అందరి ప్రయోజనాలు కాపాడాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన సమయంలో అన్ని ప్రాంతాల ప్రజల ప్రయోజనాలు కాపాడేలా కేంద్రప్రభుత్వ నిర్ణయం ఉండాలని ప్రజాస్వామ్య సంస్కరణల పీఠం(ఎఫ్‌డీఆర్), లోక్‌సత్తా పార్టీలు కలిసి శనివారమిక్కడ జూబ్లీహాలులో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశం తీర్మానించింది. కాంగ్రెస్ తరఫున కాకుండా ప్రభుత్వం సొంతంగా కమిటీ ఏర్పాటుచేస్తే ప్రజలు, ప్రజాసంఘాలు అభిప్రాయాలు చెప్పుకోవచ్చని కూడా తీర్మానించింది. ప్రాంతీయ సమస్యల పరిష్కారానికి చట్టబద్ధమైన విధివిధానాలుండాలని సూచించింది. హైదరాబాద్‌లో ఉంటున్న ప్రజల స్వేచ్ఛాయుత జీవనానికి ఆటంకం కలుగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని తీర్మానించింది. ఉద్యోగులు, విద్యార్థులు రాజకీయపరమైన ఆందోళనల్లో భాగం కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడాలని కోరింది.
సమావేశానికి లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ అధ్యక్షత వహించారు. పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. జేపీ మాట్లాడుతూ.. ఎవరైనా ఎక్కడైనా జీవించవచ్చనే భరోసాను కేంద్రం, కాంగ్రెస్ కల్పించాలని కోరారు. పేదరికం పోవాలని, బతుకులు బాగుపడాలనే ఉద్దేశంతో తెలంగాణ ఏర్పాటు చేస్తున్నట్లైతే.. అదే స్థితిలో ఉన్న మిగతావారి గురించి కూడా ఆలోచించాలని వ్యాఖ్యానించారు. ప్రాంతీయ ఆకాంక్షలను కాపాడటంలో ఇతర ప్రాంతాలను విస్మరించవద్దని కోరారు. రాష్ట్ర విభజనపై కేంద్రం కేబినెట్ నోట్‌తో ముందుకువచ్చి ‘పార్టీ నుంచి ఒక్కరే వచ్చి లిఖితపూర్వక స్పందన ఇవ్వండి’ అని కోరితే విభజనపై వారి వైఖరులు తెలుస్తాయని ఎమ్మెల్సీ నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు. హెచ్‌ఎంటీవీ సీఈవో రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను తెలంగాణలో భాగంగా ఉంచాలని, ప్రత్యేక రాయలసీమ ఏర్పాటు చేయాలని సూచించారు. కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య మాట్లాడుతూ.. గుజ రాత్-మహారాష్ట్ర విడిపోయినపుడు శివసేన మరాఠేతరులను, మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్‌ఎస్) ఏర్పడ్డాక బీహారీలను బెదిరించిన విషయాన్ని గమనంలోకి తీసుకోవాలన్నారు. అయితే హైదరాబాద్‌లో అది జరగకపోవచ్చని, కాకపోతే అవకాశం ఉందని అన్నారు. తమవల్లే అభివృద్ధి అని సీమాంధ్రులు ప్రచారం చేసుకోవడం సరికాదన్నారు.
ఉమ్మడి రాజధాని సరికాదు..: రాష్ట్రం విడిపోతే హైదరాబాద్ తెలంగాణలో లేదా ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ఉండాలని, అలాగాక ఉమ్మడి రాజధానిగా ఉండటం వల్ల విచ్ఛిన్నక ర శక్తులు పెరిగిపోతాయని మాజీ డీజీపీ అరవిందరావు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమైనప్పటికీ సీమాంధ్రుల భద్రతకు సమస్య ఉంటుందని తాను భావించట్లేదన్నారు. ఉద్యోగుల్లో అభద్రతాభావం తొలగిస్తే హైదరాబాద్‌పై నెలకొన్న సందిగ్ధం కొలిక్కి వస్తుందని కేంద్ర న్యాయశాఖ మాజీ కార్యదర్శి సత్యనారాయణమూర్తి చెప్పారు. తెలంగాణకున్న సంపద గురించి మాట్లాడుతున్నవారు తెలంగాణ ప్రాంతం కోల్పోయిన దానిగురించి ప్రశ్నిస్తే ఏం జవాబిస్తారో ఆలోచించుకోవాలని నల్సార్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ కోరారు. రాష్ట్రపతి పాలన విధించి.. రాష్ట్ర విభజన చేయాలని ప్రజ్ఞాభారతి నేత త్రిపురనేని హనుమాన్‌చౌదరి కోరారు.
కాంగ్రెస్, బీజేపీ, టీడీపీల వైఖరి స్పష్టం చేస్తేనే విభజన పట్ల స్పష్టత వస్తుందని కంచె ఐలయ్య అభిప్రాయపడ్డారు. సీమకు అన్యాయం జరుగుతోందనే తప్ప ఎవరి ప్రోద్భలం వల్లో ఉద్యమం జరగట్లేదని రాయలసీమ జాయింట్ యాక్షన్ సమితి నేత బొజ్జా దశరథరామిరెడ్డి తెలిపారు. పాలకులు హేతుబద్ధమైన, న్యాయమైన నిర్ణయంతో రాష్ట్ర విభజన చేయాలని చెన్నమనేని రాజేశ్వరరావు సూచించారు. భేటీలో ఇంకా సీనియర్ పాత్రికేయులు కె.శ్రీనివాసరెడ్డి, తెలకపల్లి రవి, పొత్తూరి వెంకటేశ్వరరావు, మాజీ న్యాయమూర్తి అంబటి లక్ష్మణరావు, తెలంగాణ సెటిలర్స్ ఫోరం నాయకురాలు కాట్రగడ్డ ప్రసూన, పలు సంఘాల నేతలు కొల్లూరి చిరంజీవి, రావు చెలికాని, చెంగల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.