fighter jet crash
-
సుఖోయ్, మిరాజ్ ఢీ.. పైలట్ మృతి
న్యూఢిల్లీ/భరత్పూర్/మొరెనా: భారత వైమానిక దళం(ఐఏఎఫ్)నకు చెందిన సుఖోయ్ 30ఎంకేఐ, మిరాజ్–2000 యుద్ధ విమానాలు ఢీకొన్న అరుదైన ఘటనలో ఒక పైలెట్ మృతి చెందారు. మరో ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్‌కు సమీపంలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఐఏఎఫ్ బేస్‌గా ఉన్న గ్వాలియర్ విమానాశ్రయం నుంచి ఈ రెండు విమానాలు రోజువారీ సాధారణ శిక్షణలో భాగంగా బయలుదేరాయి. మొరెనా జిల్లా పహర్‌గఢ్ సమీపంలోని బహిరంగ ప్రదేశంలో అవి ప్రమాదవశాత్తు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఘటనలో సింగిల్ సీటర్ మిరాజ్–2000 పైలెట్ వింగ్ కమాండర్ హనుమంతరావు సారథి చనిపోగా ట్విన్ సీటర్ సుఖోయ్ ఫ్లయిట్‌లోని ఇద్దరు పైలెట్లు ఎజెక్ట్ అయి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మృతి చెందిన వింగ్ కమాండర్ శరీర భాగాలు పహార్‌గఢ్ ప్రాంతంలో లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. విమాన శకలాలు కొన్ని పొరుగునే ఉన్న రాజస్తాన్‌లోని భరత్పూర్ జిల్లాలోనూ పడిపోయాయి. దీనిపై ఐఏఎఫ్ దర్యాప్తునకు ఆదేశించింది. ఘటనకు సంబంధించిన వివరాలను ఐఏఎఫ్ చీఫ్ వీఆర్ చౌధరి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించారు. ఫ్లయిట్ డేటా రికార్డుల విశ్లేషణ అనంతరమే ఘటనకు దారి తీసిన కారణాలు తెలుస్తాయన్నారు. ఐఏఎఫ్ చరిత్రలో మిరాజ్, సుఖోయ్ ఢీకొనడం ఇదే తొలిసారి. దేశంలో గత 70 ఏళ్లలో ఇలాంటి 64 ప్రమాదాల్లో 39 మంది పైలట్లు ప్రాణాలు కోల్పోయారని వైమానిక నిపుణుడు అంచిత్ గుప్తా తెలిపారు. -
Fighter Jets: మధ్యప్రదేశ్‌లో కుప్పకూలిన రెండు యుద్ధ విమానాలు
ఇండోర్: మధ్యప్రదేశ్‌లో భారత వాయుసేనకు చెందిన రెండు యుద్ధ విమానాలు సుఖోయ్-30, మిరాజ్ కుప్పకూలాయి. మొరెనాలో జరిగిన ఈ ప్రమాదంలో ఒక పైలెట్ ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు పైలెట్లు గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. సహాయక చర్యలు చేపట్టి వారిని ఆస్పత్రికి తరలించారు. శిక్షణా సమయంలో ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. శిక్షణా విన్యాసాలు చేస్తున్న సమయంలో రెండు విమానాలు ఢీకొన్నట్టుగా ప్రాథమికంగా తెలుస్తోంది. గ్వాలియర్ ఎయిర్‌బేస్ నుంచి టేకాఫ్ అయిన సుఖోయ్, మిరాజ్ శనివారం ఉదయం 5.30 గంటల సమయంలో ప్రమాదానికి గురయ్యాయి. -
గోవా తీరంలో కుప్పకూలిన మిగ్-29కే ఫైటర్ జెట్
పనాజీ: భారత నౌకాదళానికి చెందిన మిగ్-29కే ఫైటర్ జెట్ ప్రమాదానికి గురైంది. గోవా తీరంలో సాధారణ పెట్రోలింగ్‌కు వెళ్లి నేవీ బేస్‌కు తిరిగి వస్తున్న క్రమంలో సముద్రంలో కుప్పకూలిపోయింది. యుద్ధవిమానంలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగానే కూలిపోయినట్లు నౌకదళం వెల్లడించింది. అయితే, ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. సమాచారం అందుకున్న వెంటనే పైలట్‌ను రక్షించి ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. మిక్-29కే యుద్ధ విమానం ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తునకు ఆదేశించింది నేవీ. 