స్టార్ నుంచి స్టోరీ వైపు..
భారీ తారాగణం, వందల కోట్ల బడ్జెట్‌తో స్క్రీన్‌ను కమ్మేయకుండా మన జీవితాలకు రంగుల ఫ్రేమ్‌ను సెట్ చేస్తే? మనిల్లు లాంటి ఇల్లు.. మన ఫ్యామిలీ లాంటి ఫ్యామిలీ.. మన ఇరుగు పొరుగు అంతా కథలో పాత్రలయితే.. థియేటర్ దాటినా ఆ అనుభూతి వెంటాడుతుంది.. ఆత్మీయులందరినీ కూర్చోబెట్టి టైటిల్ కార్డ్స్ నుంచి ఎండ్ కార్డ్ దాకా సీన్ టు సీన్ చెప్పాలనిపిస్తుంది! ఎన్నేళ్లయింది ఇలాంటిది అనుభవంలోకి రాక..? ఈ మాట విన్నదేమో మన తెలుగు కథ.. వెండి తెరకు బలమై.. మంచి సినిమాలా వెలుగుతోంది!ఆ మలయాళం సినిమా చూశారా..? సహజత్వం.. కథా గమనం..! ఎంత అద్భుతంగా ఉందో కదా..! భారీ బడ్జెట్ లేకున్నా పెద్ద సక్సెస్ సినిమాలు ఇలా కూడా తీస్తారా..! అవును నిజమే.. ఫీల్ గుడ్ మూవీస్‌కు కేరాఫ్ మలయాళం చిన్న కథలు.. మెస్మరైజ్ చేసే టేకింగ్ నిజ జీవితాలకు దగ్గరగా ఉండే పాత్రలు సరే.. మాలీవుడ్ మూవీస్ గొప్పగానే ఉండొచ్చు మరి టాలీవుడ్ సినిమా సంగతేంటి ?పొరుగు సినిమాలు విపరీతంగా చూసి మన దగ్గర అసలు విషయం ఏమాత్రం లేదనుకుంటాం గానీ.. మల్లు సినిమాలను మించి అద్భుతమైన కథ, కథనాలతో ఈ మధ్య కాలంలో విడుదలైన తెలుగు చిత్రాలు సైలెంట్‌గా సక్సెస్ సాధిస్తున్నాయి. స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్స్ సినిమాలను పక్కన పెడితే.. రొటీన్ ఫార్ములాలకు భిన్నంగా మనసుకు హత్తుకునే సినిమాలతో తెలుగుతెర పులకించిపోతోంది. వందల కోట్ల బడ్జెట్,భారీ తారాగణం, పెద్దపెద్ద సెట్టింగులు.. ఇవి ఉంటేనే సినిమా అనే రోజులు పోయాయి. మూస సినిమాలు చూసి బోరుకొట్టిన తెలుగు ప్రేక్షకులకు ఈ ఏడాది చిన్న సినిమాలు విందు భోజనమే పెట్టాయి. కుటుంబ కథా చిత్రాల నుంచి సస్పెన్స్ థ్రిల్లర్ వరకు ఈ తరహా సినిమాలు సిల్వర్ స్క్రీన్‌తో పాటు ఓటీటీలోనూ మంచి పేరు తెచ్చుకుంటున్నాయి. గొప్పగొప్ప సినిమాలన్నీ తమిళ, మలయాళం వాళ్లే తీస్తారు.. తెలుగు వాళ్ల దగ్గర అంత క్రియేటివిటీ లేదు అన్న విమర్శలకు చిన్న సినిమాలు తమ సక్సెస్‌తో సమాధానం చెబుతున్నాయి. పెద్ద సినిమాల కంటే చిన్న బడ్జెట్ సినిమాలే ఎక్కువగా ఫిల్మ్ ఇండస్ట్రీని డామినేట్ చేస్తున్నాయిఏడాదంతా చిన్న సినిమాల పండగే2024ను చిన్న సినిమాల నామ సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ఆరంభం, పేకమేడలు, కమిటీ కుర్రోళ్లు, ఆయ్, వీరాంజనేయులు విహార యాత్ర, 35 చిన్న కథ కాదు, మత్తు వదలరా 2, సోపతులు, జనక అయితే గనక.. ఇవన్నీ ఈ ఏడాది మూవీ లవర్స్‌తో శభాష్ అనిపించుకున్న చిన్న సినిమాలే. ఐఎమ్బీ (ఐMఆ) రేటింగ్స్‌లో ఈ మూవీస్ అన్నీ టాప్ లిస్టులో ఉన్నవే. తెరపై