FDR
-
‘ఎఫ్డీఆర్’తో రోడ్ల ఛిద్రానికి చెక్.. ఆ టెక్నాలజీ అంటే ఏమిటో తెలుసా?
ఆకివీడు(పశ్చిమగోదావరి జిల్లా): రాష్ట్రంలో ప్రగతి బాటలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పటిష్టమైన రహదారుల నిర్మాణమే లక్ష్యంగా సరికొత్త టెక్నాలజీని వినియోగిస్తోంది. మెత్తటి నేలల్లో రోడ్లు నిర్మిస్తున్నా.. వర్షాలు పడినా, వరదలు వచ్చినా కొద్దిరోజులకే ఛిద్రం కావడం, గుంతలు పడటంతో పాటు రహదారులు కోతకు గురవుతున్నాయి. ఇటువంటి సమస్యలన్నింటికీ చెక్ పెట్టేలా ఎఫ్డీఆర్ (ఫుల్ డెప్త్ రిక్లమేషన్) టెక్నాలజీని వినియోగించాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇటువంటి రోడ్లను గుర్తించి, వాటిలో అత్యవసరమైన రోడ్ల నిర్మాణాలకు ప్రభుత్వం ప్రతిపాదనలు కోరింది. దీనిలో భాగంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఆర్అండ్బీ శాఖ రాష్ట్ర రహదారులుగా ఉన్న ఆరు రోడ్లు, జిల్లాలోని మేజర్ రోడ్లు ఏడింటిని మొత్తంగా 13 రహదారులను ఎంపిక చేసి రూ.130 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. సుమారు 140 కిలోమీటర్ల మేర రహదారులను నిర్మించేందుకు ప్రభుత్వ అనుమతి, సాంకేతిక అనుమతి పొందాల్సి ఉంది. అనుమతులు వచ్చిన తర్వాత టెండర్లు పిలిచి ఆయా రోడ్లను కొత్త సాంకేతిక పద్ధతిలో నిర్మించనున్నారు. ఇప్పటికే జిల్లాలోని పలు ఆర్అండ్బీ, జిల్లాపరిషత్, రాష్ట్ర రోడ్లు పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నాడు–నేడు ద్వారా రోడ్లను మరింత నాణ్యంగా నిర్మించనుంది. నూతన టెక్నాలజీతో నిర్మించనున్న కాళీపట్నం–భీమవరం రహదారి ఎఫ్డీఆర్ టెక్నాలజీ అంటే.. ఫుల్ డెప్త్ రిక్లమేషన్ (ఎఫ్డీఆర్) టెక్నాలజీ ద్వారా రోడ్లు పటిష్టంగా ఉండటంతో పాటు గుంతలు పడటం, కోతకు గురికావడం వంటివి ఉండవని ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న రోడ్డును సుమారు 250 మిల్లీమీటర్ల నుంచి 300 మిల్లీమీటర్ల లోతులో తవ్వి వచ్చిన మెటీరియల్‌ను మరాడిస్తారు. దీనికి ప్రత్యేక కెమికల్, సిమెంట్ కలిపి తవ్విన ప్రాంతంలోనే మెషీన్ ద్వారా చల్లుకుంటూ సీపుట్ రోలర్‌తో రోలింగ్ చేస్తారు. అనంతరం రెండు, మూడు అంగుళాల తారు రోడ్డు నిర్మిస్తారు. ఇలా నిర్మించిన రోడ్లపై మూడు రోజుల తర్వాత సాధారణ వాహనాలను, ఏడు రోజుల తర్వాత భారీ వాహనాలను రాకపోకలకు అనుమతిస్తారు. ఈ రోడ్లు 15 ఏళ్లపాటు నాణ్యంగా ఉంటాయి. అలాగే ఎఫ్డీఆర్ టెక్నాలజీ పర్యావరణ హితమైనది కూడా కావడం విశేషం మూడు వంతెనలు ఉమ్మడి జిల్లాలో ఆర్అండ్బీ శాఖ ద్వారా రూ.26 కోట్ల వ్యయంతో మూడు భారీ వంతెనల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. గణపవరం, నారాయణపురం, గుండుగొలనులో బ్రిడ్జిల నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. చురుగ్గా నిర్మాణాలు కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఉమ్మడి జిల్లాలో మొదటి దశలో రూ.130 కోట్ల వ్యయంతో 13 రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. సాంకేతిక అనుమతి వచ్చిన తర్వాత టెండర్లు పిలుస్తారు. ఉమ్మడి జిల్లాలో వంతెనల నిర్మాణానికి రూ.26 కోట్లు మంజూరయ్యాయి. జిల్లాలో రోడ్ల నిర్మాణం, మరమ్మతులు చురుగ్గా సాగుతున్నాయి. – జీవీ భాస్కరరావు, ఎస్ఈ, ఆర్అండ్బీ శాఖ, ఏలూరు జిల్లా పశ్చిమలో 55 కిలోమీటర్ల మేర.. పశ్చిమగోదావరిలో నూతన సాంకేతికతతో 55.853 కిలోమీట ర్ల మేర రోడ్లు నిర్మించనున్నాం. కాళీపట్నం–భీమవరం (15.953 కిలోమీటర్లు), నవాబుపాలెం–దండగర్ర (7.340 కిలోమీటర్లు), వేల్పూరు–రామేశ్వరం (11.100 కిలోమీటర్లు), అత్తిలి–అలంపురం (10.260 కిలోమీటర్లు), ఉరదాళ్లపాలెం–దువ్వ (11.200 కిలోమీటర్లు) రోడ్లను అభివృద్ధి చేయనున్నాం. –ఎస్.లోకేశ్వరరావు, ఆర్అండ్బీ ఇంజనీరింగ్ అధికారి, పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం ఎంపిక చేసిన రహదారులు ఏలూరు జిల్లా : చేబ్రోలు–దేవరపల్లి, పొంగుటూరు–యర్నగూడెం, వడలి–తాడినాడ, నూజివీడు– గన్నవరం, వడ్లమన్నాడ–పెదలంక (స్టేట్æ హైవే), గుండుగొలను–కోరుకొల్లు, పొంగుటూరు–లక్కవరం, ఉప్పుటేరు–కలిదిండి (మేజర్ జిల్లా రోడ్లు). పశ్చిమగోదావరి జిల్లా : కాళీపట్నం–భీమవరం (స్టేట్ హైవే), ఉరదాళ్లపాలెం–దువ్వ, వేల్పూరు–రామేశ్వరం, నవాబుపాలెం–దండగర్ర, అత్తిలి–అలంపురం (మేజర్ జిల్లా రోడ్లు) -
రోడ్ల కోతకు ‘ఎఫ్డీఆర్’తో చెక్
సాక్షి, అమరావతి: నదీపరివాహక ప్రాంతాల్లో దశాబ్దాలుగా వేధిస్తున్న రోడ్ల కోతకు రాష్ట్ర ప్రభుత్వం ముగింపు పలకనుంది. అందుకోసం ఫుల్ డెప్త్ రిక్లమేషన్ (ఎఫ్డీఆర్) టెక్నాలజీతో రోడ్లు నిర్మించాలని నిర్ణయించింది. మెత్తటి నేలల్లో రోడ్లు నిర్మిస్తున్నా.. వర్షాలు పడినా, వరదలు వచ్చినా నదీతీర ప్రాంతాల్లో రోడ్లు కోతకు గురవుతున్నాయి. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో దశాబ్దాలుగా ఈ సమస్య వేధిస్తోంది. ఈ జిల్లాల్లో నల్లరేగడి నేలలు ఎక్కువగా ఉండటమే అందుకు కారణం. ఈ సమస్యను గుర్తించినప్పటికీ గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. సాధారణ పరిజ్ఞానంతో రోడ్లు నిర్మిస్తూ తమ అనుయాయులైన కాంట్రాక్టర్లకు ప్రయోజనం కల్పించింది. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం మెత్తటి నేలల్లో కూడా పటిష్టమైన రోడ్లు నిర్మించాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ (ఆర్డీసీ) రాష్ట్రంలో మొదటిదశ కింద చేపట్టిన రోడ్ల పునరుద్ధరణ పనుల్లో ఎఫ్డీఆర్ సాంకేతికతతో రోడ్లు నిర్మించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా తూర్పు గోదావరి జిల్లాలోని గోపాలపురం నియోజకవర్గంలో గజ్జరం నుంచి హుకుంపేట వరకు 7.50 కిలోమీటర్ల మేర ఎఫ్డీఆర్ టెక్నాలజీతో రోడ్డు నిర్మించారు. ఆ రోడ్డును పరిశీలించిన సీఐఆర్ నిపుణులు సంతృప్తి వ్యక్తం చేశారు. వెయ్యి కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎఫ్డీఆర్ టెక్నాలజీతో వెయ్యి కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. అందులో ఆర్ అండ్ బి శాఖకు చెందిన 500 కిలోమీటర్ల రోడ్లు, పంచాయతీరాజ్ శాఖకు చెందిన 500 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. కిలోమీటరుకు సింగిల్ లైన్ అయితే రూ.80 లక్షలు, డబుల్ లైన్ అయితే రూ.1.40 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. యాన్యుటీ విధానంలో ఈ రోడ్లు నిర్మిస్తారు. త్వరలోనే టెండర్ల ప్రక్రియ చేపట్టి నిర్మాణ పనులు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎఫ్డీఆర్ టెక్నాలజీ అంటే.. మెత్తటి నేలలపై ఉన్న పాత రోడ్లను 300 మిల్లీమీటర్ల లోతువరకు తొలగిస్తారు. సిమెంట్, ఎమ్యల్షన్ అనే ప్రత్యేక ఎడెటివ్ రసాయనంతో చేసిన మిశ్రమాన్ని రోడ్డు, గ్రానైట్ వ్యర్థాల మిక్స్‌లతో కలిపి రోడ్లు నిర్మిస్తారు. ఈ రోడ్లు 15 ఏళ్లపాటు నాణ్యతతో ఉంటాయి. దీంతోపాటు ఎఫ్డీఆర్ టెక్నాలజీ పర్యావరణ హితమైనదని కూడా కావడం విశేషం. -
లోక్‌సత్తా, ఎఫ్డీఆర్ ఆరోగ్య నమూనాలో ఏముందంటే...
సాక్షి, హైదరాబాద్: అందరికీ నాణ్యమైన ఆరోగ్యాన్ని అందించేలా ఫౌండేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఎఫ్డీఆర్), లోక్‌సత్తా సంయుక్తంగా రూపొందించిన ‘టువర్డ్స్ వయబుల్ యూనివర్సల్ హెల్త్‌కేర్’ ఆరోగ్య నమూనాను లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ విడుదల చేశారు. అందులోని ముఖ్యాంశాలు ఇలా.. ► అన్ని రకాల ఔట్ పేషెంట్ సేవలకూ ప్రజలు తమకు నచ్చిన డాక్టర్ని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ, వైద్య సేవల మధ్య పోటీతో ఫ్యామిలీ ఫిజీషియన్ నేతృత్వంలో ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థ. ఇది పైస్థాయి ఆస్పత్రి సేవలకు అనుసంధానమై ఉంటుంది. ఆస్పత్రి చికిత్స అవసరమనుకుంటే ఫ్యామిలీ ఫిజీషియనే సిఫార్సు చేస్తారు. ప్రభుత్వం నిధుల్ని సమకూరుస్తుంది. చదవండి: అతనితో సన్నిహిత సంబంధాలు.. ఐజీపై సస్పెన్షన్ వేటు ► ద్వితీయ, తృతీయ స్థాయి చికిత్సల ఆస్పత్రులు ఇన్‌పేషెంట్ సేవలకు మాత్రమే పరిమితం. అయితే అత్యవసరాలు మినహాయించి అన్ని కేసుల్లో కింద స్థాయి వైద్యుని నుండి సిఫార్సు (రెఫరల్) తప్పనిసరి. ► ఆయుష్మాన్ భారత్ నుండి తృతీయ స్థాయి వైద్య సేవలను మినహాయించి, ఆ పథకాలు అన్ని ద్వితీయ స్థాయి చికిత్సలకూ అందరు పౌరులకూ వర్తించేలా వాటి పరిధిని విస్తరించటం. తృతీయ స్థాయిలో నాణ్యమైన, ఖర్చుకు తగ్గ ఫలితాలనిచ్చే వైద్య సేవలందించేలా దేశంలోని జిల్లా, ప్రభుత్వ బోధనాస్పత్రులను అభివృద్ధి చేయటం. అదనపు వనరుల్ని సమకూర్చటం. ►ఈ నమూనాను అమల్లోకి తేవటానికయ్యే ఖర్చులో ఎక్కువ భాగాన్ని ప్రభుత్వమే భరిస్తున్నా, ప్రైవేట్ రంగానికి కూడా కీలక పాత్ర ఉంటుంది. ప్రభుత్వ – ప్రైవేటు భాగస్వామ్యాలు, ఆర్థిక వనరుల సేకరణకు వినూత్న పద్ధతులతో ఈ నమూనా రూపొందింది. ►దేశవ్యాప్తంగా ఈ నమూనా అమలుకు అదనం గా అయ్యే వ్యయం ఏడాదికి సుమారు రూ. 