నూతన సాంకేతికతతో నిర్మించనున్న ఉప్పుటేరు–కలిదిండి రహదారి
ఆకివీడు(పశ్చిమగోదావరి జిల్లా): రాష్ట్రంలో ప్రగతి బాటలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పటిష్టమైన రహదారుల నిర్మాణమే లక్ష్యంగా సరికొత్త టెక్నాలజీని వినియోగిస్తోంది. మెత్తటి నేలల్లో రోడ్లు నిర్మిస్తున్నా.. వర్షాలు పడినా, వరదలు వచ్చినా కొద్దిరోజులకే ఛిద్రం కావడం, గుంతలు పడటంతో పాటు రహదారులు కోతకు గురవుతున్నాయి. ఇటువంటి సమస్యలన్నింటికీ చెక్ పెట్టేలా ఎఫ్‌డీఆర్ (ఫుల్ డెప్త్ రిక్లమేషన్) టెక్నాలజీని వినియోగించాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇటువంటి రోడ్లను గుర్తించి, వాటిలో అత్యవసరమైన రోడ్ల నిర్మాణాలకు ప్రభుత్వం ప్రతిపాదనలు కోరింది.
దీనిలో భాగంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఆర్‌అండ్‌బీ శాఖ రాష్ట్ర రహదారులుగా ఉన్న ఆరు రోడ్లు, జిల్లాలోని మేజర్ రోడ్లు ఏడింటిని మొత్తంగా 13 రహదారులను ఎంపిక చేసి రూ.130 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. సుమారు 140 కిలోమీటర్ల మేర రహదారులను నిర్మించేందుకు ప్రభుత్వ అనుమతి, సాంకేతిక అనుమతి పొందాల్సి ఉంది. అనుమతులు వచ్చిన తర్వాత టెండర్లు పిలిచి ఆయా రోడ్లను కొత్త సాంకేతిక పద్ధతిలో నిర్మించనున్నారు. ఇప్పటికే జిల్లాలోని పలు ఆర్‌అండ్‌బీ, జిల్లాపరిషత్, రాష్ట్ర రోడ్లు పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నాడు–నేడు ద్వారా రోడ్లను మరింత నాణ్యంగా నిర్మించనుంది.
నూతన టెక్నాలజీతో నిర్మించనున్న కాళీపట్నం–భీమవరం రహదారి
ఎఫ్‌డీఆర్ టెక్నాలజీ అంటే..
ఫుల్ డెప్త్ రిక్లమేషన్ (ఎఫ్‌డీఆర్) టెక్నాలజీ ద్వారా రోడ్లు పటిష్టంగా ఉండటంతో పాటు గుంతలు పడటం, కోతకు గురికావడం వంటివి ఉండవని ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న రోడ్డును సుమారు 250 మిల్లీమీటర్ల నుంచి 300 మిల్లీమీటర్ల లోతులో తవ్వి వచ్చిన మెటీరియల్‌ను మరాడిస్తారు. దీనికి ప్రత్యేక కెమికల్, సిమెంట్ కలిపి తవ్విన ప్రాంతంలోనే మెషీన్ ద్వారా చల్లుకుంటూ సీపుట్ రోలర్‌తో రోలింగ్ చేస్తారు. అనంతరం రెండు, మూడు అంగుళాల తారు రోడ్డు నిర్మిస్తారు. ఇలా నిర్మించిన రోడ్లపై మూడు రోజుల తర్వాత సాధారణ వాహనాలను, ఏడు రోజుల తర్వాత భారీ వాహనాలను రాకపోకలకు అనుమతిస్తారు. ఈ రోడ్లు 15 ఏళ్లపాటు నాణ్యంగా ఉంటాయి. అలాగే ఎఫ్‌డీఆర్ టెక్నాలజీ పర్యావరణ హితమైనది కూడా కావడం విశేషం
మూడు వంతెనలు
ఉమ్మడి జిల్లాలో ఆర్‌అండ్‌బీ శాఖ ద్వారా రూ.26 కోట్ల వ్యయంతో మూడు భారీ వంతెనల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. గణపవరం, నారాయణపురం, గుండుగొలనులో బ్రిడ్జిల నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.
చురుగ్గా నిర్మాణాలు
కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఉమ్మడి జిల్లాలో మొదటి దశలో రూ.130 కోట్ల వ్యయంతో 13 రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. సాంకేతిక అనుమతి వచ్చిన తర్వాత టెండర్లు పిలుస్తారు. ఉమ్మడి జిల్లాలో వంతెనల నిర్మాణానికి రూ.26 కోట్లు మంజూరయ్యాయి. జిల్లాలో రోడ్ల నిర్మాణం, మరమ్మతులు చురుగ్గా సాగుతున్నాయి.
– జీవీ భాస్కరరావు, ఎస్‌ఈ, ఆర్‌అండ్‌బీ శాఖ, ఏలూరు జిల్లా
పశ్చిమలో 55 కిలోమీటర్ల మేర..
పశ్చిమగోదావరిలో నూతన సాంకేతికతతో 55.853 కిలోమీట ర్ల మేర రోడ్లు నిర్మించనున్నాం. కాళీపట్నం–భీమవరం (15.953 కిలోమీటర్లు), నవాబుపాలెం–దండగర్ర (7.340 కిలోమీటర్లు), వేల్పూరు–రామేశ్వరం (11.100 కిలోమీటర్లు), అత్తిలి–అలంపురం (10.260 కిలోమీటర్లు), ఉరదాళ్లపాలెం–దువ్వ (11.200 కిలోమీటర్లు) రోడ్లను అభివృద్ధి చేయనున్నాం.
–ఎస్.లోకేశ్వరరావు, ఆర్‌అండ్‌బీ ఇంజనీరింగ్ అధికారి, పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం
ఎంపిక చేసిన రహదారులు
ఏలూరు జిల్లా : చేబ్రోలు–దేవరపల్లి, పొంగుటూరు–యర్నగూడెం, వడలి–తాడినాడ, నూజివీడు–
గన్నవరం, వడ్లమన్నాడ–పెదలంక (స్టేట్æ హైవే), గుండుగొలను–కోరుకొల్లు, పొంగుటూరు–లక్కవరం, ఉప్పుటేరు–కలిదిండి (మేజర్ జిల్లా రోడ్లు).
పశ్చిమగోదావరి జిల్లా : కాళీపట్నం–భీమవరం (స్టేట్ హైవే), ఉరదాళ్లపాలెం–దువ్వ, వేల్పూరు–రామేశ్వరం, నవాబుపాలెం–దండగర్ర,
అత్తిలి–అలంపురం (మేజర్ జిల్లా రోడ్లు)
Comments
Please login to add a commentAdd a comment