2019 నుంచి మిగ్-29కే ప్రమాదానికి గురికావటం ఇది నాలుగోది. ఫైటర్ జెట్‌లో రష్యా తయారు చేసిన కే-36డీ-3.5 జెట్ నుంచి విడిపోయే సీటు ఉంది. ఈ సాంకేతికత ప్రపంచంలోనే అత్యాధునికమైనదిగా చెబుతారు. హ్యాండిల్ లాగగానే ముందుగా వెనుక సీట్లో ఉన్న పైలట్, ఆ తర్వాత ముందు సీటులోని పైలట్ జైట్ నుంటి బయటపడతారు. ఇదీ చదవండి: ‘మాకు 5జీ ఫోన్లు కావాలి’, స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలకు కేంద్రం ఆదేశాలు -
రాజస్థాన్‌లో కుప్పకూలిన మిగ్–21 ఫైటర్ జెట్
బార్మర్: భారత వైమానిక దళానికి(ఐఏఎఫ్) చెందిన మిగ్–21 యుద్ధ విమానం గురువారం రాత్రి 9.10 గంటలకు రాజస్తాన్‌లోని బార్మర్‌లో నేలకూలింది. ఈ ఘటనలో ఇద్దరు విమానంలోని ఇద్దరు పైలట్లు మృతిచెందారు. రెండు సీట్లున్న ఈ విమానాన్ని శిక్షణ కోసం ఉపయోగిస్తున్నారు. ఉత్తర్లాయ్ ఎయిర్‌బేస్ నుంచి బయలుదేరిన విమానం భీమ్డా గ్రామం వద్ద నేలకూలి మంటల్లో చిక్కుకుంది. ఘటనా స్థలంలో భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఇద్దరు పైలట్లు తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి గల అసలైన కారణాలు తెలుసుకొనేందుకు వైమానిక దళం కోర్టు ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేసింది. రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ మార్షల్ వీఆర్ చౌదరితో మాట్లాడారు. మిగ్–21 ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నారు. దేశంలో గత ఏడాది జనవరి నుంచి ఇప్పటిదాకా ఆరు మిగ్–21 విమానాలు కుప్పకూలాయి. ఐదుగురు పైలట్లు బలయ్యారు. -
‘‘ఈ ఎగిరే శవ పేటికలను రద్దు చేయండి’’
న్యూఢిల్లీ: భారత వైమానిక దళంలో మిగ్ ఫైటర్ జెట్లది ప్రత్యేక స్థానం. రెండేళ్ల క్రితం పాక్‌లోని ఉగ్ర స్థావరాలపై ఇండియా నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్‌లో వీటినే వాడారు. వైమానిక దళంలో వీటి ప్రాముఖ్యత ఏంటో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే ఇంత ప్రతిష్టాత్మకమైన ఈ ఫైటర్ జెట్లు ప్రతి ఏటా పలువురు యువ ఐఏఎఫ్ ట్రైనీలను బలి తీసుకుంటున్నాయి. కారణం ఏంటంటే ఈ ఫైటర్ జెట్లు చాలా పురాతనమైనవి కావడంతో.. ట్రైనింగ్ సమయంలో కూలి పోతున్నాయి. తాజాగా రెండు రోజుల క్రితం మిగ్-21 ఫైటర్ జెట్ పంజాబ్ మోగా జిల్లాలో కూలిపోయింది. ప్రమాద సమయంలో దానిలో ఉన్న పైలెట్, స్క్వాడ్రోన్ లీడర్ అభివన్ చౌదరి మరణించారు. ఈ క్రమంలో ఆయన తండ్రి ‘‘ఈ ప్రమాదంలో నేను నా కుమారుడిని పొగొట్టుకున్నాను. మరి కొందరు తల్లిదండ్రులకు ఈ గర్భశోకం తప్పాలంటే.. దయచేసి ఈ మిగ్ ఫైటర్ జెట్లను ఐఏఎఫ్ నుంచి తొలగించండి’’ అంటూ ప్రభుత్వాన్ని చేతులెత్తి వేడుకుంటున్నారు. పంజాబ్‌లోని మోగా జిల్లాలో గురువారం అర్ధరాత్రి తర్వాత మిగ్-21 బైసన్ యుద్ధ విమాన కూలింది. ఈ ప్రమాదంలో స్క్వాడ్రోన్ లీడర్ అభినవ్ చౌదరి మరణించాడు. ఈ వార్త తలెసిన వెంటనే సన్నిహితులు, బంధువులు మీరట్‌లోని అతడి ఇంటికి చేరుకుని సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా అభినవ్ చౌదరి తండ్రి మిగ్-21 ఫైటర్ జెట్లను తొలగించాల్సిందిగా కన్నీటితో వేడుకుంటున్నాడు. ఈ సందర్భంగా అభినవ్ తండ్రి మాట్లాడుతూ.. ‘‘1980లోనే రష్యా వీటిని రద్దు చేసింది. ప్రతి ఏటా కుప్ప కూలుతున్న ఈ ఎగిరే శవ పేటికలు అనేక మంది యువకుల కలలను, జీవితాలను ఛిద్రం చేస్తున్నాయి. ఈ పాత కాలపు యుద్ధ విమానాలను రద్దు చేసే విషయంలో ప్రభుత్వం తర్జన భర్జన పడుతుంది. ఫైటర్ పైలెట్ల శిక్షణ కోసం ప్రభుత్వం ఏటా కోట్లు ఖర్చు చేస్తుంది. అలాంటప్పుడు ఈ అరిగిపోయిన విమానాలను శిక్షణ కోసం ఎందుకు అనుమతిస్తున్నారు’’ అంటూ ప్రశ్నించారు. చదవండి: ముక్కలైన మిగ్-21.. పైలెట్ దుర్మరణం -
రాజస్తాన్‌లో కుప్పకూలిన మిగ్-21 విమానం
-
కుప్పకూలిన మిగ్-21 విమానం
జైపూర్ : రాజస్తాన్‌లో భారత యుద్ధ విమానం మిగ్-21 కుప్పకూలింది. ఘటన జరిగిన సమయంలో పైలట్ విమానం నుంచి ఎజెక్ట్ అయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం పైలట్ క్షేమంగానే ఉన్నట్లు సమాచారం. బికనీర్‌కు సమీపంలో ఉన్న శోభా సర్కీ ధానీ ఏరియాలో ఈ దుర్ఘటన చోటుచేసుకుందని బికనీర్ ఎస్పీ తెలిపారు. పుల్వామా ఉగ్రదాడి, మెరుపు దాడుల నేపథ్యంలో భారత్- పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్న తరుణంలో యుద్ధ విమానం కూలిపోవడంతో అలజడి రేగింది. అయితే రాజస్తాన్‌లోని నాల్ ఎయిర్‌బేస్‌కు మిగ్-21ను ఐఏఎఫ్ తరలిస్తున్న క్రమంలోనే ఈ ఘటన చోటుచేసుకుందని వార్తా సంస్థ ఏఎన్ఐ పేర్కొంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని జైషే మహ్మద్ ఉగ్ర స్థావరాలపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26న 12 మిరాజ్-2000 జెట్ ఫైటర్స్‌తో చేపట్టిన సర్జికల్ స్ట్రైక్‌ను ఐఏఎఫ్ విజయవంతంగా పూర్తి చేసింది. ఇందుకు ప్రతిగా పాక్ వైమానిక దళం తిరిగి దాడికి ప్రయత్నించగా వారిని ఎదిరించే క్రమంలో భారత పైలట్ అభినందన్ ఆ దేశ ఆర్మీకి చిక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అనేక పరిణామాల అనంతరం జెనీవా ఒప్పందం ప్రకారం ఆయన భారత్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. -
కూలిన పాకిస్థాన్ యుద్ధ విమానం
కరాచీ: పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన యుద్ధ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్ మరణించాడు. మస్రూర్ బేస్ నుంచి వెళ్తుండగా కరాచీకి 16 కిలో మీటర్ల దూరంలో విమానం కూలిపోయినట్టు అధికారులు చెప్పారు. సహాయక సిబ్బంది వెంటనే ఘటనా స్థలాని చేరుకున్నారు. ట్రైనింగ్ మిషన్‌లో భాగంగా ఈ విమానం వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు పాక్ ఎయిర్ ఫోర్స్ అధికారులు చెప్పారు. జనావాసాలకు దూరంగా విమానం కూలడంతో ఘటనా స్థలంలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని వివరించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు తెలిపారు. ఈ యుద్ధ విమానాన్ని ఫ్రాన్స్‌లో తయారు చేశారు. గత నెలలో కూడా పాక్‌లో ఓ యుద్ధ విమానం కూలిన ఘటనలో పైలట్ మరణించాడు.