకు చెందిన ఓ రైతు తన పట్టాదారు పాసు పుస్తకంలో ఉన్నభూమిని వెబ్‌ల్యాండ్‌లో ఎక్కించాలంటూ (మ్యుటేషన్ కోసం) ‘మీసేవ’ కేంద్రంలో రూ.285 రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకున్నాడు. భూమి విస్తీర్ణంలో తేడా ఉందంటూ రెవెన్యూ అధికారులు దాన్ని తిరస్కరించి చెత్తబుట్టలో పడేశారు.
విజయనగరం జిల్లా ఎస్.కోటకు చెందిన ఒకరు 2001లో ఐదెకరాల భూమిని కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ప్రవాస భారతీయుడైన ఆయన భూరికార్డుల్లో తన పేరు మార్చాలంటూ 2014లో చేసుకున్న అర్జీని అధికారులు తిరస్కరించారు. కారణమడిగితే.. అది ప్రభుత్వ భూమన్నారు. దళారీద్వారా రూ.లక్ష సమర్పించడంతో తక్షణమే ఆయన పేరిట రికార్డుల్లో అప్‌డేట్(మ్యుటేషన్) చేశారు.
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓమహిళ తండ్రినుంచి వారసత్వంగా సంక్రమించిన భూమిని తనపేరిట వెబ్‌ల్యాండ్‌లో అప్‌డేట్ చేయాలని పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరించారు. వేరేవారు కూడా ఆ ఆస్తికి వారసత్వ హక్కుందని చెబుతున్నట్టు వీఆర్‌వోనే కొర్రీ వేయించారు. ఉన్నతాధికారిద్వారా చెప్పించినా.. డబ్బుముట్టజెప్పందే ఆమె పని జరగలేదు.
కర్నూలుజిల్లా ఎమ్మిగనూరు రైతు ఒకరు ఈ-పట్టాదారు పాసుపుస్తకానికి దరఖాస్తు చేసుకున్నాడు. ఆయన చిరునామాకెళ్లాల్సిన పాసు పుస్తకం మండల రెవెన్యూ కార్యాలయానికి చేరింది. వీఆర్‌వోను సంప్రదించగా చెన్నైనుంచి పుస్తకం తెప్పించాలంటూ.. రూ.పదివేలు ఖర్చవుతుందన్నారు. సొమ్మివ్వడంతో వీఆర్‌వో తన వద్దనున్న పుస్తకాన్ని వారమయ్యాక రైతుకిచ్చారు.
..ఇది ఈ నలుగురి సమస్య మాత్రమే కాదు. పట్టాదారు పాసు పుస్తకాలు, భూరికార్డుల్లో మార్పుచేర్పుల(మ్యుటేషన్)కోసం దరఖాస్తు చేసుకున్న, చేసుకుంటున్న లక్షలాదిమంది నిత్యం ఎదుర్కొంటున్న సమస్య. కాసులివ్వకపోతే ఏదో సాకు చూపి రెవెన్యూ అధికారులు ఈ అర్జీల్ని తిరస్కరిస్తున్నారు. ఇలా వచ్చిన దరఖాస్తుల్లో 35 శాతాన్ని అధికారులు తిరస్కరించినట్లు అధికారిక గణాంకాలే తేటతెల్లం చేస్తున్నాయి. అయినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. దీంతో క్షేత్రస్థాయి అధికారులు భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. పట్టాదారు పాసుపుస్తకాలకు తహసీల్దార్లు రూ.10 వేలు వసూలు చేస్తున్నారు. కొందరైతే మ్యుటేషన్లు, పాసు పుస్తకాలకు రూ.20నుంచి రూ.30వేలదాకా దండుకుంటున్నారు. డబ్బులివ్వకపోతే రెవెన్యూ ఉద్యోగులే కొర్రీలేయించి లిటిగేషన్లు సృష్టిస్తున్నారు.
రెవెన్యూలో అవినీతిని అంగీకరించిన ఉప ముఖ్యమంత్రి...
‘రెవెన్యూ’లో నెలకొన్న అవినీతికి సాక్షాత్తూ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. ఏప్రిల్ 26న జరిగిన జాయింట్ కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ ‘‘కోర్టుకెళ్లి ఉత్తర్వులు తెచ్చుకోండంటూ రెవెన్యూ అధికారులే కొందరికి సూచిస్తూ లిటిగేషన్లు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. నిరభ్యంతర పత్రాలివ్వకుండా దళారుల్ని ఏర్పాటు చేసుకుని డబ్బు తీసుకున్నాకే ఇస్తున్నారు. అర్జీలు ఏళ్లయినా పరిష్కారమవట్లేదు. దీన్నిబట్టి జాయింట్‌కలెక్టర్ల పర్యవేక్షణ లోపించినట్లు స్పష్టమవుతోంది’ అని అన్నారు. తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాల్లో విచ్చలవిడి అవినీతికి పాల్పడుతున్నారని ఉన్నతస్థాయి రెవెన్యూ అధికారులే అంగీకరిస్తున్నారు. క్షేత్రస్థాయి అధికారులవద్ద ఈ మాటల్ని ప్రస్తావిస్తే.. బదిలీలకు ప్రజాప్రతినిధులు లక్షల్లో తీసుకుం టున్నారని, ప్రొటోకాల్ ఖర్చులు నెలనెలా వేలల్లో ఉంటున్నాయని, ఇవన్నీ ఎక్కడినుంచి తేవాలని ప్రశ్నిస్తున్నారు.
తిరస్కరణలో సీఎం జిల్లా టాప్
మ్యుటేషన్లు, పాసుపుస్తకాల అర్జీల తిరస్కరణలో సీఎం చంద్రబాబు సొంతజిల్లా చిత్తూరు మొదటిస్థానంలో ఉంది. జిల్లాలో 3,06,641 దరఖాస్తులు రాగా 84,417 అర్జీల్ని తిరస్కరించారు. 1,30,125 అర్జీల్లో 69,188 వినతుల తిరస్కరణతో కృష్ణాజిల్లా రెండోస్థానంలో ఉంది. రాష్ట్రంలో మ్యుటేషన్లు, పాసు పుస్తకాలకోసం మొత్తం 13.62 లక్షల అర్జీలు రాగా 8.13 లక్షల్నే(59.72 శాతం) ఆమోదించారు. 4.77 లక్షల(వచ్చిన వాటిలో 35 శాతం) వినతుల్ని తిరస్కరించారు. ఆమోదించిన అర్జీల్లోనూ రైతులు కోరిన పని జరిగినవి 45 శాతమే. ఇక ఈ-పట్టాదారు పాసు పుస్తకాలకోసం అర్జీల్ని ఆమోదించినా చెన్నైకు పంపించి తెప్పించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. మ్యుటేషన్లకు సంబంధించి ఆమోదించిన అర్జీల్లోనూ సబ్‌డివిజన్ జరిపాకే అప్‌డేట్ చేస్తామంటూ పెండింగ్‌లో పెట్టినవి పెద్దసంఖ్యలో ఉన్నాయి.