కనిపించే నటీనటుల నుంచి తెర వెనుక పనిచేసే సాంకేతిక నిపుణుల వరకు అందరూ కలిసి ఈ చిన్న సినిమాలకు ప్రాణం పోశారు. ఊహాజనితమైన కథలు, పాత్రలకు భిన్నంగా నేటివిటీకి చాలా దగ్గరగా ఈ చిత్రాలు కనిపిస్తాయి. సామాన్య జన జీవితాలే ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన ఈ చిత్రాలు మాలీవుడ్ సినిమాలను మైమరపిస్తున్నాయి. స్టార్ హీరోలు ఉన్న సినిమాలు మాత్రమే బాక్సాఫీస్‌ను డామినేట్ చేస్తాయన్న అభిప్రాయాన్ని చిన్న బడ్జెట్ సినిమాలు బ్రేక్ చేశాయి. ప్రేక్షకులను థియేటర్ల వైపు నడిపించడంలో చిన్న సినిమా దర్శకులు విజయం సాధిస్తున్నారు.కటౌట్ కాదు కంటెంట్ ముఖ్యంఒక సినిమా విజయానికి కలెక్షన్ల సునామీ ఒక్కటే గీటురాయి కాదు. కమర్షియల్‌గా నిర్మాతలకు కోట్లు కుమ్మరించలేకపోయినా కొన్ని సినిమాలు ప్రేక్షకుల గుండెలను తాకుతాయి. ఫీల్ గుడ్ మూవీస్‌గా నిలిచిపోతాయి. ఇలాంటి సినిమాల్లో ఉండేది కంటెంట్ మాత్రమే. హీరో హీరోయిన్లు, దర్శక నిర్మాతలు, చిత్ర తారాగణం వీటన్నింటికంటే కథ.. ఆ కథను దర్శకుడు నడిపించిన తీరే చిన్న సినిమాల సక్సెస్‌కు అసలు కారణం. హీరోల ఇమేజ్, దర్శకుల పాపులారిటీ కారణంగా పెద్ద సినిమాలు ఒక వేవ్ క్రియేట్ చేస్తాయి. ఇలాంటి సినిమాలు అభిమానులతో పాటు కొన్ని వర్గాలను మాత్రమే మెప్పిస్తాయి. ఈ తరహా సినిమాలు ప్రేక్షకులను ఎంతగా ఎంటర్టైన్ చేసినా చిన్న సినిమాలు మాత్రం మనసుకు హత్తుకుని మళ్లీ మళ్లీ చూసేలా చేస్తున్నాయి. కేవలం సినిమా కోసమే కథలు.. హీరోలను ఎలివేట్ చేయడం కోసమే పాత్రలు, పాటల కోసమే హీరోయిన్లు.. ఇలా దారి తప్పిన సినిమాను యువతరం దర్శకులు తమ సృజనాత్మకతను జోడించి గాడిన పెడుతున్నట్టుగా అనిపిస్తోంది. 2024లో విడుదలై సత్తా చాటిన చిన్న సినిమాలే ఇందుకు నిదర్శనం.మీకో కథ చెబుతా చూస్తారా..ఇన్నోవేటివ్ స్టోరీ టెల్లింగ్.. యువ దర్శకులకు బాగా తెలిసిన విద్య. సినిమాను అతుకుల బొంతలా కాకుండా ప్రేక్షకుడి మనసును తాకేలా కథలను రాసుకుని అంతే వినూత్నంగా తెరపై ప్రజెంట్ చేస్తున్నారు. ఈ ఏడాది సక్సెస్ రుచి చూసిన సినిమాలన్నింటిలోనూ ఇది కనిపిస్తోంది. నిజ జీవితాలకు దగ్గరగా, నేటివిటీ ఉండేలా ముఖ్యంగా ప్రేక్షకులు సినిమాలో లీనమైపోయేలా చిన్న సినిమాలు ఉంటున్నాయి. కథలో కొత్తదనం.. ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యే పాత్రలు సినిమా సక్సెస్‌ను నిర్ణయిస్తున్నాయి. పెద్ద బడ్జెట్ చిత్రాలన్నీ స్టార్ పవర్ పైనా, హీరోల ఇమేజ్ పైనా ఆధారపడుతుంటే.. చిన్న చిత్రాలు మాత్రం మంచి కథలను మాత్రమే నమ్ముకుంటున్నాయి. సక్సెస్ఫుల్ డైరెక్టర్లుగా పేరున్న వారు కూడా ఈ మధ్య ఆడియన్స్‌ను మెప్పించడంలో తడబడుతుంటే యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్స్ తమ ఇన్నోవేటివ్ స్టోరీ టెల్లింగ్‌తో వెండితెరపై భావోద్వేగాలను పండిస్తున్నారు. పల్లెటూరి స్నేహాలు వాటి చుట్టూ అల్లుకున్న జీవితాలు, కుల పట్టింపులు, స్థానిక రాజకీయాలు వీటన్నింటి మధ్య ఎమోషన్స్ ను చూపించిన ‘కమిటీ కుర్రోళ్లు’ మంచి సక్సెస్ సాధించింది. చిన్ననాటి స్నేహాన్ని, అమాయకత్వాన్ని, మమకారాన్ని హృద్యంగా చూపించిన సోపతులు ఫీల్ గుడ్ మూవీగా నిలిచిపోయింది. నివేదా థామస్, విశ్వదేవ్, ప్రియదర్శి నటించిన ‘35 చిన్న కథ కాదు’ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులతో మంచి మార్కులు వేయించుకుంది. కండోమ్ కంపెనీపై యుద్ధం ప్రకటించే వ్యక్తిగా సుహాస్ నటించిన ‘జనక అయితే గనక’ సినిమా మంచి రేటింగ్‌తో థియేటర్లతో పాటు ఓటీటీలోనూ పెద్ద చర్చనే రేపింది.ఓటీటీ మెచ్చితే అదే పెద్ద విజయంఓటీటీలు వచ్చిన తర్వాత ఎంటర్టైన్మెంట్ ముఖచిత్రమే మారిపోయింది. వివిధ భాషా చిత్రాలు అందుబాటులో ఉండటంతో కంటెంట్ వినియోగం కూడా పెరిగిపోయింది. భిన్న అభిరుచి గల ప్రేక్షకులు తమకు నచ్చిన కంటెంట్‌ను వీక్షించడం అలవాటు చేసుకున్నారు. అందుకే థియేటర్ రిలీజ్ కాకుండా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ద్వారా చిన్న సినిమాలకు పెద్ద ఎత్తున వ్యూయర్షిప్ వస్తోంది. మంచి కథలతో వస్తున్న తెలుగు చిన్న సినిమాలు ఓటీటీ వేదికలపై సత్తా చాటుతున్నాయి. థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత ఓటీటీలోకి ఆ సినిమా ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూసే రోజులు వచ్చాయి. మౌత్ టాక్‌తో పాటు సోషల్ మీడియా ప్రమోషన్స్ చిన్న సినిమాలను ఓటీటీల ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువ చేస్తున్నాయి. దీంతో చిన్న చిత్రాలు పెద్ద సక్సెస్‌ను నమోదు చేసుకుంటున్నాయి.వైవిధ్యం.. విజయ రహస్యంకథలో వైవిధ్యం, కథనంలో కొత్తదనం.. మలయాళ సినిమా విజయ రహస్యం ఇక్కడే ఉంది. అందుకే దేశమంతా మాలీవుడ్ చిత్రాల గురించి గొప్పగా చెప్పుకుంటారు. టాలెంట్, క్రియేటివిటీ ఈ రెండూ సరిహద్దులు లేనివి. ప్రేక్షకులను మెప్పించే స్థాయిలో మంచి కథలు రాసే దర్శకులు, వాటిని అందంగా చిత్రీకరించే సాంకేతిక నిపుణులు అన్ని సినీ పరిశ్రమల్లోనూ ఉంటారు. సరైన అవకాశాలు, అభిరుచి ఉన్న నిర్మాతలు దొరికినప్పుడు ఆ కథలు మంచి చిత్రాలుగా ప్రేక్షకులకు చేరతాయి. టాలీవుడ్ సినిమాలను కంటెంట్ మాత్రమే శాసించడం మొదలుపెట్టి చాలా కాలమైంది. చదవండి: పెళ్లిలో మెరిసిన అల్లు అర్జున్, మెగాస్టార్.. ఫోటోలు వైరల్!