FICCI ladies organization
-
డబ్బు లెక్క... ఓ కొలిక్కి వస్తోంది
ఇటీవల ఒక సర్వేలో వెల్లడైన నిజాలు ఆశ్చర్యం కలిగించాయి. ఈ డిజిటల్ యుగంలో కూడా మహిళ బ్యాంకు పోపుల డబ్బానే! ఆర్థిక వ్యవహారాలకు మహిళలు దూరంగానే ఉంటున్నారు. ఉద్యోగం చేసే మహిళల ఏటీఎమ్ కార్డుల నిర్వహణ భర్తదే! అందుకే... ఫైనాన్షియల్ లిటరసీ అవసరం అంటారు శుభ్రా మహేశ్వరి. ‘‘చాలామంది మహిళలకు ఆర్థిక వ్యవహారాల పట్ల ఏ మాత్రం అవగాహన ఉండడం లేదు. ఇది గ్రామీణ మహిళలు, నిరక్షరాస్యులైన మహిళల విషయం కాదు. బాగా చదువుకున్న వాళ్లు కూడా కనీస అవగాహన లేకుండా జీవితాన్ని గడిపేస్తున్నారు. నగరంలో ఇంటిని నిర్వహించే గృహిణి నెల ఖర్చులకు ముప్పై – నలభై వేల వరకు ఆమె చేతుల మీదుగా ఖర్చు చేస్తుంటుంది. కానీ ఒక లక్ష రూపాయలు ఇచ్చి ఇన్వెస్ట్ చేయమంటే చేయలేదు. మన దగ్గర ఉన్న డబ్బును బ్యాంకులో దాస్తే డబ్బే డబ్బును రెట్టింపు చేస్తుందనే చిన్న లాజిక్‌ని మిస్ అవుతున్నారు. ఇది వెల్త్ క్రియేషన్‌లో వెనుకబాటుతనమేనంటారు శుభ్ర. అక్షరాలు వచ్చు! లెక్క తేలదు!! ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే... పెద్ద చదువులు చదువుకున్న మహిళలు కూడా బంగారాన్ని ఆభరణం రూపంలో కొని బీరువాలోనో, బ్యాంకు లాకర్లోనో దాచుకుంటున్నారే తప్ప గోల్డ్‌బాండ్ కొనుగోలు చేయాలనే ఆలోచన చేయడం లేదు. బాండ్ రూపంలో ఉన్న బంగారం విలువను అర్థం చేసుకోవడంలో నిరక్షరాస్యతలో ఉన్నారనే చెప్పాలి. బ్యాంకులు గ్రామాల్లోకి కూడా విస్తరించాయి. కానీ చిన్న మొత్తమైనా సరే బ్యాంకులో దాచుకుని బ్యాంకు ద్వారా కానీ యాప్ ద్వారా కానీ లావాదేవీ నిర్వహించడం నేర్చుకోవడంలో బాగా వెనుకబడి ఉన్నారు. కాలేజీల్లో కూడా విద్యార్థులకు డబ్బు సంపాదించడం గురించి మాత్రమే నేర్పిస్తారు. డబ్బును ఎలా నిర్వహించాలో నేర్పించడం మీద దృష్టి వెళ్లడం లేదు. ‘‘పరిశ్రమలు స్థాపించిన మహిళలు, చిన్న చిన్న వ్యాపారాలు మొదలు పెట్టిన మహిళలు శ్రమించడంలో ఏ మాత్రం అలసత్వం ఉండదు. నూటికి నూరు శాతం ఎఫర్ట్ పెడుతున్నారు. కానీ మనీ మేనేజ్మెంట్ తెలియకపోవడం వల్లనే లాభాల బాట పట్టాల్సిన పరిశ్రమలు పట్టాలు తప్పుతున్నాయి. ఒక చార్టెడ్ అకౌంటెంట్‌గా నేను గమనించింది ఒక్కటే. పరిశ్రమలు, వ్యాపారాలు ప్రారంభించిన మహిళలు అంకితభావంతో పని చేస్తున్నప్పటికీ వారికి సరైన మార్గదర్శనం చేసే వారు లేకపోవడంతో ఆ మహిళల శ్రమ వృథా అవుతోంది. వర్క్‌లో డెడికేషన్ ఎంత ముఖ్యమో, రైట్ డైరెక్షన్లో చేయడం కూడా అంతే ముఖ్యం. అందుకే నా వంతు సామాజిక బాధ్యతగా మహిళల్లో ఆర్థిక చైతన్యం తీసుకురావడానికి ఫైనాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్‌లు నిర్వహిస్తున్నాను. ఇటీవల మనదేశంలో మహిళా పారిశ్రామికవేత్తలు గణనీయంగా పెరిగారు. ఈ దశలో ఈ చైతన్యం చాలా అవసరం. ఇందుకోసం గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో వర్క్ షాపులు చేపడుతున్నాం. భారీ సమావేశాలకు బదులు చిన్న చిన్న క్యాంపులు నిర్వహిస్తున్నాం. ఇంత పెద్ద విషయాన్ని సరళంగా వివరించడానికి స్థానిక బ్యాంకులతో కలిసి పని చేస్తున్నాం. సమావేశంలోనే బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయించడం కూడా జరుగుతుంది’’ అన్నారు శుభ్రా మహేశ్వరి. కలను దర్శించాలి! ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్‌గా ఆమె మహిళను మానసికంగా శక్తిమంతం చేయడానికి ‘స్ట్రాంగర్ షీ’ అనే కార్యక్రమం రూపొందించారు. అందులో భాగంగా ఈ ఏడాది చేపట్టిన అంశం ‘ఫైనాన్షియల్ లిటరసీ’. దేశంలోని గ్రామీణ, పేద మహిళ నుంచి మధ్య తరగతి మహిళలు, వైట్ కాలర్ జాబ్‌లో ఉన్న మహిళలను కూడా కలుసుకుంటారు. డబ్బు సంపాదించడం మాత్రమే తెలిస్తే సరిపోదు, డబ్బును ఎలా ఇన్వెస్ట్ చేయాలో కూడా నేర్పించడం, డబ్బుతో డబ్బును ఎలా పెంపొందించుకోవాలో తెలియచేయడం ఇందులో ప్రధాన ఉద్దేశం. ‘‘భూమ్మీద నీకంటూ ఒక స్థానం ఉంది. ఆకాశంలోనూ నీ కంటూ కొంత భాగం ఉంది. ఈ రెండింటినీ కలుపుతూ ఎదగడానికి నీకంటూ ఒక కల ఉండాలి. నీ జ్ఞానంతో ఆ కలను దర్శించగలగాలి. ఆ కలను నిజం చేసుకోవడానికి నీ శ్రమను అనుసంధానం చేసుకోవాలి. నీ కలను నిజం చేసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా నీదే. కుటుంబ సభ్యులు, స్నేహితులు సహాయంగా ఉండే వారే, ఫలితం పూర్తిగా నీదే. అది విజయం అయినా అపజయం అయినా పూర్తి బాధ్యత నీదేననే విషయాన్ని మర్చిపోకూడదు’’ మహిళలకు నా సందేశం ఇదేనన్నారు శుభ్రా మహేశ్వరి. రోజూ తెల్లకాగితమే! శుభ్రా మహేశ్వరి పుట్టింది, పెరిగింది ఢిల్లీలోనే. తండ్రి పారిశ్రామికవేత్త. ఆమె మాత్రం చార్టెడ్ అకౌంటింగ్ వైపు ఆసక్తి చూపించింది. పెళ్లి తర్వాత ఇరవై ఏళ్ల కిందట భర్తతో హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. బ్లూ స్టోన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీల డైరెక్టర్‌గా విధులు నిర్వహణతోపాటు చార్టెడ్ అకౌంటెంట్‌గా తిరుమల తిరుపతి దేవస్థానమ్, ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్, నేషనల్ హైవేస్తోపాటు దాదాపుగా మూడు వందల కార్పొరేట్ కంపెనీలకు ఆడిటర్‌గా సేవలందించిన, అందిస్తున్న అనుభవం ఆమెది. ‘‘మన జీవితంలో ప్రతి రోజూ ఒక కొత్త రోజే. డైరీలో కొత్త పేజీనే. ఏమీ రాయని తెల్లకాగితమే. జీవితంలో విజయం సాధించాలంటే ప్రతి కాగితాన్నీ మంచి విషయంతో నింపాలి. అదే అందమైన కథ అవుతుంది. అంటే ఏ ఒక్క రోజునూ నిరుపయోగంగా గడపవద్దు. ప్రయోజనకరంగా గడపాలి’’ అంటారు శుభ్రా మహేశ్వరి. – వాకా మంజులారెడ్డి -
