నీకంతా..! మరి నాకింతేనా?
►మామూళ్ల పంపకాల్లో ఎక్సైజ్ అధికారుల మధ్య విభేదాలు
►కాసుల వర్షం కురిపిస్తున్న బార్ల లెసైన్సు రెన్యువల్స్
►ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆరోపణలు
►ఉన్నతాధికారుల ఆధిపత్య పోరు
►మామూళ్ల మత్తులో ఎన్‌ఫోర్సుమెంట్ గాలికి
►బెల్టు షాపులు రాష్ట్రంలో లేనే లేవట!
సాక్షి, హైదరాబాద్: కమీషన్ల పంపకాలు ఎక్సైజ్ శాఖలో అధికారుల మధ్య విభేదాలకు దారితీసింది. ఇప్పటికే ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య ఆదిపత్య పోరు నడుస్తోంది. ఈ పోరులో అధికారులు, సిబ్బంది రెండు వర్గాలుగా విడిపోయారు. తాజాగా బార్ల లెసైన్సుకు వసూలు చేసిన కమీషన్ల పంపకాల్లో అధికారులు, సిబ్బందికి మధ్య తలెత్తిన విభేదాలతో ఈ పోరు తారాస్థాయికి చేరింది. ప్రకాశం జిల్లాలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆదినారాయణమూర్తి ఏకంగా మీడియా సమావేశం నిర్వహించి ఓ ఉన్నతాధికారి అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారంటే ఎక్సైజ్‌లో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధమవుతుంది. ఆదినారాయణమూర్తికి, అక్కడ ఎక్సైజ్ సిబ్బందికి మధ్య వాటాల పంపకాల్లో తలెత్తిన విభేదాలు ఆ శాఖలో జరుగుతున్న అవినీతిని వెలుగులోకి తెచ్చాయన్న విమర్శలు వస్తున్నాయి.
అలా మొదలైంది...
రాష్ట్రంలో మొత్తం 728 బార్లు ఉన్నాయి. వీటి లెసైన్సును జూలైలో మూడు నెలలపాటు పొడిగించిన ప్రభుత్వం తాజాగా ఈ గడువును మరో నెల పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో యజమానులకు బార్ల లెసైన్సు రెన్యువల్ తప్పనిసరైంది. ఇదే ఆ శాఖలోని సిబ్బందికి కాసుల వర్షం కురిపిస్తోంది. నిర్వాహకుల నుంచి ఒక్కో బారుకి రూ. లక్ష చొప్పన వసూలు చేస్తున్నారు. అయితే వసూళ్ల పంపకాల్లో తేడాలు వచ్చాయి. దీనికి తోడు ఆధిపత్య పోరు ఉండనే ఉంది. దీంతో ఆమ్యామ్యాల విషయం బయటపెడుతూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ వసూళ్లకు సంబంధించిన వివరాలు పలు చోట్ల అధికారులు వెల్లడించడం గమనార్హం.
మామూళ్ల మత్తులో ఎన్‌ఫోర్స్‌మెంట్ గాలికి..
ఎన్‌ఫోర్సుమెంటు పక్కన పెట్టి ఓ ఉన్నతాధికారి అసలు దాడులు చేయవద్దని ఎస్టీఎఫ్ సిబ్బందికి ఆదేశాలిస్తున్నారని ఆ శాఖ అధికారులే చెబుతున్నారు. సదరు అధికారి సెలవుపై వెళ్లినా తన పర్యవేక్షణలోనే ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వర్తించేలా ఏకంగా జీవో జారీ చేశారంటే ఆయన ఏ విధంగా చక్రం తిప్పుతున్నారో అర్ధమవుతుంది. ఎక్సైజ్ ఏడాది ప్రారంభమై ఏడాది కావస్తున్నా ఇప్పటి వరకు ఎమ్మార్పి ఉల్లంఘన కేసులు తొమ్మిది మాత్రమే నమోదయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అంతే కాకుండా రాష్ట్రంలో ఎక్కడా అసలు బెల్లు షాపులే లేవని నివేదికలు రూపొందించడం గమనార్హం. ఎక్సైజ్ శాఖను పర్యవేక్షించాల్సిన ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య ఉన్న విభేదాలు రోడ్డున పడటం, ఎక్సైజ్ మంత్రి ఇవేమీ పట్టించుకోకపోవడంతో ఆ శాఖలోని ఇతర అధికారులు బహిరంగంగా ఆరోపణలు చేసుకుంటున్నారు.