చిన్న సినిమాల సక్సెస్ కూడా ఈ ఏడాదికి మాత్రమే పరిమితమైంది కాదు. పెద్ద సినిమాలు, హీరోల ఆధిపత్యాలు చలామణి అవుతున్న రోజుల్లో కూడా మంచి కథలతో వచ్చిన సినిమాలను ప్రేక్షకులు గుండెలకత్తుకున్నారు. ఈ నగరానికేమైంది, c/o కంచరపాలెం, మిడిల్ క్లాస్ మెమరీస్, బలగం, కలర్‌ఫోటో ఇలా భిన్న కథాంశాలతో కూడిన చిత్రాలెన్నో విజయం సాధించి చిన్న సినిమాను నిలబెట్టాయి. ఆ ట్రెండ్‌ను కొనసాగిస్తూ నేటి యువ దర్శకులు, సాంకేతిక నిపుణులు లోబడ్జెట్ సినిమాను తెలుగులో ట్రెండ్‌గా మార్చేశారు. అందుకే 2024 సినీ ప్రేమికులకు మంచి అనుభూతులను మిగిల్చింది.చిన్న సినిమాల వెనుక పెద్ద నిర్మాతలుస్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు, వందల కోట్ల వసూళ్లు ఈ రొటీన్ సినిమాటిక్ ఫార్ములా నుంచి నిర్మాతలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. మంచి కథలతో ముందుకొచ్చే కొత్త దర్శకులను ప్రోత్సహిస్తున్నారు. ఈ మధ్య సక్సెస్ చూసిన చిన్న సినిమాల వెనుక పెద్ద ప్రొడ్యూసర్స్ ఉండటం విశేషం. ‘35 చిన్న కథ కాదు’ చిత్రానికి సురేష్ ప్రొడక్షన్స్ నుంచి నటుడు రానా ప్రమోట్ చేశారు. యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తున్న అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ 2 బేనర్‌పై ఆయ్ చిత్రాన్ని నిర్మించారు. అంజి కె మణిపుత్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా పెద్ద చిత్రాలతో పోటీపడి మరీ మంచి సక్సెస్ సాధించింది. మెగా ఫ్యామిలీకి చెందిన నిహారిక కొణిదెల ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ బ్యానర్‌పై ‘కమిటీ కుర్రోళ్లు’ నిర్మించి బిగ్ సక్సెస్ సాధించారు. తెలుగులో పెద్ద సినీ నిర్మాణ సంస్థగా ఉన్న మైత్రీ మూవీ మేకర్స్‌కు చిన్న సినిమా ‘మత్తు వదలరా 2’ సక్సెస్ మంచి కిక్ ఇచ్చింది. ఒకప్పుడు కొత్త దర్శకులు కథలు పట్టుకుని నిర్మాతల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు కంటెంట్ ఉన్న దర్శకులను నిర్మాతలు వెతుక్కుంటూ వెళ్తున్నారు. మాస్ ఎంటర్టైన్ మెంట్ సినిమాలకు, స్టార్ హీరోల చిత్రాలకు మార్కెట్లో ఎప్పుడూ గిరాకీ ఉంటుంది. అయితే ఈ సినిమాలపై ప్రేక్షకులకు విపరీతమైన అంచనాలు ఉంటాయి. అంచనాలు తలకిందులైతే సీన్ మారిపోతుంది. అభిమానులు కూడా పెదవి విరిచే పరిస్థితి తలెత్తుతుంది. చిన్న సినిమాలతో ఈ సమస్య లేదనే చెప్పాలి. తక్కువ బడ్జెట్‌తో కొత్త సాంకేతిక నిపుణులతో తెరకెక్కే చిన్న చిత్రాలకు మినిమమ్ గ్యారెంటీ ఉంటోంది.