లేడీస్ స్పెషల్... ఇండస్ట్రియల్ పార్క్
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ - ఎఫ్ఎల్వో( లేడీస్ ఆర్గనైజేషన్) ఆధ్వర్యంలో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ పార్క్ రూపుదిద్దుకుంది. నగర శివార్లలో ఉన్న సూల్తాన్‌పూర్ ఏరియాలో 50 ఎకరాల్లో సిద్దమైన ఈ పార్కుని ప్రారంభించనున్నారు. మహిళా దినోత్సవం పురస్కరించుకుని మార్చి 8న ఈ పార్కుని మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఫిక్కీ ఎఫ్ఎల్వో జాతీయ అధ్యక్షురాలు ఉజ్వలా సింఘానియా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఇరవై ఏళ్ల కిందట యాభై మంది మహిళా పారిశ్రామికవేత్తలతో ఫిక్కీ ఎఫ్ఎల్వో ప్రారంభం అయ్యింది. తాజాగా ఫిక్కీ ఎఫ్ఎల్వో 800ల మంది సభ్యులు దేశవ్యాప్తంగా ఉన్నారు. -
మహిళల రక్షణకు ఎయిర్టెల్, ఎఫ్‌ఎల్‌వోల నుంచి యాప్
న్యూఢిల్లీ: మై సర్కిల్ పేరుతో మహిళలకు అత్యవసర సందర్భాలు, ఒత్తిడి సమయంలో ఉపకరించే యాప్‌ను భారతీ ఎయిర్టెల్, ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్(ఎఫ్ఎల్వో) విడుదల చేశాయి. కేవలం ఎయిర్టెల్ యూజర్లనే కాకుండా ఇతర టెలికం యూజర్లు సైతం వినియోగించుకోవచ్చు. ఈ యాప్ సాయంతో తెలుగు, తమిళం, కన్నడ, ఇంగ్లి ష్, హిందీ సహా 13 భాషల్లో కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల్లో ఐదుగురికి ఎస్ఓఎస్ అలర్ట్స్‌ను పంపించొచ్చని విడుదలైన ప్రకటన తెలిపింది. తద్వారా తాము అత్యవసర పరిస్థితుల్లో ఉన్నామని, తమను చేరుకోవాలని సందేశాన్ని పంపొచ్చని పేర్కొంది. గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ ఐవోఎస్ స్టోర్‌లో ఇది అందుబాటులో ఉంది. -
సింధు, సైనాలపై పుల్లెల ఆశ్చర్యకర వ్యాఖ్యలు
సాక్షి , న్యూఢిల్లీ : బ్యాడ్మింటన్‌లో భారత సత్తాను ప్రపంచానికి చాటిన సైనా నెహ్వాల్, పీవీ సింధూలను ఫిక్కీ మహిళా విభాగం గోల్డెన్ గర్ల్స్ ఆఫ్ బాడ్మింటన్ పేరుతో ఘనంగా సన్మానించింది. వారిని ఉన్నత స్థానానికి తీసుకురావడానికి కారణమైన పుల్లెల గోపీచంద్‌ను సైతం నిర్వాహకులు సన్మానించారు. ఈసందర్భంగా పుల్లెల మాట్లాడుతూ సైనా, సింధూ ఇద్దరూ వజ్రాల్లాంటి వారని, తన దృష్టిలో ఇద్దరూ ఒక్కటేనని పేర్కొన్నారు. భవిష్యత్తులో భారత్‌కు బాడ్మింటన్‌లో మరిన్ని పతకాలు వస్తాయని అన్నారు. సింధూ హార్డ్ వర్కర్ అని, సైనా ఎనర్జీ అమోఘమని గోపీచంద్ కితాబిచ్చారు. జీవితంలో విజయం సాధించిన మహిళలను మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరముందని అందుకే ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పింకీరెడ్డి తెలిపారు. అనంతరం బాడ్మింటన్‌లో తమ అనుభవాలను సైనా, సింధూ వారితో పంచుకున్నారు. రియో ఒలంపిక్స్‌లో బాడ్మింటన్ పతకం వచ్చిందని, రానున్న ఒలింపిక్స్‌లో మరిన్ని పతకాలు వస్తాయని వారు మీడియాకు చెప్పారు. ఖాళీ సమయంలో కుటుంబ సభ్యులతో గడపటంతో పాటు సినిమాలు చూస్తానని సింధూ తెలిపారు. సైనా మాట్లాడుతూ తనకు బాలీవుడ్ చిత్రాలంటే పిచ్చంటూ ముచ్చటించారు. -
50 ఎకరాల్లో ఎఫ్ఎల్వో
హైదరాబాద్: ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ భారత్‌లో తొలిసారిగా హైదరాబాద్ వద్ద ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేస్తోంది. పటాన్చెరు సమీపంలోని సుల్తాన్పూర్ వద్ద 50 ఎకరాల్లో దీనిని నెలకొల్పుతున్నారు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్వో) హైదరాబాద్ చాప్టర్, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీఎస్ఐఐసీ) సంయుక్తంగా ఈ ప్రాజెక్టును అభివద్ధి చేస్తున్నాయి. పార్కులో 3-5 ఏళ్లలో రూ. 200 కోట్ల పెట్టుబడులు వస్తాయని ఎఫ్ఎల్వో హైదరాబాద్ చాప్టర్ చైర్పర్సన్ పద్మ రాజగోపాల్ తెలిపారు. 3- 4 వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ఎఫ్ఎల్వో ప్రతినిధులు బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. సభ్యులకు మాత్రమే.. ఎఫ్ఎల్వో వుమెన్ ఎంట్రప్రెన్యూర్స్ ఇండస్ట్రియల్ పార్కులో కేవలం ఎఫ్ఎల్వో సభ్యులకు మాత్రమే అవకాశం కల్పిస్తారు. పర్యావరణానికి హాని కలిగించని కంపెనీలు ఇక్కడ ఏర్పాటవుతాయి. యూనిట్ల ఏర్పాటుకు ఇప్పటికే 36 దరఖాస్తులు అందాయి. కాగా పార్కులో మౌలిక సదుపాయాలను ప్రభుత్వమే కల్పిస్తోంది. -
ఎఫ్ఎల్ఓ వైస్ ప్రెసిడెంట్ గా అపర్ణా పింకీరెడ్డి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫిక్కీ మహిళా సంస్థ (ఎఫ్ఎల్ఓ)కు నూతన జాతీయ వైస్ ప్రెసిడెంట్‌గా హైదరాబాద్‌కు చెందిన పారిశ్రామికవేత్త అపర్ణా పింకీ రెడ్డి నియమితులయ్యారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన 32వ వార్షిక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎఫ్ఎల్ఓ హైదరాబాద్ చైర్పర్సన్ రేఖ లాహోటీ ఒక ప్రకటనలో తెలిపారు. 500లకు పైగా మెంబర్లున్న హైదరాబాద్ చాప్టర్ ఎఫ్ఎల్ఓకు దేశంలోనే అతిపెద్ద చాప్టరని చెప్పారు. 2018-19 ఎఫ్ఎల్ఓ జాతీయ ప్రెసిడెంట్‌గానూ అపర్ణా రెడ్డి ఎంపికవుతారని ఈ సందర్భంగా ఆమె ప్రకటనలో పేర్కొన్నారు.