85 వేల కోట్లు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో అదనపు వ్యయం వరుసగా సుమారు రూ.1,900 కోట్లు, రూ. 2,600 కోట్లు ఉంటుంది. ► ఈ సంస్కరణల అమలు ఆవశ్యకతను తెలియచెప్పి ఒప్పించే క్రమంలో ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్, ఆర్థిక సలహా మండలి, పార్లమెంటు సభ్యులు, మీడియా, ఈ రంగంలో పనిచేస్తున్న ఇతర అనేక సంస్థలు, వ్యక్తులు ఇలా సంబంధితుందరికీ ఎఫ్డీఆర్ వివరాలను అందించింది. ► ఆరోగ్య రంగం రాష్ట్రాల జాబితాలోని అంశం కాబట్టి, అంతిమంగా సంస్కరణలు రాష్ట్రాల నుండి ప్రారంభం కావాలి. కాబట్టి ఎఫ్డీఆర్ ఈ నమూనాను దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆరోగ్య మంత్రులు, ఇతర సంబంధిత ఉన్నతాధికారులకు పంపింది. ► ఈ సంస్కరణలను అమలు చేసేలా ప్రభుత్వాలను ఒప్పించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిషాతో మొదలు పెట్టి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులని వ్యక్తిగతంగా కూడా కలవాలని లోక్‌సత్తా, ఎఫ్డీఆర్ భావిస్తోంది. -
అందరి ప్రయోజనాలు కాపాడాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన సమయంలో అన్ని ప్రాంతాల ప్రజల ప్రయోజనాలు కాపాడేలా కేంద్రప్రభుత్వ నిర్ణయం ఉండాలని ప్రజాస్వామ్య సంస్కరణల పీఠం(ఎఫ్డీఆర్), లోక్‌సత్తా పార్టీలు కలిసి శనివారమిక్కడ జూబ్లీహాలులో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశం తీర్మానించింది. కాంగ్రెస్ తరఫున కాకుండా ప్రభుత్వం సొంతంగా కమిటీ ఏర్పాటుచేస్తే ప్రజలు, ప్రజాసంఘాలు అభిప్రాయాలు చెప్పుకోవచ్చని కూడా తీర్మానించింది. ప్రాంతీయ సమస్యల పరిష్కారానికి చట్టబద్ధమైన విధివిధానాలుండాలని సూచించింది. హైదరాబాద్‌లో ఉంటున్న ప్రజల స్వేచ్ఛాయుత జీవనానికి ఆటంకం కలుగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని తీర్మానించింది. ఉద్యోగులు, విద్యార్థులు రాజకీయపరమైన ఆందోళనల్లో భాగం కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడాలని కోరింది. సమావేశానికి లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ అధ్యక్షత వహించారు. పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. జేపీ మాట్లాడుతూ.. ఎవరైనా ఎక్కడైనా జీవించవచ్చనే భరోసాను కేంద్రం, కాంగ్రెస్ కల్పించాలని కోరారు. పేదరికం పోవాలని, బతుకులు బాగుపడాలనే ఉద్దేశంతో తెలంగాణ ఏర్పాటు చేస్తున్నట్లైతే.. అదే స్థితిలో ఉన్న మిగతావారి గురించి కూడా