ఇదొక గుడ్ సైన్‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ లాంటి చిన్న సినిమాను గీతా ఆర్ట్స్ పెద్ద ఎత్తున రిలీజ్ చేసింది. దీన్ని చిన్న సినిమాకు దక్కిన గౌరవంగా భావిస్తాను. ఒకప్పుడు చిన్న సినిమాను చిన్న ప్రొడ్యూసర్స్, కొత్త ప్రొడ్యూసర్సే తీయాలి అని ఉండేది. కాని ఇప్పుడు చిన్న సినిమాలను తీయడానికి, డిస్ట్రిబ్యూట్ చేయడానికి పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ ముందుకొస్తున్నాయి. కొత్త కథకులను, కొత్త డైరెక్టర్స్‌ను ఎంకరేజ్ చేస్తున్నాయి. మంచి కథలకు డెఫినెట్‌గా ఇదొక గుడ్ సైన్!∙ దుష్యంత్, దర్శకుడురెస్పెక్ట్ దొరికింది‘వీరాంజనేయులు విహార యాత్ర’తో నాకొక రెస్పెక్ట్ దొరికింది. కుటుంబమంతా కలిసి చూడగలిగే హెల్దీ హ్యూమర్‌తో హెల్దీ ఫిల్మ్ తీయడం వల్లేమో మరి! ఇంకో మంచి విషయం ఏంటంటే.. ఇలాంటి సినిమా కథలను ప్రొడక్షన్ హౌస్‌లు వెదుక్కోవడం. ఇదివరకైతే స్క్రిప్ట్ పట్టుకుని ప్రొడక్షన్ హౌస్‌ల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్లే కథాబలమున్న స్క్రిప్ట్‌లను వెదుక్కుంటున్నాయి. వైవిధ్యమైన కథలు, ఆ కథల మీద గట్టి నమ్మకం, రాజీపడని తత్వం ఉంటే తప్పకుండా మంచి సినిమాలు వస్తాయని అర్థమైంది.అనురాగ్, దర్శకుడుతప్పకుండా ఆదరిస్తారుఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంటర్టైన్మెంట్ స్క్రిప్ట్‌లు తక్కువగా వస్తున్నాయి. అందులోకి గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో మన నేటివిటీని బేస్ చేసుకుని వినోదాన్ని పంచే స్క్రిప్ట్‌లు వంశీ, జంధ్యాల వంటి దర్శకుల తర్వాత పెద్దగా రావట్లేదని చెప్పొచ్చు. అందుకే మన నేటివిటీని యూజ్ చేసుకుని ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలిగితే సినిమా హిట్ అవుతుందనిపించి.. ‘ఆయ్’ సినిమా తీశాను. ఫస్ట్ సినిమాకే పెద్ద బ్యానర్ దొరకడం, అది హిట్ అవడం నిజంగా అదృష్టం. ఇండస్ట్రీలో పది పన్నెండేళ్ల నా స్ట్రగుల్ మంచి రిజల్ట్‌నే ఇచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. మన నేటివిటీ, నిజ జీవితంలో కనిపించే పాత్రలతో కథను పండించగలిగితే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ప్రూవ్ అయింది. అంజి కె మణిపుత్ర, దర్శకుడుప్రయత్నాన్ని నమ్మారు..‘కమిటీ కుర్రోళ్లు’ వల్ల గనుక నిర్మాతలు నష్టపోతే ఇక భవిష్యత్తులో ఎవరూ చిన్న సినిమా మీద డబ్బు పెట్టడానికి ముందుకురారు అనే భయం ఉండింది. కథాబలంతో చిన్న సినిమా ఉనికి చాటాలనేదే నా ప్రయత్నం. నా ప్రయత్నంలోని నిజాయితీని నిర్మాతలు, ప్రేక్షకులు నమ్మారు. చిన్న సినిమాలకు ఆదరణ ఉంటుందని నిరూపించారు. యదు వంశీ, దర్శకుడుఫణికుమార్ అనంతోజు