ఆలోచించాలని వ్యాఖ్యానించారు. ప్రాంతీయ ఆకాంక్షలను కాపాడటంలో ఇతర ప్రాంతాలను విస్మరించవద్దని కోరారు. రాష్ట్ర విభజనపై కేంద్రం కేబినెట్ నోట్‌తో ముందుకువచ్చి ‘పార్టీ నుంచి ఒక్కరే వచ్చి లిఖితపూర్వక స్పందన ఇవ్వండి’ అని కోరితే విభజనపై వారి వైఖరులు తెలుస్తాయని ఎమ్మెల్సీ నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు. హెచ్ఎంటీవీ సీఈవో రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను తెలంగాణలో భాగంగా ఉంచాలని, ప్రత్యేక రాయలసీమ ఏర్పాటు చేయాలని సూచించారు. కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య మాట్లాడుతూ.. గుజ రాత్-మహారాష్ట్ర విడిపోయినపుడు శివసేన మరాఠేతరులను, మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) ఏర్పడ్డాక బీహారీలను బెదిరించిన విషయాన్ని గమనంలోకి తీసుకోవాలన్నారు. అయితే హైదరాబాద్‌లో అది జరగకపోవచ్చని, కాకపోతే అవకాశం ఉందని అన్నారు. తమవల్లే అభివృద్ధి అని సీమాంధ్రులు ప్రచారం చేసుకోవడం సరికాదన్నారు. ఉమ్మడి రాజధాని సరికాదు..: రాష్ట్రం విడిపోతే హైదరాబాద్ తెలంగాణలో లేదా ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ఉండాలని, అలాగాక ఉమ్మడి రాజధానిగా ఉండటం వల్ల విచ్ఛిన్నక ర శక్తులు పెరిగిపోతాయని మాజీ డీజీపీ అరవిందరావు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమైనప్పటికీ సీమాంధ్రుల భద్రతకు సమస్య ఉంటుందని తాను భావించట్లేదన్నారు. ఉద్యోగుల్లో అభద్రతాభావం తొలగిస్తే హైదరాబాద్‌పై నెలకొన్న సందిగ్ధం కొలిక్కి వస్తుందని కేంద్ర న్యాయశాఖ మాజీ కార్యదర్శి సత్యనారాయణమూర్తి చెప్పారు. తెలంగాణకున్న సంపద గురించి మాట్లాడుతున్నవారు తెలంగాణ ప్రాంతం కోల్పోయిన దానిగురించి ప్రశ్నిస్తే ఏం జవాబిస్తారో ఆలోచించుకోవాలని నల్సార్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ కోరారు. రాష్ట్రపతి పాలన విధించి.. రాష్ట్ర విభజన చేయాలని ప్రజ్ఞాభారతి నేత త్రిపురనేని హనుమాన్‌చౌదరి కోరారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీల వైఖరి స్పష్టం చేస్తేనే విభజన పట్ల స్పష్టత వస్తుందని కంచె ఐలయ్య అభిప్రాయపడ్డారు. సీమకు అన్యాయం జరుగుతోందనే తప్ప ఎవరి ప్రోద్భలం వల్లో ఉద్యమం జరగట్లేదని రాయలసీమ జాయింట్ యాక్షన్ సమితి నేత బొజ్జా దశరథరామిరెడ్డి తెలిపారు. పాలకులు హేతుబద్ధమైన, న్యాయమైన నిర్ణయంతో రాష్ట్ర విభజన చేయాలని చెన్నమనేని రాజేశ్వరరావు సూచించారు. భేటీలో ఇంకా సీనియర్ పాత్రికేయులు కె.శ్రీనివాసరెడ్డి, తెలకపల్లి రవి, పొత్తూరి వెంకటేశ్వరరావు, మాజీ న్యాయమూర్తి అంబటి లక్ష్మణరావు, తెలంగాణ సెటిలర్స్ ఫోరం నాయకురాలు కాట్రగడ్డ ప్రసూన, పలు సంఘాల నేతలు కొల్లూరి చిరంజీవి, రావు చెలికాని, చెంగల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.